మమ్ముట్టి… వయస్సు 70 ఏళ్లు… యాభై ఏళ్లుగా తను మలయాళంలో తిరుగులేని హీరో… మోహన్‌లాల్ తనకన్నా పదేళ్లు చిన్న… అప్పుడప్పుడూ మన్నెంపుల్లి, జనతా గ్యారేజీ, మనమంతా ఎట్సెట్రా పాత్రలతో తనను గమనించే అవకాశం లభించింది… కానీ మమ్ముట్టి అప్పుడెప్పుడో ముప్ఫయ్ ఏళ్ల క్రితం తను హీరోగా నటించిన స్వాతికిరణం ఓ క్లాసిక్… తరువాత యాత్ర అని వైఎస్ బయోపిక్‌లో ఓ పార్ట్… మళ్లీ ఇప్పుడు సోనీ యాప్‌లో పెట్టిన పుజు…
నటవిశ్వరూపం… ఈ వయస్సులో కూడా ఓ తపన… నిజానికి తను కూడా ఇన్నేళ్లుగా అందరు కమర్షియల్ హీరోల్లాగే ఎగిరాడు, దూకాడు, హీరోయిన్లతో కిందామీదా పడ్డాడు… బీభత్సమైన ఫైట్లు గట్రా చేశాడు, డబ్బు సంపాదించాడు, విపరీతమైన ఫ్యానిజం… అన్ని వేషాలూ వేశాడు… అదేసమయంలో ఏదైనా మంచి పాత్ర దొరికితే, తన చుట్టూ ఉన్న దేవతా వస్త్రాల వంటి ఇమేజీని విప్పేసి, తనలో సుప్తచేతనావస్థలో ఉన్న అసలు నటుడిని నిద్రలేపుతాడు… ఆ పాత్రలోకి ఆతృతగా పరకాయ ప్రవేశం చేస్తాడు…
పుజు అదేతరహా… మొహంలో ఉద్వేగాలు పలకడం అంటే ఏమిటో మమ్ముట్టి మొహం చెబుతుంది… దానికి తగ్గట్టుగా బాగా ఇంటెన్సిటీ ఉన్న కథ… ఇంకేముంది..? చెలరేగిపోయాడు… కడుపు వేరు, మనసు వేరు… మనసు కోసం ఎప్పుడో ఓ మంచి పాత్ర కావాలని తపించిపోవడం, అవసరమైతే అన్నిరకాల ఇగోలు, ఇమేజీలను బద్దలు కొట్టుకుని ఆ పాత్రను ఆలింగనం, ఆవాహన చేసుకోవడం వేరు… అదీ ఆర్టిస్టుకు ఉండాల్సింది… మోహన్‌లాల్ కూడా అంతే…
Ads
దక్షిణ ఇండస్ట్రీలను పరిశీలిస్తే… కన్నడంలో రాజకుమార్ తరువాత ఆ రేంజ్ హీరో ఎవరూ లేరు… చెప్పుకోవడం వేస్ట్… తమిళంలో నటన పట్ల ఆర్తి, దాహం కమలహాసన్‌లో ఉంటాయి… ఎప్పటికప్పుడు ఏదో ప్రయోగంతో తనలోని అసలైన నటుడిని నిద్రలేపి, సంతృప్తిపరిచి, నేను ఆర్టిస్టును అని రెన్యువల్ చేసుకుంటాడు… కమలహాసన్‌తో అసలు ఎవరికీ పోలిక లేదు… నటుడిగా..! రజినీకాంత్ ఈమధ్య కొన్ని భిన్న పాత్రల్ని ట్రై చేశాడు గానీ అవి క్లిక్ కాకపోవడంతో మళ్లీ పెద్దన్న తరహా సోది పాత్రల్లోకి వేగంగా జారిపోయాడు… కొంచెం నటులు సూర్య, విక్రమ్ భిన్నమైన పాత్రలకు సంబంధించి బెటర్…
తెలుగులో ప్రజెంట్ ఎవరున్నారు..? పెద్ద ప్రశ్న…! శుభలేఖ, అభిలాషల తరువాత చిరంజీవి తనలోని మంచి సమర్థుడైన నటుడిని బయటికి తీసి, ఇంట్లోనే ఓ కోల్డ్ స్టోరేజీలోకి విసిరేశాడు… తనలో ఒక కుమ్ముడు హీరో మాత్రమే ఉన్నాడు ఇప్పుడు, నటుడు లేడు… నవరసాలు అంటే… కరుణ, హాస్యం, బీభత్సం, భయానకం, శృంగారం, వీరం, అద్భుతం, రౌద్రం, శాంతం… కొన్ని బేసిక్ రంగులు రకరకాల పాళ్లలో కలిసి లక్షల షేడ్స్‌గా కనిపించినట్టుగా… ఆ నవరసాలే అనేక అనిర్వచనీయ ఉద్వేగాలను ఆవిష్కరిస్తాయి…
మనవాళ్లు రౌద్రాన్ని, వీరాన్ని, బీభత్సాన్ని ప్రదర్శించగలరు… కానీ పెద్ద హీరోల్లోనే చాలామందికి కామెడీ చేతకాదు… ఇక కరుణ, శాంతం తెలియనే తెలియదు… ప్రత్యేకించి కన్నీళ్లు, బాధను అభినయించి మెప్పించేవాళ్లు ఏరీ..?! ఇవన్నీ చేయగలిగిన జూనియర్ తను కూడా ఇమేజీ బందిఖానాలో ఉండిపోయాడు… రంగస్థలంలో రాంచరణ్ బాగానే చేశాడు… ఖలేజాలో మహేష్ డిఫరెంట్… కానీ మళ్లీ ఏదీ అలాంటిది ఒక్క పాత్ర..?!
టాప్ హీరోలు కాదు గానీ నాని, శర్వానంద్ సరైన పాత్రలు దొరికితే పర్‌ఫామ్ చేయగలరు… అన్నీ చేయగల మరో నటుడు బాలయ్య… ఏ రసమైనా సరే దున్నేయగలడు… కానీ తనను కూడా బీభత్స కమర్షియల్ బందిఖానాలో పడేశారు కదా… సరైన పాత్ర పడాలే గానీ పుజు వంటి పాత్రను బాలయ్య చేయగలడు… వందల కోట్లను కుమ్మేయగల డిష్యూం డిష్యూం హీరోలున్నారు… కానీ కంట తడిపెట్టించే నటులు..? ఎందరున్నారు..? ఆర్తిగా, తపనతో ఓ పాత్రను ఆవహించేవాళ్లు ఎవరున్నారు..? అసలు ఆ పాత్రల్ని సృష్టించేవాళ్లు ఎక్కడున్నారు..?! అసలు ఇదే పుజు పాత్ర ఆఫర్ చేస్తే చేయడానికి ముందుకొచ్చే ఒక్క తెలుగు హీరో పేరు చెప్పగలరా..?! పుజు (పురుగు)లా తీసిపడేస్తారు..!!!
Share this Article