‘అక్రమ సంతానం’. మరాఠీ నుంచి తెలుగు అనువాదం ఇది. మూల రచయిత శరత్ కుమార్ లింబాళే’ గారు మరాఠీలో ఇంతకన్నా సూటైన పేరు పెట్టారు. దాని పేరు ‘అక్కరమాశి’. అది పేరు కాదు, తిట్టు. దానర్థం ‘లంజ కొడుకు’. అవును. రచయిత అక్రమ సంతానం కావడం వల్లే పుస్తకానికి ఈ పేరు పెట్టారు. తాను శారీరకంగా మానసికంగానే కాదు అతడి ఆత్మ ఎంత వేదనకు గురైందో చెప్పే పుస్తకం ఇది. అడుగడుగునా తాను ఎదుర్కొన్న కష్టాలన్నీ ఇందులో మనం చదువుతాం.
అంతేకాదు, రచయిత దళితుడు కూడా. ఆ కారణంగానూ ఈ నవల దళిత ఆత్మ కథల్లో ఇప్పటిదాకా ప్రస్తావనకు రాని ఎన్నో విషయాలను సవివరంగా ముందు ఉంచాయి. రచన పొడవున ఒక దళితుడి జీవనం ఎంత అధమంగా ఉంటుందో, అదీనూ అక్రమ సంతానం వల్ల పుట్టిన వాడైనందున అంతకు మించిన ఇబ్బంది ఎలా అతడిని పీడించినదో ఈ ఆత్మ కథ అత్యంత బీతావహంగా నిర్లజ్జగా మనకు తెలియజేస్తుంది. ఇలా రెండు విధాలా అతడి బ్రతుకు, ఎదురీతా, వికాసం అంతా ఈ సమాజం వికృత స్వరూపాన్ని ప్రతి పేరాలో పరిచయం చేస్తుంది. ఎటువంటి మొహమాటాలు లేకుండా, సిగ్గు పడకుండా మనం చదివి ఆలోచించ వలసిన పుస్తకం ఇది.
సామాన్య పాఠకులు సరే. ముఖ్యంగా ఎప్పటి నుంచో రాస్తున్న సంపన్న అగ్ర కుల రచయితలతో పాటు అత్యధికంగా ఇటీవల కాలంలో రాస్తున్న పైపైకి ఎగబాకాలని చూస్తున్న మధ్య తరగతి రచయితలు, వెనుకబడిన కులాలకు చెందిన వృత్తి కులాల వారు ఈ పుస్తకం చదవాలి.
అలాగే, దళిత రచయితలూ ఈ పుస్తకం ఇంకా చదవకపోతే తప్పక చదవాలి. తమ జీవితానికీ ఆ రచయిత జీవితానికీ ఎంత తేడా ఉన్నదో తెలుసుకోవడానికి, తాము రాస్తున్న వస్తువుకీ అతడు వెల్లడించిన వస్తువుకూ ఎంత గ్యాప్ ఉన్నదో గమనించడానికి, అగ్రకుల బ్రతుకులతో మిలాఖత్ అయి ఒకే మూస సాహిత్యాన్ని రచిస్తున్న వారందరూ, ఎవరి లోకాలు ఏమిటో చెప్పడానికి వెనుకాడుతున్న వాళ్ళు అందరూ చదవాలి. అంతేకాదు, తమ రచనలు అవసరమా కదా అన్నది కూడా ఈ పుస్తకం చదివితే రచయితలు ఎవరికీ వారు పోల్చుకోగలుగుతారు. అందుకు కూడా చదవాలి.
ప్రజాసాహితిలో సీరియల్ గా అచ్చయిన ఈ ఆత్మకథను రంగనాథ రామచంద్రరావు గారు తెలుగు చేశారు. ఐతే, గతంలో కొలకలూరి ఇనాక్ గారు కూడా దీన్ని అనువదించారు గానీ వీరు హిందూ మూలం నుంచి చేసినట్లు చెప్పారు.
రంగనాథ రామచంద్రరావు గారు ఈ పుస్తకాన్ని ఎంతో బాగా అనువదించారు. వారు ముందు మాట రాస్తూ “ఈ పుస్తకాన్ని చదివి దిగ్భ్రాంతి చెందాను” అంటూ ఇలా పరిచయం చేస్తారు…”నిస్సహాయ స్థితిలో వేశ్యావృత్తిని చేపట్టిన ఒక అస్పృశ్య మహిళకు లింగాయత గౌడకు అక్రమ సంబంధం వల్ల పుట్టిన శరణ కుమార లింబాళే మనస్సులో భగభగమని మండిన అగ్ని జ్వాలలలో ఏర్పడిన నిప్పుకణికల్లాంటి మాటల్లో అక్షరబద్ధమైన ‘అక్రమ సంతానం’ ఇది” అని రాశారు.
