ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న.. మదర్ థెరీస్సా చెప్పిన ఈ ప్రోవర్బ్ ఎంత పాప్యులరో తెలిసిందే. అయితే, ఒక వ్యక్తి.. ఒక కుటుంబం ఒంటరైనప్పుడు థెరీస్సా మాటల స్పిరిట్ తో కనుక సమాజం పనిచేస్తే… మన కంటికి కనిపించని దైవత్వాన్ని మించిన మానవత్వాన్ని ఆవిష్కరించొచ్చు. కనిపించని దైవత్వం కన్నా.. కనిపించే మానవత్వమే మిన్న అనిపించొచ్చు. అదిగో అలా చేశారు కనుకే.. ఆ కేరళ సమాజపు స్టోరీ ఓసారి చెప్పుకోవాలి.
అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను.. మృగజాతికెవ్వడు మేతబెట్టె.. వనచరాదులకెవ్వడు భోజనమిప్పించె.. చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసె.. స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు పెంచె.. ఫణులకెవ్వడు బోసె బరగ విషము.. మధుపాళికెవ్వడు మకరంద మొనరించె.. పసులకెవ్వడొసగె బచ్చిపూరి అంటూ.. జీవకోట్లను పోషింప నీవెగాని.. వేరొకడు లేడయా వెదికి చూడ అంటాడు శేషప్ప.
మార్కండేయుడిలా యమపాశం పడి మరణం దాకా వెళ్లాక కూడా.. విధిరాత బాగుంటే ఆ యముడైనా వెనక్కి తిరిగి వెళ్లాల్సిందే! కొండలోయల్లో తీసుకెళ్లి పడేసినా ప్రహ్లాదుడిలా తిరిగి రావాల్సిందే!!
Ads
అలా మరణం అంచులను తాకిన అబ్దుల్ రహీమ్ కథే ఇది. అబ్దుల్ రహీమ్.. మొన్నీ మధ్య వచ్చిన గోట్ లైఫ్.. తెలుగులో ఆడుజీవితం సినిమాలోలాగే.. ఎడారి దేశాల బాట పట్టిన ఓ వలసజీవి. కేరళ కోజికోడ్ కు చెందిన రహీమ్.. 2006లో సౌదీకి వెళ్లాడు. అక్కడ ఓ కుటుంబానికి సంబంధించిన కారు డ్రైవర్ గా పనిచేసేందుకు కుదిరాడు. చాలా మంది కంటే లైఫ్ బాగానే నడుస్తోంది. అయితే, తన యజమానికి ఓ 15 ఏళ్ల వికలాంగ బాలుడున్నాడు. రహీమ్ డ్రైవర్ గానే కాకుండా.. ఆ బాలుడి సంరక్షకుడిగా కూడా పని చేయాల్సి వచ్చేది.
అలా ఓరోజు రహీమ్.. ఆ వికలాంగ బాలుడిని తీసుకుని కారులో వెళ్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. వికలాంగుడైన ఆ బాలుడి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండటంతో.. ఆ బాలుడి చేయికి ఓ మెడికల్ డివైజ్ ను అమర్చారు. దాని ద్వారానే అతడి శ్వాసకోశ ప్రక్రియకు ఇబ్బంది లేకుండా అతడు జీవించేవాడు. ఓ చోట సిగ్నల్ పడింది. రెడ్ లైట్ సిగ్నల్ జంప్ చేయమని బాలుడు అడిగాడన్నది డ్రైవర్ రహీమ్ చెప్పే మాట. ఆ క్రమంలోనే బాలుడికీ, తనకు చిన్నగా గొడవ మొదలై.. తన చేయి.. బాలుడి చేయికున్న మెడికల్ డివైజ్ కు తాకి.. ఆ బాలుడు గాయపడి అక్కడికక్కడే శ్వాసందక మరణించాడని డ్రైవర్ కోర్ట్ ముందు వెల్లడించాడు.
