అయిపోయింది… ఇక కేసీయార్ దగ్గర చిన జియ్యర్ పలుకుబడికి ఫుల్ స్టాప్ పడింది… యాదాద్రి మళ్లీ యాదగిరిగుట్ట అవుతుంది… శ్రీమన్నారాయణ నామకీర్తనలు ఉండవ్… అసలు జియ్యరుడికి ప్రవేశాలు, ఆహ్వానాలే ప్రశ్నార్థకం ఇకపై… అనే ప్రచారాలు సాగాయి, సాగుతున్నాయి… పాలకుడి రాగద్వేషాలు, బంధాలు, పీఠాధిపతుల పరిమిత జ్ఞానాలు మన ఆచారాల్ని, సంప్రదాయాల్ని ప్రభావితం చేస్తున్నాయి అన్నమాట… సరే, దాన్నలా వదిలేస్తే… జియ్యర్ ప్రభావం ఏమీ ముగిసిపోలేదు…
ఆయన వీరభక్తగణం భద్రాచలంలో బలంగానే ఉన్నారు… (జియ్యర్ ఎక్కడికి వెళ్లినా తన సొంత పేరు శ్రీమన్నారాయణను విపరీతంగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడని మనం గతంలోనూ చెప్పుకున్నాం కదా…)… కొన్నేళ్లుగా భద్రాచలం రాముడి ప్రవరను, నామాన్ని మార్చేస్తున్నారనే వివాదం ఉంది తెలుసు కదా… ఈరోజు కల్యాణంలోనూ జియ్యర్ చెప్పినట్టుగానే రామనారాయణుడికి పెళ్లి జరిపించారే తప్ప రామభద్రుడికి కాదు…
సరే, ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసినా… అసలు రామచంద్రుడిని లేదా రామభద్రుడిని రామనారాయణుడిగా మార్చేసి, రాముడి ప్రవర, సీతమ్మ పేరు, ప్రవరలను కూడా మార్చేసి, కల్యాణం జరిపించడం సబబేనా..? ఫేస్‌బుక్‌లో ఓ మిత్రుడి వాల్ మీద కనిపించిన పోస్టు ఆసక్తికరంగా ఉంది…
Ads
భద్రాచల రామయ్య పేరు, ప్రవరలు, గోత్రాలు మారుస్తున్నదెవరు?
నమస్తే దేవ దేవేశ శంఖచక్ర గదాదరధనుర్బాణ దరానంత రామచంద్ర నమోస్తుతే!అని .. రామచంద్రుని దర్శనం అవగానే భద్రుడు స్తుతిస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చి నాలుగు చేతులతో శంఖ చక్ర గదారూఢుడై శ్రీ రాముడు దర్శనమిచ్చాడు. తహసీల్దార్ రామదాసు కూడా సీతారామచంద్ర స్వామి ఆలయాన్నే నిర్మించాడు. అంతేకానీ శ్రీమన్నారాయణ ఆలయాన్ని నిర్మించలేదు.
కానీ నాడు భద్రుడికి రామచంద్రుడు నాలుగు చేతులతో దర్శనిమిచ్చినందుకు ఆయన రాముడు కాదు నారాయణుడే అయి ఉంటాడని ఇన్ని శతాబ్దాల తర్వాత వైష్ణవ మతాధిపతులు కొత్త భాష్యం చెబుతున్నారు. భద్రాచల రాముడిని సీతారామచంద్రస్వామిగా పిలవడం వారిని నామోషీగా మారి రామ నారాయణ అనే పేరు తెరపైకి తీసుకొచ్చారు. అందుకనే గత కొన్నేళ్లుగా చినజీయరు శిష్యులు గోత్రాలు, ప్రవరలు మొత్తం మార్చేశారు. వీళ్లకు ఆ హక్కు ఎవరిచ్చారు?
రామచంద్రుడి గోత్రం వశిష్ట. కానీ గత కొన్నాళ్లుగా(ఈ రోజు కూడా) అచ్యుత గోత్రం అని చెబుతున్నారు. దశరథ మహారాజు గోత్ర ప్రవరలు (నాభాగ, అజ, దశరథ) చెప్పడం మానేసి నారాయణుడి ప్రవరలు అందుకుంటున్నారు… రాముడు కాస్తా..రామ నారాయణుడు అయ్యాడు. సీతమ్మ గోత్రం గౌతమ ప్రవరలు స్వర్ణరోమ, హ్రస్వరోమ, జనకుడు అని చెప్పాలి. దానికి బదులు సీతమ్మ గోత్రాన్ని సౌభాగ్య అని మార్చేశారు. ప్రవరలు మార్చేశారు
—————————-
ఎవరు చేస్తున్నారు ఇదంతా?
విష్ణువును ఆరాధించమని ప్రవచిస్తుంది వైష్ణవ మతం. అంతేకానీ శైవ, శాక్తేయ శాఖలను నిర్వీర్యం చేయమని, స్థానిక ఆచారాలను తొక్కి పారేయమని ఏ వైష్ణవ బోధకుడూ చెప్పలేదు. అలా చేయమని శ్రీ మత్ రామానుజులు కూడా చెప్పి ఉండరు. మరి భద్రాచాల వాసులందరూ శతాబ్దాలుగా అనుసరించిన స్థానిక ఆచారాలను, సంప్రదాయాలను చినజీయరు స్వామి లాంటి వైష్ణవ మతాధిపతులకు తొక్కి తోసి రాజేసే హక్కు ఎవరిచ్చారు?
చివరికి కంచి పరమాచార్యుల వారి పై అద్వైత మత ప్రచారకులంటూ ముద్ర వేసి ఆ తగాదాను తెగనీయలేదు. కేవలం వైష్ణవం మాత్రమే ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటికే భద్రాచల ఆలయంలో శైవ ప్రతీకలను తొలగించారు. శివలింగాన్ని కూడా మాయం చేశారనే ఆరోపణలు ఉన్నాయి
——————————
ఈ తగాదాను పీఠాలకు, పీఠాధిపతులకు వదిలేస్తే లాభం లేదు. భద్రాచల వాసులే పూనుకోవాలి. శతాబ్దాలుగా భద్రాద్రి రామదాసు ఏర్పర్చిన విధివిధానాలనే అనుసరించాలని పోరాటం చేయాలి. లేదంటే శ్రీ సీతారామచంద్రుడి ఉనికిని మాయం చేస్తారు. వైష్ణవులు మంచివాళ్లే. ఎటొచ్చి వైష్ణవ ఉగ్రవాదులతోనే ఈ చిక్కులన్నీ. వీళ్లని ఎంత త్వరగా నియంత్రిస్తే అంత మంచిది
Share this Article