రచయిత ముందు మాటలో చెబుతారు. తన ఆత్మకథ రాయడం పూర్తయ్యాక ఆయన ఎంతగా లిబరేట్ అయ్యారో. నిజమే. ఒక భయంకర స్టిగ్మా నుంచి… తన బ్రతుకే కాదు, పుట్టుక ఎలాంటిదో చెప్పి బయట పడటం ఏదైతే ఉన్నదో అప్పుడు ఎంత ఉపశమనం ఉంటందో ఆయన ఇలా చెప్పారు. “పాము కుబుసం విడిచి బయటకు వస్తుందో అదే విధంగా నేను ‘అక్కర్ మాశి’ నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు నాకు ఎవరి భయం లేదు. ఎలాంటి ఆత్మన్యూనతా భావమూ లేదు“ అంటారు.
రచన వరం. ఆ బాధితుడిని విముక్తి చేసినందుకు నిజంగానే మనందరం కూడా సాహిత్యానికి రుణపడాలి. ఇలాంటి పుస్తకాలు చదివినప్పుడే రచన పట్ల ఎంతో సంతోషం, గౌరవం కలుగుతుంది.
ఈ పుస్తకంలో రచయిత బాధ, కోపం, సంకట స్థితి, ఆక్రోశం, నిరాశ, నిస్పృహ, పీడన, ఆవమానం, పగ పరుచుకుని ఉంది. అవును. పగ కూడా. అంత్యంత ఘోరంగా నిరంతరం అవమానాల పాలైన వ్యక్తికి సమాజంపై పగ కూడా ఏర్పడుతుందని, ఆ పగ అతడిని ఎలాగైనా మార్చవచ్చని ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. అయితే, సమాజం అంటే మనుషులే కాబట్టి, అతడి పగ ఎవరిపై ఎలా విరుచుకు పడుతుందో తెలియదు. అది మీపై నాపై కూడా అని అర్థం చేసుకోవాలి. అది గ్రహించడానికి కూడా ఈ పుస్తకం చదవాలి.
లక్కీగా ఆయన విద్యావంతుడై ఆఖరికి స్థిరపడ్డారు. ప్రస్తుతం నాసిక్ కేంద్రంగా పనిచేస్తున్న యశ్వంతరావు చవాన్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ – పూనా ప్రాంతీయ కేంద్రానికి అధిపతిగా ఉన్నారు. ఐతే, ఆయన జీవితం స్థిర పడ్డప్పటికీ తాను ఆవిష్కరించిన ఈ గాథ తనలాంటి అందరిదీ. అది ఎన్ని విధాలా ఈ దేశంలో అస్థిరంగా గడుస్తున్నదో ఊహించుకుంటేనే ఒళ్ళు గగర్పొడుస్తుంది.
***
మన సమాజంలో నేరాలు ఘోరాలు అమానవీయ సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయంటే అవన్నీ సదరు వ్యక్తుల సాంఘిక ఆర్ధిక పరిస్థితుల ప్రభావం అని మాత్రమే మనం లేక్కిస్తాం. కానీ కాదని ఈ పుస్తకం నిరూపిస్తుంది. ముఖ్యంగా మన దేశంలో మనిషిని తీర్చిదిద్దే అంశాల్లో ముఖ్యంగా కుల వివక్ష, అణిచివేత కూడా అపరిమితంగా ఉందన్న నిజం ఇందులో చూస్తాం. అలాగే మత దురహంకారం కూడా మనదేశంలో మరో విపరీత వాస్తవం. వీటిని గుర్తించడానికి వెనుకాడుతాం కానీ ఇవీ ముఖ్య కారణాలు అని గుర్తు చేస్తుంది ఈ రచన.
Ads
కుల మత వివక్షల కారణంగా వ్యక్తులు చిన్ననాటి నుంచే పీడనకు గురికావడం పేదరికంలో మగ్గడం, కనీస అవకాశాలకు దూరంగా ఉండటం, క్రమంగా ఒంటరి కావడం, ఒక మూలకు లేదా పాతాళానికి నెట్టి వేయడం, వీటన్నిటి వల్ల కూడా సదరు వ్యక్తులకు సమాజం పట్ల కసి, పగకు కూడా కారణం అవుతుంది. ఆ సంగతి అధికంగా మాట్లాడుకోము కానీ ఈ పుస్తకం అలా అర్థం చేసుకోవలసిన అవసరాన్ని గుండెలో ముళ్ళు గుచ్చినట్టు బాధించి గుర్తు చేస్తుంది.
ఒక వ్యక్తిని నేరస్తుడు కావడానికి సంఘం లేదా సమాజం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో మన అవగాహనకు చేర్చే రచనలు బహు అరుదు. ఈ పుస్తకం అలాంటి అలజడి కూడా కలిగిస్తుందని నా భావన. ఎందుకంటే ముందే చెప్పినట్టు రచయిత నిస్సంకోచంగా తన ఆత్మను, అందలి అన్ని భావనలను యధాతధంగా నిజాయితీగా వ్యక్తపరిచాడు. రెండు చోట్ల అతడు బాహాటంగానే చెబుతాడు. మొదటిది మీరు చదవండి. రెండోది తనకు ఇల్లు అద్దెకివ్వని పట్టణానికి అగ్గి పెట్టాలనిపిస్తుంది అని రాస్తాడు.
ఇలాంటి స్థితికి నెట్టే మన ఊరు, పట్టణం – వాడల్లో బ్రతికే వ్యక్తిని అవమానంతో కోపంతో ద్వేషంతో పెరిగేలా చేస్తుంది. అది పగగా మారే క్రమం కూడా సహజమే. ఇదొక వాస్తవం. దాన్ని వింటే గానీ ఆ సంగతి మన సెన్సిటివిటీలకు అందడు. ఈ పుస్తకం ఆ దిశలో భయపెట్టించడం ఒక వాస్తవం. అందుకే రచయిత అంటాడు, మరాఠీ సాహిత్యంలో వచ్చిన ఆత్మ కథలకన్నా తనది విభిన్నమైనది అని. నిజంగా నిజం. తెలుగులో ఇలాంటి ఆత్మకథలు వచ్చాయో లేదో దళిత సాహిత్యం బాగా అధ్యయనం చేసినవారే చెప్పాలి.
ఐతే, అంటరాని వసంతం వంటివి నవలలు వచ్చినా అందులో జీవితం విప్లవంతో జత కట్టిన కారణంగా అణిచివేత కన్నా ఆశయాలు ప్రబలంగా ముందుకు వచ్చి అది దళిత నవలగా ప్రభావం చూపలేదు. కానీ ఈ ఆత్మకథ అసామాన్యమైనది, ఆత్మ గౌరవం కన్నా ఆత్మ క్షోభను వినిపించడం ప్రధానంగా సాగి మన సమాజం ఎట్లాంటిదో అర్థమై సిగ్గుతో చచ్చిపోయేలా చేస్తుంది.
ఒక దళితుడు చిన్నప్పటి నుంచి యుక్త వయస్కుడు అయ్యేదాకా అదృష్టవశాత్తూ చదువుకుని ఉద్యోగం చేసేదాక విడమర్చి చెబుతుంది. మళ్ళీ రాస్తే, అదృష్టవశాత్తూ పెళ్లి కూడా చేసుకుని స్థిరపడేదాకా ఉంటుంది. అదృష్టం అని ఎందుకు నొక్కి చెప్పటం అంటే రచయిత పరిస్థితులన్నీ చదువుతూ పోతే ఈ మనిషి పదో తరగతి చదవడమే గొప్ప. అటువంటిది మాస్టర్స్ చేస్తాడు కనుక. అలాగే అతడికి ఎవ్వరూ పిల్లను ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఆఖరికి పెళ్ళవుతుంది కనుక.
అంతేకాదు, ఈ పుస్తకంలో అంబేద్కర్ తన వంటి వారికి గొప్ప ఆలంబన అవుతారో, అది ఎంత సహజమో అనివార్యమో కూడా ఈ రచన అర్థం చేపిస్తుంది. రిజర్వేషన్ల పట్ల మండిపడే వారు కూడా ఈ పుస్తకం దయచేసి చదవాలి. ఒక మనిషి మనిషిగా బ్రతకగలిగే పరిస్థితులు లేనప్పుడు ఆ వ్యక్తికి ఎన్ని ప్రత్యేక అవకాశాలు అవసరమో కూడా బోధపడుతుంది.
భద్ర జీవులు, కవులు, మధ్య తరగతి యధాతధ వాదులు, కులం మతం గురించి నోరెత్త కూడదనే వాళ్ళు, విప్లవ రచనలు చేస్తున్నామని చెప్పుకునే రచయితలు చదవ వలసిన పుస్తకం ఇది. అసలు ఒక అంచున ఈ దేశాన జీవితం ఎట్లున్నదో చూడకుండానే మార్పు కోరుకునే వారందరూ చదవాల్సిన పుస్తకం ఇది.
దళితుడిని అని చెప్పుకోవడం కూడా ఒక దశలో సాధ్యం కాని స్థితిలో ఆ మనిషి పడ్డ యాతన కూడా రచయిత ఆవిష్కరిస్తాడు. మొత్తంగా ఒక ‘వాడ ఆత్మ అస్తిత్వం’ ఎలా ఉంటుందో చూపే సూక్ష్మ దర్శిని ఈ పుస్తకం.
ఊరిలో పట్టి పెరిగిన వారంతా ‘వాడ’ ఎక్కడిదో, అది ఎట్లాంటి స్థితిగతులతో ఉన్నదో అక్కడ బ్రతుకులు ఎంత దుర్భరమో తెలుసుకోవడానికి చదవాలి.
ఈ పుస్తకంలోనివి యాభై అరవై ఏళ్ల నాటి పరిస్థితులే కావొచ్చు. కానీ నేటికీ అలాంటి స్థితి ఉన్న కారణంగా ఆధునిక సాహిత్యం సృజిస్తున్న వారు తప్పనిసరిగా ఎటువంటి వస్తువు, ఆ వస్తువు కారణంగా ఎలాంటి శైలి, శిల్పం ఆత్మకథలు ఎంచుకుంటాయో తెలుసుకోవడానికి చదవాలి.
***
వేరేవాళ్ళు దళితుల గురించి మాట్లాడుతారు. వేరేవాళ్ళు స్త్రీల గురించి మాట్లాడుతారు. వేరే వాళ్ళు ప్రాంతాల గురించి మాట్లాడుతారు. కానీ అదంతా ఒక సహానుభూతి. కానీ స్వీయానుభవం వినడం, చదవడం అన్నిటికన్నా మిన్న. స్వీయ రచయితలే జీవిత రచనలను అందిస్తారు. మిగతావి నాన్ డీటైల్డ్ స్టడీస్ అనుకుంటే లింబాళే వంటి రచయితలు సృష్టించేవి డీటైల్డ్ స్టడీస్.
వారిని చదవడం మన కల్పనా జగత్తును పర్రెలు పెట్టిస్తుంది, వాస్తవికత అరుదుగా సృజనలోకి వస్తున్నదన్న ఎరుక కలిగిస్తుంది. ఆ చేదు అనుభవం అర్థమైతే మనం కలాలను గళాలను మూసుకునేలా చేస్తాయి. అలా జరగడమూ అవసరమే. అలాంటి షాక్ ట్రీట్ మెంట్ కు గురి కావాలంటే దయచేసి ఈ పుస్తకం చదవాలి. చదివితే గానీ తెలియదు ఎంత లజ్జాభరిత అవమానకర బతుకు గడిపాడో ఆ రచయిత అని.
అలా ఎన్ని వేలు, లక్షలు, కోట్ల మంది మన మధ్య మనతోనే అనేక విధాలా కలిసి జీవిస్తున్నారో అని. వారిని పోల్చుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి. చూసి మనుషులంతా సమానం కాదన్న సంగతి అర్థం చేసుకోవాలి. అందరి రక్తం ఎరుపే కానీ ఒకటి కాదని తెలుసుకోవాలి. ఒకే ఆకాశం. కానీ అందరం తలెత్తి బ్రతకడం లేదని గ్రహించాలి. చూరు కింద అందరూ నిద్రించడం లేదన్న వాస్తవమూ తెలుసుకోవాలి. రచయితకు బస్టాండ్ మాత్రమే ఇల్లు. పూణే లో చదువుకుంటున్నప్పుడు సహా విద్యార్థులు తమ ఊరికి వస్తారు. వస్తేగానీ తెలియదు, లింబాలే ఉండేది ఇంట్లో కాదని, వారి కుటుంబం నివసించేది బస్టాండ్ లో అని.
