Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మా ఇంట్ల మిగిలిన ఏకైక పాత సామాను నేనే… తోడుగా ఇలాంటివి కొన్ని…

March 28, 2024 by M S R

Sampathkumar Reddy Matta….  పాతబడని జ్ఞాపకాలు

~~~~~~~~~~~~~~~

కొందరి జ్ఞాపకాలు మధురం,

Ads

ఇంకొందరి జ్ఞాపకాలు కఠినం.

నా జ్ఞాపకాలు రెండో కోవకు చెందినవి.

పాతసామాను ఫోటోలు పెట్టుమన్నపుడు

నా వరకు నాకు బాధైంది. కారణం ఏమంటే

మా ఇంట్ల మిగిలిన ఏకైక పాతసామాను నేనే.

నా పుట్టుకలోనే డ్యాము కోసం ఊరు చెదిరిపోవుడు

మా కుటుంబానికి ఇక జీవితంలో కోలుకోలేని పెద్ద దెబ్బ.

అమ్మాబాపుల అనారోగ్యం అప్పులు కొత్త వూర్లో శిథిలజీవితం

నా బాల్యమంతా పేరిమి సముద్రుని పెద్దబిడ్డ కటువు కటాక్షమే.

పాత ఊర్లో మా పక్కింటి కమ్మరివాళ్లతో మాది ధృడమైన బంధం.

మా అమ్మ వ్యక్తిత్వం బాగా తెలిసిన మా కమ్మరోళ్ల సింహాద్రి తాత

ఊరుగాని ఊర్లో మా అమ్మ వేరేవాళ్ల కడప తొక్కకూడదని తలిచి

అమ్మకు అవసరమైన వంటింటి సామానంతా ఇష్టంగా స్వయంగా

తయారుచేసి ట్రాక్టర్ల పెట్టి శాశ్వతంగా ఊరు నుండి సాగనంపిండు.

కుందెన, కుదురు,చిన్నది పెద్దదీ రోకలిబండలు, రెండు రోకంఢ్లు,

వడ్ల జల్లెడ, నూకల జల్లెడ, పప్పు జల్లెడ, జలిగంటె,అప్పాపుల్లలు

సన్నపూస పావు, దొడ్డుపూస పావు, రెండు తీర్ల సరాతాలు, తెడ్డు,

అరిసెల చెక్కలు, రొట్టె పీట, కోల, దీపపు చెక్క, మూడు కాళ్ల పీట,

సోల, తవ్వ, అడ్డ, ఉల్లి గడ్డలకు జాలి, బోల్లు వేసుకునే పెద్ద చిక్కు,

ఇంటికేసే ఇనుప తాళం, ముల్లు దీసుకునే శావణం, ముగ్గు గిరుక,

కొండనాలుకకు ఎల్లిపాయరసం తాకించే పొడవైన సన్నటి చెంచా,

రెండు సైజుల ఇనుప పొయ్యిలు, ఊదుకునే గొట్టం, ఎగేసే కారు…

ఇవన్నీ మా తాత తన పక్కింటి కోడలుకు కానుకలుగా ఇచ్చిండు.

అమ్మకు పక్షవాతం వచ్చిన తర్వాత ఇసిరెపసిరె చెదిరిపోయింది.

కాళ్ల కిందికి నీళ్లు రానీగాక, మా బాపుకు కంచంమంచం ఉంటే చాలు.

ఇల్లు కాకులు చింపిన విస్తరిగ మారిన తర్వాత ఏదెక్కడ పోయిందో.

ప్రాణం ఊపిరి ఉచ్ఛ్వాస నిశ్వాస అన్ని కదలికిలు ఇంటి మీదే, కానీ

దేహం మాత్రం, విద్యాదీపపు వెలుగు కోసమై యూనివర్సిటీ నీడన.

కొత్త అప్పులు, పాతప్పు కాగితాల మార్పిళ్లు, దవాఖాన తిరుగుళ్లు

వీటితోనే పైలాపచ్ఛీసు పసుపుపచ్చని మేనిఛాయ పాలిపోయింది.

అమ్మే ఆస్తి. ఆమే పోతున్నదాయె, ఇంక వస్తువుల మీద ధ్యాసెక్కడ.

వంటింట్ల పెద్ద కొప్పెర్లు, గంగాళం, ఇత్తడి బిందెలు, కుంచం బిందె,

పాడిగలిగిన వారసత్వం కనుక శేరుచెంబులు, అద్దశేరు చెంబులు,

పెద్ద సర్వలు, చిన్న సర్వలు, బోనాల గంజులు ఇత్తడివి ఉంటుండే.

వెనుకటి కాళ్లు కడిగిన పెద్ద తాంబాలాలు, బతుకమ్మ తాంబాలం,

మా తాతది, మా తాతమ్మది రెండు పెద్ద కంచుకంచాలూ ఉండేవి.

ఈ పెద్దమనుషులవే ఓ గుండు చెంబు ఓ కోల చెంబు రెండు ఉండేవి.

మా అమ్మ మాత్రం, వాళ్ల తాతమ్మ కొనిచ్చిన కంచు కంచంల తినేది.

స్టీలు సామానుకు మారిన తర్వాత కూడా తను కంచం మార్చలేదు.

ముగ్గురు పడితే తిరిగే పెద్ద విసుర్రాయి, పప్పులు విసిరే చిన్నరాయి

రెండూ ఉండేవి. వాకిట్ల , వంట సామాన్ల ఎక్కడి పొత్రం అక్కడనే.

నేను ఇల్లువిడిచి వనవాసం పట్టేనాటికి వీటిల చానా వస్తువులుండే.

తర్వాత అవన్నీ ఎవరిపాలైనయి అనేది.. కేవలం కాలానికే తెలుసు.

అమ్మకు బాపుకు అంతిమ నమస్కారాలు సమర్పించుకుని, నేను

బ్రహ్మచారిగా, ఉద్యోగార్థిగా ఊరు విడిచి పెట్టినపుడు నాకోసమని

కొన్ని వస్తువులు వెంట తీస్కపోయిన. నాకు దక్కినవి అవి మాత్రమే.

పెండ్లి తర్వాత ఇంట్ల మిగిలిన మరికొన్ని వస్తువులు సదురుక తెచ్చి

మా అత్తగారింట్ల అటుకు ఎక్కించినము. ఇప్పటివరకు ముట్టలేదు.

ముప్పయేండ్లుగ నాతోనే ఉండి, ఇప్పటికీ వంటింట్ల కంటికెదురుగ కనబడుతున్న ఈ నాలుగింటిని మాత్రం ఇగ మీకు పరిచయం చేస్త.

ఒకటవది మా ఇంట్ల మొదటి స్టీలు పాల సర్వ. రెండోది కూర గంజు.

మూడవది అమ్మకు తన వదిన పసుపు కోసమిచ్చిన రాతెండి డబ్బ.

నాలుగవది మా ఇంట్లున్న కోతకొడవండ్లల్ల ఇది ఒక అనామకమైది.

నాకు ఇష్టమైన ఆకురాయి కొడవలి లిక్కితోనే కోతపనులన్నీ సాగేవి.

దానికని వెతికీ అలిసీ, వ్యవసాయపు నీషానుగ దీన్ని వెంటేసుకున్న.

అపుడపుడు దీనితో కొబ్బరి కుడుక తీసుకతింటెనే ఈ జన్మకు తృప్తి.

ఇదీ.. అర్థాంతరంగ అతికష్టంగ ముగిసిన, అమ్మ వంటిల్లు చరిత్ర. ~డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి  (ఈ నాలుగు మాటల కోసం కదిలించిన ఇందిర గారికి కృతజ్ఞతలు)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • డియర్ రేవంత్‌రెడ్డి సార్… మీరు ఇంకాస్త బాదండి సర్, పర్లేదు..!!
  • ‘విష్ణు విగ్రహ వ్యాఖ్య’లపై మోహన్ భగవత్ ఏమైనా స్పందించాడా..?
  • పరుగుల పోటీల్లో రారాజు… ఈ చిరుత ఇప్పుడు పరుగెత్తితే ఎగశ్వాస…
  • చెడబుట్టిన కొడుకుల్ని ఖతం చేయడమే ‘న్యాయమా’ దాసరీ..?!
  • రిట్రీట్..? మావోయిస్టుల ఆయుధసన్యాసం నిజమేనా..? వాట్ నెక్స్ట్..?!
  • అప్పటికీ ఇప్పటికీ భక్తసులభుడు చిలుకూరు వీసాల బాలాజీ..!!
  • అక్కడ హారన్ కొట్టరు… ట్రాఫిక్ గీత దాటరు… సెల్ఫ్ డిసిప్లిన్…
  • మంచు కాదు కంచు లక్ష్మి..! డ్రెస్‌ సెన్స్‌ ప్రశ్నకు దిమ్మతిరిగే జవాబు…!
  • కృష్ణాజలాలపై కేసీయార్ తప్పుటడుగులకు రేవంత్ విరుగుడు ప్రయాస..!
  • కేసీయార్ బాపతు గోదావరి జలవైఫల్యాలకు రేవంత్‌రెడ్డి దిద్దుబాట..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions