Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లాభనష్టాల మాటెలా ఉన్నా కృత్రిమ మేధ దూకుడు ఆపలేం…!!

September 13, 2024 by M S R

సాంకేతికత రెండంచుల కత్తి లాంటిది. సరిగ్గా వాడుకుంటే ఉపయోగం. విచక్షణ లేకుండా వినియోగిస్తే అనర్థదాయకం. మాట్లాడే భాష, రాసే భాష, అనువాదం లాంటి భాషాసంబంధ విషయాల్లో సాంకేతికత ఎంతగా ఉపయోగపడుతుందో అంతగా మెదడును మొద్దుబారుస్తోందని ఈమధ్య అనేక అధ్యయనాలు రుజువుచేస్తున్నాయి.

మనం తప్పు టైప్ చేసినా ఆటోమేటిగ్గా సరిచేసేది- ఆటో కరెక్ట్.
మనం టైపు చేయబోయే మాటలను దానికదిగా అందించేది- ప్రిడిక్టివ్ టెక్స్ట్. మనం టైపు చేసిన వాక్యంలో వ్యాకరణ దోషాలను సరిచేసేది- గ్రామర్లి.
ఈ యాపులు కాక ఆడియో చెబితే టెక్స్ట్ ఇచ్చేవి, పిడిఎఫ్ పెడితే టెక్స్ట్ ఇచ్చేవి, రియల్ టైములో ఒక భాష నుండి ఇంకో భాషలోకి అనువదించే ఆడియో, టెక్స్ట్…ఇలా ఇప్పుడు లెక్కలేనన్ని భాషా సాధనాలు అందుబాటులో ఉన్నాయి.

సాంకేతికతను ఉపయోగించుకుంటూ సమాచారవ్యవస్థల ద్వారా దూసుకుపోవడంలో ప్రధాని మోడీ ముందు ఎవరైనా దిగదుడుపే. దానికి ఆయన్ను, ఆయన ఉరిమే ఉత్సాహాన్ని ప్రత్యేకంగా అభినందించాల్సిందే. ఆయన ప్రత్యర్థులకు కూడా అవే సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉంటాయి కానీ…వారికవన్నీ సెల్ఫ్ గోల్స్ కు మాత్రమే పనిచేస్తాయి.

Ads

ఆమధ్య కాశీలో తమిళ సంఘం వారి కార్యక్రమంలో మోడీ హిందీలో మాట్లాడిన ప్రసంగాన్ని కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్- ఏ.ఐ) ద్వారా గ్రాంథిక తమిళంలోకి ఆటోమేటిగ్గా అనువదించి…ఆ ఆడియో, వీడియోను సామాజిక మాధ్యమాల్లో వదిలితే…తమిళనాడులో పాజిటివ్ స్పందన వచ్చింది. దాంతో ప్రస్తుత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏఐ ద్వారా రియల్ టైమ్ లో మోడీ హిందీ ప్రసంగాలను మరాఠిలోకి అనువదించి ప్రసారం చేయడానికి బిజెపి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది.

ఇందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అరకొర హిందీ జ్ఞానంతో చెప్పిన విషయాన్ని యథాతథంగా, ఉద్దేశం, ధ్వనిని కూడా పట్టుకుని చెప్పగలిగే అనువాదకులు లేకపోవడం వల్ల తన లక్ష్యం నెరవేరడం లేదని మోడీ గ్రహించారు. మనిషిని నమ్ముకోవడం కంటే యంత్రాన్ని నమ్ముకోవడమే నయమనుకున్నారు. పైగా ఆయన గొంతుతోనే ప్రాంతీయ భాషల్లో రియల్ టైమ్ అనువాదం ఒక సౌలభ్యం కూడా.

లాభం:-

భాషా యాప్ ల వల్ల ప్రత్యేకించి ఇంగ్లీషులో అక్షర దోషాలు, వ్యాకరణ దోషాలు లేకుండా రాయడం నేర్చుకుంటున్నారు. ఒకమాటను ఎలా పలకాలో అన్న శబ్దోచ్చారణ కూడా తెలుసుకుంటున్నారు. గూగుల్ చాట్ బోట్ లాంటి వాటి సహాయంతో సృజనాత్మక రచనలు కూడా వస్తున్నాయి.

నష్టం:-

కృత్రిమ మేధ- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో నడిచే భాషా యాప్ లు మనిషి మెదడును మొద్దుబారుస్తున్నాయి. యాంత్రికంగా మారుస్తున్నాయి. స్పెల్లింగులు, వాక్య నిర్మాణం, ఉచ్చారణ ఎలా ఉన్నా యాప్ లు సవరిస్తాయన్న ధీమాతో ప్రాథమికమయిన భాషా పరిజ్ఞానం కూడా లేకుండా పోతోంది. కొన్నాళ్లకు యాప్ లు, సాఫ్ట్ వేర్లు, కృత్రిమ మేధలు మాత్రమే భాషాధికారాన్ని నిర్ణయించే పరిస్థితి రావచ్చు.

దేవులపల్లికంటే గొప్పగా చాట్ బోట్ భావకవిత్వం రాయచ్చుగాక. యంత్రం యంత్రమే. ఎక్కడో ఒకచోట దానికి పరిమితి ఉంటుంది. అందులో ఫీడ్ అయిన సమాచారం ఆధారంగానే అది కవిత అల్లగలుగుతుంది.

