Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఖర్చెక్కువైనా సరే, లాయర్ ఎంత సమర్థుడైనా… కోరిన న్యాయం దక్కాలనేమీ లేదు…

September 10, 2023 by M S R

Nancharaiah Merugumala…….   మన గొప్ప తెలుగోళ్లందరికీ ఉత్తరాది (పంజాబీ, పార్సీ, సింధీ) లాయర్లే దిక్కు… అయినా, దక్షిణాదికి ఏదో హిందీవాళ్లు అన్యాయం చేస్తున్నట్టు మనోళ్ల ఏడుపు… చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో బెయిలిప్పించడానికి దిల్లీ పంజాబీ వకీలు లూథ్రా…

………………………………………………………………………………………………………

దక్షిణాది రాష్ట్రాలకు ఏదో అన్యాయం జరిగిపోతోందని, సదువు, సంపదా లేని ఉత్తరాదోళ్లు మన ఐదు ప్రాంతాల జనాన్ని తొక్కి నారతీస్తున్నారని మనం తరచు తెగ బాధపడిపోతుంటాం. కొన్ని రంగాల్లో తమిళులు, మలయాళీలు, కన్నడిగులు, తెలుగోళ్లూ ముందున్న మాట నిజమే. కాని, సుప్రీంకోర్టులోగాని, మన తెలుగు హైకోర్టుల్లోగాని గట్టిగా వాదించి మన దక్షిణాది బలిసినోళ్లను కేసుల్లో గెలిపించే సత్తా ఉన్న ఒక్క తెలుగు వకీలూ ఇప్పటి దాకా లేరనే చెప్పాలి.

Ads

ఇంకా చెప్పాలంటే, కె.పరాశరన్, జస్టిస్‌ వీఆర్‌ కృష్ణయ్యర్‌ వంటి తమిళులు, కేకే వేణుగోపాల్‌ వంటి కన్నడిగులు ఈ రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు గాని వారి స్థాయిని వారి మోకాళ్ల వరకైనా అందుకునే తెలుగు వారే లేకపోవడం దురదృష్టం. సుప్రీంకోర్టులో గట్టి వకీళ్లుగా పేరున్నవారిలో పార్సీలేగాక పంజాబీలు (ప్రధానంగా ఖత్రీలైనహిందువులు), సింధీలు కూడా ఉన్నారు. అందుకే వీవీఐపీలైన తెలుగు ప్రముఖులను న్యాయస్థానాల్లో రక్షించడానికి గతంలో ఈ ఉత్తరాది దిల్లీ లాయర్లే హైదరాబాద్‌ రావాల్సి వచ్చింది.

1984లో రామోజీరావును అరెస్టు నుంచి కాపాడిన పార్సీ వకీలు ఎఫ్‌.ఎస్‌.నారిమన్‌

2006లో మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ కేసులో గుజరాతీ దిల్లీ లాయర్‌ అనిల్‌ దీవాన్‌

………………………………………………………

1984లో నాటి ఏపీ శాసనమండలిపై ‘పెద్దల సభలో గలభా’ అనే శీర్షికతో వార్త రాసినందుకు ఈనాడు గ్రూపు సంస్థల యజమాని చెరుకూరి రామోజీరావు గారు నాటి హైదరాబాద్‌ సిటీ పోలిస్‌ కమిషనర్‌ కే.విజయరామారావు చేతిలో అరెస్టు కాకుండా దిల్లీ లాయర్‌ ఎఫ్‌ఎస్‌ నారిమన్‌ అత్యున్నత న్యాయస్థానంలో గట్టిగా వాదించి కాపాడారు. అలాగే, 2006లో నాటి రాజమండ్రి నియోగి ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ గారు బయటకు లాగిన మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ కేసులో రామోజీ తరఫున మరో దిల్లీ సుప్రీం కోర్టు లాయర్, న్యాయకోవిదుడు అనిల్‌ బీ దీవాన్‌ వాదించి కొంత వరకు కాపాడారు.

అలాగే దివంగత నేత, అగ్రశ్రేణి క్రిమినల్‌ లాయర్‌ రామ్‌ జేఠ్మలానీ (దిల్లీలో స్థిరపడిన సింధీ) రామోజీ రావుకు ఒక కేసులో, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి సీబీఐకి సంబంధించిన బెయిలు కేసులో ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టులో వాదించారు. మంచి సుప్రీంకోర్టు జడ్జీలుగా పేరుతెచ్చుకున్న ఓ. చిన్నపరెడ్డి (అనంతపురం జిల్లా గుత్తి రోమన్‌ కేథలిక్‌ రెడ్డి కుటుంబంలో పుట్టారు) బీపీ జీవన్‌ రెడ్డి (మెదక్‌ జిల్లా) జాస్తి చలమేశ్వర్, లావు నాగేశ్వరరావు, కే రామస్వామి (ఈ ముగ్గురూ కోస్తాంధ్ర జిల్లాల వారు) గురించి తెలసిందే.

lawyers

ఇద్దరు సుప్రీం సీజేలాయ్యారు గాని ఒక్క గట్టి వకీలూ లేడే!

………………………………………

పైన చెప్పిన వీళ్లదంరికంటే ముందు వరంగల్‌ జిల్లాలో మూలాలున్న జస్టిస్‌ పింగళి జగన్మోన్‌ రెడ్డి గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. రాజమండ్రికి చెందిన జస్టిస్ కోకా సుబ్బారావు గారు 1960ల్లో భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. పదవీకాలం ముగియడానికి కొన్ని నెలల ముందు రాజీనామా చేసి 1967లో కాంగ్రెస్‌ అభ్యర్థి డా.జాకిర్‌ హేస్సేన్‌ పై ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్‌ సుబ్బారావు పోటీచేసిన విషయం తెలిసిందే. ఇటీవల పదవీ విరమణ చేసిన జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన రెండో తెలుగు ప్రముఖుడుగా రికార్డుకెక్కారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తరఫున దిగువ స్థాయి ఏసీబీ కోర్టులో వాదించడానికి దిల్లీ పంజాబీ లాయర్‌ సిద్దార్థ లూథ్రా ఆఘమేఘాల మీద దేశ రాజధాని నుంచి గుంటూరు జిల్లా కృష్ణానదీ తీరానికి వచ్చారనే విషయం విన్నాక ఇదంతా చెప్పాలనిపించింది. మన నెల్లూరు జిల్లాలో మూలాలున్న మాజీ ఎంపీ పర్వతరెడ్డి బాబులు రెడ్డి గారు ఏపీ హైకోర్టు లాయర్‌ గా తీరికలేని ప్రాక్టీసు చేశారు. ఈ సొమ్ముతో అనేక హోటళ్లు పెట్టుకున్నారు.

ఆ డబ్బుతోనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఆకట్టుకుని 1980ల ఆరంభంలో జనతా అభ్యర్థిగా రాజ్యసభకు భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. కొడుకు ప్రభాకరరెడ్డి కూడా టీడీపీ ఎంపీ అయ్యేట్టు (వారి నాటి వైస్రాయ్‌ హోటల్‌ లో ఎమ్మెల్యేల బసకు అనుమతించినందుకు) చేశారు బాబులు రెడ్డి. అంతేగాని పైన చెప్పిన సుప్రీంకోర్టు ప్రముఖ లాయర్ల స్థాయికి ఆయన ఎదగలేదు. బాబులు రెడ్డి పేరు చెప్పగానే మా తరం వారికి ఆబిడ్స్‌ సిద్దార్థ, వైస్రాయ్, బ్లూఫాక్స్‌ వంటి హొటేళ్లు గుర్తుకొస్తాయి. ఆయనొక న్యాయకోవిదుడిగా కనపడడు.

లండన్‌ లో జిన్నా సలహా

………………………..

పైన ప్రస్తావించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పింగణి జగన్మోహన్‌ రెడ్డి గారు లండన్‌ గ్రేస్‌ ఇన్‌ లో న్యాయశాస్త్రం (బారెట్లా) చదువుతుండగా, ఈ న్యాయశాస్త్ర విద్యార్థులనుద్దేశించి అప్పట్లో నాటి భారత నేత, గొప్ప న్యాయకోవిదుడు మహ్మదలీ జిన్నా ప్రసంగించారు. ‘ఎవరైనా సరే తమ కేసు తప్పనిసరిగా గెలవాలంటే… వారు తమ భార్యల పుస్తెలను అమ్మేసైనా సరే… మంచి వకీళ్లును పెట్టుకోవాలి. కేసు గట్టిదైనప్పుడు లాయర్లను ఎంపికచేసుకోవడంలో వివేకంతో వ్యవహరించాలి. డబ్బు కక్కుర్తి పడకూడదు,’ అని జిన్నా సలహా ఇచ్చారని జస్టిస్‌ పింగళి తన జ్ఞాపకాల పుస్తకంలో రాశారు. ఈ సలహానే రామోజీ నుంచి చంద్రబాబు వరకూ పాటిస్తున్నారని నిన్నటి సిద్దార్థ లూథ్రా ఆగమనం సూచిస్తోంది. (మొదటి ఫోటో: రాంజేఠ్మలానీ, రెండో ఫోటో: సిద్ధార్థ లూథ్రా, మూడో ఫోటో: అనిల్‌ బీ దీవాన్‌)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…
  • డిస్టర్బింగ్ సీసీటీవీ ఫుటేజీ… కొన్ని జవాబులు దొరకని ప్రశ్నలు కూడా…
  • ‘‘నీ ఏడుపేదో నువ్వేడువు… నాకన్నా ఎక్కువ ఏడువు… నేనేమైనా వద్దన్నానా..?’’

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions