Prabhakar Jaini……. ఆచార్ అండ్ కో సినిమా చూసాను. చూడకపోతే, చాలా మిస్ అయ్యేవాణ్ణి.
సినిమా చూస్తున్నంత సేపూ, మనసు పురా వీధుల్లో తిరిగిన అనుభూతి కలిగింది. దర్శకుడు ఆనాటి వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో కృతకృత్యులయ్యారు. తండ్రి బ్రతికి ఉన్నప్పుడు కొంటె పిల్లలుగా అల్లరి చేసిన వాళ్ళు, ఇంటి యజమానురాలిగా ఉన్న తల్లి – తండ్రి మరణం తర్వాత ఎంత సులభంగా, నాచురల్ గా, బాధ్యతలు తెలిసిన వ్యక్తులుగా, తల్లి నెమ్మదిగా పిల్లల చాటు వ్యక్తిగా రూపాంతరం చెందడం అద్భుతంగా తీసారు.
ఈ విషయం క్రిటికల్ గా చూస్తే గానీ తెలియదు.
Ads
కామెడీగా మొదలైన కథ, కష్టాల సుడిగుండంగా మారి, చివరకు సుఖాంతం కావడం విశేషం. పది మంది పిల్లలను కనడం కొంత వింతగా ఉన్నా, ఆ రోజుల్లో అది పెద్ద అసంభవమైన విషయమేమీ కాదు. తండ్రి పాత్రను బలంగా చిత్రీకరించారు. కానీ, ఇద్దరు కుటుంబ పెద్దలు అర్థాంతరంగా, అంతర్థానం కావడం ఆశ్చర్యమనిపిస్తుంది. అక్కడ ఉండ వలసినంత విషాదం లేదనిపిస్తుంది. బహుశా కథాగమనానికి అడ్డు వస్తుందని, విషాదాన్ని మరిచిపోయారేమో.
పెంకి పిల్లగా కనిపించే, సుమ పాత్రను చివరకు వ్యక్తిత్వం మూర్తీభవించిన పాత్రగా తీర్చి దిద్దడం బాగుంది.
పెద్ద కొడుకు స్వార్థ పరుడు. కుటుంబం, ఎన్ని సమస్యల్లో చిక్కుకున్నా మళ్ళీ రాడు. కనపడడు.
ఈ రెండు పాత్రల్లోని వైరుధ్యం అది.
‘అక్కా’; ‘అన్నా’; ‘అమ్మా’ అన్న పదాలు ఎక్కువగా వినిపించడం వల్ల; దాదాపు తెలుగింటి వాతావరణమే ఉండడం వల్ల, తెలుగు సినిమానే చూస్తున్నట్టనిపిస్తుంది.
ఈ భీకర రణగొణ ధ్వనుల మధ్య, పరపరా నరకడాలు, రక్తపుటేరుల ప్రవాహాలను పారించే తెలుగు, కన్నడ, హిందీ, తమిళ సినిమాల మధ్యన, నవనవోన్మేష కుసుమం లాంటి చిన్న సినిమా – మనసుకు హాయిగా అనిపిస్తుంది.
మన జీవితాలు ఒకప్పుడు ఇలాగే ఉండేవి. శషభిషలు లేకున్నా, అనంత ధనరాశుల ఆదాయం, హంగులు, ఇంటర్నెట్లూ, సెల్ఫోన్లూ, ఫేస్బుక్కులూ లేకున్నా జీవితాలు హాయిగా గడిచిపోయాయన్న సత్యాన్ని నిరూపించిన సినిమా ఆచార్ & కో.
ఓ సారి నోస్టాల్జిక్, మన ముందు తరాల మధ్య తరగతి వారి జీవితాల్లోకి, కొంత మంది మధుర ఙ్ఞాపకాల వీధుల్లోకి, తొంగి చూడాలనుకున్న వాళ్ళు – చూసి తరించగల సినిమా.
అమెజాన్ ప్రైమ్ లో, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఉన్న కన్నడ సినిమా, ఉంది. IMDb ర్యాంకు 7.8/10 గా ఉంది మరి. కొస మెరుపు ఏమిటంటే, ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సింధూ శ్రీనివాస మూర్తే ఈ సినిమా హీరోయిన్ ‘సుమ’ పాత్రలో కూడా నటించింది….
Share this Article