Bharadwaja Rangavajhala…… హీరో కృష్ణతో …. కృష్ణను సినిమాల్లో చూడ్డమే కాదు … ఆయన మా ఊళ్లో పాడిపంటలు, పంచాయితీ, ఊరంతా సంక్రాంతి , శభాష్ గోపీ లాంటి సినిమాలు షూట్ చేసిన సందర్భంలో నేరుగా చూశాను. ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాను. ఆ తర్వాత ఆయనతో మనకేం పనీ … ఇలా నడుస్తూండగా … రెండు వేల సంవత్సరంలో అనుకుంటా … ఓ రోజు మా గురువుగారు కె.ఎన్.చారిగారు పిల్చి … అబ్బాయ్ మోదుకూరి జాన్సన్ తో కలసి పనిచేసిన ప్రముఖుల ఇంటర్యూలు కావాలి …. అందులో కృష్ణగారిది మరీ కావాలి … ఆ ప్రయత్నం చేయి అర్జంట్ గా అన్నారు.
అప్పుడు కృష్ణ అన్నయ్య అనే ఓ టీవీ సీరియల్ చేస్తున్నారు. ఆ సీరియల్ రైటింగ్ కమ్ డైరెక్షన్ విభాగంలో పన్జేస్తున్న రాంబాబుగారు ఉదయంలో నా కొలీగే. దీంతో ఆయనకి ఫోన్ చేసి కృష్ణగారిని కలవాలి అన్నాను. సరే … ఫిలిం ఛాంబర్ దగ్గరకు వచ్చేయండి .. అక్కడ నుంచీ నేను గైడ్ చేస్తాను … ఆయన ఇంట్లోనే ఈ రోజు షూట్ అన్నారు రాంబాబు. వెళ్లాను. తీరా వెళ్లిన తర్వాత ఆయన షూట్ లో బిజీగా ఉన్నారు. మధ్యాహ్నం లంచ్ టైమ్ లో నన్ను ఆయన ముందు ప్రవేశపెట్టారు.
విషయం చెప్పాను … సరే … మాట్లాడదాం … ఇప్పుడో సీన్ ఉంది . ఇది అవగానే మనం కూర్చుందాం అన్నారాయన. ఆ సీన్ అయిపోయింది . మేడ మీద షూట్ జరిగింది … ఆయన దిగి వస్తున్నారు … నేను ఎదురువెళ్లాను… నాకూ జాన్సన్ కీ ఉన్న అనుబంధం గురించి ఇందాక మీరు మాట్లాడారు కదా … అదే … మన సినిమాలకు చాలా మంచి పాటలు ఇచ్చారాయన. మీరే రాసేయండి … పర్వాలేదు నేను విడిగా మీకు చెప్పేదేముంది అన్నారాయన. అంటూనే … విజయచందర్ తో మాట్లాడారా? అని అడిగారు. లేదు సార్, ఆయన నంబర్ కోసం ప్రయత్నం చేస్తున్నాను అన్నాను.
ఒక్క నిమిషం అని ఆయనే ఎవరికో కాల్ చేసి, విజయ్ చందర్ నంబర్ సంపాదించి నాకు ఇచ్చి … తనే స్వయంగా విజయ్ చందర్ తో మాట్లాడారు ..
Ads
విజయ్ చందర్ వీళ్లు మోదుకూరి జాన్సన్ గారి గురించిన విశేషాలతో పుస్తకం తెస్తున్నారు. … నా దగ్గరకు వచ్చారు ఇంటర్యూ కోసం నేను మాట్లాడేశాను … నువ్వు కూడా మాట్లాడాలి … ఎక్కడ ఎప్పుడు కలవాలో చెప్పు వీళ్లు వస్తారు అన్నారు … ఆయన రేపు ఉదయం పదిగంటలకు కుకట్ పల్లిలో కలుస్తాను రమ్మనండి అన్నారు… అదే మాకు చెప్పి వెళ్లండి అన్నారు. నేను బయల్దేరబోతుండగా … అవునూ పీసీరెడ్డి ఇంటర్యూ తీసుకున్నారా? అని అడిగారు … నేను ఆయనెందుకూ అన్నట్టు చూశాను …
జాన్సన్ గారు రచన చేసిన తొలి చిత్రం మరో ప్రపంచం … పిసిరెడ్డి గారికి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో చేరిన తొలి చిత్రం కూడా అదే. కనుక ఆయనతో మాట్లాడిస్తే మీకు ఎక్కువ వివరాలు దొరుకుతాయి … ఈ సీరియల్ కు తనే డైరెక్టరు … పైనున్నట్టున్నాడు .. పిలిపిస్తానుండండి … అన్నారు … పైకి కబురు పెట్టారు … రెడ్డిగారు వచ్చారు … ఆయనతో మాట్లాడుతూ ఉండగా … మళ్లీ కృష్ణగారు వచ్చి … ఇప్పుడే విజయనిర్మల వచ్చింది … బైట లాన్ లో ఉంది … తను డైరెక్ట్ చేసిన సినిమాలకు కూడా జాన్సన్ గారు సహకారం అందించారు … చెప్పాను మీతో మాట్లాడమని .. వెళ్లండి . అని తన గదిలోకి వెళ్లిపోయారు.
ఆ తర్వాత అక్కడే ఉన్న ఓ వ్యక్తిని పిల్చి .. ఇతని పేరు వాల్మీకి … నా పర్సనల్ వ్యవహారాలన్నీ ఇతనే చూస్తాడు .. ఇతన్ని నా దగ్గర పన్లో పెట్టింది ఎవరో తెల్సా? అని అడిగి … జాన్సన్ గారే అని తనే సమాధానం కూడా చెప్పేశారు. జాన్సన్ గారి పుస్తకం అచ్చైన తర్వాత మళ్లీ కృష్ణగారింటికి వెళ్లాను.. ఈ సారి వాల్మీకి ద్వారా కల్సాను. ఆయనతో కలసి కాఫీ తాగాను ఆరోజు. ఆయనకి అలవాటుందో లేదో గానీ రెండు గుటకలు వేసి పక్కన పెట్టేశారు … కాఫీ మాత్రం నాకు నచ్చింది … తాగేశాను …
పుస్తకం బాగా వచ్చింది … ఏమిటి విషయం అన్నారాయన … దీని ఆవిష్కరణ వాళ్లు కొలకలూరులో ప్లాన్ చేస్తున్నారు సార్ … మీరు కూడా వస్తే బావుంటుందని అభ్యర్ధన … అన్నాను. హైద్రాబాద్ లో పెడితే కొంత వరకూ ఆలోచించవచ్చుగానీ … బైటకు మాత్రం రాలేను … సారీ … అంటూనే … మా ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదా … ఇక్కడికే అందరినీ పిలుస్తాను … వాళ్ల వైపు నుంచీ వచ్చేవాళ్లున్నా ఇక్కడికే రావచ్చు అన్నారాయన . లేదండీ వాల్లు అక్కడే అని ఫిక్స్ అయ్యారు అన్నా …
సరే మీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పేశాను … అన్నారు … ఈ రెండు సార్లు కల్సినప్పుడూ ఆయన సూపర్ స్టార్ లా బిహేవ్ చేయలేదు … ఓ ఫ్రెండ్ లా తోటి కార్యకర్తలానే మాట్లాడారు … ఆ తర్వాత మళ్లీ ఆయన్ని కల్సే అవసరం రాలేదు … కానీ నేను ఇంటర్యూ అడిగితే … ఏదో కాసేపు మాట్లాడి పంపేస్తే పోయేదానికి … తనే వేరే వాళ్లతో మాట్లాడి వాళ్ల ఇంటర్యూలు ఇప్పించి … ఒక కార్యకర్తలాగా ఆయన బిహేవ్ చేసిన పద్దతి మాత్రం ఆశ్చర్యం కలిగించింది. కృష్ణగారు లేరు అనగానే ఆనాటి దృశ్యం నా కళ్లముందు ప్రత్యక్షమైంది ….
Share this Article