నిన్న సోషల్ మీడియాలో ఒకటే చెణుకులు… ‘మంచిగైంది’ అన్నట్టు నవ్వులు… రేవంత్ ప్రెస్‌మీట్‌లో జర్నలిస్టులు స్వేచ్ఛగా ప్రశ్నలు అడిగారు, తను జవాబులు చెప్పాడు… గతంలో కేసీయార్ ప్రెస్‌మీట్లు తెలుసు కదా, పరోక్షంగా బెదిరింపులు, వెక్కిరింపులు, ఎకసక్కేలు… ముఖ్యమంత్రి హోదాలో ఉన్నానని కూడా మరిచిపోయి వ్యవహరించేవాడు… సీఎం బీట్ చూసే రిపోర్టర్లు స్వేచ్ఛ లభించినట్టు ఫీలవుతున్నారు… సచివాలయంలోకి ప్రవేశమే లేని దురవస్థలో ఏకంగా సీఎం మీడియా మీట్ ఏ ఆంక్షలు లేని వాతావరణంలో… గుడ్…
రేవంత్ రెడ్డి ఈ స్పిరిట్ కాపాడుకుంటాడనే ఆశిద్దాం… దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉండిపోయి, కేసీయార్ నమ్మకద్రోహానికి గురైన ఇళ్లస్థలాలనూ ఓ కొలిక్కి తీసుకువస్తాడనీ కోరుకుందాం… అదే సమయంలో తను చేయాల్సింది మరొకటి ఉంది… అబ్బే, కోట్లు తగలేసిన ఆ 22 ల్యాండ్ క్రూయిజర్లను తెప్పించి, మంత్రులకు అధికారిక ఉపయోగానికి ఇచ్చేయడం గురించి కాదు… మీడియాలో జరిగిన ప్రజాధన దోపిడీని తవ్వితీయడం…
కేసీయార్ అవమానకరంగా ప్రగతిభవన్ ఖాళీచేసి, ఆ ఫామ్ హౌజ్ వైపు, ఆ నిరాశా దిగంతాల వైపు సాగిపోయాక… కొత్త ప్రభుత్వం కొలువు తీరాక ప్రభుత్వ యాడ్స్ నమస్తే తెలంగాణలో కూడా ప్రత్యక్షం కావడం అందరినీ విస్మయపరిచింది… అది కూడా పత్రికే అనుకుందాం కాసేపు, కానీ తను ఇన్నేళ్లూ ఇదే రేవంత్‌రెడ్డి మీద, ఇదే కాంగ్రెస్ మీద వందల టన్నుల బురదను, చెత్తను చిమ్మింది… రేవంత్ రెడ్డే ప్రధాన బాధితుడు… ఐనా పత్రికకు యాడ్స్ వచ్చాయి… అందరికీ ఇచ్చినప్పుడు, వాళ్లకూ ఇవ్వాలి కదా అనేది పైకి చెప్పడానికి బాగానే ఉంటుంది… కానీ..?
Ads
రాజకీయాల్లో సమీకరణాలు, లెక్కలు, దృక్కోణాలు వేరు… ఇదే కేసీయార్ ఏం చేశాడు..? ఏళ్ల తరబడీ ఆంధ్రజ్యోతికి యాడ్స్ ఇవ్వలేదు… వెలుగుకు కూడా ఆమధ్య ఆపేసినట్టున్నాడు… అంతేనా..? మమ్మల్ని వ్యతిరేకించే వాళ్లకు ఇళ్లస్థలాలు ఎందుకిస్తాం అంటూ దబాయించాడు… మళ్లీ వెంటనే తెలంగాణను వ్యతిరేకించేవారికి అని కవర్ చేశాడు..? బీఆర్ఎస్‌ను వ్యతిరేకిస్తే తెలంగాణను వ్యతిరేకించినట్టా..? ఒక ముఖ్యమంత్రి సూత్రీకరణా అది..? దారుణమైన ధోరణి…
ఇప్పుడు కళ్లు తెరుచుకుని రేవంత్ ప్రభుత్వం నమస్తే తెలంగాణకు యాడ్స్ ఆపేసింది… నిన్న అందరికీ ఇచ్చిన సిక్స్ గ్యారంటీలు, ప్రజాపాలన, అభయహస్తం బాపతు యాడ్స్ అందులో రాలేదు… నిజానికి రేవంత్ ప్రభుత్వం చేయాల్సింది మరో కీలకాంశం ఉంది… అసలు ఏ పత్రిక సర్క్యులేషన్ ఎంత..? ఏ టీవీ చానెల్ వ్యూయర్‌షిప్ ఎంతో తేల్చాలి… ఏబీసీ లేదా ఐఆర్ఎస్… ఏదో ఒక న్యూట్రల్ ప్రొఫెషనల్ సర్వే ఫలితాన్నే పరిగణనలోకి తీసుకోవాలి… పత్రికల సొంత సర్టిఫికెట్లను, సీఎ మదింపుల్ని చెత్తబుట్టలో పడేయాలి… టీవీలకు రేటింగ్స్ ప్రతివారం బార్క్ ఇస్తుంది… ఇన్నేళ్ల ప్రభుత్వ యాడ్స్ కలిపి లెక్కేసి చూస్తే కొన్ని వేల కోట్ల స్కాం ఇది…
వాటిని బట్టి టారిఫ్ రివైజ్ చేయాలి… నమస్తే తెలంగాణ మాత్రమే కాదు… కొన్ని చిన్న పత్రికలు పేరుకు ఐఅండ్‌పీఆర్ అధికారులకు పంపించడం కోసమే ఓ వందా రెండొందల కాపీలు కొట్టి అడ్డగోలుగా యాడ్స్ కొట్టేసేవాళ్లు… టీవీ చానెళ్లకు ఇచ్చే యాడ్స్‌కు లెక్కాపత్రం ఏమీ లేదు… జాతీయ స్థాయిలో తన పేరు వెలిగిపోవడానికి ఏవేవో భాషల్లో ఉన్న పత్రికలకూ వందల కోట్లు తగలేశాడు కేసీయార్… కేవలం ఆ యాడ్స్ కమీషన్ల కోసం అప్పటికప్పుడు ‘యాడ్ ఏజెన్సీలు’ పుట్టుకొచ్చాయి… తెలుగు కదా, అవి పలువురు పీఆర్ఓల బినామీ ఏజెన్సీలు… అదొక పెద్ద దందా… దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి… అలా చేస్తేనే కోట్ల ప్రజాధనానికి న్యాయం చేసినట్టు… అబ్బే, అలా చేస్తే, ఓ పారదర్శక విధానం తీసుకొస్తే మా వెలుగు పత్రికకు కష్టం కదా అంటారా..? ఏబీసీకి వెళ్లమనండి, తప్పేముంది..? అన్నట్టు… మీడియా అకాడమీ వేరు, జర్నలిస్టుల యూనియన్ వేరు… ఆ రెండింటి మధ్య ఓ బలమైన గీత ఉంటుంది… దాన్ని గౌరవించండి…!!
Share this Article