మన హీరో మహేశ్ బాబు మంచోడు… అందగాడు, వివాదాల్లో వేలుపెట్టడు… బోలెడు మంది పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించాడు… ఇలా చాలా చాలా చెప్పుకుంటాం… కానీ నాణేనికి మరోవైపు… నీకు ఈ గుట్కాల సరోగేట్ యాడ్స్ డబ్బు, ఆ పెంట మీద డబ్బు అవసరమా నీకు అనీ తిట్టుకుంటాం… దేనిది దానికే… దూద్‌కాదూద్ పానీకాపానీ…
ఆమధ్య అమితాబ్ బచ్చన్ టపటపా చెంపలేసుకుని, తాను ఇక గుట్కా యాడ్స్‌లో యాక్ట్ చేయను, ఇప్పటికే తీసుకున్న డబ్బు వాపస్ పంపించేస్తున్నాను అని ప్రకటించాడు… పశ్చాత్తాపమో, ప్రాయశ్చితమో… అమితాబ్ తప్పును తప్పు అని తెలుసుకున్నానని చెప్పడానికి సిగ్గుపడలేదు… మరి మహేశ్ బాబు నుంచి ఇలాంటి ప్రకటన ఎప్పుడు..? అనే ప్రశ్నకు జవాబు లేదిప్పటికీ…
అత్యంత ఖరీదైన తెలుగు బ్రాండ్ హీరో తను… అదేసమయంలో తెలుగు తెరకు విలువైన కథానాయకుడు… ఏది ముఖ్యం..? డబ్బేనా..? డబ్బు వస్తే చాలు, ఆ ఉత్పత్తి ఏదైనా సరే ప్రమోట్ చేయాలా..? నీకు సమాజం ఇంత ఇచ్చింది కదా, మళ్లీ నువ్వేం తిరిగి ఇస్తున్నావనేది ఎంత ముఖ్యమో, సమాజానికి నష్టం వాటిల్లే పని చేయకపోవడం కూడా సాయం చేయడమే…
Ads
అంతటి అమితాబే తప్పుతెలుసుకున్నాడు..! మరి మన మహేశ్‌బాబు ఏం చేస్తాడో..!?
ఇప్పుడు మళ్లీ ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… బాలీవుడ్ మోస్ట్ బిజీ హీరో అక్షయకుమార్ కూడా సేమ్, అమితాబ్‌లాగే చెంపలేసుకున్నాడు… విమల్ ఇలాచీ పేరిట సాగుతున్న గుట్కా యాడ్స్‌లో షారూక్, అక్షయ్, అజయ్ దేవగణ్ ప్రధానంగా కనిపిస్తున్నారు కొన్నాళ్లుగా… ఒక్క ముక్కలో చెప్పాలంటే, ముగ్గురు స్టార్ హీరోలు, సొసైటీ మీకు ఇంత డబ్బు, కీర్తిని ఇచ్చింది, ఇవేం యాడ్స్..? సోషల్ రెస్సాన్సిబులిటీ లేదా..? అని సోషల్ మీడియా ముక్కచీవాట్లు పెడుతోంది కొన్నిరోజులుగా…
కరోనా సంక్షోభకాలంలో అక్షయ్ ప్రకటించిన విరాళాలు అన్నీఇన్నీ కావు… దేశం యావత్తూ కొనియాడింది… నెత్తిన పెట్టుకుంది… కానీ ఆఫ్టరాల్ విమల్ గుట్కా చిల్లర డబ్బుకు కక్కుర్తి పడటంతో ఆ మంచిపేరు కాస్తా కాలిపోయింది… అందుకే ఓ రేంజ్‌కు చేరాక సెలబ్రిటీలు వేసే ప్రతి అడుగూ మీద అంచనాలుంటయ్, ఇలాగే ఆడిట్లు కూడా ఉంటయ్…
అక్షయ్ కుమార్ తప్పును అంగీకరిస్తున్నాడు కానీ కాస్త తెలివిని ప్రదర్శిస్తున్నాడు… లీగల్ ఒప్పందాల్లో ఆల్‌రెడీ ఇరుక్కున్న కారణంగా విమల్ యాడ్స్ ఆపలేను, కాకపోతే తనకు వచ్చే పారితోషికాన్ని ఏదైనా మంచి పనికి వినియోగిస్తాను అంటున్నాడు… ఇకముందు జాగ్రత్తగా ఉంటాను అంటున్నాడు… కానీ లీగల్ డ్యురేషన్ ఆఫ్ కంట్రాక్టు నుంచి కూడా బయటపడేందుకు చాన్స్ ఉంది… సరే, కమర్షియల్ బ్రాండ్ వాల్యూ దెబ్బ తింటుందని భయపడుతున్నాడేమో…
ఇవన్నీ సరే… పొగాకు ఉత్పత్తుల్ని ప్రచారం చేయడం నేరం కదా… సోడా, వాటర్ పేరిట మద్యం బ్రాండ్స్, ఇలాచీ, మౌత్ ఫ్రెషనర్స్ పేరిట గుట్కా సరోగేట్ యాడ్స్ ఇంత విస్తృతంగా ప్రసార మాధ్యమాల్లో వస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది..? ఈ ప్రశ్న ఎప్పుడైనా తలెత్తిందా మీ మనస్సుల్లో…. సర్లెండి, కేంద్ర ఆరోగ్యశాఖ ఈమధ్యకాలంలో చేసిన ఒక్క మంచిపని చెప్పండి అంటారా..? అంతేలెండి… అదీ నిజమే…!! మరి షారూక్, అజయ్ దేవగణ్‌లకు ఏం పుట్టింది అంటారా..? ఏమో, వాళ్ల చర్మాలు కాస్త ఎక్కువ మందం..!! సోషల్ మీడియాతో సొసైటీకి అప్పుడప్పుడూ కాస్త ఉపయోగం ఉంటుంది… ఇది మాత్రం నిజం…
Share this Article