నిజానికి ఇది కదా సీరియస్ వార్త… ఇలాంటివి కదా హైలైట్ కావల్సింది… మన సిస్టంలో ఓ మనిషికి జరిగిన తీవ్ర అన్యాయానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు..? ఎక్కడుంది లోపం..? అపెక్స్ కోర్టు గానీ, ప్రభుత్వాలు గానీ ఎందుకు పట్టించుకోవు..? వార్త ఏమిటంటే..? బిహార్, గోపాలగంజ్ జిల్లా, భోర్ ఠాణా పరిధిలో ఉండే సూర్యనారాయణ భగత్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్, దేవరియాకు చెందిన బీర్బల్ భగత్‌తో కలిసి పని కోసం ముజఫర్‌పూర్‌కు వెళ్లాడు…
సూర్యనారాయణ్ హఠాత్తుగా కనిపించకుండా పోయాడు… కుటుంబసభ్యులు వెతికారు, ప్రయోజనం లేదు… 1993లో సూర్యనారాయణ్ కొడుకు సత్యనారాయణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు… మిస్సింగ్ కేసు నమోదు చేశారు… తన తండ్రితోపాటు బీర్బల్ భగత్ కూడా వెళ్లాడు కాబట్టి ఈ మిస్సింగ్ కేసులో తన ప్రమేయం ఉందేమోనని కొడుకు అనుమానించాడు… ఎఫ్ఐఆర్లో బీర్బల్ పేరు కూడా చేర్చారు…
తరువాత కొద్దిరోజులకు సూర్యనారాయణ్ శవంగా కనిపించాడు… మిస్సింగ్ కేసు కాస్తా మర్డర్ కేసుగా మార్చబడింది… బీర్బల్ భగత్‌ను జైలుకు పంపించారు… 1994 నుంచి జైలులోనే బీర్బల్… 1995లో నామ్కేవాస్తే ఓ చార్జి షీటు వేశారు… అందులో ఏ వివరాలూ సరిగ్గా లేవు, సాక్ష్యాలు లేవు, పోస్ట్ మార్టం చేసిన వైద్యుడి జాడలేదు… శవానికి సంబంధించిన ఫోటోలే సరిగ్గా లేవు, కేసు విచారణ నడిచీ నడిచీ… 28 ఏళ్లపాటు సాగీ సాగీ… చివరకు జిల్లా అదనపు సెషన్స్ జడ్జి సదరు నిందితుడిని నిర్దోషిగా తీర్పు చెప్పి విడుదల చేయించాడు…
Ads
అండర్ ట్రయల్‌గా గరిష్ఠంగా ఎన్నేళ్లు జైలులో ఉండాలి..? నిజానికి మర్డర్ కేసు ప్రూవ్ అయినా సరే… జీవితఖైదు పడినా సరే, రెమిషన్స్ పోను ఏ 15 ఏళ్లకో బయటికి వచ్చేసేవాడు కదా… మరి ఇన్నేళ్ల అన్యాయభరితమైన జైలు జీవితం ఎవరి తప్పు ఫలితం..? ఇది కదా ముందుగా దిద్దాల్సింది… అసలు దేశంలోని జైళ్లలోని అండర్ ట్రయిల్స్ కేసులు, ఒకవేళ నేరం రుజువైతే పడే శిక్ష, అప్పటికే అనుభవించిన జైలుశిక్షల గురించి ఒక్కసారైనా సీరియస్ సమీక్ష జరిగిందా..?
లేటు న్యాయం కూడా అన్యాయమే అంటారు కదా… మరి దీన్ని..? అన్యాయం అనే పదాన్ని మించినదేదో వాడాలి..! లీగల్‌గా పరిశీలిస్తే బీర్బల్ భగత్ 28 ఏళ్ల జైలు ఇష్యూలో ఎవరూ అపరాధులు కాదు… పోలీసులు తమ డ్యూటీ తాము చేశారు… కోర్టు తన డ్యూటీ తను చేసింది… మరి లోపం ఎక్కడున్నట్టు..? డబ్బుంటే ఏవో బెయిల్ ప్రయత్నాలు చేసుకుని, బయటపడేవాడేమో… ఒకసారి నేరారోపణ జరిగాక ఇక నిరోధినని నిరూపించుకోవడం సదరు నిందితుడిదే బాధ్యత… నేరనిరూపణ జరగనీ, జరగకపోనీ, తప్పుడు కేసయినా సరే పోలీసులకు పోయేదేమీ ఉండదు… విచారణలో జాప్యం కోర్టు తప్పు కాదు… మరి బీర్బల్ బతుకు జైలుపాలు కావడానికి బాధ్యులు ఎవరు..? దేవుడేనా..? తన ఖర్మేనా..?!
Share this Article