గీతామాధురి… ప్రముఖ సింగరే గాకుండా లైవ్ కచేరీల ట్రూప్ కూడా ఉన్నట్టుంది… తెలుగు ఇండియన్ ఐడల్ రెండో సీజన్‌లో… అంటే గత సీజన్‌లో అడ్డదిడ్డం జడ్జిమెంట్లతో బదనాం అయ్యింది… సంగీత పరిజ్ఞానం లేక కాదు… తను పట్టుకున్న తప్పుల్ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలియక..!
కానీ ఇప్పుడు జడ్జిగా కాస్త ఎదిగింది… ప్రస్తుత కంటెస్టెంట్లలో కీర్తన అనే అమ్మాయి బాగా పాడుతోంది… ఈసారి ఎపిసోడ్‌కు ఆడజన్మకు ఎన్ని శాపాలో అనే పాట ఎంచుకుంది… (లాస్ట్ సీజన్‌లో విజేత సౌజన్య కూడా ఈ పాట పాడినట్టు గుర్తు)… ఆర్ద్రంగా ఆలపించింది… కానీ ఇంకా చిన్నమ్మాయే కదా, బ్రీతింగ్ ఇష్యూ ఉన్నట్టుంది… పాడుతున్నప్పుడు శా– పాలో, శోకా– లో అని ఆ పదాల్ని విరిచేసింది… వింటుంటే ఆడ్‌గా అనిపించింది… అసలే తమిళ ట్యూన్ల పుణ్యమాని మన తెలుగు పదాల్ని రకరకాలుగా నరికి ఆ ట్యూన్లలో పొదుగుతూ ఉంటారు మనవాళ్లు…
ఇక తెలుగు పాటలో కూడా పదాల్ని అలా విరగ్గొడితే ఎలా అనిపించింది..? జడ్జిలు ఎవరైనా పట్టుకుంటారేమో చూడాలనీ అనిపించింది… కార్తీక్ కూడా మ్యూజిషియనే… అనేక తెలుగు పాటల్ని కూడా పాడాడు… కానీ పట్టుకోలేదు… థమన్ ప్రధానంగా పిచింగ్ ఇష్యూస్, ఓవరాల్ పర్‌ఫామెన్స్ చూస్తుంటాడు గానీ లిరిక్స్, పదాల ఉచ్ఛరణను పెద్దగా చూడడు… కానీ గీతామాధురి పట్టుకుంది…
Ads
అదే ప్రస్తావించింది… అందరూ కీర్తనను ఆహా ఓహో అంటుంటే ఈ లోపాన్ని పట్టుకుని నిర్మొహమాటంగా చెప్పేసింది… బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కాస్త ట్యూన్ అటూఇటూ అయినా సరే పదాల్ని విరవకూడదనీ హెచ్చరించింది… నిజం… హోస్ట్ సింగర్ శ్రీరామచంద్ర కూడా ఆ పదాల్ని ఎలా పాడాలో తను పాడి చూపించాడు… గుడ్… కంటెస్టెంట్లు ఎలా పాడినా చప్పట్లు కొట్టడం కాదు, ఓ నిశిత పరిశీలన జరగాలి… అది క్రమేపీ పక్కకుపోయి, జస్ట్ ఓ సగటు టీవీ పర్‌ఫామెన్స్ షోగా మార్చేశారు దీన్ని…
దీనికితోడు సినిమా ప్రమోషన్లు… ఈసారి మిస్టర్ బచ్చన్ సినిమా ప్రమోషన్ కోసం హరీష్ శంకర్, భాగ్యశ్రీ బోర్సె వచ్చారు… హరీష్ శంకర్‌కు కాస్త స్వరజ్ఞానం ఉన్నట్టుంది… మిరపకాయ్ సినిమా పాటలకు సంబంధించి థమన్, ఆయన కాసేపు ముచ్చటించుకున్నారు… అవునూ, పదాల్ని విరవడం మీద కదా చెప్పుకునేది… లేటరల్ ఎంట్రీగా వచ్చిన అభీజ్ఞ నిజానికి పాటల ఎంపికలో జాగ్రత్తపడాలి… కానీ ఓ దిక్కుమాలిన పాట ఎంచుకుంది…
ఆమె ఆ ఒరిజినల్ పాటకు తగినట్టు బాగానే పాడింది… కానీ ఆ పదాలు ఒక్కటీ అర్థమయ్యేలా వినబడితే ఒట్టు… ఏదో డబ్బింగ్ సాంగ్ అనుకుంటా… పదాల్ని విరగ్గొట్టి, నలగ్గొట్టి, చితగ్గొట్టి ట్యూన్‌లో ఇరికించారు… ఆల్రెడీ ఆడిషన్లలో ఆమెను రిజెక్ట్ చేస్తే, సోషల్ మీడియా వోట్లు, రిక్వెస్టులు, డిమాండ్ల ఆధారంగా ఆమెను మిడిల్ ఎంట్రీగా తెచ్చినట్టు చెప్పారు కదా మొదట్లో… (తను అమెరికా, వర్జీనియాలో ఉంటుంది)… మళ్లీ ఆమె కంటెస్టెంటుగా రావడం జడ్జిలకు నచ్చినట్టు లేదు…
ఆమె పాడిన పాటలో ఏవేవో తప్పులు వెతికారు… చివరకు శ్రీరామచంద్ర కూడా వోట్ అప్పీల్ సమయంలో మా అనిరుధ్, మా కీర్తన, మా శ్రీకీర్తి అని చెబుతూ ఉంటాడు కదా, మా అభీజ్ఞ అనలేకపోయాడు… ఇదేం వివక్షో మరి..! పక్కా… ఆమెను త్వరలోనే బయటికి పంపించేస్తారు… ఈసారి మిస్టర్ బచ్చన్ ప్రమోషన్ కదా, రాబోయే ఎపిసోడ్లకు సరిపోదా శనివారం ప్రమోషన్ కోసం నాని వస్తున్నాడు… పైగా ఈసారి డబుల్ ఎలిమినేషన్ అనీ ప్రకటించారు…!!
Share this Article