.
‘‘సహ పౌరులకు, ఇండీగో యాజమాన్యానికి రాస్తున్న ఈ బహిరంగ లేఖను, నేను ఒక కార్పొరేట్ ప్రతినిధిగా కాకుండా.., ప్రతీ షిఫ్ట్‌ను, ప్రతీ నిద్రలేని రాత్రిని, ప్రతీ అవమానాన్ని, ప్రతీ తగ్గించిన జీతాన్ని, ప్రతీ అసాధ్యమైన డ్యూటీ జాబితాను అనుభవించిన ఇండీగో ఉద్యోగిగా రాస్తున్నాను…
నేను ఒక భారతీయుడిగా కూడా రాస్తున్నాను, ఎందుకంటే ఈ విమానయాన సంస్థ పరిస్థితి కేవలం అంతర్గత సమస్య కాదు – ఇది దేశంలోని లక్షలాది మంది ప్రజలపై ప్రభావం చూపుతోంది…
Ads
ఈ విపత్కర పరిస్థితికి ఎలా చేరుకున్నామో అర్థం చేసుకోవడానికి, లోపల చాలా కాలంగా ఉన్న నా మాట వినండి…
ఇది ఒక్క రాత్రిలో జరగలేదు – మేమంతా చూస్తూనే ఉన్నాం…
ఇండీగో ఒక్క రోజులో కుప్పకూలలేదు. ఈ పతనానికి సంవత్సరాలు పట్టింది.
-
2006లో మేము చిన్నగా మొదలుపెట్టాం. మేము నిర్మిస్తున్న ఓ వ్యాపార సామ్రాజ్యం గురించి నిజంగా గర్వపడ్డాం…
-
కానీ కాలక్రమేణా, ఆ గర్వం అహంకారంగా మారింది, ఎదుగుదల దురాశగా మారింది.
-
“మనం ఎప్పుడూ విఫలం కాబోం, ఎందుకంటే మేం చాలా పెద్దవాళ్ళం” అన్న ధోరణి వచ్చింది… (లేమాన్ బ్రదర్స్ విఫలమైనప్పుడు 2009లో కూడా ఇదే విన్నాం)…
-
మేము, ఉద్యోగులం, నిశ్శబ్దంగా, కొన్నిసార్లు ఆందోళనగా హెచ్చరిస్తూనే ఉన్నాం… కానీ ఎవరూ వినలేదు…
-
పోటీని అణచివేస్తున్న ఇండీగోను “స్వేచ్ఛా మార్కెట్ విజయగాథ” అని దేశం పిలుస్తూనే ఉంది… ఆకాశ ఎయిర్ ప్రారంభంలో ఓవర్-కెపాసిటీతో ఎలా వెంటాడిందో గుర్తుందా?
ప్రయాణికులు, ఉద్యోగులు, ప్రభుత్వం – అందరూ చూశారు… కానీ చూసీచూడనట్లు వదిలేశాం, ఇప్పుడు గుత్తాధిపత్యాన్ని నిందిస్తున్నాం…
లోపల మేం ఎదుర్కొన్నది – ఎవరూ మాట్లాడనిది
నిజమైన పతనం నైపుణ్యం కంటే పదవులు ముఖ్యమైనప్పుడు మొదలైంది…
-
సరిగ్గా ఒక ఇ-మెయిల్ కూడా రాయలేని వారు కూడా V.P (వైస్ ప్రెసిడెంట్లు) అయిపోయారు – ఎందుకంటే VP అంటే ESOPలకు (ఉద్యోగులకు షేర్లు) అధికారానికి మార్గం…
-
ఆ అధికారాన్ని ఎలా సమర్థించుకుంటారు? మీ కింద ఉన్న ఉద్యోగులను అణచివేయడం ద్వారా…
-
పైలట్లు అలసట, సురక్షితం కాని డ్యూటీ సమయాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు… వినడానికి బదులు, కొందరిని హెడ్ ఆఫీస్‌కి పిలిచి బెదిరించారు, అరిచారు, అవమానించారు…
-
పరిష్కారాలు లేవు. జవాబుదారీతనం లేదు. కేవలం భయం మాత్రమే అలుముకుంది మాలో…
- నైట్ డ్యూటీలు రెట్టింపు అయినప్పుడు, కొత్త నియమాలు అమలు చేసినప్పుడు, సెలవులు రద్దు చేసినప్పుడు – ఆ శారీరక, మానసిక శ్రమకు పరిహారంగా ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదు…
-
గ్రౌండ్ స్టాఫ్ – నెలకు ₹16,000–18,000 మాత్రమే సంపాదించేవారు – అక్షరాలా పరుగులెత్తారు – విమానం నుండి విమానానికి, ఒక్కోసారి ముగ్గురి పనిని ఒక్కరే చేశారు…ఇంజనీర్లు ఒకేసారి అనేక విమానాలను చూసుకుంటూ, మీరు గమ్యస్థానానికి సమయానికి చేరుకోవడానికి అహర్నిశలు శ్రమించారు.
-
క్యాబిన్ క్రూ గ్యాలీలో ఏడుస్తూనే, ప్రయాణికులకు చిరునవ్వుతో సేవ చేశారు…
పై నుండి వచ్చిన సందేశం ఏంటి? “మీకు ఉద్యోగం దొరికినందుకు అదృష్టవంతులు” లేదా “భిక్షాటన చేసేవారు ఎంపిక కాబడరు..” (Beggars can’t be choosers)…
మేమే విచ్ఛిన్నమైతే, దేశానికి ఎలా సేవ చేయగలం?
ఇటీవలి సంవత్సరాలలో ఇండీగో మిమ్మల్ని “ప్రయాణికులు” అని పిలవడం మానేసి, “కస్టమర్‌లు” అని పిలవడం గమనించి ఉండవచ్చు… ఇది ఉద్దేశపూర్వకమే…
-
“మీరు వారిని ప్రయాణికులు అని పిలిస్తే, వారు తమకు విమానయాన సంస్థపై యాజమాన్యం ఉందని అనుకుంటారు” అని మాకు చెప్పారు…
-
సీటు కొనుక్కునే, తమ జీవితాలను నమ్మే ప్రజల పట్ల ఈ ధోరణిని ఒక్కసారి ఆలోచించండి…
-
ఉద్యోగులు దోపిడీకి గురై, విలువ లేకుండా, అలసిపోతే, మీకు అర్హమైన సేవను వారు ఎలా అందించగలరు? మాకు పట్టదు అని కాదు… మాకూ చాలా బాధ ఉంది. కానీ మేము శక్తి లేక నడుస్తున్నాం… నడిపిస్తున్నాం…
నియంత్రణ సంస్థ గురించి
మేము ఒంటరిగా ఉన్నామని భావించాం… పైలట్లు విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు, లైసెన్స్ ధృవీకరణలు బాగా ఆలస్యం అయ్యాయి… ఈ వాస్తవం విమానయానంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు… వేగవంతమైన ప్రాసెసింగ్ కోసం “అనధికారిక ధరలు” అని గుసగుసలాడారు కూడా…
అలసట నియమాలు మా షెడ్యూల్‌లను మరింత క్రూరంగా మార్చే విధంగా మారినప్పుడు, నిలబడటానికి ఏ యూనియన్ లేదా వ్యతిరేకించడానికి ఏ నియంత్రణ సంస్థ లేదు….
ఇండీగో పెరిగింది… కానీ విమానాలను నడిపే, రిపేర్ చేసే, హ్యాండిల్ చేసే ప్రజలు – వెనుకబడిపోయారు…
ఈ రోజు మనం ఉన్న స్థితి – ఆశ్చర్యమని నటిస్తున్న సంక్షోభం
నా సహ పౌరులారా, మీకు కోపం ఉందని నాకు తెలుసు… మీరు ఎందుకు విమానయాన సంస్థ హఠాత్తుగా విచ్ఛిన్నమైందని ఆశ్చర్యపోతున్నారు..? కానీ మేము సంవత్సరాలుగా విచ్ఛిన్నమయ్యాము….
