Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అఖండ-3… అనంత తాండవం… స్టోరీ, స్క్రిప్ట్ రెడీ… నిర్మాత కావలెను..!!

December 12, 2025 by M S R

.

మనకు మూడడం వల్ల మాడిన మూడోభాగం…. (గొట్టిముక్కల కమలాకర్)…. 
***

టెక్సాస్ రాష్ట్రంలో శివన్ ఏరియా సెవెన్త్ స్ట్రీట్ లో ఉన్న ఒక డ్రగ్ డీలర్ మహమ్మద్ వెంకట్ పీటర్ రష్యా, చైనా, జర్మనీ, కెనడా ఇంకా ఫ్రాన్స్ దేశాల అధ్యక్షులతో కలిసి ఓ మాఫియా ఏర్పాటు చేస్తాడు. సహజవనరులు సమృద్ధిగా ఉన్న దేశాలనన్నిటినీ తమ అదుపులోకి తీసుకుని బోల్డంత సంపాదించుకోవాలని వాళ్ల ప్లానాలోచన.

Ads

  • ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అనంతపూర్ ఎమ్మెల్యే గారి పనితనం మెచ్చి తనని ముఖ్యమంత్రిగా ఉండమని బతిమాలుతాడు. కానీ “మీ భార్య నా సోదరి లాంటిది. నాకు వేరే బాధ్యతలు ఉన్నాయి. ఇంకొంత కాలం పాటు మీరే ఆ పదవిలో ఉండండి. మీ పాలనలో రాష్ట్రం చల్లగా ఉంటుంది..!” అని నమస్కారం చేసి మళ్లీ అనంతపూర్ బయల్దేరుతాడు.

అప్పుడు టెక్సాస్ డ్రగ్ డీలర్ అనంతపూర్ లో తన మెయిన్ బ్రాంచీ తెరిచాడని సమాచారం రావడంతో అక్కడికి బుల్లెట్ మీద వెళ్లి డ్రగ్ డీలర్ ఏకైక కొడుకునీ, రష్యా, చైనా, జర్మనీ, కెనడా, ఫ్రాన్స్ అధ్యక్షులందరికీ ఉన్న ఒక్కొక్క కొడుకునీ ఒకే కత్తిగొడ్డలితో చంపేస్తాడు.

  • అనంతపూర్ డ్రగ్ రహిత జిల్లాగా పేరు తెచ్చుకుంటుంది.

ఆ ఆరుగురు విలన్లూ అదిలాబాద్ అడవుల్లో ఒక రహస్యసీక్రేటు మీటింగెట్టుకుంటారు. ఒఖ్కడైనా సంతానం చచ్చారన్న దిగుల్లేకుండా అనంతపూర్ ఎమ్మెల్యే అంతెలా చూడాలా..? అన్న కసితో రగిలిపోతూ తన కుటుంబ వివరాలు తెప్పిస్తారు. అప్పుడే వాళ్లకో షాకింగ్ విషయం తెలుస్తుంది.

  • అమెరికా అధ్యక్షుడి పెళ్లాం వేరెవరో కాదు. అనంతపూర్ ఎమ్మెల్యే ఏకైక కూతురు జననియే..! అధ్యక్షుడు జానీ జానీ అని పిలవడం వల్ల మనమూ విలన్లూ కన్ఫ్యూజై పోతావన్నమాట. అమెరికాకు పెద్ద సైంటిస్టై పోయి తన పరిశోధనా ఫలితాల్ని పుట్టినిల్లును భారతదేశానికీ; మెట్టినిల్లు అమెరికాకూ సరిసమానంగా పంచుతూ ఉంటుంది.

విలన్లకి తమ దేశాలు ఎందుకు వెనకబడి ఉన్నాయో, ఇండియా అమెరికాలు ఎందుకు ముందుకెళుతున్నాయో తెలిసిపోతుంది.

ఆ విలన్లంతా కలిసి తలా ఓ కత్తీ గొడ్డలీ తీసుకుని అమెరికా అధ్యక్షుడూ; ఆయన పెళ్లాం జనని వెంటపడతారు. వాళ్లు వాషింగ్టన్ డీసీ నుండి పరిగెడుతూ పరిగెడుతూ హిమాలయాల్లోకి వస్తారు. విలన్లు వెనక జీపులో కార్లల్లో ఫాలో చేస్తూ వస్తారు. అధ్యక్షుడు పరిగెత్తలేక మంచులో కింద పడ్డప్పుడు డ్రగ్ డీలర్ కత్తితో పొడవబోతుంటే జనని “బాబా….!” అంటూ అరుస్తుంది. దూరం నుండి ఒక శూలం వచ్చి వాడి చెయ్యి నరికేస్తుంది.

బాబా తన చెప్పులూ, పిక్కలూ తొడలూ నడుమూ ఛాతీ గడ్డం మొహం చూపిస్తూ వచ్చి చేతుల్లో ఉన్న విభూతి మొహానికి రాసేసుకుని “అహం శివమ్…!” అంటూ పొలిగావుకేకరుపు పెడతానే డ్రగ్ డీలర్ తల పట్టుకుని ఓ సారి క్లాక్ వైజూ ఇంకోసారి ఆంటీ క్లాక్ వైజూ తిప్పి విరిచి చంపేస్తాడు.

జననీ, తన మొగుడు ఐన అమెరికా అధ్యక్షుడూ రెండు చేతులెత్తి దండం పెడుతుండగా; పంచదేశాధ్యక్షులు పంచకూటమిగా మారి పంచప్రాణాలూ ఉగ్గబట్టుకుని పంచెల్లో పాస్ పోసుకుంటుంటే…

ఇంటర్వెల్ అవుతుంది.

ఐదు దేశాల అధ్యక్షులు వాళ్ల దగ్గరున్న అణ్వాయుధాలన్నిటినీ అంతర్వేదికి షిఫ్ట్ చేస్తారు. అక్కడ గోదావరి, సముద్రం కలిసేచోట పినాకపుష్టదక్షతాధారగండం అనే మంత్ర విద్య తెలిసిన ఓ పాకిస్తానీ క్షుద్ర మంత్రగాడు ఉంటాడు. వాడి విద్యతో అణ్వాయుధాలు ఎవరికీ కనిపించకుండా చేస్తాడు.

అక్కడికొచ్చిన బాబా పూజారికీ, ధర్మకర్తకీ, ఈవోకీ దేవుడికి పూజలెందుకు చేయాలో, ఎలా చేయాలో చెబుతాడు.

  • ఊరివాళ్లనూ, బాబా వదిలేసుకున్న తన ఇతర కుటుంబ సభ్యులనూ, అమెరికా అధ్యక్షుడినీ, అతని భార్య జననినీ ఆ ఐదుగురు విలన్లూ తాడుతో కట్టేసి అణ్వాయుధాలను వాళ్లమీదికి గురిపెడతారు. మిమ్మల్ని ఈ విశ్వంలోని ఏ శక్తీ కాపాడలేదంటూ వికటాట్టహాసం చేస్తారు.

గాల్లోంచి వచ్చిన బాబా విసిరిన త్రిశూలం రామబాణంలా విష్ణుమూర్తి సుదర్శనచక్రంగా ఆంజనేయుడి గదలా యముడి పాశంలా మారుతూ వెళ్లి ఆ తాడును తెంపేస్తుంది.

అనంతపూర్ ఎమ్మెల్యే చిన్నాచితకా రౌడీలను చంపుకుంటాడు. బాబాలో నుండి శివుడూ ఆంజనేయుడూ నరసింహుడూ రాముడూ దుర్గాదేవీ బైటకొచ్చి ఆ ఐదుగురు విలన్లనూ చంపేసి వాళ్ల రక్తంతో బాబాను అభిషేకిస్తుంటే అమెరికా అధ్యక్షుడు; ఆయన పెళ్లాం; ఎమ్మెల్యే; మిగిలిన ఆర్టిస్టులందరూ అఖండంగా స్తోత్రం చేస్తుంటే ఎండ్ టైటిల్స్ మొదలౌతాయి…!

**

యే రూప్ నహీ; యే విశ్వరూప్ హై…!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అఖండ-3… అనంత తాండవం… స్టోరీ, స్క్రిప్ట్ రెడీ… నిర్మాత కావలెను..!!
  • ఆ దర్శకుడి ‘కత్తెర’ దెబ్బకు… కమలిని ఏకంగా టాలీవుడ్‌నే వదిలేసింది…
  • … ట్రంపుడు మన పిల్లల్ని కడుపు నిండా అన్నం కూడా తిననివ్వడట..!!
  • అక్రమాల ‘ఫార్ములా రేస్’ కాదు… హైదరాబాద్‌కు ట్రూ ‘బెనిఫిట్ మ్యాచ్’…
  • … ఇంతకీ చిరంజీవి చెవిలో యముడు ఏం సలహా ఊదాడబ్బా..!!
  • ఇండిగో అనూహ్య సంక్షోభానికి మరో ప్రధాన కారణమూ ఉంది..!!
  • అసలే బాలయ్య, ఆపై బోయపాటి… ఇంకేం..? తెరపై అఖండ తాండవం..!!
  • మోడీ కరెక్ట్… ఒవైసీ చెబితే వింటాడు… టీబీజేపీ ఎంపీలు తలో దిక్కు…
  • డియర్ రామ్మోహన్ నాయుడూ… ఓసారి ఈ పైలట్ లేఖ చదువుతావా…
  • నిలువు దోపిడీ..! నేతి లడ్డూలో నెయ్యి లేదు… పట్టు శాలువాలో పట్టు లేదు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions