సినిమా నటుడు ఆలీకి బాగా అర్థమైపోయినట్టుంది… ఏపీ ప్రభుత్వంలో సలహాదారు అనే పదవికి కేవలం ప్రోటోకాల్, నెలవారీ జీతం తీసుకోవడం తప్ప పెద్దగా వేరే పనేమీ ఉండదని తెలిసిపోయినట్టుంది… ఆయన ఇంకేమైనా మంచి పోస్టు ఆశించాడేమో తెలియదు, అసలు జగన్‌ను మెజారిటీ సినిమాజనం లైట్ తీసుకుంటారు… జగన్ పట్ల ప్రేమను, అభిమానాన్ని కనబరిచిందే ఇద్దరు ముగ్గురు… ప్రధానంగా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, పోసాని, ఆలీ… ఏవో పదవులిచ్చి గుర్తించాడు జగన్… కానీ…
జగన్ పోస్టులను అలంకారప్రాయంగా తీసుకోవడమే తప్ప ఇన్వాల్వ్ కావద్దనే నిజం బలిరెడ్డి పృథ్వీరాజ్‌కు అర్థం కాలేదు… పైగా పోయి పోయి జగన్ చిన్నాన్న ఎదుటే ఫోజులు కొట్టాడు… తరువాత ఫ్యూజులు ఎగిరిపోయాయి… ఇవన్నీ చూస్తున్న ఆలీ తనకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదివిని జగన్ ఇవ్వగానే వినయంగా స్వీకరించాడు… వెంటనే ఈటీవీలో ‘ఆలీతో సరదాగా’ షో ఆగిపోయింది… అబ్బో, తన పదవిలో సీరియస్‌గా అవుతాడేమో, అందుకే టీవీ- సినిమా షూటింగులు ఆపేశాడేమో అనుకున్నారు… కానీ నిజం కాదు…
పైగా ఈటీవీలో ప్రోగ్రాం చేస్తే జగన్‌కు కోపమొస్తుందనేదీ నిజం కాదు… రోజా మంత్రి అయినా సరే, ఈటీవీ జబర్దస్తే ప్రాణంగా భావిస్తుంది… ఇప్పటికీ వెళ్లి స్పెషల్ షోలో డాన్స్ చేయాలమ్మా అనడిగితే చేసేస్తుంది కూడా… సో, ఆలీ టీవీలను మానేసింది దానికి కాదు… పైగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు… ఆలీతో సరదాగా షోకు రేటింగ్స్ దారుణంగా పడిపోయినయ్… అందుకని ఆపేసినట్టున్నారు ఆ షో… నిజానికి ఈటీవీలో అన్ని రియాలిటీల షోలకూ ఆదరణ పడిపోయింది… ఆలీ అది గమనించలేకపోయాడా…?
Ads
ఆ పదవిలో పనేమీ ఉండదు… అదొక విచిత్రమైన పోస్టు… ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అంటే ఏం చేయాలి..? ప్రభుత్వ వ్యతిరేక ప్రసారాలు రాకుండా మేనేజ్ చేయాలా..? ఆ పని సజ్జల, అమర్, జీవీడీ వంటి సలహాదారులకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి కూడా సాధ్యం కావడం లేదు, ఫాఫం ఆలీ ఏం చేయగలడు..? ఏబీఎన్ ఆఫీసుకు వెళ్లి వెంకటకృష్ణను, టీవీ5 ఆఫీసుకు వెళ్లి సాంబశివను, మూర్తిని బాబ్బాబు టోన్ తగ్గించండి కాస్త అంటూ బతిమిలాడలేడు కదా… మహాన్యూస్ వంశీకి పొర్లుదండాలు పెట్టలేడు కదా…
ఈలోపు ఈటీవీలో ఆలీతో సరదాగా స్థానంలో వెన్నెల కిషోర్‌తో అలా మొదలైంది అనే షో స్టార్ట్ చేసింది… కానీ ఆలీ వేరు, వెన్నెల కిషోర్ వేరు… ఈ ప్రోగ్రాం అట్టర్ ఫ్లాప్… మొన్నటివారం రేటింగ్స్‌లో మరీ దారుణంగా ఒకటిలోపు రేటింగ్స్ వచ్చాయి… ఒక్క ముక్కలో చెప్పాలంటే దాన్నెవడూ దేకడం లేదని అర్థం… సెలక్షన్స్ ఆఫ్ గెస్ట్స్ విషయంలో రాంగ్ స్టెప్స్ ప్రధానం… ఇక వెన్నెల కిషోర్ బదులు ఆ పాత ఆలీయే నయం అని ఈటీవీ కళ్లు తెరుచుకున్నాయి… ఇప్పుడు ఆలీ ఆల్ ఇన్ వన్ అనే ప్రోగ్రామ్‌కు రూపకల్పన చేశారు… ప్రోమోలు వదిలారు…
నిజానికి ఈటీవీలో ప్రతి రియాలిటీ షో ముక్కుతూ మూలుగుతూ నడుస్తోంది… అంతటి సుమ హోస్ట్ చేసే సుమ అడ్డా షోయే ఎవరూ చూడటం లేదు… ఢీ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది… చివరకు స్వరాభిషేకాలు, పాడుతా తీయగా వంటి షోలు కూడా ఫ్లాప్… శ్రీదేవి డ్రామా కంపెనీ మినహా జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ కూడా ఎవరూ పెద్దగా చూడటం లేదు… తెలుగు వినోద చానెళ్లలో మూడో స్థానాన్నే కష్టమ్మీద కాపాడుకుంటోంది…
సరే, దానికి కారణాలు బోలెడు… ఈ స్థితిలో పలు పాత చాట్ షోలు, ఎంటర్‌టెయిన్‌మెంట్ షోలను మిక్సీలో వేసి, కిచిడీ చేసి ఈ ‘ఆల్ ఇన్ వన్’ రూపొందించినట్టు ఆలీ షో ప్రోమోలో కనిపిస్తోంది… అందులో డాన్స్ ఉంటుంది, సింగింగ్ ఉంటుంది, కామెడీ ఉంటుంది… కిట్టీ పార్టీల్లాగా చిన్న చిన్న ఆటలపోటీలు ఉంటాయి, అందుకే కదా ఆల్ ఇన్ వన్ అని పేరు పెట్టింది… ఇక దాని భవిష్యత్తు ఏమిటో కాలమే చెప్పాలి… సో, ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుకు పనేమీ ఉండదని బోధపడింది కాబట్టి… నాలుగు డబ్బులు తెచ్చి పెట్టే రెండుమూడు టీవీషోలు చూసుకో ఆలీ…
Share this Article