మేము హెచ్చరించాము… వ్యవస్థ విరిగిపడడం చూశాం… సహోద్యోగులు రాజీనామా చేయడం లేదా నిస్సత్తువకు గురవడం చూశాం… మేము ఒక అదనపు గంట విశ్రాంతి కోసం నిశ్శబ్దంగా ప్రార్థిస్తుంటే, నాయకత్వం యూరప్‌కు విమానాల్లో ఎగురుతూ ఉండటం చూశాం…
ఇప్పుడు ప్రపంచం మనల్ని చూసి నవ్వుతోంది… “భారతీయులు ఒక్క స్థిరమైన విమానయాన సంస్థను కూడా నడపలేరా?” అని నవ్వుతారు… ఇది బాధాకరం, ఎందుకంటే మిమ్మల్ని విఫలం చేస్తున్నది భారతీయ కార్మికులు కాదు… అది యాజమాన్యం – ఎక్కువగా విదేశీయులు…
నా విజ్ఞప్తి – సహోద్యోగిగా, పౌరుడిగా, మానవుడిగా…
నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను…
-
గ్రౌండ్ స్టాఫ్‌కు కనీస వేతనాలు నిర్ణయించండి…
-
విమానానికి కనీస సిబ్బందిని అమలు చేయండి…
-
ఉద్యోగుల ప్రాతినిధ్యంతో అలసట నియమాలను తిరిగి పరిశీలించండి…
-
లక్షలాది మంది ప్రయాణికులను ప్రభావితం చేసే కార్యాచరణ నిర్లక్ష్యాన్ని శిక్షించండి…
ఇండీగో దాని ఉద్యోగులకు సరసమైన జీతం ఇవ్వడం వలన కూలిపోదు… కానీ వారిని లెక్క చేయనట్లు చూస్తే మాత్రం కూలిపోతుంది…
పైలట్లు, ఇంజనీర్లు, గ్రౌండ్ స్టాఫ్, క్యాబిన్ క్రూ – దాని ప్రయాణికుల కారణంగానే ఈ విమానయాన సంస్థ గొప్పగా మారింది… ఆ ప్రయాణికులే సహాయం కోసం వేడుకుంటున్నారు…
ఇది ఒక మలుపు కావాలి
నేను విమానయానాన్ని ప్రేమిస్తున్నాను… నా ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నాను… ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాను…
మేము గర్వంతో నిర్మించినది ఇప్పుడు భయం, అలసట, నిశ్శబ్దంతో నిలబడటం చూసి నా గుండె బద్దలవుతోంది... నేను ఇక మౌనంగా ఉండలేను కాబట్టే ఇది రాస్తున్నాను…
(లేఖలో పేర్లను పేర్కొంటూ వ్యక్తిగత విమర్శలు ఉన్నాయి.)
-
పీటర్ ఎల్బర్స్ – ఈ విపత్తు జరిగినప్పుడు ఆయన తన స్వస్థలమైన నెదర్లాండ్స్‌లో సెలవులో ఉన్నారు…
-
ఇసిడోర్ పోర్కెరాస్ – ఈయన ఇక్కడ ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు…
-
జాసన్ హెర్టర్ – ఈయన రాకతోనే 8 ఏళ్ల క్రితం ఉద్యోగులు, యజమాని మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి…
-
అదితి కుమారి – పైలట్లకు, క్యాబిన్ క్రూకి కనీస విశ్రాంతితో డ్యూటీలు ప్లాన్ చేస్తూ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్‌ను (OCC) గందరగోళంగా మార్చారు…
-
అశిమ్ మిత్రా – 70 ఏళ్ళ వయసులో కూడా పదవీ విరమణ చేయడానికి నిరాకరిస్తున్న వ్యక్తి, తాను గొప్పగా ‘ప్లేబాయ్’ అని చెప్పుకుంటారు…
-
అక్షయ్ మోహన్ – అశిమ్ నుండి బాధ్యతలు తీసుకున్నప్పుడు పైలట్లను మరింతగా అణచివేయాలని చూస్తున్నారు…
-
రాహుల్ పాటిల్ – ఇ-మెయిల్ కూడా సరిగా రాయలేని వ్యక్తి, కానీ తోటి పైలట్లను బెదిరించడంలో, దూషించడంలో దిట్ట…
-
తపస్ దేయ్ – తన సహోద్యోగులను “బిచ్చగాళ్లు ఎంపిక కాబడరు” అని పిలవడానికి తెగించిన వ్యక్తి…
ఇండీగో నిజంగా మళ్లీ ఎదగాలనుకుంటే, అది ముందుగా తన లోపలికి – తన విమానాలను ఆకాశంలో ఉంచే అలసిన, అధిక పనిభారం ఉన్న మానవుల వైపు చూడాలి…
మాకు మెరుగైనది దక్కాలి… అలాగే మీకు కూడా – మీ సమయం, డబ్బు , భద్రత విషయంలో మమ్మల్ని నమ్మే పౌరులకు…
(Disclaimer): ఇది ఒక అజ్ఞాత ఇండీగో పైలట్ ఆవేదనగా సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్న సుదీర్ఘ లేఖకు తెలుగు అనువాదం… ఈ లేఖ వాస్తవికత (Authenticity) లేదా విశ్వసనీయత ఇంకా నిర్ధారణ కాలేదు…
ఇది కేవలం ప్రస్తుతం విమానయాన రంగంలో చర్చనీయాంశమైన ఉద్యోగుల మనోభావాలను, సంస్థాగత సమస్యలను ప్రతిబింబిస్తున్న నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠకులకు అందించబడింది… పౌరవిమానయాన మంత్రీ, డీజీసీఏ పెద్దలూ ఓసారి చదువుతారా..? తీరిక ఉందా..?
Share this Article