లాభనష్టాల మాటెలా ఉన్నా కృత్రిమ మేధ వాడకాన్ని ఆపలేము.

తెలుగులో తొలి చాట్ బోట్

ఇప్పటివరకు ఇంగ్లిష్ కే పరిమితమైన చాట్ బోట్ సదుపాయం ఇకపై తెలుగులో కూడా అందుబాటులోకి రానుంది. దీనికోసం “స్వేచ్ఛ” సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐ టీ శాఖ సహాయంతో పెద్ద యజ్ఞం చేస్తోంది. తెలుగు భాష, సంప్రదాయాలు, ఆచారాలు, వృత్తులు, ప్రత్యేకమైన పలుకుబళ్లు, పారిభాషిక పదాలను దాదాపు లక్షమంది విద్యార్థుల సాయంతో సేకరించారు. ఏడువేల గ్రామాలనుండి సేకరించిన ఈ విలువైన డేటాను జల్లెడ పట్టి, తప్పొప్పులను సరిచూసుకుని చాట్ బోట్ లో ఫీడ్ చేస్తారు. ఆ డేటా అంతా పబ్లిక్ డొమైన్లో పెడతారు.

ఆయా అంశాలకు సంబంధించి మన సందేహాలను టెక్స్ట్ లేదా ఆడియో రూపంలో ఈ తెలుగు చాట్ బోట్ ను తెలుగులోనే అడగవచ్చు. దానికి టెక్స్ట్ లేదా ఆడియో రూపంలో తెలుగులోనే సమాధానం వస్తుంది.

గ్రామీణ ప్రాంతాల్లో ఒక పొలంలో పనిచేసే సాధారణ వ్యక్తి కూడా దీన్ని ఉపయోగించుకోవాలన్న తపనతో చాలా కష్టపడి, అనేక అధ్యయనాలు చేసి రూపొందించారు. ప్రాజెక్టు తుది దశకు వచ్చింది. మరో రెండు నెలల్లో పూర్తయి…అందరికీ అందుబాటులోకి రావచ్చు.

ఇప్పటివరకు ఏ భారతీయ భాషకూ లేని చాట్ బోట్ సేవలను తెలుగులో తెస్తున్నందుకు “స్వేచ్ఛ” సంస్థను, ప్రోత్సహించిన తెలంగాణ ఐటీ శాఖను అభినందించాలి.

సామాజిక మాధ్యమాల్లో తెలుగు వాడకం ఎంతగా పెరిగితే…అంతగా తెలుగు చెట్టు వేళ్లూనుకుని నిలబడుతుంది. ఆ కోణంలో మన భాషలో స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి, రాసుకోవడానికి “స్వేచ్ఛ” కొత్త రెక్కలు తొడుగుతుంది. ఇలాంటివి మరిన్ని రావడానికి “స్వేచ్ఛ” బోట్ దారి దీపమవుతుంది.

ఈమధ్య హైదరాబాద్ లో కృత్రిమ మేధ మీద ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది. భారత దేశంలో ప్రాంతీయ భాషల్లో కృత్రిమ మేధ ఆధారిత వాయిస్ సర్వీసులు గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యులకు కూడా అందుబాటులోకి వస్తేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు అర్థం- పరమార్థం ఉంటుందని కేంద్ర ఐ టీ శాఖ అదనపు కార్యదర్శి అభిషేక్ సింగ్ ఈ సదస్సులో అన్నారు. ప్రాంతీయ భాషల వాయిస్ సర్వీసుల్లో వ్యాపారావకాశాలు ఉంటే ఐటీ కంపెనీలు వద్దన్నా ఇబ్బడి ముబ్బడిగా ఇందులో పెట్టుబడులు పెడతాయని ఈ రంగంలో నిపుణులు చెబుతున్నారు.

కృత్రిమ మేధతో ఉన్న ఉద్యోగాలు పోతాయని కొందరు; పోకపోగా కొత్త ఉద్యోగాలు మరిన్ని వస్తాయని కొందరు వాదిస్తున్నారు. కృత్రిమ మేధ తత్సంబంధిత రంగాల్లో ఉద్యోగాలు పెరిగితే పెరగవచ్చు కానీ…మిగతా అన్ని రంగాల్లో కృత్రిమ మేధ ఉద్యోగాలను ఊచకోత కోయడం ఖాయమనే ఎక్కువమంది నమ్ముతున్నారు.

చిన్నప్పుడు బడుల్లో ప్రకృతి- వికృతి పాఠాలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ వికృతే ప్రకృతిగా నేర్చుకోవాల్సిన పాఠమయ్యింది. కాలమహిమ. ప్రకృతి తనకు తాను పక్కకు తప్పుకుని…వికృతికి చోటిచ్చిందా? మనమే ప్రకృతిని పక్కకు తప్పించి…వికృతి వెంటపడుతున్నామా?

మనలో మనమాట:-
కొన్నాళ్లకు ఏది ప్రకృతో! ఏది వికృతో! చెప్పగలిగినవారుంటారా? ఉంటే- వారిని కృత్రిమ మేధ బతకనిస్తుందా?

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions