మామూలుగా వాణిజ్య ప్రకటన ఇస్తే ఎవడు చూస్తున్నాడు ఈరోజుల్లో… చుట్టూ రకరకాల మార్గాల్లో ప్రకటనలు మోతెక్కిస్తుంటే ప్రత్యేకంగా ఫలానా యాడ్ చూడాలని ఎవడైనా ఎలా అట్రాక్ట్ అవుతాడు..? అందుకే ప్రజల కళ్లను, మెదళ్లను తమవైపు అట్రాక్ట్ చేయడానికి ప్రకటనలు రూపొందించే యాడ్ ఏజెన్సీలు, క్రియేటర్స్ రకరకాల వేషాలు, కొత్త పైత్యాలకు తెరతీస్తుంటారు… ఎవడ్రా ఈ దిక్కుమాలిన యాడ్ జారీచేసింది అని తిట్టుకున్నా సరే, ఈసడించుకున్నా సరే… మిమ్మల్ని అట్రాక్ట్ చేశామా, చదివించామా లేదా..? మీ మెదళ్లలో రిజిష్టరైందా లేదా అనేదే ప్రధానం…
బహుశా తిక్క తిక్క యాడ్స్ ఇవ్వడం ‘అబ్సర్డ్ ప్రమోషన్’ అనే కొత్త విద్య కావచ్చు..!! మార్కెటింగ్ ఏజెన్సీలు చెప్పాలి… ఈనాడు ఫస్ట్ పేజీలో డంజో డెయిలీ వాడి యాడ్ అచ్చంగా ఇలాంటి అబ్సర్డ్ ప్రమోషనే… తెలుగులో తిక్క వేషం అని చదువుకోవచ్చు… అసలు ఆ యాడ్ ఏం చెప్పదలుచుకుందో, ఏం చెప్పిందో కనీసం దాన్ని జారీచేసిన వాళ్లకు, పబ్లిష్ చేసిన వాళ్లకు కూడా తెలియదు… వాడు పంపించాడు, వీడు పబ్లిష్ చేశాడు… డబ్బొచ్చింది… ఈనాడు టార్గెట్, పర్పస్ అంతే… మరి సదరు కంపెనీకి ఒరిగిందేమిటి..? రీడర్స్ నుంచి వెక్కిరింపులు… ఎవడ్రా భయ్, ఈ యాడ్ డిజైన్ చేసింది..?!
పోనీ, వ్యంగ్యాన్ని విసిరి, వినియోగదార్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారా అంటే ఆ తెలివి కూడా కనిపించలేదు… వ్యంగ్యంతో ఒక యాడ్ డిజైన్ చేయాలంటే చాలా కష్టం… సరే, ఈ డుంజో యాడ్ విషయానికి వద్దాం… కిరాణ సామగ్రికి సంబంధించిన హాక్స్, తప్పుడు, గాలి వార్తలు బోలెడు వస్తుంటయ్… వాటిపై సర్కాస్టిక్‌గా ఏదో యాడ్ ప్రయోగించాలనేది ఈ డుంజో గ్రాసరీ వాడి ప్లాన్ కావచ్చు… గ్రాసరీ హాక్స్ మిమ్మల్ని ఆదర్శ్ భారతీయుడిని చేస్తాయనేది ఆ వ్యంగ్యమే… కానీ..?
Ads
ఒకవైపు హాక్స్ నమ్మే అదర్భ భారతీయుల్లారా అంటూనే… మా ఆదర్శమైన డెలివరీ సేవ ఆదర్శ భారతీయుల కోసం అని రాశారు… అంటే దీన్ని కూడా కస్టమర్లు ఓ హాక్స్ అనుకోవాలా..?11 రకాల హాక్స్ బిట్లు వేసి, చివరలో డంజోపై కిరాణ సరుకులు ఆర్డర్ చేయండి అని మరో బిట్ రాశారు… అంటే డంజోపై ఆర్డర్ చేయడం కూడా ఇలాంటిదే అనుకోవాలా..? ఎవడో ఇంగ్లిషులో ఏదో రాస్తాడు, తెలుగు అనువాదకుడు ఎవడో కళ్లు, మిగతావన్నీ మూసుకుని ఇష్టమొచ్చినట్టు ట్రాన్స్‌లేట్ చేస్తాడు… పత్రికవాడు కూడా నేనేం పబ్లిష్ చేస్తున్నాను అనే సోయి లేకుండా వేసేస్తాడు…
దుస్తులకు గంజి పెట్టడానికి గంజి ఉపయోగించండి… అనే బిట్ అక్షరాలా నాన్సెన్స్… కళ్లు శుభ్రం చేయడానికి కమలాపండు తొక్కలు పిండండి, చెడ్డవారిపై విసరడానికి టమాటాలు సేకరించండి, మొటిమలు నయం కావడానికి టూత్‌పేస్ట్ రాయండి, కీటకాల్ని తరిమికొట్టడానికి దుస్తులపై ఎండు మిరపకాయ ఉపయోగించండి, నకిలీ జ్వరం కోసం చంకల కింద ఉల్లిపాయలు పెట్టండి, పెదవుల్ని తేమ కోసం బొడ్డులో దేశీ నెయ్యి రాయండి వంటి హాక్స్‌ను వెక్కిరిస్తే తప్పులేదు…
రకరకాల కిరాణ సామగ్రి పేరు వచ్చేలా ఈ బిట్లు కూర్చారు, పేర్చారు… సరే, అదొక పిచ్చి స్ట్రాటజీ… అయితే యాంటీ సెప్టిక్‌గా పసుపు వాడితే తప్పేముంది..? అందులో వెక్కిరింత అంశమేముంది..? అలాగే పాత్రలు శుభ్రం చేయడానికి కొబ్బరి పీచు వాడండి, దోమల్ని తరమడానికి నిమ్మకాయల్లో లవంగాలు గుచ్చండి, అరటిపండును అగర్‌బత్తీ స్టాండ్‌లా వాడండి అనే రాతల్లో అభ్యంతరాలేముంటయ్..? ఏదో ఒకటి రాసేశాం, ప్రధానమైన కిరాణ సామగ్రి పేర్లు వచ్చాయా లేదా అని చూసుకున్నారు యాడ్‌లో… అంతే, జనం మీదకు వదిలారు… దీన్ని తిక్క అనాలా..? సెమీ తిక్క అనాలా..? అతి తిక్క అనాలా..?!
Share this Article