Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కీలకమైన నదీజలాల వివాదాలపై… హరీష్‌రావు అబద్దపు బాష్యాలు…

December 31, 2025 by M S R

.

ఎంతగా కేసీయార్ ట్రెయినింగ్ అయినా సరే, ఇన్నాళ్లూ హరీష్ రావు కాస్త హేతుబద్దంగా, జనం నవ్వకుండా ఉండేలా కాస్త పద్ధతిగా మాట్లాడతాడని అనుకునేవాళ్లకు తీవ్ర నిరాశ, విస్మయం… తను కేటీయార్‌ను మించిపోయాడు పద్దతిరాహిత్యంలో..!

నిన్నటి తన ఇరిగేషన్ ప్రెస్‌మీట్ నిండా అబద్దాలు, వితండ బాష్యాలతో ఉంది… మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇరిగేషన్ సబ్జెక్టును వదిలేసింది కాబట్టి, హరీష్ రావు మాటల్లో అబద్ధాల్ని పట్టుకోలేకపోతోంది… పట్టుకోగలిగినా విశ్లేషణలు లేవు… సరే, కొన్ని నిజాల్లోకి వెళ్దాం.,. తన పాయింట్లు, అసలు నిజాలు…

Ads


1) గోదావరి – బనకచర్లతో జల దోపిడికి ప్రయత్నం చేసిన ఏపీ నష్టాన్ని తగ్గించడం కోసం బనకచర్ల నుంచి నల్లమల సాగర్ కు మార్చుకోవడం జరిగింది… అది బనకచర్ల అయినా నల్లమలసాగర్ అయినా జరిగేది తెలంగాణ జల దోపిడి..

  • – అవును, నిజమే, అదే కదా తెలంగాణ సమాజం, ప్రభుత్వం చెబుతోంది, అందుకెేగా సుప్రీంకోర్టులో కేసు వేసింది…

2) నల్లమలసాగర్ అక్రమ నిర్మాణానికి సూత్రధారి చంద్రబాబు, పాత్రధారి రేవంత్ రెడ్డి… కత్తి చంద్రబాబుది, అయినా పొడిచేవాడు రేవంత్ రెడ్డి…రేవంత్ రెడ్డి జల ద్రోహానికి పాల్పడుతున్నాడు… ముఖ్యమంత్రినా లేక చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లిస్తున్నడా?

  • – కత్తి చంద్రబాబుదే, కరెక్టే… కానీ గురుదక్షిణ చెల్లించేవాడే అయితే రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టులో కేసు ఎందుకు వేసినట్టు..? ఇక్కడ గురువు లేడు, శిష్యుడు లేడు… వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్లు… ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వాళ్లవి… ఇందులో జలద్రోహం ఏముంది..? రేవంత్‌రెడ్డి కూడా కేసీయార్‌లాగే తెలంగాణ ముఖ్యమంత్రి… తనకు రాజకీయంగా ఏది నష్టమో తెలియనివాడా రేవంత్‌రెడ్డి… నిజానికి జలద్రోహం చేసిందే కేసీయార్, అదీ చెప్పుకుందాం…

3) బనకచర్ల ముప్పును ముందుగా పసిగట్టి రణభేరి మోగించిందే బిఆర్ఎస్… నేను ముల్లుకర్ర కాదు, బల్లెం పెట్టి పొడిస్తే గాని ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర లేవలేదు…

  • – ఇది నిజం కాదు, ఒకవేళ నిజమే అయినా సరే, ప్రతిపక్షంగా నువ్వు నిర్వహించాల్సిన బాధ్యతే కదా… అందులో జబ్బలు చరుచుకునే పనేముంది..?

4) కేంద్రం ఢిల్లీలో ఏపీ, తెలంగాణతో మీటింగ్ పెట్టింది.. పోను పోను అనుకుంటూనే బనకచర్ల మీటింగ్‌కు ఉరికిండు… అపెక్స్ మీటింగ్‌కు కాకుండా వేరే ఏ రకమైన సమావేశానికి హాజరు కావొద్దని మేం ఆనాడు గట్టిగా హెచ్చరించినం… పోను అనుకుంటూనే పోయి కూసున్నడు… పెట్ట పెట్ట అనుకుంటనే సంతకం పెట్టిండు…

