ఏమో మరి… బహుశా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రమే బాగా కనిపించిందేమో… వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల ఆధారంగా కమ్మ, కాపు కులాల మధ్య విద్వేషం రగిలించడానికి వైసీపీ సోషల్ మీడియా విభాగం తీవ్రంగా శ్రమపడిందనేది ఆర్కే వారి ఉవాచ… వీరయ్య సినిమా మీద కాపు, వీరసింహారెడ్డి సినిమా మీద కమ్మ సెక్షన్ సోషల్ మీడియాలో విపరీతంగా వ్యతిరేక పోస్టులు పెట్టాయనీ, అవన్నీ వైసీపీ ప్రేరేపితమనీ ఆర్కే విశ్లేషణ…
నిజానికి అంత సీన్ ఏమీ కనిపించలేదు… గతంలో ఇలా కమ్మ వర్సెస్ కాపు పోస్టుల సమరం ఉండేదేమో కానీ ఈరెండు సినిమాల విషయంలో అదేమీ పెద్దగా లేదు… వీరయ్యకు అనుకూలంగా కాపులు, వీరసింహారెడ్డికి అనుకూలంగా కమ్మలు సైడ్ తీసుకున్నట్టు… ఎదుటి కులం సినిమాను డిగ్రేడ్ చేయడానికి పోస్టులు పెట్టినట్టు ఆర్కే మాత్రమే చూశాడేమో…
ఇందులో రాజకీయ కుట్ర ఉందనీ, వైసీపీ దానికి తెగించిందనీ ఆర్కే వాదన… ఒకవేళ అది నిజమైనా సరే, వైసీపీ రాజకీయ పార్టీయే కదా… రాజకీయం కాకపోతే ఇంకేం చేస్తుంది… ఒకవేళ పవన్ కల్యాణ్, చంద్రబాబు నడుమ దూరాన్ని పెంచాలని గనుక వైసీపీ సీరియస్‌గా భావిస్తే, దానికి ