A musical & visual feast . నోము సినిమా తర్వాత రామకృష్ణకు సూపర్ హిట్ సినిమా 1975 లో వచ్చిన ఈ పూజ సినిమా . మహిళలు మెచ్చిన చిత్రం . మహిళలకు నచ్చిన చిత్రం . రాజన్ నాగేంద్ర సంగీతం ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం . ఈరోజుకీ ఈ సినిమా లోని పాటలు ఆ తరం వారి చెవుల్లో గింగురుమంటూనే ఉంటాయి . అంత గొప్ప శ్రావ్యమైన పాటలు .
ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ ఎన్నటికీ మాయని మమతా నీదీ నాది , నింగీ నేల ఒకటాయెనే , నీ దయ రాదా రామ నీ దయ రాదా , పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను , మల్లె తీగె వాడిపోగా మరల పూలు పూయునా , అంతట నీ రూపం నన్నే చూడనీ ఆశలు పండించే నిన్నే చేరనీ .
నీ దయ రాదా పాటను సుశీలమ్మ పాడారు . మిగిలిన పూజలు చేయ , నింగీ నేల ఒకటాయెనే , ఎన్నెన్నో జన్మల బంధం పాటల్ని వాణీ జయరాం , బాల సుబ్రమణ్యంలు పాడారు . ఈ సినిమా పేరు చెప్పగానే గుర్తొచ్చే పాట ఎన్నెన్నో జన్మల బంధం పాటని కర్నాటక రాష్ట్రం షిమోగా జిల్లాలోని గాజనూరు డాం వద్ద షూట్ చేసారు .
Ads
కన్నడంలో 1974 లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ ఎరడు కనసు సినిమాకు రీమేక్ మన పూజ సినిమా . రెండు భాషల్లోనూ AVM వారే తీసారు . కన్నడంలో రాజ్ కుమార్ , కల్పన , కన్నడ మంజుల నటించారు . ఇదే టైటిల్ తో కన్నడ రచయిత్రి వాణి వ్రాసిన నవల ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది . 30 వారాలు ఆడిన బ్లాక్ బస్టర్ .
1982 లో సెకండ్ రిలీజులో కూడా వంద రోజులు ఆడింది . 2015 లో థర్డ్ రిలీజులో కూడా బాగా ఆడింది . రాజన్ నాగేంద్రలకు కర్నాటక ప్రభుత్వం వారి అవార్డు వచ్చింది . మన తెలుగు సినిమా కూడా బాగా సక్సెస్ అయింది .
రామకృష్ణ కెరీర్లో ఓ మైలురాయి . వాణిశ్రీకి ఈ సినిమా కొట్టిన పిండి . ఆమె ఎడం చేతితో అలవోకగా చేసేసింది . అన్ని సినిమాల్లో లాగానే తన మార్కు నటనను ప్రదర్శించింది . ఇద్దరూ ఎంతో అందంగా కనిపిస్తారు . మరో హీరోయిన్ గా కన్నడ మంజుల నటించింది . కాంతారావు , సావిత్రి , కృష్ణకుమారి , రేలంగి , కె వి చలం , మిక్కిలినేని , అల్లు రామలింగయ్య , సూరేకాంతం , ప్రసన్నరాణి , చంద్రమోహన్ ప్రభృతులు నటించారు .
మహానటుడు రేలంగికి ఈ సినిమా ఆఖరి సినిమా కావటం బాధాకరం . వారికి నివాళి .
బావామరదళ్ళు ప్రేమించుకుని పెళ్ళి చేసుకుందామని కలలు కంటారు . హీరో తండ్రితో గొడవపడిన హీరోయిన్ తండ్రి తన కూతురుని ఇవ్వనని చెప్పేస్తాడు . హీరో మెయిన్ హీరోయిన్ వాణిశ్రీని పెళ్లి చేసుకుంటాడు . హీరో సిన్సియర్ లవర్ . పెళ్ళయాక కూడా మరదల్ని మరచిపోలేడు . భార్యను దూరం పెడతాడు . సినిమా చివర్లో మరదలు హాయిగా పెళ్లి చేసుకుని భర్తతో సుఖంగా కాపురం చేసుకోవడం చూసాక సిన్సియర్ లవరయిన హీరోకి ఙానోదయం కలిగి భార్య వద్దకు పరుగెత్తుతాడు . ఇదీ టూకీగా కధ .
మురుగన్ కుమరన్ దర్శకత్వం. వహించిన ఈ సినిమాకు యన్ ఆర్ నంది డైలాగ్స్ వ్రాసారు . డైలాగులను కూడా ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సిందే . చాలా పొదుపుగా , సందర్భోచితంగా , సూటిగా ఉంటాయి .
యాభై ఏళ్ళ కింద స్త్రీ పురుషుల ఆలోచనా రీతులు , విలువల నేపధ్యంలో నిర్మించబడిన సినిమా . ప్రేక్షకులకు బాగా నచ్చింది . సంగీతం , లొకేషన్స్ చాలా బాగుంటాయి . సంగీత ప్రియులకు , వాణిశ్రీ , రామకృష్ణ అభిమానులకు బాగా నచ్చుతుంది . యూట్యూబులో ఉంది . రస హృదయులు తప్పక చూడవలసిన సినిమా . ముఖ్యంగా పాటలు . అసలు మిస్ కాకండి . చాలా ఆహ్లాదంగా ఉంటాయి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు…….. [ By దోగిపర్తి సుబ్రహ్మణ్యం ]
Share this Article