తమ బాలుడి మరణానికి రహీమే కారణమని.. ఆ హంతకుణ్ని వదులొద్దంటూ బాలుడి తల్లిదండ్రులు కోర్టుకెక్కడంతో వాదనలు కొనసాగాయి. కింది కోర్టుల్లో తనకు న్యాయం జరక్కపోవడంతో.. రహీమ్ ఎలాగోలా సౌదీలో తనకున్న స్నేహితుల సాయంతో సుప్రీంకు వెళ్లినా లాభం లేకపోయింది. అలా పదహారేళ్ల పాటు.. ఉద్ధేశ్యపూర్వకంగా చేయని పాపానికి పశ్చాత్తాప్పడుతూ.. మరోవైపు కుటుంబ సభ్యులకు తెలిస్తే ఎంత వేదననుభవిస్తారోనన్న బాధతో.. భూమ్మీదే నరకాన్ని చూశాడు రహీమ్. అంత నరకప్రాయమైన బతుకనుభవించాకైనా.. తనకు ప్రాయశ్చిత్తం లభించకపోతుందానని రహీమ్ భావించాడు. కానీ, 2018లో అక్కడి సుప్రీం కోర్ట్ మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2022, ఏప్రిల్ 16 మరణశిక్షకు తేదీని కూడా ప్రకటించింది.
ఈ విషయం కోజీకోడ్ లోని అబ్దుల్ రహీమ్ కుటుంబీకులకు ఎప్పుడోగానీ తెలియలేదు. మరోవైపు కటిక దరిద్రం. అందుకే రహీమ్ సౌదీ బాటపట్టింది. ఈ క్రమంలో ఏంచేయాలో రహీమ్ కుటుంబ సభ్యులకు దిక్కు తోచలేదు. అదిగో, ఇక్కడే రహీమ్ జీవితకథ.. ఊహించని మలుపు తిరిగింది. శేషప్ప చెప్పినట్టు అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెనన్నట్టుగా… తమకు బంధుత్వముందా, తోడబుట్టినవారా, కన్నపేగా, స్నేహితుడా, కాదా అన్నవేవీ చూడకుండా.. ఇరుగుపొరుగువారు కలిసిమెలిసి ఎలా ఉండాలో ఓ స్ఫూర్తి నింపేవిధంగా.. రహీమ్ చుట్టుపక్కల సమాజం స్పందించింది. రహీమ్ ను మరణశిక్ష నుంచి తప్పించేందుకు ఏం చేయగలమో చర్చించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంది.
ఆ కమిటీలోని సభ్యులు కొందరు సౌదీలోని బాధిత కుటుంబ సభ్యుల్ని కలిశారు. వేడుకున్నారు. మొత్తంగా 34 కోట్ల రూపాయలు.. అంటే 15 మిలియన్ సౌదీ రియాల్స్ రూపంలో డబ్బు డిమాండ్ చేసింది ఆ కుటుంబం. లక్షో, రెండు లక్షలో అంటే సర్దొచ్చుగానీ.. ఏకంగా 34 కోట్లంటే.. ఆ కమిటీలో ఉన్నవారైనా.. చుట్టుపక్కల సమాజమైనా పెద్దగా కోటీశ్వరులేం కాదు. కానీ, ఐకమత్యం పనిచేసింది. అందుకు క్రౌడ్ ఫండింగ్ ఆప్షన్ వారికి ఆసరా అయింది. ఏకంగా సోషల్ మీడియాను వీలైనంతగా ఉపయోగించుకుని.. సేవ్ అబ్దుల్ రహీమ్ యాష్ ట్యాగ్ తో పాటు… ఏకంగా ఒక యాప్ నే క్రియేట్ చేసి ఫండ్స్ కలెక్ట్ చేశారు.
అలా రెయిజ్ చేసిన ఫండ్స్ ను సేకరించి.. మరణశిక్ష కంటే ముందే ఆ కుటుంబాన్ని సంప్రదించి డబ్బందజేశారు. అలా సదరు బాధిత కుటుంబ క్షమాభిక్షతో.. కోర్ట్ మరణశిక్షను రద్దు చేయడంతో.. మరణం అంచుల వరకూ వెళ్లిన అబ్దుల్ రహీమ్ మళ్లీ కోజీకోడ్ లోని తన కుటుంబాన్ని చూసుకోగల్గాడు. రహీమ్ ను మళ్లీ చూస్తామనుకోలేని ఆ కుటుంబీకుల ఆనందభాష్పాలతో.. ఆ పరిసరాల్లో ఒక ఉద్వేగ వాతావరణం కనిపించింది.
మొత్తంగా సమాజం సంఘటితంగా ఉంటే.. మానవత్వం పరిమళిస్తే.. ఎంత ఆరోగ్యకమైన సొసైటీని తయారు చేసుకోవచ్చో.. ఒకరికొకరు అండగా ఎలా నిలబడవచ్చో.. అందుకు, అబ్దుల్ రహీమ్ కథ ఓ ఉదాహరణగా నిల్చింది…. Article By… రమణ కొంటికర్ల..
Share this Article