Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇల్లు చేరగానే… నా కాలి చెప్పు తీసి టపాటపా తలకేసి కొట్టుకున్నాను…

March 6, 2024 by M S R

* నేను, మా అమ్మ (నటి లక్ష్మి) గొడవపడుతూ ఉన్నామని, మా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని అంతా అనుకుంటారు. అలా ఎందుకు అనుకుంటారో నాకు తెలియదు. మేము బాగానే ఉన్నాం! మేం కలిసే ఉన్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం లేదు కాబట్టి అలా అనుకుంటున్నారా?

* అమ్మ సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. అందుకు కారణం కూడా ఉంది. ఒకసారి నేను, అమ్మ, మా అమ్మ భర్త (Step Father) కలిసి ఒక ఫొటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. కొద్ది రోజుల తర్వాత యుట్యూబ్‌లో నా గురించి ఒక వీడియో వచ్చింది. ‘భర్తతో కలిసి నటి ఐశ్వర్య ఫోటోలు’ అని. నా భర్తతో విడిపోయి 20 ఏళ్లు అయిపోయింది. ఇప్పుడు ఫోటోలెక్కడ ఉన్నాయి అని ఆ వీడియో ఓపెన్ చేసి చూశాను. మా అమ్మ భర్తను నా భర్త అని అనుకొని వీడియో చేశారు. అది చూసి అమ్మ చాలా ఫీలైంది. అప్పటి నుంచి అలాంటి ఫోటోలు పెట్టడం మానేశాను.

* నేను లాయర్ అవ్వాలి అనుకున్నాను. అనుకోకుండా సినిమా నటి అయ్యాను. అమ్మ తన సొంత ప్రొడక్షన్‌లో ‘హొసకావ్య’ అనే కన్నడ సినిమా తీసింది. అందులో హీరోయిన్ కోసం మా ఇంట్లోనే చాన్నాళ్ల పాటు ఆడిషన్స్ జరిగాయి. రోజూ అవి చూసి, చూసి డైలాగులు కంఠతా వచ్చేశాయి. ఒకరోజు నేనే ఆ డైలాగులు చెప్పడంతో నన్నే ఆ సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆ ఒక్క సినిమా చేసి అమెరికా వెళ్లిపోదాం అనుకున్నా! ఆ తర్వాత తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు వరుస పెట్టి వచ్చేశాయి.

Ads

* నా జీవితంలో నన్ను నేనే చెప్పుతో కొట్టుకున్న సందర్భం ఒకటి జరిగింది. మణిరత్నం గారు ‘దళపతి’ సినిమాలో శోభన గారి పాత్రకు ముందుగా నన్ను అడిగారు. కానీ ఆ సమయంలో డేట్స్ సమస్య వల్ల చేయలేదు. ఆ తర్వాత రెండేళ్లకు మరోసారి మళ్లీ ఒక సినిమా కోసం అడిగారు. అప్పటికే ఒక తెలుగు సినిమా చేయడానికి అడ్వాన్స్ తీసుకున్నాను. దాన్ని కాదని, ఈ సినిమా చేయలేమని మా అమ్మమ్మ వద్దంది. అలా మరోసారి మణిరత్నం సినిమా మిస్సయింది. ఆ సినిమా పేరు ‘రోజా’. అందులో మధుబాల చేసిన పాత్రకు నన్ను అనుకున్నారు.

* ‘రోజా’ సినిమా పాటలు విడుదలయ్యాక ఆ పాటలు విన్నాను. చాలా నచ్చాయి. అరె! ఇంత మంచి పాటలున్న సినిమా వదిలేసుకున్నానే అని కొంచెం బాధపడ్డాను. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత కోయంబత్తూరులో నేను, నాన్న, అమ్మమ్మ, నాన్నమ్మ, మా అత్త కూతురు అందరం కలిసి చూశాం. చూస్తున్నంతసేపు ఏమీ మాట్లాడలేదు. నేను చాలా కోపంగా ఉన్నానని అందరికీ అర్థమైంది. కారులో కూడా చాలా మౌనంగా ఉండి ఇంటికి వచ్చాం. అపార్ట్‌మెంట్లో ఎనిమిదో అంతస్తులో మా ఇల్లు. లిఫ్ట్ ఎక్కి, ఎనిమిదో అంతస్తుకు చేరి మా ఇంటి తలుపు దగ్గరికి వచ్చి నా కాలి చెప్పు తీసి టపాటపా తలకేసి కొట్టుకున్నాను. మరేం చేయను? ఆ కోపంలో మా అమ్మమ్మని చంపలేను కదా? జీవితంలో ఒక గొప్ప అవకాశం పోయిందే అని ఇప్పటికీ బాధ పడుతుంటాను.

* ఆ తర్వాత మణిరత్నం గారు మళ్లీ ‘తిరుడ.. తిరుడ’ (దొంగ.. దొంగ) సినిమాకి పిలిచారు. మళ్లీ డేట్స్ సమస్య. ఛీ! ఆయనతో పని చేసేందుకు ఇన్ని అడ్డంకులా అని అనిపిస్తూ ఉంటుంది. కమల్‌హాసన్ గారి ‘దేవర్ మగన్’ (క్షత్రియ పుత్రుడు) సినిమాలో కూడా నాకు ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేజారింది. అందులో గౌతమి చేసిన పాత్ర నేను, రేవతి చేసిన పాత్ర మీనా చేయాలని ముందుగా ఫిక్స్ అయ్యింది. షూటింగ్‌కు వెళ్లాలి అనే టైంలో ఏమైందో కానీ మొత్తం మారిపోయింది.

* సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టి, He is my Bestie.. This is my Best Friend అని రాసుకునే వారంతా నిజజీవితంలో అంత స్నేహంగా ఉంటారా అనేది అనుమానమే! నా వరకూ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నా స్కూల్ ఫ్రెండ్స్. వాళ్లతో నేను నాలాగా ఉండగలను. నన్ను ఒక సినిమా నటిగా కాకుండా అతి మామూలు మనిషిగా చూస్తారు. మేమంతా అప్పుడప్పుడూ కలుస్తూ ఉంటాం.

* I don’t believe in Proving anything to anyone. నేను, మా అమ్మ ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటాం. నా కూతురు మా అమ్మకు చాలా క్లోజ్! వాళ్ల ఇష్టాయిష్టాలు చాలా దగ్గరగా ఉంటాయి. అవన్నీ బయటి ప్రపంచానికి తెలియదు. తెలియజెప్పాలనే ఆసక్తి నాకు లేదు. మా జీవితాల్లో మేం బాగానే ఉన్నాం.

* నేను చాలా ఆత్మగౌరవంతో పెరిగాను. అనవసరంగా ఒక్క మాట కూడా పడను. నేను తప్పు చేస్తే ఏమాత్రం ఇబ్బంది పడకుండా సారీ చెప్తాను. అందరికీ తెలిసిన ఒక సీనియర్ నటి & ప్రొడ్యూసర్ తను తీస్తున్న సీరియల్‌లో నటించమని నన్ను అడిగారు. ఆమెను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మా కుటుంబంలో అందరికీ ఆమె బాగా తెలుసు. సరే అని ఆమె సీరియల్‌లో నటించాను.‌ మూడు నెలలు గడిచినా నాకు డబ్బు రాలేదు. ఒకసారి ఆమెకు ఫోన్ చేసి డబ్బుల గురించి అడిగాను. తర్వాత రోజు ఆమె సెట్‌కి వచ్చి అందరి ముందూ నన్ను తిట్టారు.

* ఆమె అలా తిడుతుంటే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అలా షాక్‌లో ఉండిపోయాను. షాట్ అయిపోయిన తరువాత లోపలికి వెళ్లి మా అమ్మమ్మకి ఫోన్ చేసి జరిగింది చెప్పాను. “ఆ మాటలు పడాల్సిన అవసరం నీకు లేదు. వెంటనే ఇంటికి వచ్చేసెయ్! ఆమె ఇచ్చే డబ్బులు మనకేమీ వద్దు” అని అంది. నేను నా సామాన్లు ప్యాక్ చేసుకొని వెళ్తున్నానని ఆమెకు చెప్పి వచ్చేశాను. “అదేంటి? అలా ఎలా వెళ్లిపోతావ్! నీకోసం డబ్బు తెప్పిస్తున్నాను” అని అన్నారు. “నాకేమీ అక్కర్లేదు. మీ డబ్బు మీ దగ్గరే ఉంచండి” అని చెప్పి వచ్చేశాను. నన్ను అంత అనుమానించిన ఆమె ఆ తర్వాత ‘I love you Aishwarya’ అని తన యూట్యూబ్ చానెల్‌‌లో నాకోసం ఓ వీడియో చేశారు. అవసరమా అదంతా?

(నటి ఐశ్వర్య ఇటీవల ఇచ్చిన ఓ తమిళ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు… విశి)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేటీయార్ పోరాటాలు కొత్త పుంతలు కాదు… విచిత్ర పుంతలు ఫాఫం..!!
  • ‘‘చోడో కల్‌ కీ బాతే, కల్‌ కీ బాత్‌ పురానీ– నయే దౌర్‌ మే లిఖేంగే నయీ కహానీ!’’
  • క్షమించండి… యాదాద్రి కాదు… ఒడిశాలోని తారాతరిణి శక్తిపీఠం ఇది…
  • నాలుగు మెట్రో కథలు… కొత్తతరం నగర జీవితాలు… మెట్రో ఇన్ దినో…
  • అందరికీ సన్నబియ్యం… ఆచరణలో కష్టమైనా సర్కారు సక్సెస్..!
  • దలై లామా..! స్వధర్మం, స్వయంపాలన, స్వజనం కోసం అదే నిబద్ధత..!!
  • తండ్రి సమస్యను పరిష్కరించి… ఏటా 40 వేల కోట్ల మేరకు ఫాయిదా…
  • మీడియా సమస్యా..? కాదు, రాబోయే రాజకీయ సమీకరణాల సంకేతాలు..!!
  • మరి అమరావతి అంటే ఆమాత్రం ఉండాలి… మొక్కలనూ వదలరు…
  • No more ‘BARC’racy… టీవీ రేటింగుల లెక్కలే పూర్తిగా మారబోతున్నయ్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions