Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నీలిపూల నిద్రగన్నేరు చెట్టు… పరోమా! ఉదాత్తమైన అక్రమ ప్రేమ స్టోరీ…

October 24, 2023 by M S R

అది ఆడదా? గాడిదా? ఏం తక్కువయిందని? బంగారం లాంటి మొగుడు. ముత్యాల్లాంటి పిల్లలు. కనిపెట్టుకుని వుండే అత్తగారు. కార్లు, నౌకర్లు, చాకర్లు… ఏ లోటూ లేని సుఖమైన, సౌకర్యవంతమైన జీవితం. 40 ఏళ్ల వయసులో ఈ ముండకి మరొకడు కావాల్సి వచ్చిందా? పోయేకాలం కాకపోతే!

సంప్రదాయ సమాజం తేలిగ్గా అనే మాట ఇది.

ఈ నిశ్చితాభిప్రాయం మీద తిరుగుబాటే ‘పరోమా’ సినిమా. One of the finest Directors of India అపర్ణాసేన్, భారతీయ సంప్రదాయం మీద చేసిన మెరుపు దాడి. 1985లో రిలీజయింది ‘పరోమా’.

Ads

ఆ ఏడాది జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకుంది.

* * *

కలకత్తా మహా నగరంలో ఒక ఎగువ మధ్య తరగతి కుటుంబం. వ్యాపారం, డబ్బు సంపాదనతో భర్త బిజీబిజీ. స్కూళ్ళకి వెళ్లొచ్చే పిల్లలు. పెద్దవయస్సు అత్తగారు. వచ్చిపోయే బంధుమిత్రులు.

ఇక ఈ సంసారాన్ని చక్కబెట్టే బాధ్యత అంతా

ఒక్క పరోమాదే. హీరోయిన్ పేరు పరోమా. Protagonist, సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ రాఖీ గుల్జార్. అందమైన, బాధ్యతాయుతమైన సంప్రదాయ బెంగాలీ గృహిణి. కూరలు వండటం, పిల్లల్ని రెడీ చేయడం, డ్రైవర్ కి జీతం ఇవ్వడం, ఏ కారు ఎవరు వేసుకెళ్లాలో చెప్పడం, భర్తకి అటెండ్ కావడం,

చాకలి పద్దు రాయడం… అదొక రోజువారీ

మెకానికల్ రొటీన్. ఇంటికి దీపం లాంటి ఇల్లాలు అంతకంటే ఏం చేస్తుంది? కుటుంబ గౌరవం అన్నా, సంసార బాధ్యత అన్నా అదేగా!

ఎప్పటిలాగానే ఒక రాత్రి. బెడ్ రూమ్ సన్నివేశం. తెల్లని స్లీవ్ లెస్ శాటిన్ పెటీకోట్ లో మెరిసిపోతున్న రాఖీ, భర్త పక్కన పడుకుంటుంది. నిద్రపోతున్నావా? అంటాడు. “ఊహు, లేదు” అంటుంది. ఆమె దగ్గరికి జరుగుతూ, ఆ జపాన్ కాంట్రాక్టు మనకే వస్తుంది, తెలుసా? అంటాడు. మనకి చాలా డబ్బు రాబోతోంది అని చెప్పడం అతని ఉద్దేశం.

భార్యని కావలించుకుని సంభోగం చేస్తుంటాడు.

అలా అయితే, మనం బెంగుళూరులో ఇల్లు కొనుక్కోవచ్చుగా అంటుంది. అదెంత భాగ్యం? తప్పకుండా కొందాం అంటాడు. బాగా అలవాటైన రొటీన్ సంభోగం. భార్యకి తన్మయత్వం మాట అటుంచి, అసలు ఎలాంటి ఫీలింగూ వుండదు. ఈ పని అయిపోతే హాయిగా నిద్రపోవచ్చు అన్నట్టు వుంటుంది ఇద్దరికీ! ఎలాంటి ఉద్వేగానికీ తావులేని యాంత్రికమైన శృంగారం అది! తెల్లవారితే, స్కూల్ కి రెడీ అయ్యే పిల్లలూ, బ్రేక్ ఫాస్ట్.. కాఫీ.. అత్త గారికి అటెండ్ కావడం… ఇలా చాలా మామూలు… రెగ్యులర్ జీవితం. ఈ సంభోగం సీను సినిమాకి ఆయువుపట్టు.

పరోమా అంటే క్రమశిక్షణ. హుందాగా, పద్ధతిగా, చీరలో నిండుగా, పదహారణాల సంప్రదాయానికి ప్రతీక పరోమా. ఇంటి పనులన్నీ ఇష్టంగా చేస్తుంది. ఈ రొటీన్ – విసుగనీ, చిరాకనీ, దరిద్రం అనీ ఎప్పుడూ అనుకోదు.

* * *

శరన్నవరాత్రులు జరుగుతుంటాయి, దుర్గాదేవి, బంతిపూల అలంకరణ, దీపాలు, కలకత్తా అంతటా దసరా వైభవం. పరోమా భర్తకి బంధువైన ఒక యువకుడికి ఫోన్ వస్తుంది – ఒక ఫోటోగ్రాఫర్ నుంచి. అతను అమెరికాలో ఉంటాడు. ప్రపంచమంతా తెలిసిన ప్రసిద్ధ ‘లైఫ్’ మేగజైన్ ఫోటోగ్రాఫర్. బెంగాలీ బాబే. ‘సంప్రదాయ భారతీయ అందగత్తె’ అనే అసైన్మెంట్ కోసం పరోమాని ఫోటోలు తీయాలి.

ఆమె అనుమతి కావాలని ఆ ఫోన్.

ఫోటోగ్రాఫర్ మన రాహులేగా అని భర్త, అత్త అంతా ఓకే చేస్తారు. నేనే ఎందుకు? నా ఫోటోలు దేనికి?

అని పరోమ సంశయిస్తుంది. ఇబ్బంది పడుతుంది. చివరికి ఒప్పుకుంటుంది.

మర్నాడు పొద్దున్నే వచ్చేస్తాడు ఫోటోగ్రాఫర్ రాహుల్ రాయ్ (నటుడు ముకుల్ శర్మ). చాకలికి బట్టలు వేస్తూ ఉంటుంది పరోమా. పక్కా ప్రొఫెషనల్ అయిన రాహుల్, కెమెరా ఫిక్స్ చేసి, లైటింగ్ ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు. పరోమానీ, పరిసరాల్నీ అస్సలు పట్టించుకోడు. “అదేంటి నేనింకా తయారవ్వలేదు. ఎలా?” అంటుంది ఇబ్బందిగా. “ఏమీ అవసరం లేదు. ఇలా మీరు అందంగా ఉన్నారు. కొంచెం పక్కకు తిరిగి కూర్చోండి చాలు” అంటాడు. చకచకా ఫోటోలు తీస్తాడు.

మర్నాడు మళ్ళీ ఇంకో ఫోటో సెషన్.

‘మీ పాదాలకు ఎర్ర రంగు ఉండాలిగా, లేదేం?” అని అడుగుతాడు. అదా, పారాణి. ఉందేమో చూస్తాను, అని వెళ్లి, ఎర్ర రంగు పట్టుకొస్తుంది. “నా పాదాలకి నేనే రంగు వేసుకోవడం కష్టంగా ఉంది” అంటుంది. “ఏం పరవాలేదు. నేనే వేస్తాను” అంటూ చటుక్కున వచ్చి కింద కూర్చుని, ఆమె పాదాన్ని చేతుల్లోకి తీసుకుంటాడు. ఆశ్చర్యంతో, విప్పారిన కళ్ళతో చూస్తుంది పరోమా. ఆ గొప్పింటి ఇల్లాలిని పరాయి వాడు తాకడమా? ఎంత అపచారం. స్కూల్ నించి పిల్లలు తలుపు తోసుకుంటూ లోపలికి వస్తారు. “పిల్లలు వస్తున్నారు” అంటుంది సంకోచిస్తూ… రాహుల్ ఆమె పాదం వదిలేస్తాడు.

ఇంతకీ కాంట్రాక్టు పని మీద పరోమా భర్త బొంబాయి వెళ్తాడు. మరో ఫోటో సెషన్: ఇంట్లో ఓ చోట సితార్ ఉంటుంది. “ఒకప్పుడు సితార్ వాయించేదాన్ని” అని చెబుతుంది. సితార్ తో పరోమా ఫోటోలు తీస్తాడు. ‘Beautiful, మీరు Devastatingగా వున్నారు” అంటాడు. ఆమె పట్టించుకోనట్టుగా మౌనంగా ఉండిపోతుంది.

ఈసారి ఫోటోల కోసం బయటికి వెళదాం అంటాడు. అతి కష్టమ్మీద ఒప్పుకుంటుంది. మనందరికీ తెలిసిన కుర్రాడేగా, వెళ్ళమ్మా.. అంటుంది అత్త. కలకత్తాలో ఒక విశాలమైన భవంతి. పైన, టెర్రస్ మీద ఫోటోలు తీస్తాడు. అక్కడ రాఖీ జాగ్రత్తగా రెయిలింగ్ దాటుతున్నపుడు రాహుల్ చెయ్యి అందిస్తాడు. ఎప్పుడూ ఇంట్లోనే, గోడల మధ్యే ఉండే పరోమాకి

ఆ outing పెద్ద రిలీఫ్. ఎంజాయ్ చేస్తుంది.

రాఖీ ముఖం సంతోషంతో వెలిగిపోతుంది.

మర్నాడు… వాళ్ళ తాత, తండ్రి బతికిన ఒక పాడుబడిన, పురాతనమైన పెద్ద ఇంటికి రాహుల్ ని తీసుకెళుతుంది. ఒక తలుపు తీయగానే, చటుక్కున ఓ పావురం ఎగిరిపోతుంది. భయపడి, ఆమె అతన్ని పట్టుకుంటుంది. కొన్ని క్షణాలు అతని హృదయానికి దగ్గరగా… భుజమ్మీద అతని చేతులు విడిపించుకుని వెనక్కి జరుగుతుంది. ఇబ్బంది పడుతుంది. అయితే, ఆ క్షణికమైన యాక్సిడెంట్, లోపల… ఆమెకి నచ్చుతుందని మనకి తెలుస్తుంది. ఆ పాత ఇంటిలో తన బాల్యం, చదువు, సితార్ నేర్పే పెద్దాయన ఇంటికి రావడం, పెంచిన పూల మొక్కల గురించి ఒక కవిత చెబుతుంది పరోమా. కవిత్వం రాస్తారా? అని అడుగుతాడు. అది ఒక బెంగాలీ కవి రాసిందని చెబుతుంది. ఆ సీను పిక్చరైజేషన్, సంగీతం… చూసి, విని తరించాలి! ఫోటో సెషన్ అయిపోతుంది. అతను వెళిపోతాడు. ఈజీగా, రెక్లెస్ గా, సిగరెట్లు కాలుస్తూ వుండే అతనూ, ఈ సనాతన భారతీయ సౌందర్యరాశీ మానసికంగా చేరువ అవుతారు.

పరోమా నిదురపోతున్న రంగుల పూలతోట.

లోపలికి వస్తాడు అతను, ఒక పాటలాగ.

మర్నాడు ఫోన్ చేస్తాడు. మీ హ్యాండ్ బ్యాగ్ లో

నా కెమెరా లెన్స్ ఉండిపోయాయి అంటాడు.

తన మిత్రురాలి ఇంటికి రమ్మంటుంది పరోమా.

అందమైన చీరలో షోగ్గా వెళుతుంది.

అతను ఎప్పట్లానే, గబగబా వచ్చి లెన్స్ తీసుకుని, వెళతానని బై చెప్పి, వెనక్కి తిరిగి కొన్ని

అడుగులు వేస్తాడు.

అతనింక ఎప్పటికీ కనిపించడా?

కంపించిపోతుంది పరోమా.

ఆ బాధ ఆమె కళ్ళలో నీళ్లయి కరుగుతుంది.

వెనక్కి తిరిగి ఏడుస్తున్న పరోమాని చూస్తాడు.

వచ్చి పరోమాని కావలించుకుంటాడు.

ముద్దు పెట్టుకుంటాడు. కోరిక చెలరేగుతుంది.

ప్రేమ తుఫానై వీస్తుంది.

నిర్మలమైన గంగానదిలా వుండే పరోమా కల్లోల సముద్రమై, అతనికి తనని అర్పించుకుంటుంది.

పరొమాని ఒక కొత్త జీవితం, కోటి చేతులు సాచి పిలుస్తుంది. కళ్ళుచెదిరే డిజైనర్ శారీ కట్టుకోవడం, పెర్ఫ్యూమ్ వేసుకోవడం, కాంతులీనుతున్న అందాన్ని అద్దంలో చూసుకుని, రాహుల్ దగ్గరికి వెళిపోవడం… అదీ ఆమె దినచర్య.

ఒక మోహావేశంతో అతన్ని పెనవేసుకోవడం, సుఖపారవశ్యంలో తేలియాడడం, జీవనానందాన్ని అనుభవించి సేదతీరడం!

రాహుల్ తో పాటు సితార్, సంగీతం మళ్లీ

ఆమె దేహాన్ని తాకుతాయి.

ఆ నిద్రగన్నేరు చెట్టు కొత్త పూలు పూస్తుంది.

* * *

రాహుల్ వార్ ఫోటోగ్రఫీ స్పెషలిస్ట్.

గ్రీస్ లో యుద్ధం. అర్జెంటుగా వెళ్లాలి అతను.

“మళ్లీ వస్తాను, నిన్ను అమెరికా తీసుకెళ్లిపోతాను” అని చెప్పి, పరోమా చిన్నతనంలో ఇష్టపడ్డానని చెప్పిన ఒక అరుదైన మొక్కని బహుమతిగా ఇస్తాడు. కుండీలో ఉన్న ఆ మొక్కను చూస్తూ రోజువారి పనులేమీ పట్టించుకోకుండా pensive గా, పరధ్యానంగా వుండిపోతుంది పరోమా.

కొన్నిరోజుల తర్వాత… ‘ఇండియన్ ట్రెడిషనల్ బ్యూటీ’ అనే శీర్షికతో ‘లైఫ్’లో పరోమా ఫోటో ఫీచర్ వస్తుంది. ఆ మేగజైన్ని ఆమె అడ్రస్ కి పోస్ట్ చేస్తారు. ఇంట్లోకి వెళుతున్న ఆమె భర్త పోస్ట్ బాక్స్ లో ‘లైఫ్’ని చూస్తాడు. ఒక ఫోటో దగ్గర షాక్ తో ఆగిపోతాడు. బాత్రూంలో అర్ధనగ్నంగా వున్న పరోమా ఫుల్ పేజీ ఫోటో మీద.. Remember ? love, Rahul’ అని పెద్ద అక్షరాలు ఉంటాయి. భర్త, పరోమాకి ఆ ఫోటో చూపించి “ఇదా నువ్వు చేసిన నిర్వాకం” అంటాడు. నివ్వెరపోతుంది.

“ఇంట్లో నువ్విక ఏ పనీ చేయనక్కరలేదు.

ఒక లం- నా పిల్లల్ని పెంచడానికి వీల్లేదు”

అంటాడు. దుఃఖంతో, కన్నీళ్ళతో, దోషిగా మిగిలిపోతుంది, ఒంటరిగా!

బాత్రూంలోకెళ్లి ముంజేతిని బ్లేడుతో కోసేసుకుని, కింద పడిపోతుంది. గబగబా ఆసుపత్రిలో చేరుస్తారు. బతుకుతుంది.

తలకి దెబ్బ తగలడంతో జుట్టంతా కత్తిరించేస్తారు. తెల్లటి ఆసుపత్రి గౌనులో, అయోమయంగా చూస్తూ, పిచ్చిదానిలా వుంటుంది పరోమా.

కుటుంబ సభ్యులంతా వుండగా, అపరాధ భావం తొలగిపోవడానికి ఆమెకి మానసిక చికిత్స చేయాల్సిన అవసరం వుంది అంటాడు డాక్టర్. చుట్టూ వున్న అందర్నీ చూస్తూ, పరోమా clear గా, firm గా ఒక మాట అంటుంది:

“నేనే తప్పూ చేయలేదు”

రాహుల్ యిచ్చిన కుండీలో మొక్కని తెచ్చి పరోమా పక్కన కిటికీలో పెడుతుందో స్నేహితురాలు.

దాన్ని ఇష్టంగా, ప్రేమగా చూస్తూ, గుర్తుపట్టి, “కృష్ణపల్లవి” అంటుంది (అది ఆ మొక్క అసలు పేరు) చిరునవ్వుతో…అంటే ఆమె పూర్తిగా

నార్మల్ గా వుందన్న మాట …

సినిమా అయిపోతుంది.

స్త్రీ స్వేచ్చని సెలబ్రేట్ చేస్తూ, తలెత్తుకుని ధైర్యంగా బతకమని ఆడవాళ్ళకి గొప్ప సాహసంతో చెప్పిన

ఈ సినిమా వచ్చి, ఇప్పటికి 39 సంవత్సరాలైంది!

* * *

1945 అక్టోబర్ 25న అపర్ణా సేన్ కలకత్తాలో పుట్టింది. ఉత్తమ దర్శకురాలిగా జాతీయ,

ప్రాంతీయ అవార్డులెన్నో అందుకుంది. 60-70 దశకంలో బెంగాల్ లో ఆమె స్టార్ హీరోయిన్.

36 చౌరంగీ లేన్, మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్, ఉనిషే ఏప్రిల్, పరోమా …అపర్ణా సేన్ తీసిన అద్భుతమైన సినిమాలని విమర్శకులు మెచ్చుకున్నారు.

ఎలా? అలా ఎలా జరిగింది?

పరోమా కథ అపర్ణా సేన్ రాసుకున్నదే.

దర్శకురాలూ ఆమే. అయితే పరోమా వచ్చిన

పది సంవత్సరాల తర్వాత హాలీవుడ్ సినిమా Bridges of Madison country రిలీజయింది.

కథ ఒకటే. అమెరికాలో అది నిజంగా జరిగిన కథ. రెండు సినిమాల్లోనూ పిల్లలున్న గృహిణి ప్రియుడు అంతర్జాతీయ ఖ్యాతి వున్న ఫోటోగ్రాఫర్ కావడం ఆశ్చర్యం!

Is it a sheer accident?

తలవని తలంపుగా, కథాచిత్తుగా అంటాం కదా,

అలా ఎలా జరిగిందో మరి!?

పరోమాలో రాఖీ చెప్పనలవికానంత అందంగా వుంటుంది. ఆ మెరిసే బుగ్గలతో, చేరడేసి కళ్ళతో మనల్ని చంపేస్తుంది. పైగా స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ తో రాఖీ ప్రేక్షకుల్ని మూగవాళ్ళని చేస్తుంది.

ప్రతి చిన్న డీటెయిల్ పట్ల శ్రద్ధ, భావోద్వేగం నిండిన సంఘటనల్ని పేర్చిన తీరూ, కళాత్మకంగా తెరమీద పండించిన నేర్పూ మనల్ని ఎప్పటికీ వెన్నాడతాయి…. జీనియస్ అపర్ణా సేన్ కి జన్మదిన శుభాకాంక్షలు.. – TAADI PRAKASH    97045 41559

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions