Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హమ్మయ్య… సంజయ్‌ను బండి దింపేశారు… కానీ ఎవరి సంతృప్తి కోసం..?!

July 4, 2023 by M S R

ఓ మిత్రుడి వ్యాఖ్య… ‘‘మొన్న రాహుల్ గాంధీ ఖమ్మం సభలో ఓ మాటన్నాడు… కేసీయార్ పార్టీ అంటే బీజేపీ రిష్తేదార్ పార్టీ… అది బీజేపీకి బీటీమ్… కేసీయార్‌ను ఆడించే రిమోట్ మోడీ చేతిలో ఉంది అన్నాడు… నిజానికి టీబీజేపీ వ్యవహారాలకు సంబంధించి కేసీయార్ చేతిలోనే రిమోట్ ఉన్నట్టుంది… తనకు బండి సంజయ్ అనే తలనొప్పిని తగ్గించేందుకేనా మోడీ ఇప్పుడు తనను తీసేసి, కిషన్‌రెడ్డిని టీబీజేపీ అధ్యక్షుడిగా చేశాడు…’’

తన విశ్లేషణ, కాదు, తన ప్రశ్న ఏమిటంటే..? ‘‘కిషన్‌రెడ్డి సుదీర్ఘకాలం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నవాడే… తనను ఎందుకు తీసేసి, బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా చేసినట్టు..? మళ్లీ ఇప్పుడు కీలకమైన ఎన్నికల వేళ అదే కిషన్‌రెడ్డిని ఎందుకు తెచ్చి పెట్టుకున్నట్టు..?’’ ఇంతకుముందు కిషన్‌రెడ్డి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ ఎప్పుడూ కేసీయార్ రాజకీయాల మీద దూకుడుగా పోయినట్టు కనిపించలేదు… బండి సంజయ్ అధ్యక్షుడయ్యాక కేసీయార్‌ మీద బీజేపీ పోరాటంలో ఎంతోకొంత జోష్ కనిపించింది… కేడర్ యాక్టివేటయింది… కానీ..?

కొన్నిసార్లు అనిపిస్తుందేమిటంటే… వర్గాల కుంపట్ల విషయంలో టీకాంగ్రెస్ టీబీజేపీకన్నా నయం అని..! నిజానికి ఇప్పుడు కాంగ్రెస్‌లోని వర్గాలు కొంత ఐకమత్యంతో పనిచేస్తున్నాయి… తమలోతమకు ఎన్ని విభేదాలున్నా సరే…! ఇప్పుడు బీజేపీలో ఉన్న వర్గపోరాటం కాంగ్రెస్‌కన్నా ఎక్కువ… ఎమ్మెల్యే రఘునందన్ మీడియా పిచ్చాపాటీలో మాట్లాడుతూ ‘‘ఎక్కడికో వెళ్లిపోయాడు…’’ నాయకులు ట్వీట్లతో కొట్టుకున్నారు… బండి సంజయ్‌కు అనుకూలం కొందరు, వ్యతిరేకం కొందరు…

Ads

వాస్తవానికి బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడైనప్పుడే అందరూ అనుకున్నారు… ఈయన్ని చాలాకాలం పనిచేయనివ్వరు అని..! అదే జరిగింది… బండి సంజయ్ తొలగింపు, కిషన్‌రెడ్డి నియామకం, కవిత అరెస్టు లేకపోవడం వంటి బీజేపీ హైకమాండ్ నిర్ణయాలన్నీ ఆమధ్య ‘మోడీకి కేసీయార్ సరెండర్’ అని ఆంధ్రజ్యోతి రాసినట్టే కనిపిస్తున్నాయి… కేసీయార్ కూడా తన టోన్ మ్యాగ్జిమం తగ్గించేశాడు… బీజేపీ బదులు ఇప్పుడు తనకు కాంగ్రెసే ప్రధాన, ప్రబల ప్రత్యర్థిగా కనిపిస్తోంది…

పార్టీలోని ప్రముఖులందరి మద్దతు సమీకరించుకోవడంలో బండి సంజయ్ వైఫల్యం కనిపించింది… పైగా పలు విషయాల్లో తనేం మాట్లాడుతున్నాడో సరిగ్గా అర్థం గాకుండా ఉండేవి తన మాటలు, ఉపన్యాసాలు… పొంగులేటి, జూపల్లి తదితరులు చేరితే బీజేపీ ఇంకాస్త బలపడేదేమో… కానీ అది కేసీయార్‌కు నష్టం కదా… బహుశా అందుకేనేమో బీజేపీ హైకమాండ్ ‘సరిగ్గా టాకిల్’ చేయలేదు… దాంతో ఆ రెండు పావులూ కాంగ్రెస్ శిబిరంలోకి చేరిపోయాయి… ఆల్‌రెడీ పార్టీలో చేరిన నాయకులు కూడా మథనంలో పడిపోయారు, బీజేపీలో కొనసాగడమా..? జోష్ కనిపిస్తున్న కాంగ్రెస్‌లోకి వెళ్లిపోవడమా..? యెన్నం, కొండా, కోమటిరెడ్డి తదితరులు..! కిషన్‌రెడ్డి పునర్నియామకం పట్ల బీజేపీ కేడర్ అసంతృప్తి సోషల్ మీడియాలో కూడా కనిపిస్తోంది…

ఈటల గెలిచినప్పుడు బీజేపీ శ్రేణుల్లో కనిపించిన జోష్‌ ఇప్పుడు సగం కూడా లేదు… బీజేపీలో నాయకుల అంతర్గత కొట్లాటలు సగటు బీజేపీ నిజ అభిమానికీ మనస్తాపాన్ని కలిగించేలా సాగుతున్నయ్… ఏదేమైనా కేసీయార్ హేపీ… ఆఫ్‌దిరికార్డ్‌గా రాజకీయ విశ్లేషకులు చెబుతున్న అభిప్రాయం ఇదే… ఇక ఏపీ విషయానికి వస్తే సోము వీర్రాజు తొలగింపు చాన్నాళ్లుగా ఊహిస్తున్నదే… సత్యకుమార్, వైఎస్ చౌదరి తదితరులు పేర్లు వినిపించినా సరే చివరకు పురంధేశ్వరి పేరుకు టిక్ కొట్టింది హైకమాండ్… పార్టీ ఇప్పుడున్న స్థితిలో ఆ అధ్యక్ష పదవిలో ఎవరున్నా చేయగలిగేది ఏమీ లేదు… సోము వీర్రాజుకు భిన్నమైన పనితీరును పురంధేశ్వరి ఎలా కనబరుస్తుందో చూడాలి…

చివరగా… అటు కాంగ్రెస్‌లో, ఇటు బీజేపీలో కేసీయార్ అనుకూల కేరక్టర్లు కొన్ని ఉంటాయి… అవి ఎప్పుడూ చక్రాలు తిప్పుతూనే ఉంటయ్… కేసీయార్ తెర వెనుక చాణక్యం అంత త్వరగా ఎవరికీ అంతుపట్టదు… ఎక్కడ ఏ మీట నొక్కుతాడో, బల్బు ఎక్కడ వెలుగుతుందో ఎవరికీ సమజ్ కాదు… జాతీయ స్థాయి ‘యాంటీ మోడీ యాక్టివిటీ’లో కనిపించే అఖిలేష్, కేజ్రీవాల్ తదితరులు హైదరాబాద్ వచ్చి కేసీయార్‌తో భేటీలు వేసినట్టు..!! బహుశా ‘‘ఆర్థికబంధాలు’’ మాత్రమే కాదు, అంతకు మించి ఇంకేదో… అదేమిటో ఎవరి అంచనాకూ అందడం లేదు..!!

అన్నట్టు… ఈటల ఎన్నికల కమిటీకి అధ్యక్షుడట,.. వోకే, వోకే, కానీ ఆయన గతంలో అధ్యక్షుడిగా ఉన్న చేరికల కమిటీ సాధించిందేమిటి..? అసలు ఎన్నికల కమిటీకి ఉన్న అధికారాలేమిటి..? ఏదో ఒక పదవి ఇచ్చాం, కీప్ క్వయిట్ అని చెబుతున్నట్టేనా..!! ఈమాత్రం దానికి అస్సోం దాకా వెళ్లి అటు వైపు నుంచి నరుక్కురావాలా ఏం..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • So Long Love… ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకు… ఎన్నెల్లు తిరిగొచ్చె మా కళ్లకు…
  • మేడిగడ్డ బరాజులాగే… కల్వకుర్తి లిఫ్టు… కవిత ప్రశ్నకు జవాబుల్లేవ్…
  • కమల్ అంటే కమలే… ఏ పాత్రయినా సరే అలవోకగా దూరిపోగలడు…
  • స్మిత వాయిద్యాల జోరు పాటలోకి ఈ రాజు గారు ఎలా దూరారు..?
  • వచ్చిందమ్మా వయ్యారీ… నువ్వొకదానివి తక్కువయ్యావు ఇన్నాళ్లూ…
  • విస్తుగొలుపుతున్న మావోయిస్టుల అత్యంతాధునిక ఆయుధ సామగ్రి..!!
  • వెలవెలబోతున్న శాటిలైట్ టీవీ… వెలిగిపోతున్న డిజిటల్ ఓటీటీ…
  • ఓహో…! పాలమూరు- రంగారెడ్డికి మోకాలడ్డింది జగన్ సర్కారేనా..?!
  • హైహై నాయకా… ఓ బూతు బుడతడి రిపేరు… అడుగడుగునా కామెడీ జోరు…
  • కొండగట్టులో పవన్ కల్యాణ్ ‘ప్రదర్శన’ ఏం సంకేతాలు ఇస్తోంది..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions