ఈమధ్య ఓ మీడియా వ్యవహారాల వెబ్‌సైట్ కొన్ని అంకెలు ప్రచురించింది… జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద పత్రికల సర్క్యులేషన్ ఈ రెండేళ్లలో ఎంత దారుణంగా పడిపోయిందనేది ఆ గణాంకాల సారాంశం… తెలుగులో పత్రికల స్థితిగతులేమిటో ‘ముచ్చట’ ఇంతకుముందే చెప్పింది… అసలు ఏబీసీ లెక్కలంటే వణికిపోయే చిన్నాచితకా పత్రికల్ని వదిలేద్దాం… ఏబీసీ లెక్కలకు సిద్ధపడేవి సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి… వాటి కాపీలు ఎంత దారుణంగా పడిపోయాయో కూడా మనం చెప్పుకున్నాం…
దేశమంతటా ప్రింట్ మీడియా సంక్షోభం కొనసాగుతోంది… ముద్రణ వ్యయాలు, రవాణా ఖర్చులు, పంపిణీ కష్టాలు పత్రికారంగాన్ని కుదేలు చేస్తున్నాయి… కానీ మళ్లీ ఇప్పుడిప్పుడే కాస్త ధైర్యాన్ని తెచ్చుకుంటున్నయ్ తెలుగు పత్రికలు… ప్రత్యేకించి జగన్ పదే పదే తిట్టిపోసే ఆ రెండు పత్రికలు… ముందుగా చెప్పుకోవాల్సింది… కాపీలు, సర్క్యులేషన్ మాటెలా ఉన్నా, ఉన్న సిబ్బందిని కాపాడుకోవడానికి ఆంధ్రజ్యోతి జీతాలు పెంచింది…
కరోనా సమయంలో ఇళ్లకు పంపించేసి, అరకొర జీతాలు ఇచ్చిన జ్యోతి గత ఏడాది కాస్త తేరుకుని 5 శాతం మేరకు పెంచింది… కానీ ఇప్పుడు 10 శాతం జీతాలు పెంచింది… ఇప్పుడు పత్రికారంగం ఉన్న స్థితిలో చెప్పుకోదగిన విశేషమే… ‘‘సబ్ ఎడిటర్లకు సగటున 2500 నుంచి 3000 వరకు పెరిగింది… కాగా డెస్క్ ఇంఛార్జిలకు సగటున 4,000 పెరిగాయి’’ అని సమాచారం… సో, సిబ్బంది మంచి మూడ్‌లోకి వచ్చేశారు… మరి కంట్రిబ్యూటర్లకు ఏం పెరిగింది..? ఎప్పటిలాగే ఏమీ లేదు… హళ్లికిహళ్లి సున్నాకుసున్నా…
Ads
ఆమధ్య నమస్తే ఉద్యోగులు అక్కడక్కడా పెన్ డౌన్, ఆందోళనలు చేసినట్టు వార్తలొచ్చినయ్… సాక్షిలో ఈ భారీ పెంపులు ఏమీ లేవు… ఆమధ్య జస్ట్ 5 శాతం పెంచినట్టు గుర్తు… అదలా నడిచిపోతూ ఉంటుంది… ఉండేవాళ్లు ఉండనీ, పోయేవాళ్లు పోనీ… ఐనా ఇంకెక్కడికి పోతారు..? ఈమాత్రం జీతాలైనా ఇచ్చేవాడు ఎవడున్నాడు..? ఇదీ ధీమా… ఇదే భరోసా…
ఆంధ్రజ్యోతికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల యాడ్స్ ఉండవు… రెండు ప్రభుత్వాలతోనూ వైరమే… మరోవైపు ఆర్థికభారం… ఐనాసరే రాధాకృష్ణ ఈ భారాన్ని భరించడానికి సిద్ధపడటం విశేషమే… ఈనాడు సంగతికొస్తే… అదొక గందరగోళం… బబ్రాజమానం- భజగోవిందం… ఈనాడు అపాయింట్‌మెంట్లు ఉన్నవాళ్లు పనిచేయరు… వేతనభారం ఎక్కువ… అందుకని ‘ఈనాడు డిజిటల్’ పేరిట పనిచేసేవాళ్లకు పనిదోపిడీ… చాలామంది ఈనాడు జర్నలిజం స్కూల్ యాడ్ చూసినట్టున్నారు… కానీ ఓ జాగ్రత్త…
ఇది ప్రింట్ జర్నలిజం కోసం కాదు… కేవలం మల్టీమీడియా, టెలివిజన్, మొబైల్ జర్నలిజం విభాగాల్లో పని చేయించుకోవడం కోసం… తనకు అవసరమున్నంతమేరకు శిక్షణ మాత్రమే ఇస్తారు… ప్రింట్ మీడియా కాదు కదా… ఏ వేజ్ కమిషనూ పనిచేయదు… సో, బాండెడ్ లేబర్ పద్ధతి మళ్లీ మొదలుపెట్టారు… మూడేళ్లపాటు ఈనాడు విభాగాల్లో ఎక్కడ చెబితే అక్కడ పనిచేయాల్సి ఉంటుంది… అంటే ఈటీవీ, ఈటీవీ భారత్ ఎట్సెట్రా… ఈనాడుకు ప్రింట్ మీడియా మీద ఆశల్లేవు, ఇక దాని కోసం ప్రయాస కూడా ఉండదు… ఓన్లీ డిజిటల్ బాటే…
మూడేళ్లు పనిచేస్తామని బాండ్ రాసివ్వాలి… అందులో నుంచి ఏ కారణం చేత బయటికి రావాలన్నా కుదరదు… బోలెడంత డబ్బు పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది… మరి ఇదేం స్కూల్, ఇదేం శిక్షణ అంటారా..? ఎస్, ఈనాడు సంస్థల్లో పనికోసం ఉద్దేశించిన శిక్షణ మాత్రమే… గతంలో చాలామంది బాండెడ్ లేబర్ నుంచి విముక్తి పొందడానికి చాలా కష్టాలుపడ్డారు…!
Share this Article