.
‘ఆడపిల్లలే నయం’… 40 ఏళ్ల క్రితమే చెప్పేశారు
… మనలో చాలామందితో సహా మన చుట్టాల్లో 90 శాతం మంది ఎలా ఉన్నారు? పుత్రసంతానం మీద విపరీతమైన మోహంతో ఉన్నారు. కొడుకు వంశోద్ధారకుడు అని, తమను ఉద్దరిస్తాడనే ఆలోచనతో ఉన్నారు. ఆడపిల్లలు ‘ఆడ’ పిల్లలే అన్న మాటను ఇంకా ఇంకా మోస్తున్నారు.
వృద్ధాశ్రమాలు పెరుగుతున్నా, ఒక్క కొడుకు ఉంటే చాలు ఆఖరి సమయంలో ఆదుకుంటాడనే ఆశతో ఉన్నారు. లాయర్ల దగ్గరికి వెళ్లి అడిగి చూడండి, తిండి పెట్టకపోయినా ఫర్లేదు కానీ, కొడుకు మీద కేసులు పెట్టమంటే పెట్టరు. ఒకవేళ పెట్టినా, చివరకు రాజీకొచ్చేస్తారు. కొడుకు ‘కొరివి’ లాంటివాడైనా తలకొరివి అతనే పెట్టాలన్న పిచ్చి నమ్మకాన్ని ఇంకా ఇంకా పాటిస్తూ ఉంటారు.
Ads
ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత మరోసారి భార్య గర్భవతి అయితే, స్కానింగ్ చేయించి, పుట్టేది ఆడపిల్ల అని తెలిసి అబార్షన్ చేయించిన చుట్టం నా చుట్టే ఉన్నాడు. ఒక్క కొడుకు కోసం నలుగురు ఆడపిల్లల్ని కన్న ప్రభుత్వ ఉద్యోగి నా కళ్ల ముందే తిరుగుతున్నాడు. ఇద్దరు కూతుళ్ల తర్వాత మరోసారి కూతురే పుడితే, లిటరల్‌గా హాస్పిటల్లోనే ఏడ్చిన కుటుంబం నాకు తెలుసు. ఇవన్నీ వాళ్ల మొహం మీద ఏనాడైనా అనగలిగామా?
గుట్టుగా బండి లాగిస్తున్నాం. ఇంతా చేస్తే, పుట్టిన ఆడపిల్లలకే సరైన గౌరవం, గుర్తింపు ఇవ్వలేని సమాజంలో ఉన్నాం. ఇంక పుట్టబోయే ఆడపిల్లల గతి ఊహిస్తేనే ఘోరంగా ఉంది. ఇవన్నీ సమాజరీతులు. మారిపోయాయని అనుకోవడం మన అమాయకత్వం. మారాలని ప్రయత్నించడమే ఇప్పటి అవసరం.
ఓ సినిమా గుర్తొస్తోంది. పేరు ‘ఆడపిల్లలే నయం’. 1985లో వి.సత్యనారాయణ అనే దర్శకుడి దర్శకత్వంలో వచ్చిన సినిమా. చంద్రమోహన్, జయసుధ, రాజేంద్రప్రసాద్, సుత్తివేలు, వేజెళ్ల రాజేశ్వరి, శ్రీలక్ష్మి, రాజ్యలక్ష్మి, రావికొండలరావు.. వీరంతా అందులో పాత్రధారులు.
చాలా సింపుల్ కథ. ఇద్దరు కొడుకుల తర్వాత ఓ ఆడపిల్లని కన్న ఓ తండ్రి తన కొడుకులు తనను ఉద్దరిస్తారని గొప్పగా ఆశపడతాడు. ఆడపిల్ల తర్వాత ఓ కొడుకును కన్న మరో తల్లి మాత్రం ఎవరైనా ఆ దేవుడిచ్చిన వరమే అని భావిస్తుంది. కాలం గిర్రున తిరిగి అందరూ పెద్దవుతారు.
ఇటు ఆయన ఇద్దరు కొడుకులూ పెళ్లిళ్లు చేసుకుని, పట్నంలో కాపురం పెట్టి భార్యలకు దాసులుగా మారిపోతారు. తండ్రి ఎలా ఉన్నాడో, చెల్లెలు ఎలా ఉందో చూసే తీరిక, కోరిక లేకుండా పోతుంది. మరో పక్క కూతుర్ని, కొడుకును పెంచిన ఆ తల్లి కాయకష్టం చేస్తూ వారిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది.
ఆ కూతురు మగపిల్లలతో సమానంగా చెట్లెక్కుతూ, అందర్నీ ఎదురించి నిలబడుతూ, ధైర్యంగా ఉంటూ ఇంటికి పెద్ద కొడుకుగా మారిపోతుంది. అటు కొడుకులు పట్టించుకోని ఆ తండ్రి మనోవేదనతో మరణిస్తాడు. ఆయన కూతురు ఒంటరిదైపోతుంది.
ఆ తర్వాత రకరకాల సీన్లు, మెలోడ్రామాలు. ఒకసారి చూసేందుకు మాత్రమే బాగుండే సినిమా. అప్పటికి కొత్తగా సినిమాల్లో నిలదొక్కుకుంటున్న రాజేంద్రప్రసాద్, శ్రీలక్ష్మి ఇందులో భార్యాభర్తలుగా నటించారు. కామెడీ నటిగా పేరున్న శ్రీలక్ష్మి గయ్యాళి పాత్ర పోషించిన సినిమా ఇదొక్కటే అనుకుంటా!
మగపిల్లలతో సమానంగా పెరిగిన అమ్మాయిగా జయసుధ ఇందులో నటించారు. అప్పటికి పాతికేళ్లు దాటేసి, చాలా సీరియస్ పాత్రలు చేస్తున్న ఆమెకు ఇందులో చలాకీ పిల్ల పాత్ర అంత సూట్ కాకపోయినా, తన నటనతో బాగానే మెప్పించారు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి పాత్రలో చంద్రమోహన్ నటించారు.
ఇద్దరన్నలున్నా ఆదరణ కరువైన చెల్లెలి పాత్రలో రాజ్యలక్ష్మి నటిస్తే, ఆమె అన్నలుగా సుత్తివేలు, రాజేంద్రప్రసాద్ నటించారు. ఈ సినిమాలో ఓ కీలక పాయింట్ ఏంటంటే, రాజేంద్రప్రసాద్ కొడుకు తన తల్లి (శ్రీలక్ష్మి) పెంపకంలో రాలుగాయిలా తయారవుతాడు.
భర్త చెల్లెలి (రాజ్యలక్ష్మి)ని ఆమె కొడుతూ ఉంటే, ఏడేళ్ల కొడుకు కూడా ఆమెతోపాటు మేనత్తని కాళ్లతో తంతాడు. అలా తన్నమని తల్లే ఆ పిల్లాడిని ప్రోత్సహిస్తుంది. పనిమనుషులను కొట్టే పిల్లలు, ఆడపిల్లల్ని ధైర్యంగా టీజ్ చేసే అబ్బాయిలు, రోడ్డు మీద అమ్మాయిల మీద పెట్రోలు పోసేవాళ్లు ఎక్కడ, ఎలా తయారవుతారో ఆ సీన్ చూస్తే అర్థమవుతుంది.
మెలోడ్రామా నిండిన ఈ సినిమాలోని ‘ఆడపిల్లల్ని కంటే మేలు’ అనే పాయింట్‌తో ఆ తర్వాత పదేళ్లకు దాసరి నారాయణరావు ‘కంటే కూతుర్నే కను’ అనే సినిమా తీశారు. రెండూ పూర్తిగా విభిన్నమైన సినిమాలు. కానీ పాయింట్ దాదాపు ఒకటే! రెండు సినిమాల్లోనూ జయసుధ ఉండటం విశేషం. ఈ రెండు సినిమాలూ యూట్యూబ్‌లో ఉన్నాయి. చూడండి…. – విశీ (వి.సాయివంశీ)
Share this Article