  • – ఏం సంతకం పెట్టాడు రేవంత్ రెడ్డి..? బనకచర్లకు ఆమోదం చెబుతూ పెట్టాడా..? ఎందుకీ అబద్ధం… నిపుణులు, ఉన్నతాధికారులతో ఓ కమిటీ వేద్దాం అని కేంద్రం చెబితే… అవును, ఆ కమిటీతోనే బనకచర్ల తెలంగాణకు నష్టదాయకం అని చెప్పిస్తే, పర్‌ఫెక్ట్ కౌంటర్ అవుతుంది కదా…

5) పేరుకు మాత్రమే వాళ్లు ప్రాజెక్టు ఆపుతున్నం అని ప్రకటించారు… ఆపలేదు… పోలవరం నుంచి బనకచర్లలో కలపకుండా, పోలవరం – నల్లమల సాగర్‌కు లింకు చేశారు… ఎందుకంటే… గోదావరి నీళ్లు కృష్ణా ద్వారా తరలిస్తే, గోదావరి అవార్డు ప్రకారం, 45:21:14 తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు కృష్ణాలో నీటి వాటా ఇవ్వాల్సి ఉంటుంది… తెలంగాణకు నీటి వాటా దక్కకుండా ఉండేందుకు కృష్ణాలో కలుపకుండానే, పెన్నా బేసిన్ కు గోదావరి నీటిని తరలించే పెద్ద కుట్రకు తెరతీసిండు రేవంత్ రెడ్డి…

  • – ఇది మరో వక్రబాష్యం… నల్లమలసాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లిందే రేవంత్‌రెడ్డి… పైగా ఏపీ ప్రయోజన ప్రాజెక్టు ఖర్మ రేవంత్‌రెడ్డికి దేనికి..? పైగా గోదావరి నుంచి కృష్ణాకు నీరు మళ్లించినా, పెన్నా బేసిన్‌కు మళ్లించినా అది ‘ఇంటర్ బేసిన్ ఇష్యూ’యే… లేని సూత్రీకరణలు, విధానాలు చెప్పడం అంటే తెలంగాణ జనం కళ్లకు గంతలు కట్టడమే…

6) నిజానికి పోలవరం బనకచర్ల విషయంలో కర్ణాటక, మహారాష్ట్రలు తీవ్ర అభ్యంతరాలు తెలుపుతూ లేఖలు రాసాయి…. సెప్టెంబర్ 17, 2025 నాడు కర్ణాటక ప్రభుత్వం కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది… 80, 100, 243 మొత్తంగా 423 టీఎంసీలు ఏపీ తీసుకువెళ్తే మాకు 112 టీఎంసీల నీళ్లు కృష్ణాలో ఆపుకుంటాం అని రాసింది…

మహారాష్ట్ర కూడా తను రాసిన లేఖలో అభ్యంతరాలను స్పష్టంగా చెప్పింది… అసలు ఫ్లడ్ వాటర్ మీద ముందుకు వెళ్ల కూడదు, ఒకవేళ వెళ్తే మహారాష్ట్ర వాటా చెప్పండి అని డిమాండ్ చేసింది… వరద జలాల మీద ప్రాజెక్టు కట్టేందుకు ఏపీకి అవకాశం ఇస్తే అదేవిధంగా ప్రాజెక్టులు కట్టేందుకు మేమూ డీపీఆర్లు పంపుతం అన్నారు… కృష్ణాలో 74 టీఎంసీలు మా వాటా నీళ్లు ఆపుకుంటాం.., వరద ప్రాజెక్టులు కడతాం, విదర్భకు నీళ్లు తీసుకుపోతాం అన్నారు…

కర్ణాటక 112 నీళ్లు ఆపుకుంటాం అంటుంది… మహారాష్ట్రనేమో కృష్ణాలో 74 టీఎంసీలు ఆపుకుంటాం అంటున్నది…మరో వైపు తెలంగాణకు 45 నిష్పత్తిలో వాటా దక్కుతుంది… ఈ వాటా తెలంగాణతో సహా ఏ రాష్ట్రానికి దక్కకుండా చేసేందుకు గంపగుత్తాగా నీళ్లు తరలించేందుకు పోలవరం- నల్లమలసాగర్ ప్రాజెక్టుకు భారీ స్కెచ్ వేసింది ఏపీ… ఈ ప్లాన్ కర్ణాటక, మహారాష్ట్రకు అర్థం అయ్యింది, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం అర్థం కాలేదు…

  • – మంచిదే కదా, రెండు ఎగువ రాష్ట్రాలు పోరాడితే, మనకూ మంచిదే కదా… తప్పేముంది..? పెన్నా బేసిన్‌కు గోదావరి నీళ్లు తరలిస్తే… ఎగువ రాష్ట్రాలకు వాటాలు ఇవ్వక్కర్లేదు అని ఈ మాజీ నీళ్ల మంత్రికి ఎవరు చెప్పారో..? నల్లమలసాగర్ తెలంగాణకు వ్యతిరేకమే కాబట్టి, అర్థం గాకుండానే సుప్రీంకోర్టులో కేసు వేసిందా..?

