గబ్బర్ సింగ్ అనే తెలుగు సినిమాలో విలన్ ఇంటికే వచ్చి బ్రహ్మానందం తొడ గొడతాడు. ఏందిరా నీబలం అని తనికెళ్ల భరణి అడిగితే.. వెనుకాల రిక్షాలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ కటౌట్ ఒకటి వచ్చే సీన్ ఉంటుంది.. గుర్తొచ్చిందిగా..?
అయితే, ఆ ధైర్యం వెనుక ఆ కటౌట్ ను చూపించిన ఆ సీన్ సినిమాలోదైతే… అలాంటి ఓ నిజమైన సీన్ ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, క్రైమ్ రిపోర్టర్ హుస్సేన్ జైదీకి నిజజీవితంలో అనుభవంలోకొచ్చిందట. సినిమాలో బ్రహ్మానందం వెనుక పీకే కటౌట్ నిల్చినట్టు.. అప్పుడా జర్నలిస్టును ఆదుకున్నదెవరో ఓసారి చదివేద్దాం పదండి.
సద్దాం హుస్సేన్ అంతం తర్వాత ఓసారి హుస్సేన్ జైదీ అనే పాత్రికేయుడు ఇరాక్ రాజధాని బాగ్ధాద్ ను సందర్శించాడు. ఆ సమయంలో హుస్సేన్ ను కొందరు మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. కళ్లకు గంతలు కట్టి ఎక్కడో తెలియని ఓ కొత్త ప్రదేశానికి తీసుకెళ్లారట.
Ads
కళ్ల గంతలు విప్పితే… మన రాంగోపాల్ వర్మ సినిమా తరహాలో చుట్టూ ఎటు చూసినా గడ్డాలతో ఉన్న మనుషులతో భయంకరమైన వాతావరణ కనిపించిందట. కానీ, ఒకే ఒక్క వ్యక్తి మాత్రం క్లీన్ షేవ్ తో… వెనుక పెద్ద పెద్ద జులపాలతో 90ల కాలంలోని బాలీవుడ్ హీరోను తలపించేలా కనిపించాడట. ఈ విషయాల్ని హుస్సేన్ 2015లో హిందుస్థాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
కట్ చేస్తే… ఆ బాలీవుడ్ హీరోను పోలిన క్లీన్ షేవర్… హుస్సేన్ దగ్గరకు వచ్చి… నీది పాకిస్థానా అడిగాడట. దానికి, హుస్సేన్ నాది ఇండియా.. నేను హిందీలో మాట్లాడగలనంటూ సమాధానమిచ్చాడట ఆ మిలిటెంట్ కు… కానీ, తానేమో అరబిక్ మాట్లాడటంతో.. తనకు భాష అర్థంకాని పరిస్థితిలో ఒకవైపు ఒకింత ఆందోళన, మరింత భయం రెండూ ఆవహించాయి హుస్సేన్ కు.
అప్పుడతను మీకు అమీషా బక్కన్ తెలుసా అని అడుగుతున్న దాంట్లో అమీషా బక్కన్ మాత్రమే అర్థమవుతోంది.. కానీ, మిగిలిన అరబిక్ భాష మాత్రం అర్థం కాని పరిస్థితి. దాంతో అప్పటికే అమీషా పటేలేమోనన్న భావనతో… నాకు అమీషా పటేల్ మాత్రమే తెలుసుగానీ.. అమీషా బక్కన్ తెలియదన్నాడట హుస్సేన్. దాంతో ఆ మిలిటెంట్ కు చిర్రెత్తుకొచ్చిందట.. ఇండియా అంటున్నావ్… అమీషా బక్కన్ తెలియదా అంటూ కాస్త గట్టిగా లొల్లి పెట్టాడట.
అదే చిరాకుతో లోపలికెళ్లిన మిలిటెంట్.. 1982లో విడుదలైన రమేష్ సిప్పీ తీసిన శక్తి సినిమాలోని పేపర్ లో వచ్చిన ఓ స్టిల్ ను తీసుకుని వచ్చాడట. అప్పుడుగానీ.. ఇరాక్ లో భయంకరమైన మిలిటెంట్ల చేతుల్లో కిడ్నాప్ కు గురై ఆందోళనలో ఉన్న హుస్సేన్ కు బల్బ్ వెలిగిందట.
వెంటనే ఎస్, నాకు ఈ వ్యక్తి తెలుసు.. అమితాబ్ బచ్చన్ నాకు మంచి స్నేహితుడని చెప్పాను. దాంతో ఆ మిలిటెంట్ ఓ తెల్ల కాగితం మీద తానెప్పుడైనా ముంబై వస్తే.. అమితాబ్ బచ్చన్ ను కలిపిస్తానని ప్రామిస్ చేయమని… ఓ ప్రామిసరీ నోట్ రాయించి… వదిలిపెట్టాడట.
అదిగో అలా అమితాబ్.. హుస్సేన్ జైదీ అనే అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ప్రాణాలను కాపాడే విషయంలో పరోక్షంగా తనకుపయోగపడ్డాడు. వినడానికి ఓ పిట్టకథను తలపించినా.. ఈ నిజమైన కథను తానే ఓసారి పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది.
హుస్సేనీ జైదీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగానే కాకుండా… రచయితగా కూడా సుపరిచితుడు. ది ఏసియన్ ఏజ్, ది ఇండియన్ ఎక్స్ ప్రెస్, మిడ్ డే, ముంబై మిర్రర్ వంటి పత్రికల్లో సయ్యద్ హుస్సేన్ జైదీ రాసిన క్రైమ్ స్టోరీస్, ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ ఆయన కెరీర్ లో మైల్ స్టోన్స్ గా మిగిలాయి. అలాగే, డోంగ్రీ టూ దుబాయ్- సిక్స్ డికేడ్స్ ఆఫ్ ది ముంబై మాఫియా, మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై, బ్లాక్ ఫ్రైడే, ముంబై అవేంజర్స్, మై నేమ్ ఈజ్ అబూసలేం వంటి బుక్స్ రాశాడు.
ముఖ్యంగా ఇతని రచనలన్నీ ముంబైలోని అండర్ వరల్డ్ బేస్డ్ గా సాగాయి. టెర్రర్ ఇన్ ముంబై వంటి HBOలో వచ్చిన డాక్యుమెంటరీకి జైదీ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించాడు. జైదీ ముంబై అవేంజర్స్ ను బేస్ చేసుకునే కబీర్ ఖాన్.. ఫాంటమ్ సినిమా రూపొందించాడు.
ఇలా పలు సినిమా ప్రొడక్షన్ హౌజెస్ తోనూ.. బాలీవుడ్ ప్రముఖులతోనూ మంచి సంబంధాలున్న సయ్యద్ హుస్సేన్ జైదీ ప్రాణాలతో బయటపడటానికి మాత్రం అదే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ పరోక్షంగా ఉపయోగపడటం ఆయన జీవితంలో ఓ మరపురాని జ్ఞాపకమైపోయింది….. (రమణ కొంటికర్ల)
Share this Article