ప్చ్… ఢిల్లీలో మన వెంకయ్యనాయుడు లేని లోటు కనిపిస్తోంది… సంక్రాంతి పూట చక్కగా సంబురాలు చేయించేవాడు… పార్టీ ముఖ్యులను కూడా ఆహ్వానించి మాంచి తెలుగు భోజనం పెట్టించేవాడు… నాన్-తెలంగాణ కాబట్టి సకినాలు, తాడ్కల పాశం ఉండకపోవచ్చునేమో గానీ మాంచి ఆంధ్రా వెజ్ కడుపు నిండా పెట్టేవాడు… ఫాఫం, తెర మీదే లేకుండా పోయాడు… అయోధ్యకైనా ఆహ్వానించారో లేదో…
ఇప్పుడు ఆ చాన్స్ తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ తీసుకున్నాడు… ఆయన కేంద్ర చేపలు, పశుసంపద సహాయ మంత్రి… తమిళులు ఈ పండుగను మనలాగే ఘనంగా జరుపుకుంటారు… (తెలంగాణలో సంక్రాంతి సంబురాలు తక్కువే, తెలంగాణకు దసరా ప్రధానం…) ప్రధానంగా వ్యవసాయదారుల పండుగ… మనకు మూడు రోజుల పండుగ (భోగి, సంక్రాంతి, కనుమ) అయితే వాళ్లకేమో నాలుగు రోజుల పండుగ… (అక్కడా భోగి పొంగల్, థాయ్ పొంగల్, మట్టు పొంగల్, కనుమ పొంగల్…) మనలాగే భోగి, కనుమ…
తమిళనాడు యావత్తూ ఈ సంబురాల్లోనే ఉంది… మురుగన్ నిర్వహించిన పొంగల్ ఉత్సవాల్లో మోడీ కూడా పాల్గొన్నాడు… వీడియోలు, ఫోటోలు గట్రా వచ్చాయి కదా… ఆవులకు గడ్డి తినిపించడం గట్రా… అయోధ్య ఉపవాస దీక్షలో ఉన్నాడు కదా, బహుశా ఏమీ తిని ఉండడు… ఈ ప్రోగ్రాంలో అదే తమిళనాడుకు చెందిన నిర్మలా సీతారామన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై, జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, బీజేపీ నేషనల్ వుమెన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వనతి శ్రీనివాస్ తదితరులు కూడా పాల్గొన్నారు…
Ads
మన బండారు దత్తాత్రేయ నిర్వహిస్తాడు అలయ్ బలయ్ అని… తెలుసు కదా… అలాగే తమిళులు నిర్వహించుకునే గెట్‌టుగెదర్ వెట్టి-చట్టి… సరే, అక్కడ మోడీ ఏదో ప్రసంగించాడు, తనకు దక్షిణ వోట్లు కావాలి కదా, కావాలనైనా దక్షిణ పండుగల్ని చేసుకుంటూ ఫోకస్ అవుతాడు, తన మీడియా దేశమంతా ఆ వార్తల్ని, ఆ ఫోటోల్ని మోసుకుపోతుంది…
సరే, ఇదంతా చెప్పుకుంటున్నాం సరే, గానీ ఆ ప్రోగ్రాంలో నటి థిల్లానా థిల్లానా మీనా ప్రముఖంగా కనిపించింది… మోడీ పక్కనే ధగధగలాడింది… అతిథులు మొదటి వరుసలోనే ఆమెకూ సీటు కేటాయించారు… పెద్ద పెద్ద బీజేపీ తలకాయల నడుమ ఈ తల ఎందుకలా మెరిసిపోయింది..? చాలామంది అదే ఆసక్తిని రేకెత్తించింది… అఫ్ కోర్స్, మోడీ ఇలాంటి వాళ్లను పెద్దగా దేకడు… అది వేరే సంగతి…
ఆ ఈవెంట్‌కు వెళ్లిన ఒకాయన ఏమంటాడంటే… ‘‘నిర్మలా సీతారామన్, తమిళిసైల తరువాత మీనాకే అధిక ప్రాధాన్యం దక్కింది… వనతి శ్రీనివాన్ పక్కనే ఆమె సీటు… ఆమె బీజేపీ మనిషి కాదు, మరెందుకు ఈ ప్రాధాన్యం..? ఎవరికీ అర్థం కాలేదు…’’
మీనాతోపాటు కొరియోగ్రాఫర్ కళ మాస్టర్ మొత్తం ప్రోగ్రాం అయిపోయేదాకా మోడీ వెంటవెంటనే తిరిగారు… నిజానికి కొన్నాళ్లుగా తమిళ మీడియా రాస్తూనే ఉంది… మీనా త్వరలో బీజేపీలో చేరి, వచ్చే లోకసభ ఎన్నికల్లో పోటీచేయబోతోంది అని… ఓహో, అది నిజమేనన్నమాట…
ఖుష్బూ ఆల్రెడీ బీజేపీలోనే ఉంది… నేషనల్ వుమెన్ కమిషన్ మెంబర్… ఆమె మీనాకు జాన్ జిగ్రీ… మీనా మాత్రమే కాదు, నమిత, రాధారవి, గంగై అమరన్, కస్తూరి రాజా, కుట్టి పద్మిని, పొన్నాంబళం, పవర్ స్టార్ శ్రీనివాసన్, మ్యూజిషియన్ దినా, నిర్మాత నటరాజన్, నట నిర్మాత ఆర్కే సురేష్ తదితరులంతా ఇప్పుడు బీజేపీయే… కాకపోతే ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు అన్నామలైతో పొసగక నటి గాయత్రి రఘురాం, గౌతమి పార్టీని విడిచిపెట్టిపోయారు… అసలు సినిమా పర్సనాలిటీస్ అంటేనే పెద్ద తిక్క కేసులు, ఇప్పుడున్నవారితో కూడా అన్నామలైకి ఎలా పొసుగుతుందో ఏమో… ప్రత్యేకించి రాబోయే మీనాతో..!!
Share this Article