Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒక కోట… ఒక బ్రహ్మి… ఎప్పుడు చూసినా నవ్వులు పండించే హిట్ మూవీ….

November 1, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ….. పిసినారితనం మీద ఫుల్ లెంగ్త్ నిఖార్సయిన హాస్యంతో సినిమా తీసి తెలుగు చలనచిత్ర రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయారు జంధ్యాల . ఆదివిష్ణు నవల సత్యం గారి ఇల్లు ఈ అహ నా పెళ్ళంట సినిమాకు మాతృక . సినిమా కొరకు కూర్పులు , చేర్పులు , మార్పులు వండి ఫుల్ మీల్సుగా ప్రేక్షకులకు అందించారు .

ఈ సినిమా అనగానే ఇప్పటికీ ఎప్పటికీ ఎవరికయినా చాలా పాత్రలు గుర్తుకొస్తాయి .‌ వాటిల్లో కొన్ని సినిమా అంతా కనిపించే ప్రధాన పాత్రలు అయితే కొన్ని పాత్రలు కొన్ని సీన్లలో మాత్రమే కనిపించినా ప్రేక్షకులు వాటిని మరచిపోయే ప్రసక్తే లేదు . మచ్చుకు చివర్లో వచ్చే చెవిటి మాలోకం పాత్రలో గుండు హనుమంతరావు . అంతా చెప్పించి వినపడలే అంటూ కడుపుబ్బా నవ్వించే పాత్ర . విజయవాడ వాసి అయిన హనుమంతరావుకు ఇది రెండో సినిమా . అయితే గుర్తింపు వచ్చింది ఈ సినిమా ద్వారానే .

Ads

ముఖ్యంగా చెప్పుకోవలసింది పీనాసి లక్ష్మీపతి పాత్ర . అతనితో పాటు నౌకరు పాత్రలో అరగుండు గోవిందుగా బ్రహ్మానందం . కోట శ్రీనివాసరావు అప్పటికే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు . అయితే ఈ పాత్ర ఇంకెవరూ ఇలా వేయలేరు అన్నట్లుగా రక్తి కట్టించారు . మాసిపోయిన పాత పంచె , చినిగిన బనీను , ఒకద్దం పగిలిపోయిన కళ్ళజోడు . ఆ ఆహార్యాన్ని డిజైన్ చేసిన జంధ్యాలకు హేట్సాఫ్ .

ఇంక మాతో పాటు చదువుకున్న బ్రహ్మానందం . విద్యార్ధిగా ఉన్నప్పుడే మిమిక్రి ఆర్టిస్టుగా పాపులరయిన బ్రహ్మానందం 1974 మే మాసంలో నా పెళ్లి రిసెప్షనుకు మా నరసరావుపేటలో మిమిక్రి ప్రోగ్రాం ఇచ్చారు . అత్తిలి కాలేజిలో తెలుగు లెక్చరరుగా , NSS ఆఫీసరుగా విద్యార్ధులలో పాపులర్ లెక్చరర్ అయి కూడా సినిమాల్లో చాన్సులు కోసం ప్రయత్నం ఆపలేదు .

ఈ సినిమాకు ముందు రెండు మూడు సినిమాల్లో దర్శనమిచ్చినా వెనక్కు తిరిగి చూసుకోవలసిన పరిస్థితి రాకుండా తెలుగు సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఈ సినిమా ద్వారానే పొందారు . అరేయ్ పోతావురా , నాశనమైపోతావురా అంటూ ఎక్కడెక్కడి తిట్లని పోగేసి బుర్రలోనే తిట్టుకునే పాత్రను ఇరగతీసారు . హేట్సాఫ్…

హీరో రాజేంద్రప్రసాద్ . అప్పటికే సోలో హీరో అవతారంలో ప్రకాశిస్తున్న రాజేంద్రుడికి కూడా ఈ సినిమా చాలా  పేరుని తెచ్చింది . కాలేజి కుర్రాడిగా , కోటీశ్వరుడి గారాల కొడుకుగా , ఘట్టి ప్రేమికుడిగా , తండ్రితో ఛాలెంజ్ చేసి అష్టకష్టాలు పడి ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవటానికి ఓ ప్రపంచ స్థాయి పీనాసి అవతారంగా , పలు షేడ్సులో అద్భుతంగా రాణించారు రాజేంద్రప్రసాద్ .

కలెక్టర్ వెంకటరావుగా సుత్తి వీరభద్రరావు నటన అమోఘం . ముఖ్యంగా బావ లక్ష్మీపతి టీ అమ్ముకోవటం చూసి పిచ్చెక్కి బట్టలు చించుకుని సినిమా ఆఖరిదాకా పిచ్చోడిగానే చాలా బాగా నటించారు . మరో ప్రధాన పాత్ర కస్తూరి సత్యనారాయణ . మాట్లాడితే మా తాతలు ముగ్గురు అంటూ ఫేమిలీ చరిత్ర మొదలు పెట్టి జనాన్ని విసిగించే పాత్రలో గొప్పగా నటించారు .

జంధ్యాల , విశ్వనాధ్ , వంశీ సినిమాల్లో నటులకన్నా పాత్రలే ఎక్కువ గుర్తుండిపోతాయి . అలాంటి పాత్రలు ఎన్నో తారసపడతాయి . అఖిల భారత పీనాసి సంఘం సభ్యులు , పెళ్ళి కొడుకులు , వాళ్ళ వెంట వచ్చే బంధువులు , వగైరా .

జంధ్యాల ఈ సినిమా ద్వారా జనానికి చాలా ఊతపదాల్నే ఇచ్చారు . ముఖ్యంగా నాకేంటి , expect చేసా వంటి మాటలు . కాస్త అతిగా అనిపించినా పిసినారితనాన్ని చూపేందుకు జంధ్యాల తన మార్కు చేష్టలను చాలా జొప్పించారు . అగ్గిపుల్లలు ఏరుకోవటం , పేపర్లు చుట్టుకోవటం , వగైరా .

మరో హాస్యనటుడు బాబూ మోహనుకి సాంకేతికంగా ఇది రెండో సినిమా అయినా బస్ డ్రైవర్ల యూనియన్ నాయకుడిగా బాగానే కనిపిస్తాడు . ఇతర ప్రధాన పాత్రల్లో రాళ్ళపల్లి , డబ్బింగ్ జానకి , సుమిత్ర , సుత్తి వేలు , శుభలేఖ సుధాకర్ , విద్యాసాగర్ , సంధ్య , అశోక్ కుమార్ , మరెంతో మంది జూనియర్ ఆర్టిస్టులు నటించారు .

ఈ సినిమా అఖండ విజయానికి జంధ్యాల మాటలతో పాటు వేటూరి , జొన్నవిత్తుల , M R S శాస్త్రి పాటలు , రమేష్ నాయుడు సంగీతం , తార రఘుల నృత్య దర్శకత్వం , బాలసుబ్రమణ్యం సుశీలమ్మ వాణీజయరాం , నాగూర్ల గాత్రం దోహదపడ్డాయి . ముఖ్యంగా కస్తూరి రంగయ్య కరుణించవేమయ్యా డ్యూయెట్లో రాజేంద్రప్రసాద్ , రజని నృత్యం చాలా అందంగా చిత్రీకరించబడింది .

అలాగే ఇది శృంగార గంగావతరణం తొలి వలపు క్షీరాబ్ది మదనం డ్యూయెట్ కూడా చాలా బాగుంటుంది . తిక్కన పాడింది భారతం మహాభారతం అంటూ సాగే డిస్కో డాన్సుని రాజేంద్రప్రసాద్ చక్కగా డాన్సించారు . కుయిలీతో స్వాగతం సంగీత సాధనం డ్యూయెట్ కూడా బాగుంటుంది . ఇంక పీనాసోళ్ళ గోల పాట పీనాసి అయినా సన్నాసి అయినా ఉన్నోడే మనిషి డబ్బున్నవాడే మనిషి గోలగోలగా సరదాగా ఉంటుంది .

మాయాబజార్ సినిమా అనగానే మనకు గుర్తుకొచ్చే పాటల్లో ఒకటి అహ నా పెళ్ళంట . దాన్నే టైటిలుగా ఎంపిక చేసుకుని పూర్తి న్యాయాన్ని చేసారు జంధ్యాల . 16 లక్షల బడ్జెటుతో తీస్తే మూడు కోట్లో నాలుగు కోట్లో గ్రాస్ వచ్చిందని అంటారు . 15 సెంటర్లలో వంద రోజులు ఆడిన ఈ సినిమా కన్నడంలోకి కూడా ఛాలెంజ్ గోపాలకృష్ణ టైటిలుతో రీమేక్ అయింది . కన్నడంలో అనంత నాగ్ , అశ్విని , ముఖ్యమంత్రి చందు ప్రధాన పాత్రల్లో నటించారు .

సురేష్ ప్రొడక్షన్స్ బేనర్లో రామానాయుడు తీసిన ఈ సినిమా ఔట్ డోర్ షూటింగ్ అంతా షామీర్ పేటకు దగ్గరలో ఉన్న దేవర యంజాల్ అనే గ్రామంలో జరిగింది . సెట్లు వేయకుండా ఆ గ్రామంలో ఉన్న భవనాలను , దేవాలయ ప్రాంగణాలను వాడుకున్నారట .

1987 నవంబర్లో విడుదలయిన ఈ ఆల్ టైం కామెడీ సూపర్ హిట్టుకి ఇవివి సత్యనారాయణ అసోసియేట్ డైరెక్టరుగా పనిచేసారు . మనకు ఇలాంటి పిసినారి సినిమా మరొకటి రేలంగి నరసింహారావు దర్శకత్వంలో రాజేంద్రప్రసాదే హీరోగా ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం టైటిలుతో వచ్చి సక్సెస్ అయింది .

సినిమాలు పిసినారితనం మీదే అయినా ప్రేక్షకులు ధారాళంగా ఆదరించారు వీటిని . బహుశా ఈ అహ నా పెళ్ళంట సినిమాని చూడనివారు ఎవరూ ఉండరు . తరచూ టివిలో కూడా వస్తూనే ఉంటుంది . సినిమా యూట్యూబులో ఉంది . చూడండి , నవ్వండి , నవ్వించండి , నవ్వు ఆరోగ్యకరం . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక కోట… ఒక బ్రహ్మి… ఎప్పుడు చూసినా నవ్వులు పండించే హిట్ మూవీ….
  • ఒక గొప్ప ఫోటో..! దీని వెనుక ప్రతి లీడర్ తప్పక చదవాల్సిన ఓ కథ..!!
  • నీలిపూల నిద్రగన్నేరు చెట్టు… పరోమా! ఉదాత్తమైన అక్రమ ప్రేమ కథ…
  • గొప్పల తిప్పలు తరువాత… ముందు నీ గోచీ సరిచూసుకోవయ్యా ట్రంపూ…
  • ఇది ఆ పాత కాంగ్రెస్ కాదు… ఈ జుబ్లీ గుట్టల్లో కొత్తగా స్ట్రాటజిక్ అడుగులు…
  • ‘‘కేసీయార్‌వి ప్రచార నాటకాలు- రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలా కాదు’’
  • మొన్నటి అమ్మాయిల విజయం వెనుక ఓ అలుపెరుగని గురువు..!!
  • ఓ సుదీర్ఘ వీక్షణం… ఆ పాత వైబ్స్ లేవు, ఆ గూస్ బంప్స్ లేవు…
  • అదే రవితేజ… అదే మొనాటనీ… అదే యాక్షన్… అదే ‘మాస్ జాతర’…
  • నిన్న అమ్మాయిల గెలుపు హోరు… నేడు అబ్బాయిల పేలవ ఆటతీరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions