.
Subramanyam Dogiparthi…. వల్లభనేని జనార్ధన వరప్రసాదుని ఆహుతి ప్రసాదుగా మార్చిన సినిమా 1987 డిసెంబర్లో వచ్చిన ఈ ఆహుతి సినిమా .
సాంకేతికంగా మొదట తళుక్కుమన్న సినిమా విక్రమే అయినా ప్రేక్షకుల గుర్తింపు వచ్చింది మాత్రం ఈ సినిమాతోనే . మధు ఫిలిం ఇన్స్టిట్యూటులో శిక్షణ పొందిన ఈ కృష్ణా జిల్లా కుర్రాడు మంచి కేరెక్టర్ ఏక్టరుగా రాణించారు . ఓ విషయంలో ఆయనతో రెండు సార్లు ఫోన్లో మాట్లాడే అవకాశం కలిగింది నాకు .
Ads
ఈ సినిమాలో పాత్ర నెగటివ్ పాజిటివ్‌ల మిక్స్ డ్ పాత్ర అయినా తర్వాత కాలంలో హీరోగా నిలదొక్కుకోవటానికి డా. రాజశేఖరుకి ఉపకరించిన సినిమా ఈ ఆహుతే . అంతే కాదు ఆయనకు జీవితను జీవిత భాగస్వామిని చేసిన సినిమా కూడా ఇదే .
1986లో మళయాళంలో వచ్చిన Rajavinte Makan సినిమాకు రీమేకే ఈ ఆహుతి సినిమా . మలయాళంలో మోహన్ లాల్ , అంబిక , రితీష్ ప్రధాన పాత్రల్లో నటించారు . యంయస్ రెడ్డి కుమారుడు శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మాతగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కమర్షియల్‌గా కూడా సక్సెస్ అయింది .
రాజకీయంగా ఎదగటానికి ప్రేయసినే తార్చటానికి సిధ్ధపడిన ఓ యువజన నాయకుడు , చేసే వ్యాపారం తప్పుడుదే అయినా మంచితనం ఉన్న ఓ లిక్కర్ డాన్ల మధ్య బంతిలాగా అటూఇటూ ఆడబడే మహిళ పాత్ర , వెరశి ఈ ఆహుతి సినిమా . కుళ్ళిపోతున్న రాజకీయ వ్యవస్థను బాగా చూపించిన సినిమా .
ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాలలో ముఖ్యమైనది గణేష్ పాత్రో తూటాల్లాంటి డైలాగులు . ఆ తర్వాత సత్యం సంగీతం . పాటలనన్నీ మల్లెమాలే వ్రాసారు . బాగా వ్రాసారు . సూరీడు తూరుపున దీపమై వెలుగు పాట చాలా చాలా శ్రావ్యంగా ఉంటుంది . ముత్యాలముగ్గు సినిమా లోని ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ పాట ట్యూన్ గుర్తుకొస్తుంది .
మరో శ్రావ్యమైన పాట అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిహారం . చెబుతా వినుకో వింత కధ , పడగలెత్తిన దురాగతానికి పచ్చని బతుకులు ఆహుతి , బుధ్ధుడు పుట్టిన జన్మభూమిలో గాంధీ మహాత్ముని జన్మభూమిలో పాటలు బాగుంటాయి .
ఇతర పాత్రల్లో బాబూమోహన్ , భానుప్రకాష్ , జూనియర్ ఆర్టిస్టులు నటించారు . వంచించబడిన స్త్రీగా , దెబ్బతిన్న పులిగా , లాయరుగా జీవిత చక్కగా నటించింది . మద్యపాన నిషేధాన్ని రాజకీయాలకు ఎంత గొప్పగా ఉపయోగించుకుంటారో 1987 లో వచ్చిన ఈ సినిమా లోనే బాగా చూపించారు .
మన దేశంలో ఇప్పుడు జరుగుతున్న కుట్ర రాజకీయాలు 1987 లో వచ్చిన ఈ సినిమాలోనే ఉండటం ఆసక్తికరం . సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకముందు చూడనట్లయితే తప్పక చూడతగ్గ సమకాలీన రాజకీయ చిత్రం . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
- సందర్భం వచ్చింది కదా… అప్పట్లో ఎక్కడో చదివినట్టు గుర్తు….“ఓ తమిళ నిర్మాత తన సినిమా కోసం రాజశేఖర్ కు జోడీగా జీవితను తీసుకున్నాడు… మొదటిసారి జీవితను చూసిన రాజశేఖర్ .. ‘ఈమె వద్దు… తొలగించండి’ అంటూ దర్శక నిర్మాతలకు చెప్పాడు…. దర్శకనిర్మాతలు ఆలోచించుకుని నిజంగానే తొలగించారు…. కానీ జీవితను కాదు, రాజశేఖర్‌నే…!!
తరువాత ఈ ఇద్దరూ కలిసి ‘తలంబ్రాలు’ అనే సినిమాలో కలిసి నటించవలసి వచ్చింది… అప్పుడే ఇద్దరి మధ్య పరిచయం పెరిగి, అది కాస్తా ప్రేమగా మారింది… తరువాత ఈ ‘ఆహుతి’ సినిమా… షూటింగులో రాజశేఖర్ గాయపడినప్పుడు, జీవిత ఆయన దగ్గరే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంది… రాజశేఖర్ పై జీవితకి ఎంత ప్రేమ ఉందనేది దీంతో తెలిసి… రాజశేఖర్ కుటుంబసభ్యులు వీరిద్దరి పెళ్ళికి అంగీకరించారు… శుభం…’’
Share this Article