ఎవరెంత తిట్టుకున్నా సరే… టీవీ9 అంటే ప్రయోగం… అది పలుసార్లు వికటించి నవ్వులపాలు కావచ్చుగాక… కానీ ఎప్పుడూ ఏదో ఒక కొత్తదనాన్ని ప్రయత్నిస్తుంది… ఈమధ్య ఇంగ్లిషు, ఒడిశా భాషల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో రూపొందించిన డిజిటల్ యాంకర్‌ను తెరపైకి తీసుకువస్తే సూట్లు, యూట్యూబర్లు, మెయిన్ స్ట్రీమ్ టీవీలు సైతం ఆ వార్తను ఊదరగొట్టాయి… సేమ్, దాన్ని టీవీ9 కూడా తెలుగులో తీసుకువద్దామని అనుకుంది… కానీ..?
బిగ్‌టీవీ అనే ఓ చిన్న చానెల్ వాళ్లకన్నా ముందే ఏఐ యాంకర్‌ను తీసుకొచ్చేసింది… చిన్న చిన్న టీవీల్లో నిజం యాంకర్‌కు, ఈ కృత్రిమ మేధ యాంకర్‌కు తేడా పెద్దగా గమనించలేం… అంత పర్‌ఫెక్ట్‌గా కుదిరింది… పైగా పిచ్చి ఫారిన్ డ్రెస్ గాకుండా సంప్రదాయబద్ధంగా తెలుగు మాయలా పద్ధతిగా ఉంది… వాయిస్ కూడా క్లియర్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు సాఫ్ట్‌వేర్‌లో… బాగుంది… సో, అన్నింటికీ టీవీ9 మాత్రమే కాదు, ఇదుగో కొత్తవి వస్తున్నాయి…
Ads
నిజానికి టీవీ9లో ఇంతకుముందే దీన్ని తీసుకురావాలని కొందరు ప్రతిపాదిస్తే ‘‘పెద్ద తలకాయలు’’ పడనివ్వడం లేదని సమాచారం… సరే, దాన్నలా వదిలేస్తే… హమ్మయ్య, ఇకపై మనం రుధిరం, పోస్కో, టాల్కమ్ పౌడర్ వంటి పైత్యాల నుంచి రక్షింపబడినట్టే… అఫ్‌కోర్స్, మనం రాసిచ్చిన స్క్రిప్టును బట్టే ఈ డిజిటల్ యాంకర్ వార్తలు చదువుతుంది… దాంట్లో తప్పుల్లేకుండా ఉండాలి…
నిజానికి మొన్న ఓటీవీ వాళ్లు లిసా పేరిట ఈ యాంకర్‌ను తీసుకొచ్చారు కానీ బిగ్‌టీవీయే తొలిసారి ఇండియన్ టీవీ మీద ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ యాంకర్‌ను తీసుకురావాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు… మాయ అని పేరు కూడా పెట్టారు… ఆ సాఫ్ట్‌వేర్ సమకూర్చుకున్నారు… తీరా వీళ్ల మాయ కనిపించేలోపు ఓటీవీ వాడు లిసాను పరిచయం చేసేశాడు… సో, సౌతిండియాలో తొలి ఏఐ యాంకర్‌ను ప్రవేశపెట్టిన రికార్డు మాత్రం బిగ్‌టీవీ సంపాదించుకుంది…
ఈ యాంకర్లను ప్రేక్షకులు ఆదరిస్తారా..? నిజంగానే వీళ్లు ఒరిజినల్ యాంకర్ల పొట్టగొడుతారా..? ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఇంకా ఏయే రూపాల్లో మన జీవితాల్లోకి దూసుకువస్తోంది..? ఇవన్నీ పెద్ద పెద్ద ప్రశ్నలు… కానీ టెక్నాలజీని ఎవరూ ఆపలేరు… ఇది గాకపోతే మరింత స్పష్టంగా, అచ్చు ఒరిజినల్ అనిపించేలా మరింత మెరుగుపరిచే ప్రయత్నాలు సాగుతూనే ఉంటాయి…
ఐతే ఎక్కడో ఓటీవీ చేసిన ప్రయోగాన్ని ఊదరగొట్టిన మన తెలుగు మీడియా మరి మన తెలుగు చానెల్ చేసిన ప్రయత్నాన్ని సాదరంగా ఎందుకు స్వాగతించలేకపోయింది..? ఇదీ ప్రశ్న… రాజకీయాల్లో సైడ్ తీసుకోవడమే కాదు, చివరకు ఇలాంటి విషయాల్లో కూడా వివక్షా..? ఏదో చిన్న చానెల్ అని చిన్న చూపా..? వార్త ముఖ్యమా..? ఎహె, ఆ చిన్న చానెల్‌కు ప్రచారం వస్తుందనే నెగెటివ్ ధోరణా..? ఏమాటకామాట… మీడియాకన్నా సోషల్ మీడియా బెటర్ కదా ఇప్పుడు… సోషల్ మీడియాలో మాత్రం బిగ్‌టీవీ మాయ మీద బోలెడు మీమ్స్ కనిపిస్తున్నయ్… గుడ్…
Share this Article