ఓ చిత్రమైన వార్త చదవబడ్డాను… చాలా ఆశ్చర్యపడ్డాను… ముందుగా ఆ వార్త ఏమిటంటే..? ‘‘పవన్ కల్యాణ్, రేణు దేశాయ్‌ల కొడుకు పేరు అకిరా నందన్… తను హీరో అయిపోయి, తండ్రి అడుగుజాడల్లో నడుస్తాడని పవన్ ఫ్యాన్స్ ఎన్నో కలలుకన్నారు… మెగా క్యాంపు అంటేనే హీరోల ఉత్పత్తి కేంద్రం… కానీ అకీరా హఠాత్తుగా ఓ షార్ట్ ఫిలిమ్‌కు సంగీత దర్శకత్వం వహించి విస్మయపరిచాడు… తమ హీరో కొడుకును కూడా జూనియర్ పవర్ స్టార్‌లా చూడాలనుకుంటే, ఓ మ్యూజిక్ డైరెక్టర్ కావడం ఫ్యాన్స్‌కు నిరాశ కలిగిస్తోంది…
హీరోల కొడుకులు హీరోలు అయిపోయి, వారసత్వాన్ని నిలబెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటారు… ఆ నమ్మకం, ఆ ఆనవాయితీకి భిన్నంగా అకీరా తన కెరీర్ ఎంచుకున్నాడు… బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ముప్ఫయ్ ఏళ్లొచ్చినా ఇంకా తెరపైకి రాలేదు…’’ ఇలా సాగిపోయింది ఆ కథనం… తోచిందేమిటో రాసేసి, ఫ్యాన్స్ మీదకు తోసేయడం… కాస్త వివరాల్లోకి వెళ్తే…
- హీరో కొడుకు హీరోయే కావాలని ఏముంది..? నటన తప్ప మరిక ఏ వృత్తులూ లేవా ఈ లోకంలో..?
- హీరో కొడుకు అయితే ఖచ్చితంగా ఫ్యాన్స్ కోరినట్టు వ్యవహరించాలా..? తనకు టేస్ట్, చాయిస్ లేవా..?
- భిన్నమైన రంగంలోకి వెళ్లి సదరు హీరో కొడుకు గనుక రాణిస్తే సదరు హీరో ఫ్యాన్స్ సంతోషపడరా..?
- ఎందరో ప్రముఖుల వారసులు సినిమాల్లోకి వచ్చి ఫెయిలయ్యారు, ఎందుకూ కొరగాకుండా పోయారు, అలా గాకుండా అకీరా తనకు ఇష్టమైన రంగంలో రాణిస్తే తప్పేమిటి…?
- అబ్రకదబ్ర అనగానే హీరో కొడుకు కూడా హీరోగా రాణించడు, దానికి చాలా లెక్కలుంటయ్… ఫ్యాన్స్ అనుకోగానే టాప్ స్టార్ అయిపోతాడా..?
అన్నింటికీ మించి అకీరా చిన్న పిల్లాడు కాదు… తను ఎదిగాడు… తనకు ఏం కావాలో తేల్చుకునే, ఎంచుకునే వయస్సు వచ్చింది… ప్రతిసారీ మా అన్న కొడుకు అని ఫ్యాన్స్ ఓన్ చేసుకుంటుంటే అకీరా తల్లి రేణుదేశాయ్‌కు నచ్చడం లేదు… ‘‘వీడు నా కొడుకు’’ అంటోంది స్థిరంగా… వాళ్ల బతుకుల్ని వాళ్లు నిర్దేశించుకోలేరా..?
Ads
ఆమధ్య… అంటే ఏడాది క్రితం గ్రాడ్యుయేషన్ సెరిమనీ సందర్భంగా అకీరా నందన్ పేరును అకీరా నందన్ దేశాయ్ అని ప్రదర్శించారట… కొణిదెల పేరు లేదట… అప్పట్లో వార్తల్లో చదివినట్టు గుర్తు… అంటే అకీరా కూడా తల్లి ఇంటిపేరునే ఓన్ చేసుకుంటున్నాడు… పవన్ కల్యాణ్ వారసత్వపు ఛాయలను కాదు అని అర్థం చేసుకోవాలా..? ఐనా వాళ్లిద్దరూ ఎప్పుడో విడిపోయారు… చాన్నాళ్లు సహజీవనం చేసి, తరువాత ‘ఏమని’ ఆలోచించుకున్నాడో పెళ్లి చేసుకున్నాడు… బంధం నిలుపుకోలేదు…
ఫలితంగా విడిపోయారు… ఫ్యాన్స్ ట్రోలింగులను తట్టుకుంటూ… తెలుగు రాష్ట్రాల్లో గాకుండా ఎక్కడో ఉంటోంది ఆమె… పవన్ ఫ్యాన్స్ అంటేనే ఆమెలో ఓ భయం… ఓ జలదరింపు… పవన్ కూడా ఇదేమిటని వారించలేదు… తన ఫ్యాన్సే తన బలం, తన బలగం అనుకుంటున్నాడు… ఎవరినీ తన కొడుకు జోలికి రానివ్వకూడదు కదా… ఈ స్థితిలో ఇలాంటి సైట్లు, ట్యూబర్ల స్టోరీలు మరిన్ని అనవసర భావనల్ని క్రియేట్ చేస్తుంటయ్… నిజంగానే అకీరా మంచి నాణ్యమైన, పాపులర్ సంగీత దర్శకుడు అయితే ఫ్యాన్స్‌కు ఆనందం ఉండదా..? ఏమో… ఈ సైట్లు, ఈ సోషల్, ఈ ట్యూబ్ రచయితలకు మాత్రం ఆనందం ఉండదు… ఎప్పుడు పెట్రోల్ పోద్దామా అనేదే ధ్యాస…
Share this Article