7) చంద్రబాబు సూచించిన ఆదిత్యానాథ్ దాస్‌ను రేవంత్ రెడ్డి కమిటీలో వేశాడు… తను తెలంగాణ ద్రోహి, ఏపీకి నమ్మినబంటు, అడుగడుగునా తెలంగాణ ఆకాంక్షలకు, నీటి హక్కులకు అడ్డంపడ్డ సైంధవుడు… తెలంగాణ నీళ్లు తెలంగాణకు దక్కకుండా ఎట్లా చేయవచ్చో ఆంధ్రా ప్రభుత్వానికి నేర్పించింది  ఇదే ఆదిత్యానాథ్ దాస్….

రాయలసీమ ఎత్తిపోతల పనులను ఏపీ వేగంగా పూర్తి చేసేందుకు తోడ్పాటు అందించింది ఇదే ఆదిత్యానాథ్ దాస్… చంద్రబాబు ఆదేశాలతోనే రేవంత్‌రెడ్డి ఈ ఆదిత్యానాథ్ దాసును నీటి పారుదల శాఖ సలహాదారుడిగా నియమించుకున్నాడనేది స్పష్టం… ఆదిత్యానాథ్ దాస్ చంద్రబాబుకు దాసుడు…

  • – జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే కదా ఆదిత్యనాథ్ దాస్ రాయలసీమ లిఫ్టు, పోతిరెడ్డిపాడు పనుల్ని చేయించింది… అప్పుడు కళ్లు మూసుకుని, జగన్ రెడ్డి కోసం ఉపయోగపడింది, తెలంగాణకు జలద్రోహం చేసింది కేసీయార్ కాదా..? పైగా జగన్ మనిషి హఠాత్తుగా చంద్రబాబు దాసుడు ఎలా అయ్యాడు..? ఐనా ఏపీ జలరహస్యాలు తెలిసినవాడిని మనం వాడుకుంటే మనకే మేలు కదా…

8) ఈ రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఈ డాక్యుమెంట్ కూడా లేదు. నేను విడుదల చేస్తున్నా. గోదావరి బనకచర్లకు అత్యంత కీలకమైన అనుమతి రానే వచ్చింది… ఢిల్లీ మీటింగ్ అయిన 15 రోజులకే బనకచర్లకు అనుమతి వచ్చింది… ఆ మీటింగ్‌లో నువ్వు అంగీకరించినావు గనుకనే పర్మిషన్ వచ్చింది… 5 నెలల క్రితమే సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి అనుమతి వస్తే నువ్వేం చేస్తున్నావు..?

  • – మరో అబద్ధం… ప్రి ఫీజబులిటీ రిపోర్టుకు సీడబ్ల్యూసీ వోకే అన్నాకే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లింది, తరువాత రద్దయింది… అదేమీ డీపీఆర్ కాదు, ప్రాజెక్టుకు ఆమోదం కూడా కాదు… రేవంత్ రెడ్డి ప్రయత్నాలు, కేంద్రంతో సరైన పోరాటం వల్లే బనకచర్లను కేంద్ర జలసంస్థలేవీ తిరస్కరించాయి… చంద్రబాబు పాలసీ మార్చి నల్లమలసాగర్ అనేసరికి, ఇక ఏకంగా సుప్రీం తలుపు తట్టింది రేవంత్ రెడ్డే…
  • ఐనా సెంట్రల్ వాటర్ కమిషన్ నిజంగానే బనకచర్లకు వోకే అని ఉంటే, దాన్ని చంద్రబాబు ఎందుకు రద్దు చేసుకుంటాడు..? ప్రత్యామ్నాయ నల్లమలసాగర్ ఎందుకు ఎంచుకుంటాడు..? బనకచర్ల లేదు, నల్లమలసాగర్ లేదు… తెలంగాణ ఊరుకోదు, మహారాష్ట్ర, కర్నాటక కూడా ఊరుకోవు… పోలవరం ఒరిజినల్ ప్రాజెక్టును మారిస్తే రాష్ట్ర విభజన చట్టానికి వ్యతిరేకం అవుతుంది… చంద్రబాబు ఏమీ సాధించలేడు… అది క్లియర్…