***
అన్నిటికన్నా మిన్న అక్రమ సంతానంగా తాను పుట్టడానికి కారణం ‘వాడ’లోకి వచ్చే ‘ఊరు’ అని లింబాళే చెప్పిన తీరు ఓకే కఠిన వాస్తవం. తాను ఆ ఊరు అక్రమ సంతానమే అయినా గానీ అటు ఊరికీ, ఇటు వాడకీ చెందని విధంగా బ్రతికిన వైనం వివరిస్తాడు రచయిత.
అంతేకాదు, రొట్టె కోసమే ‘వాడ’ అనివార్యంగా ‘ఊరి’ని చేరదీసింది అన్న వాస్తవం చెప్పడం కూడా ఈ ‘అక్రమ సంతానం’ పుస్తకంలోని మరో ముఖ్య విశేషం.
పుస్తకంలో మతం కూడా ఎంత వివక్షాభరితమో వివరిస్తాడు. తనను పెంచి పెద్ద చేసిన తాత ముస్లిం అయినందుకు కూడా వివక్షకు గురవుతాడు. ఇట్లా ఈ పుస్తకం కేవలం కులం మతం లింగం వంశంపై ఆధిపత్యం వహించిన అన్ని శక్తులనీ నిశితంగా విమర్శకు పెడతాడు రచయిత. ఒక్క మాటలో చెప్పాలంటే ఊరు ఎంత అమానుషమో చెప్పిన శక్తివంతమైన భారతీయ రచన ఇది కాకుండా ఇంకేదైనా ఉంటే అది బహుశా ఇంత విపులంగా చెప్పినది మరొకటి ఉన్నదో లేదో నాకైతే తెలియదు. పెద్దలు చెప్పాలి.
ఇట్లా ఎన్నో విధాలా ఈ రచన ఒక ఉద్గ్రంధం. వివరంగా చెబితే మరో పుస్తకం అవుతుంది. అందుకే మీరే చదవాలి. 128 పేజీల ఈ పుస్తకంలో బాల్యం ఒక భయంకర వాస్తవం. ఊరూ వాడా అన్న విభజన తెలుసుగానీ వాడలో బ్రతికే మనుషులది ‘పెంట కుప్ప’ అన్న వాస్తవం ఈ పుస్తకం ఇచ్చినట్టు మరేదీ ఇవ్వలేదు. ఏ మనిషీ నాకు ఇంతదాకా చెప్పలేదు.
***
పుస్తకంలోని ప్రతి పుట బాధ పెడుతుంది. కానీ చదవాలి. తింటున్న రొట్టెలోంచి పేడ దుర్గంధం గుప్పుమంటే దాన్ని కూడా పట్టించుకోకుండా తినే మనుషుల సహజ గాథ ఇది. చచ్చిన శవం వారికి ఆహరం. పశువులు చనిపోవాలని కోరుకునే అనివార్య స్థితి వారిది. తప్పదు. కానీ తిన్న తర్వాత కడుపులో దూడ కుమ్ముతున్నట్లు అనిపించే విషాదామూ వారిదే. బతకడం కోసం మాన మర్యాదలు లెక్కలోకి రాని కడు నీచ బతుకు పుస్తకం ఇది.
***
కలేకూరి ప్రసాద్ అన్నట్టు, “నేను ఎప్పుడు పుట్టానో తెలియదుగానీ వేల ఏండ్ల క్రితమే నన్ను చంపేశారు” అన్నట్టు ఈ మరాఠీ రచయిత బ్రతికి బట్ట కట్టడం, రచయితగా మారడమూ ఎందుకైనా జరిగిందీ అంటే బహుశా మరణించిన తమ వాళ్ళందరి ఆత్మలను మనం అర్థం చేసుకునేందుకు కాబోలు!
గత ఏడు బుక్ ఫెస్టివల్ లో తెచ్చుకున్న ఈ పుస్తకం మొదటి ముద్రణ జూన్ 2018లో వేసినట్లు ఇంప్రింట్ పేజీలో ఉంది. ఇంకా కాపీలు ఉన్నాయో లేదో తెలియదు. కానీ వివరాలకు బి. అరుణ, ప్రధాన కార్యదర్శి, జన సాహితీ, విజయవాడ అని పుస్తకంలో ఉంది. సంప్రదించవలసిన నంబరు ఇది అని ఇచ్చారు – 9440705955. మరి చూడండి… (విశ్లేషణ :: కందుకూరి రమేష్ బాబు)
Share this Article