దుకాణంలో నిరోధ్ అమ్మితే తీసుకెళ్లి జైలులో పడేస్తారా..? ఇంట్లో తనిఖీలు చేసినప్పుడు గర్భనిరోధక మాత్రలు గనుక దొరికితే వెంటనే అరెస్టు చేస్తారా..? కాపర్-టీ బిగింపులపై నిషేధం విధిస్తారా..? అవేకాదు, స్వలింగ సంపర్కం, స్వలింగ వివాహాన్ని కూడా రద్దు చేసిపారేస్తారా..? ఆ సూచనలే కనిపిస్తున్నాయి… అమెరికా మహిళల అబార్షన్ల హక్కు రక్షణను కొట్టిపారేసిన తిరోగామి తీర్పు చదివాం కదా… ఆ తీర్పు వెలువరించిన న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ క్లారెన్స్ థామస్ తన తోటి న్యాయమూర్తులకు ఓ అప్పీల్ చేశాడు… ‘‘స్వలింగ వివాహాలు, స్వలింగ సంపర్కాలు, గర్భనిరోధకాల వాడకం మీద కూడా హైకోర్టులు జారీచేసిన రక్షణ తీర్పుల్ని కూడా రద్దు చేద్దాం…’’
హక్కుల విషయంలో ప్రపంచానికే వేగుచుక్కగా చెప్పుకునే అమెరికాది నిజానికి మహిళల హక్కుల విషయంలో ఎప్పుడూ వెనుకబాటే… చివరకు మహిళల్ని సమానంగా చూస్తూ వోటు హక్కు కల్పించింది కూడా 1920లో… ప్రపంచం మొత్తానికి నీతులు చెప్పే అమెరికా బుర్రలో ఈ డొల్లతనమే అధికం… ప్రస్తుతం ఆధునిక కాలం వైపు తన ప్రస్థానాన్ని పూర్తిగా ఆపేసి, ఆ పాత రాతియుగం వైపు రిటర్న్ జర్నీలో ఉన్నట్టుగా ఉంది అది… ఆ దేశ సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పు ఓ ప్రబల ఉదాహరణ…
గర్భవిచ్చిత్తి విషయానికే వద్దాం… యాభై ఏళ్ల క్రితమే అబార్షన్ చట్టబద్ధం చేసుకున్నారు అమెరికన్లు… గుడ్… అత్యాచారం వల్ల వచ్చిన గర్భాన్ని తొలగించుకోవాలని అనుకుంటే… తను అనారోగ్యంగా ఉండి, ప్రస్తుతం గర్భాన్ని కంటిన్యూ చేయలేక వదిలించుకోవాలని అనుకుంటే… కడుపులో పిండం, శిశువు ఆరోగ్యస్థితి బాగా లేకపోతే, తల్లి వద్దని అనుకుంటే… అవాంఛిత గర్భాల్ని వద్దనుకునే హక్కు మహిళలకు ఉండేది… ఇప్పుడు దాన్ని రాష్ట్రాల ఇష్టానికి వదిలేసింది… దాదాపు సగం రాష్ట్రాలు ఇప్పుడు అబార్షన్లను నిషేధించే స్థితిలో ఉన్నాయి… ఇందులోనూ మళ్లీ రాజకీయాలు… ఒబామా, జో బైడెన్ సుప్రీం తీర్పును వ్యతిరేకించారు… ట్రంప్ సమర్థించాడు… సుప్రీం తీర్పు వీటో చేయడం సాధ్యమేనా..? ఇది వేరే చర్చ…
Ads
పక్కాగా ఇది తిరోగమనం… ఎప్పుడూ ఇలాంటి విషయాల్లో అమెరికాను చూసి వాతలు పెట్టుకునే దేశాలు గనుక ఇదే అనుసరిస్తే… మహిళలకు మరింత ప్రమాదకరం… ఇదేకాదు… ఆ న్యాయమూర్తుల ధోరణి చూస్తుంటే… చివరకు గర్భనిరోధకాల వాడకం కూడా నేరమైపోయేటట్టుంది… నవ్వాలో ఏడవాలో తెలియని దురవస్థ… నిజానికి మతఛాందసంలో పడి కొట్టుమిట్టాడే దేశాలే క్రమేపీ ఇలాంటి విషయాల్లో సంప్రదాయ పోకడల నుంచి క్రమేపీ బయటపడుతున్నాయి… మరి అమెరికా ఎందుకిలా..? తెలివి ఎక్కువైపోయి, వికటిస్తోందా..?!
Share this Article