ఒక వార్త… చిన్న వార్తే… మావోయిస్టుల ప్రకటన అది… ఏముంటుందిలే, పిడివాదాలు, పడికట్టుపదాలే కదా అని పైపైన చదువుతూ ఉంటే, ఓచోట చూపు స్టకయిపోయింది… బూటకపు ఎన్నికలను బహిష్కరించండి అని ప్రజలకు ఓ లేఖ రాసింది మావోయిస్టు పార్టీ, ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ అరుణక్క… సరే, ఎన్నితరాలైనా, ఎవ్వరూ పాటించకపోయినా సరే ఆ నినాదం ఉంటుంది… మన శుష్కభావజాలం మన ఎత్తుగడల్ని కూడా మారనివ్వదు… అదే భాష, అదే ఛాందస సిద్ధాంతం, అదే కాలం తిరస్కరించిన ఆచరణ… ఆ శుష్కవాదంలోకి ఇప్పుడు వెళ్లడం వద్దులే గానీ… ఆ లేఖలో కొన్ని వాక్యాలు… ‘‘దోపిడీ పార్టీలయిన టీడీపీ, బీజేపీ, వైసీపీలను తరిమికొట్టాలి… రాష్ట్రంలో జగన్ ఫ్యాక్షనిస్టు నియంత్రణ పాలన నడుస్తోంది… జగన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే మూడు రాజధానులు… చివరకు రాజ్యాంగం, కోర్టులను కూడా ధిక్కరిస్తున్నాడు…’’ ఇలా సాగిపోయింది లేఖ… గుడ్… మావోయిస్ట్ పార్టీ స్పిరిట్ ప్రకారం మనవన్నీ దోపిడీ పార్టీలు, బూర్జువా పార్టీలు, ఫాసిస్టు పార్టీలు ఎట్సెట్రా ఎట్సెట్రా… సో, మతవాద బీజేపీని, దోపిడీవాద టీడీపీని, ఫ్యాక్షనిజం వైసీపీని తరిమేయాలి… తరిమేద్దాం… బొందపెడదాం సరే… మరి జనసేన అనబడే ఓ పార్టీ కూడా ఉంది కదా ఏపీలో… దానికి బీజేపీకన్నా ఎక్కువ వోట్లున్నయ్… మీ సోదర లెఫ్ట్ పార్టీలున్నయ్… వాళ్లూ బరిలోనే ఉన్నారు…
మరి జనసేనను ఏం చేయాలి కామ్రేడ్ అరుణక్కా..? దాన్ని దోపిడీ పార్టీల జాబితాలోకి చేర్చలేదా ఇంకా..? లేక అది దోపిడీ పార్టీయే కాదా..? పవన్ కల్యాణ్ మావోయిస్టు పార్టీకి కూడా చేగు వేరా టైపు విప్లవయోధుడిగా కనిపిస్తున్నాడా..? లేక దాన్ని అసలు ఓ రాజకీయ పార్టీగానే గుర్తించడం లేదా..? అదే లేఖలో కాస్త క్లారిటీ ఇస్తే బాగుండు… వోట్లు ఏమీ రాలకపోయినా బాగా ఊగిపోయే పార్టీ అది… ప్రజారాజ్యం అనబడే మరో ఫ్యూడల్ పార్టీని స్థాపించి, తరువాత అమ్మేసుకున్న హీరో తమ్ముడి పార్టీ… దాని మీద మావోయిస్టు పార్టీకి ఏదో ఒక అంచనా, ఒక అవగాహన, ఒక లైన్ ఉండాలి కదా… ఓహ్, తన అడుగులు, తన మాటలు నక్సలైట్లకు కూడా అర్థంగాక, అర్థం చేసుకోలేక, జుత్తు పీక్కొని, తాత్కాలికంగా పక్కన పడేశారా..?! వోకే… పవన్ కల్యాణ్‌కు పరోక్షంగా సర్టిఫికెట్ ఇచ్చారే అనుకుందాం… కానీ నిమ్మగడ్డ వర్సెస్ జగన్ ఏదో యుద్ధం జరుగుతున్నది… అది కులం బురదలోకి కూడా దిగింది… ఇక్కడ జగన్ మాత్రమే రాజ్యాంగాన్ని, కోర్టులను ధిక్కరిస్తున్న ద్రోహిగా కనిపిస్తున్నాడా..? రాజ్యాంగసంస్థల మీద ఇంత గౌరవం, సదభిప్రాయం అకస్మాత్తుగా ఎలా ఏర్పడింది కామ్రేడ్ మీకు..? మూడు రాజధానులు జగన్ రియల్ ఎస్టేట్ దందా విస్తరణ కోసమా..? లేక వైజాగులో ప్రభుత్వం, పోలీసుల కదలికలు, ఉనికి పెరిగేకొద్దీ మావోయిస్టు కార్యకలాపాలకు సెగ తగులుతుందీ అనే భావనా..? ప్చ్… మావోయిస్టు పార్టీ ప్రకటన అంటే ఎలా ఉండాలి అసలు..? అబ్బే… పంచ్ లేదక్కా…!!
Ads
Share this Article