Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గాన చారుశీల సుశీల..! తిరుగులేని గళమాధుర్యం… స్వర సౌందర్యం..!!

November 14, 2025 by M S R

.

Rochish Mon …….. ———— గాన చారుశీల సుశీల ———————
దక్షిణ భారతదేశ చలనచిత్ర గానానికి మెరుగు, సొగసు,‌ మాధుర్యం పీ.సుశీల.

భారతదేశ చలనచిత్రాలలో మహోన్నతమైన స్త్రీ గానం అన్న నాణానికి ఒక‌వైపు లతామంగేష్కర్ అయితే మఱువైపు పీ. సుశీల.

Ads

1953లో కన్నతల్లి పేరుతో తెలుగులోనూ పెఱ్ట్రత్తాయ్ పేరుతో తమిళ్ష్‌లోనూ విడుదలైన వెర్షన్ (అంటే పూర్తిగా డబ్బింగ్ కాకుండా రెండు భాషల్లోనూ చిత్రీకరించబడిన) సినిమాల్లో “ఎందుకూ పిలిచావెందుకు?…” అనీ, “ఏదుక్కో అళ్షైత్తాయ్…” అనీ పాడి సుశీల సినిమా నేపథ్య గాయనిగా ఉదయించారు. అక్కడ నుంచీ పలు భాషల్లో ఎన్నెన్నో పాటలు, మంచిపాటలు, ఉన్నతమైన పాటలు పాడుతూ కొనసాగారు.

  • 17,695 పాటలు పాడినందుకుగానూ సుశీల 2016లో గిన్నిస్ బుక్ అవ్ (ఆఫ్) వోల్డ్ రికా(ర్)డ్ పొందారు. సుశీల 30, 000, 40,000 పాటలు పాడారు అనడం సరికాదు.

Spirited emotive voice సుశీలది. ఘనమైన గాత్రం ఆమెది. Rounded even warm tone ఆమెది. మెండైన గాత్ర సంపద, నిండైన గాత్రం ఆమెవి. దక్షిణాది సినిమాలలో Belcanto అన్నది బహుశా ఆమెతోనే మొదలయి ఉండచ్చు.

“లతా మంగేష్కర్ గాత్రం కన్నా సుశీల గాత్రమే మేలైంది” అని ఉన్నతమైన సంగీత దర్శకుడు సీ. రామచంద్ర ఒక సందర్భంలో అన్నారు. లత గాత్రం వేణునాదం అయితే సుశీల గాత్రం వీణా నాదం.
పీ. సుశీలవల్ల దక్షిణ భారత సినిమా గానానికి శోభ, ప్రభ వచ్చాయి. ఏ భాషలో పాడినా గొప్పగానే పాడారు ఆమె.

ఆమె ఎన్నో గొప్ప పాటల్ని ఎంతో గొప్పగా పాడారు. పాడిన ఇతర భాషలకన్నా, తెలుగులో కన్నా సుశీల తమిళ్ష్‌లో గొప్పగా పాడారు. (మన తెలుగు మధ్యతరగతి మాంద్యం ఒప్పుకోలేని సత్యం ఇది) ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకున్నారు.

తమిళ్ష్ పాటలకు ఆమె ప్రాధాన్యత ఇచ్చేవారు. ముఖ్యంగా సంగీత దర్శకుడు ఎమ్. ఎస్. విశ్వనాదన్ పాటలకు ఆమె అత్యంత ప్రాధాన్యతను ఇచ్చేవారు.

సుశీల తమిళ్ష్ గానం‌ ఆమెను జాతీయ స్థాయిలో గొప్ప గాయనిని చేసింది. దేశంలోనే ఉత్తమ గాయనిగా ప్రభుత్వ పురస్కారాన్ని అందుకున్న తొలి గాయని సుశీల! 1968లో విడుదలైన ఉయర్‌న్ద మనిదన్ తమిళ్ష్ సినిమాలో పాడిన “నాళై ఇన్ద వేళై పార్తు ఓడివా నిలా…” పాటకు ఆ జాతీయ ఉత్తమ గాయని పురస్కారం వచ్చింది. ఈ పాటను విన్నాక “నేను ఇంత బాగా పాడలేను” అని లత అన్నారట.

పావమన్నిప్పు సినిమాలో సుశీల పాడిన “అత్తాన్ ఎన్నత్తాన్ అవర్ ఎన్నైత్తాన్” పాట లత మంగేష్కర్ కుటుంబ గీతం. ఆశా భోస్లే ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. ఆయిరత్తిల్ ఒరువన్ అన్న తమిళ్ష్ సినిమాలో ఆమె పాడిన “ఉన్నైనాన్ సన్దిత్తేన్…” అన్న పాట మహోన్నతమైన గానానికి వ్యక్తీకరణ. సుశీల ఆ పాటను metronomical balance తో పాడారు.

ఒక్క లతా మంగేష్కర్ మాత్రమే ఆ balance తో పాడగలరు. సంగీత దర్శకుడు ఎమ్.ఎస్. విశ్వనాదన్ సుశీలతో మహోన్నతమైన గానం చేయించారు. ఎమ్.ఎస్. విశ్వనాదన్ సుశీలతో emotive wondersను సృష్టించారు. అలాంటి అద్భతాల్లో ఒకటి “మాలై పొళ్షుదిన్ మయక్కత్తిలే…” పాట. ఈ పాటే తనను ఇవాళ్టి ఇళైయరాజాను చేసింది అని ఇళైయరాజా చెప్పుకున్నారు.

కె.వీ. మహాదేవన్ సుశీలతో తెలుగులో గొప్ప పాటలు పాడించారు. అదే మహాదేవన్ తెలుగులో కన్నా తమిళ్ష్‌లో సుశీల చేత ఎంతో విశిష్టంగా పాడించారు. కె.వీ. మహాదేవన్ సంగీతం చేసిన “మన్నవన్ వన్దానడి…” పాట తాను పాడిన పాటల్లోకెల్లా గొప్పదని సుశీల స్వయంగా చెప్పారు‌.

కె.వీ. మహాదేవన్ సంగీతంలో సుశీల “గంగైక్కరై తోట్టమ్ కన్నిప్పెణ్గళ్ కూట్టమ్…” వంటి గొప్ప పాటల్ని పాడారు. ఈ గంగైక్కరై తోట్టమ్ కన్నిప్పెణ్గళ్ కూట్టమ్ పాట ముందుగా బెంగాలీలో లతా మంగేష్కర్ పాడింది. తరువాత తమిళ్ష్‌లో పాడిన సుశీల గానం లతా మంగేష్కర్ గానం కన్నా ఎంతో ప్రౌఢంగా, ఎంతో శ్రేష్ఠంగా, గొప్ప నాద పుష్టితో ఉంటుంది. ఇళయరాజా చేసిన Boney M flavour పాటల్నీ గొప్పగా పాడారు సుశీల.
తమిళ్ష్‌నాడు ముఖ్యమంత్రి ఎమ్.జీ. రామచంద్రన్ “సుశీల దక్షిణాది లత కాదు. లత ఉత్తరాది సుశీల” అని అన్నారు.

మలయాళం, కన్నడం చిత్రాల్లో సుశీల ఎన్నో ఉన్నతమైన పాటలను పాడారు. అశ్వమేధం అన్న మలయాళం సినిమాలో దేవరాజన్ సంగీతంలో వయలార్ రామవర్మ రచన “ఏళ్షు సున్దర రాత్రిగళ్…” పాట గాయనిగా ఒక్క సుశీల మాత్రమే ఇవ్వగల సౌందర్యం. మలయాళం సినిమా గానం మొత్తంలో ఈ పాటకు ఒక ప్రత్యేకమైన స్థానం‌ ఉంది.

ఎంత బాగా పాడారో ఆమె ఆ పాటను. ఎంత గొప్పగా ఉంటుందో ఆమె గాత్రం ఆ పాటలో. కన్నడంలో “విరహా నూరు తరహా…” (సినిమా: ఎడకల్లు గుడ్డద మేలే), “ఎల్లే ఇరు హేగే ఇరు…” (సినిమా: కస్తూరి నివాస), “ఒలవే జీవన సాక్షాత్కార…” (సినిమా: సాక్షాత్కార), “నీ నిద్దరేను…” (ఆనంద కంద), వంటి పాటలతో గొప్ప గానం చేశారు సుశీల.

తెలుగులో “నీవుండేదా కొండపై నా స్వామి…” ( సినిమా: భాగ్యరేఖ), “నీవు రావు నిదుర రాదు…” (సినిమా: పూలరంగడు), “నీవు లేక వీణ…” (సినిమా: డాక్టర్ చక్రవర్తి), “మదిలో వీణలు మ్రోగే…” (ఆత్మీయులు), “మనసే అందాల బృందావనం వేణు మాధవుని…”(మంచి కుటుంబం), “సఖియా వివరించవే…”(నర్తనశాల), “ఇది మల్లెల వేళయని…” (సుఖదుఃఖాలు), “ఝమ్మంది నాదం…” (సిరిసిరిమువ్వ), “ఆకులో ఆకునై…” ( మేఘసందేశం), “ఎంతో బీదవాడే గోపాలుడు…”(ఎం.ఎల్.ఎ. ఏడుకొండలు), “వటపత్ర శాయికి వరహాల లాలి…” (స్వాతి ముత్యం) వంటి పలు పాటలను రసరమ్యంగా, మహోన్నతంగా పాడారు పీ. సుశీల.

  • తన గాత్రంతో, తన గానంతో పలు భాషల్లో పలు పురస్కారాలు, ఐదుసార్లు జాతీయ ఉత్తమ గాయని పురస్కారాలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలతో పాటు ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారాన్నీ పొందారు పీ. సుశీల.

సుశీల ఉచ్చారణ విశిష్టంగా ఉంటుంది. స్పష్టత, సరళత సమపాళ్లలో కలిసిన విశిష్టమైన ఉచ్చారణ ఆమె గానంలో ద్యోతకమౌతూంటుంది. ముఖ్యంగా ఆమె తమిళ్ష్ ఉచ్చారణ చాల గొప్పగా ఉంటుంది. ఇతర తమిళ్ష్ గాయకులకన్నా కూడా సుశీల ఉచ్చారణే గొప్పగా ఉంటుంది. తమిళ్షులే సుశీల నుంచి తమిళ్ష్ ఉచ్చారణను నేర్చుకోవాలని చెబుతారు.

నిజానికి ఆమెకు తమిళ్ష్ అంత బాగా రాదు. ప్రముఖ తమిళ్ష్ కవి వైరముత్తుతో ఒక‌ ముఖాముఖిలో పీ.సుశీల “నాకు తమిళ్ష్ తెలీదు” అని చెబితే “కానీ తమిళ్ష్‌కు మీరు బాగా తెలుసు” అని వైరముత్తు అన్నారు. ఆ తమిళ్ష్‌ కవి వైరముత్తు ఒక సందర్భంలో ఇలా అన్నారు…

  • “మరణం వచ్చే సమయం నాకు ముందే తెలిసిపోతే నా మరణానికి అరగంట ముందు నా గదిలోకి ఎవర్నీ రానివ్వకుండా తలుపులేసుకుని‌ సుశీల పాటలు వింటూ మరణిస్తాను; మరణించే ముందు మరోసారి జీవిస్తాను”…

ఎప్పటికీ జీవించి ఉండే పాటల్ని ఎంతో గొప్పగా పాడారు పీ.సుశీల.‌ పీ. సుశీల వంటి గాత్రం, గానం దక్షిణ భారతదేశంలో మళ్లీ పుట్టకపోవచ్చు.
నిన్న సుశీల పుట్టిన రోజు…

తన పాటలతో ప్రతిరోజూ పుడుతూనే ఉంటారు పీ. సుశీల. పీ. సుశీల తెలుగువారైనందుకు మనం‌ గర్వించాలి. గర్విద్దాం.
దక్షిణ భారత సినిమాకు ప్రశస్తమైన కాలంలో
ప్రశస్తమైన స్త్రీ గానం, గాత్రం పీ. సుశీల. పీ. సుశీల గాన చారుశీల.
రోచిష్మాన్
9444012279

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గాన చారుశీల సుశీల..! తిరుగులేని గళమాధుర్యం… స్వర సౌందర్యం..!!
  • చున్నీయిజం..! అది స్త్రీ స్వేచ్ఛావ్యతిరేక ప్రతీకా..? ఏమిటో ఈ సిద్ధాంతం..?!
  • శివ అంటే నాగార్జున, వర్మ మాత్రమేనా..? ఇంకెవరికీ క్రెడిట్ లేదా..?!
  • డాక్టర్ ఐపీఎస్… ఉగ్రవాదుల ఓ భారీ కుట్రను ఛేదించిన తెలుగు పోలీస్…
  • వ్యూహాత్మక బగ్రామ్ ఎయిర్‌ బేస్‌కై చైనా, అమెరికా పాలిటిక్స్… కానీ..?
  • శివకు రీ-రిలీజ్ ఉన్నట్టే… వర్మకూ ఓ రీ-రిలీజ్ ఉంటే బావుండు…
  • దక్షిణాఫ్రికా నుండి గోవా తీరానికి… ఒక క్రికెట్ లెజెండ్ కొత్త కథ..!
  • ఏడీ..? ఆ కీరవాణి ఏమయ్యాడు..? టాలీవుడ్ సంస్కారం ఏమైంది..?!
  • పశ్చాత్తాప ప్రకటనలు… నేరాంగీకారాలు… జగన్ విధేయుల్లో భయం..!!
  • దాసి..! దోపిడీ కేంద్రాలు దొరల గడీలు… లైంగిక దోపిడీలకు కూడా…!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions