Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

header-new-unit-muchata.com
  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జూ బిజినెస్..! అంబానీ వారు ఏదయినా వ్యాపారీకరించగలరు..!!

February 22, 2021 by M S R

త్వరలో విడుదల!
అంబానీ వారి జంతు ప్రదర్శన శాల!
——————–

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సంపద విలువ ఆరు లక్షల కోట్లు. మార్కెట్ విలువను బట్టి ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు. ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో ఎప్పుడూ మొదటి పదిమందిలో ముఖేష్ ఉంటాడు. అలా ఆయన ఉన్నందుకు భారతీయులుగా మనం గర్వపడితే ఆయనేమీ అసూయపడడు. అది ఆయన కష్టార్జితం. చెమటోడ్చి సంపాదించిన ఆరు లక్షల కోట్లు. ఆయన తండ్రి ధీరూభాయ్ అంబానీ వేసిన గట్టి పునాది. ముఖేష్ కొడుకు అనంత్ తండ్రి వ్యాపార వారసత్వాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళుతున్నాడు. ఆ అబ్బాయి గుజరాత్ జామ్ నగర్ లో ప్రపంచంలోనే అతిపెద్ద జూ ప్రారంభించబోతున్నాడు అన్నది అంతర్జాతీయ వ్యాపార వర్గాల్లో ఇప్పుడు పెద్ద వార్త. జామ్ నగర్ రిలయన్స్ రిఫైనరీ సమీపంలో ఈ జూ కోసం రెండు వందల యాభై ఎకరాల స్థలాన్ని కేటాయించారు. భూగోళం నలుమూలలనుండి ఈ జూలో ఉంచడానికి అరుదయిన జంతువుల ఎంపిక పని మొదలయ్యింది. నర్మదా నది తీరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం చూసిన కళ్లు- ఇకపై ఈ జూను కూడా చూసి తీరతాయని టూరిజం రంగ నిపుణుల అంచనా. జూ సందర్శన ఉచితం కాదు అని వేరుగా చెప్పాల్సిన పనిలేదు. డబ్బులెవరికీ చెట్లకు కాయవు. అరుదయిన జంతువులు ఊరికే అసలు దొరకవు. దశాబ్దాల పారిశ్రామిక వారసత్వం ఉన్న రిలయన్స్ అనంత్ నోరులేని పశువుల మీద అనంతమయిన ప్రేమ కనబరుస్తుండడం కొందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ- ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. అదొక పర్యాటక వ్యాపార ప్రాజెక్ట్. నోరున్న మనుషులను నమ్మి వారి నెత్తిన వంద కోట్లు పెట్టుబడి పెట్టడం కంటే- నోరు లేని, చెప్పినట్లు పడి ఉండే జంతువుల మీద వంద కోట్లు పెట్టుబడి పెట్టడం ఏ రకంగా చూసినా సేఫ్. తెలివయిన వ్యాపారం. జంతువుల్లో భవిష్యత్ వ్యాపారాన్ని దర్శించిన అనంత్ అనంతమయిన దూరదృష్టిని అభినందించాలి.
——————–

zoo

సంస్కృతంలో పాశం అంటే తాడు. పాశంతో కట్టి ఉంచుతాం కాబట్టి జంతువులు పశువులు అయ్యాయి. వేదాంత పరిభాషలో మనిషి కూడా పశువే. కర్మ పాశాలు మనిషికి కూడా అడుగడుగునా చుట్టుకునే ఉంటాయి. కొన్ని పాశాలు చేతులకు, కొన్ని కాళ్లకు, కొన్ని మెడకు, కొన్ని కళ్లకు, కొన్ని మనసుకు. జంతువుకు కేవలం మెడకే తాడు. మనిషికి కనిపించని తాళ్లు ఎన్నెన్నో? మనిషివా? పశువువా? అని నిందార్థకంలో వాడుతుంటాం. గొడ్డును బాదినట్లు అని విపరీతంగా గొడ్లను బాధిస్తాం. మనిషికో మాట- గొడ్డుకో దెబ్బ అని అనవసరంగా గొడ్డును హింసిస్తాం. కుక్క చావు చాలా హీనం. కాకి గోల వినలేం. గాడిద బరువు మోయలేం. నక్క తెలివి భరించలేం. శివంగిలా మీద పడితే ఎదుర్కోలేం. పులి పంజాను తట్టుకోలేం. సింహం జూలు విదిలిస్తే నిలబడలేం. ఏనుగు చచ్చినా ఒకటే- బతికినా ఒకటే అని బతికి ఉండగానే చంపేస్తాం. పక్షిని పంజరంలో బంధిస్తాం.
——————–

పులులు, సింహాలంటే మనం భయం నటిస్తాం. నిజానికి మనిషంటేనే జంతువులకు సింహ స్వప్నం. సింహానికి మనిషి భయ స్వప్నం.
లేకపొతే వజ్రాల స్పూన్ బుగ్గన పెట్టుకుని పుట్టిన గాలికి కందిపోయే అంతటి సుకుమార అనంత్ క్రూర మృగాలను మదిలో పెట్టుకుని, ఒళ్లో పెట్టుకుని, వ్యాపారంలో పెట్టుకుని లాలించి, పాలించడమేమిటి?
——————–

భవిష్యత్తులో పారిశ్రామిక పరిభాష ఇలా ఉండవచ్చు.
నక్కను తొక్కిన పెట్టుబడి.
సింహభాగం రాబడి.
కుక్కలు చింపని లాభాల విస్తరి.
షేర్ మార్కెట్ చిలుక పలుకులు.
లాభాల కోయిల పాటలు.
విమర్శకుల కుక్కమూతి పిందెలు.
విదేశీ వలస పెట్టుబడి పక్షులు.
స్వదేశీ పిడకలు.
పారిశ్రామిక నాగస్వరానికి పడగవిప్పిన పాములు.
పులి చంపని లేడి పరుగు.
పారిశ్రామికవాడల్లో జూలు.
జూల్లో కార్మికులు.
కార్మికులుగా జంతువులు.
కార్మికుల పొట్టగొట్టిన జంతువులు.
జంతువులకు కనీస వేతనాలు చెల్లించాలని కార్మికుల సంఘీభావ ప్రదర్శనలు. టికెట్టు పెట్టి కొని జూలో చూసింది జంతువులను అని మనం అనుకుంటాం. కలవారికి ఈ ప్రపంచమే ఒక జంతు ప్రదర్శన శాల! …….. By…. -పమిడికాల్వ మధుసూదన్

Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • రెడ్ వాల్..! కణకణ మండిన ఆ రోజుల్లోకి… వేలాది మంది జ్ఞాపకాల్లోకి…
  • అక్షర..! సర్కారీ విద్యలాగే… లైన్ తప్పి, వెగటు కామెడీలో గింగరాలు..!!
  • మామాఅల్లుళ్లకు అవమానమే..! ఐతేనేం, తమ్ముళ్లకు నమ్మకం పోతోంది మరి..!!
  • బిరుదు కావాలా నాయనా..? మన మార్కెట్‌లో చౌక సరుకే ఇది…!!
  • డర్టీ కాంట్రవర్సీ..! అమెరికన్లకు చైనా గుదపరీక్షలు..! ఓ పంచాయితీ..!!
  • హిమ స్వర్ణం..! ఇండియన్ సోషల్ మీడియా సంబరం… చాలా అరుదు..!
  • సోప్ వేసిన సోప్ ప్రకటన..! తెల్లటి మాయకు తెలివైన ప్రయాస..!!
  • చెక్ నితిన్..! ఎంత ఏలేటి అయితేనేం… కమర్షియల్ లెక్కల్లో బోల్తా…!!
  • వజ్రాన్ని నేను…! నీరవ్ మోడీ అంతరాత్మ బహిరంగ లేఖ..!
  • ఇంట్రస్టింగు తీర్పు…! మహిళ పుట్టింటివారికీ ఆస్తిలో వారసత్వహక్కు..!!!

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now