కన్నడ సినిమా ముఖచిత్రం మారుతోంది… కేజీఎఫ్ మాత్రమే కాదు… ఆ ఇండస్ట్రీ కొత్త రక్తాన్ని నింపుకుని ఉరకలు వేస్తోంది… మొన్నమొన్నటిదాకా సౌత్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో బాగా వెనకబడినట్టు కనిపించిన శాండల్‌వుడ్ తాజాగా మేమెవరికీ తక్కువ కాదంటూ కాలర్ ఎగరేస్తోంది… ఇప్పుడు ఓ భిన్నమైన సినిమా పాన్ ఇండియా రిలీజ్‌కు రెడీ అయిపోయింది… వచ్చే 10న మలయాళం, తమిళం, కన్నడం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతోంది… పాన్ ఇండియా అంటే ఈ అయిదు భాషల్లో రిలీజ్ కావడమే కదా మరి..!!
ఈ చిత్రం ఎవరిదో తెలుసా..? రక్షిత్ శెట్టి హీరో… గుర్తుందా..? గుర్తొచ్చిందా..? ఎస్… ప్రస్తుతం టాప్ ఫిమేల్ స్టార్ హోదాను ఎంజాయ్ చేస్తున్న రష్మిక మంథన మాజీ లవర్… (ఒకప్పుడు ఎంగేజ్‌మెంట్ దాకా వెళ్లిన వాళ్ల బంధం తరువాత హఠాత్తుగా తెగిపోయింది)… దర్శకుడు కిరణ్‌రాజ్… సినిమా పేరు 777 చార్లీ… ఓ యాంగ్రీ యంగ్ మాన్ పాత్ర… పేరు ధర్మ… ఆవేశం, కోపం ప్లస్ ఒంటరితనం… తన బతుకులోకి ఓ కుక్క వస్తుంది… అది తన జీవితాన్ని, తత్వాన్ని, లక్ష్యాల్ని గణనీయంగా మార్చేస్తుంది…
మహాభారతంలో ధర్మరాజు, ఓ కుక్కతోపాటు సాగించే మహాప్రస్థానం తెలుసు కదా… దానికి ఓ సోషల్ వెర్షన్ అన్నమాట ఈ సినిమా… అంటే, కాస్త ఆ ఫిలాసఫికల్ లైన్‌లో కథను నడిపిస్తాడు దర్శకుడు… నిజానికి రక్షిత్ శెట్టి సినిమాలు ఇండిపెండెంట్ ధోరణిలో ఉంటయ్… మూసలో ఉండవ్… తనతోపాటు పనిచేసే టీం కూడా సేమ్ ఆలోచన ధోరణి… ఈ 777 చార్లి సినిమాలో హీరో ప్లస్ కుక్క… ప్రధానపాత్రలు వాళ్లే… గోవా, మహారాష్ట్ర, కోస్టల్ కర్నాటక, పంజాబ్, రాజస్థాన్, సిమ్లా, కాశ్మీర్ అంతటా చిత్రీకరించారు… ‘‘దేశం మొత్తమ్మీద కుక్కల ప్రేమికులు ఉంటారు… లక్షల ఇళ్లల్లో కుక్కలు పెంపుడు జంతువులు… సో, ఈ సినిమా దేశం మొత్తాన్ని కనెక్టవుతుంది… అందుకే ఇది రియల్ పాన్ ఇండియా సినిమా’’ అంటున్నాడు రక్షిత్…
Ads
‘‘నేను కూడా ఈ సినిమాలో పాత్ర ధర్మలాగే అంతర్ముఖుడిని… ఏదైనా సినిమా షూటింగులో మునిగిపోతే ఇక కొలీగ్స్ లేరు, ఫ్రెండ్స్ లేరు, ఇరుగు లేదు, పొరుగు లేదు… ప్రపంచం నుంచి డిస్‌కనెక్ట్ అయిపోతాను… ఒక కుక్క మనిషి బతుకును ఎలా మారుస్తుందనే ఇంట్రస్టింగ్ పాయింట్ నన్ను ఈ సినిమా వైపు పురిగొల్పింది…
ఇక్కడ చార్లీ గురించి చెప్పాలి… కుక్క పాత్రను గ్రాఫిక్స్‌లో నడిపించలేదు… నిజమైన కుక్కే… ఒకటి కాదు, రెండు కుక్కలు ప్లస్ రెండు కుక్క పిల్లలు… నిజానికి అవి నటించడం కోసమే పుట్టాయేమో… నిపుణుడైన శునకశిక్షకుడు ప్రమోద్‌ను నియమించాడు దర్శకుడు… స్క్రిప్టుకు అవసరమయ్యే దాదాపు 450 రకరకాల ట్రిక్స్ వాటికి నేర్పించాడు… ప్రతి షెడ్యూల్‌కు ముందు వాటికి 20 – 30 ట్రిక్స్ నేర్పించేవాడు… షూటింగ్ అయ్యాక వాటితో అనుబంధాన్ని తెంచుకోలేకపోయాం,.. ఒకదాన్ని నేను, మరోదాన్ని దర్శకుడు, రెండింటిని టెక్నికల్ స్టాఫ్ తీసుకున్నాం…
మూడేళ్లు… 167 రోజుల షూటింగ్… కుక్కలతో వర్క్ అంటే ఈజీ కాదని తెలుసు కదా… బోలెడు రాష్ట్రాల్లో షెడ్యూళ్లు… ఓ మామూలు సినిమాతో పోలిస్తే మా ఛాలెంజెస్ పది రెట్లు… ఒక్కోషాట్ 30, 40 టేక్స్ తీసుకునేది… కుక్కలు నటించలేవు… నేర్పించిన ట్రిక్స్ ప్రదర్శిస్తాయి… వాటితో మనకు కావల్సిన ఔట్‌పుట్ తీసుకోవాలి… దానికి రకరకాల కష్టాలు పడ్డాం… క్లోజ్ సన్నివేశాల్లో ఓవైపు కుక్కను కమాండ్ చేస్తూ, మరోవైపు మన ఎమోషన్స్ నటించాలి… పెద్ద టాస్కే…
నిజానికి నాకు పెంపుడు జంతువులతో కనెక్షన్ లేదు… చిన్నప్పుడు ఆరో తరగతిలో రెండు కుక్కలు పెంచుకుంటే చనిపోయాయి… ఉడిపిలో మా ఇంట్లో మూడు కుక్కలు ఉండేవి, నేను దూరంగానే ఉండేవాడిని… తరువాత నా ఐటీ జాబ్ కోసం బెంగుళూరు వెళ్లాక అసలు పెట్స్ అంటేనే ఇష్టం ఉండేది కాదు… నాలుగు గోడల మధ్య వాటిని బంధించడం ఏమిటనుకునేవాడిని… నాకు లైఫ్ ఏమిటో తెలుసు… నాన్న కంట్రాక్టర్… నేను కూడా ఇంజనీరింగ్ చదివి ఐటీ జాబ్ చేశాను… కానీ సినిమా మీద పిచ్చి…
రెండు పడవల మీద కాళ్లు పెట్టలేక, ఐటీ జాబ్ వదిలేశాను, కెరీర్ మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ తీసేవాడిని… 30, 40 వేలు ఆగిపోయిన ఫిలిమ్స్ కూడా ఉన్నయ్… నిజం చెప్పాలా..? బ్రేక్‌ఫాస్ట్ కోసం ఆకలితో కడుపు మాడ్చుకున్న రోజులున్నాయి… అందుకేనేమో ఈ ధర్మ పాత్ర భలే కనెక్టయింది నాకు… నిజానికి పాన్ ఇండియా రచ్చ వేస్ట్… సౌత్ ఇండియా ఇండస్ట్రీ ఎప్పుడూ పెద్ద సినిమాలనే ప్లాన్ చేస్తుంటుంది… ఆంధ్ర నిర్మాతలు మరీ ఎక్కువ… తమిళం, కన్నడ ఇండస్ట్రీలు వాళ్లను చూసి నేర్చుకున్నవే… అన్నీ పాన్ ఇండియా సబ్జెక్టులుగా సూట్ కావు…
పైగా ఏ సినిమా ఓటీటీలో చూడాలో, ఏది థియేటర్‌లో చూడాలో ప్రేక్షకులకు బాగా తెలుసు… మారుతోంది… కన్నడ సినిమా వేగంగా మారుతోంది… ‘ఏడు సముద్రాలు దాటి’ అని ఓ సినిమా తీయబోతున్నా… లార్జర్ దాన్ లైఫ్… చాలా డిఫరెంట్ కంటెంట్… మనందరికీ తెలిసిన ఆవు-పులి కథ ఉంది కదా… దానికి పుణ్యకోటి అనే మనుషుల వెర్షన్ నేనే తీయబోతున్నా… మరణానంతర జీవితం గురించి పక్కా గ్రాఫిక్ వర్క్‌తో మోక్ష అనే సినిమా ప్లాన్ చేస్తున్నాను…’’…… రక్షిత్ శెట్టి చెప్పిన వివరాలే ఇవన్నీ…
Share this Article