కాకపోతే పదే పదే రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు, తను చెప్పినట్టు ఆడుతున్నాడు అనే ఓ అబద్ధాన్ని, అపోహను వ్యాప్తి చేయడమే హరీష్ రావు ప్రచారంలోని మర్మం… తద్వారా చంద్రబాబు పట్ల తెలంగాణ జనవ్యతిరేకతను మరింత ఎగదోసి, రాజకీయంగా పబ్బం గడుపుకోవమే లక్ష్యం…

ఉమ్మడి పాలనలోకన్నా కేసీయార్ పాలనలోనే, తనవల్లే తెలంగాణకు ఎక్కువ జలద్రోహం జరిగిందని చివరకు కవిత కూడా చెబుతోంది… అక్షరసత్యం కూడా… కేసీయార్ చెప్పినట్టల్లా ఆడి, జగన్ ఆదేశాల మేరకు ఆడి జల్రద్రోహం చేసింది కేసీయార్, తోడుగా హరీష్ రావు… ఇక్కడ బనకచర్ల, నల్లమలసాగర్ వరకే ఈ కథనాన్ని పరిమితం చేద్దాం…

పాలమూరు- రంగారెడ్డికి అసలు ద్రోహులు ఎవరు..,? కాళేశ్వరం నష్టాలేమిటి..? తెలంగాణకు ఎక్కడెక్కడ, ఎలా అన్యాయం జరిగింది..? సుప్రీంకోర్టులో ఉన్న కేసేమిటి..? తెలంగాణ నీటివాటాల కేసులేమిటి..? పాలమూరు- రంగారెడ్డి పనులకు అడ్డంకులు ఏమిటి..? ఇవన్నీ సందర్భాన్ని బట్టి చెప్పుకుందాం…

అవునూ, ప్రస్తుత అసెంబ్లీ సెషన్ కీలక ఎజెండాయే జలహక్కులు కదా… తోలుతీస్తానన్న కేసీయార్ మళ్లీ పత్తాలేకుండా పోయాడు… ఈ అబద్దాల్ని అసెంబ్లీలో చెబితే, అది అఫిషియల్‌గా రికార్డయి, తనకు ఇబ్బంది అవుతుందనే భావనతోనే కదా హరీష్ రావు ఇదంతా మీడియా మీట్‌లో చెప్పుకొచ్చింది…!!




ఒక్కటి మాత్రం నిజం.... హరీష్, కేసీయార్ ఏవేవో కల్పించి, అబద్ధాలు ప్రచారం చేస్తుంటే... ప్రభుత్వం, పార్టీ నుంచి సరైన కౌంటర్ లేదు... అవును, రేవంత్ రెడ్డి తన ఇరిగేషన్ టీమ్‌ను మార్చుకుంటేనే బెటర్... ఈ విషయంలో మాత్రం హరీష్ రావు సూచనను రేవంత్ రెడ్డి పాటిస్తే మంచిదే... మంచిదే...



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెలంగాణ డీజీపీ భలే దాటేశాడు… నిజమే, ఇప్పుడు అప్రస్తుతం కూడా..!!
  • విజయశాంతి భారతనారి… మరో ప్రతిఘటన… ‘ఖతం సిద్ధాంత’ బోధన…
  • కీలకమైన నదీజలాల వివాదాలపై… హరీష్‌రావు అబద్దపు బాష్యాలు…
  • చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది, ఓ ఆరాటం..!!
  • అవీవా బేగ్..! ఎవరీమె..? ఎందుకు వార్తల్లో వ్యక్తి..? మరో గాంధీ..?!
  • మీరు జ్ఞానులే…. కానీ మన బ్యూరోక్రాట్లతో పోలిస్తే.., జస్ట్, చలిచీమలు…
  • ఇండియా వదిలేసి, లక్షల మంది దేశదేశాలకు వలస.., ఎందుకు..?!
  • SIR … వోట్ల ప్రక్షాళన తరువాత ఏమిటి..? ఇదీ ఓ క్లారిటీ..!
  • అసలు ఏమిటి ఈ ఉన్నావో కేసు..? ఎవరు ఆ నొటోరియస్ క్రిమినల్..?
  • వెండి, బంగారం…! ఎందుకీ పరుగు..? ఎక్కడి దాకా..? సేఫేనా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions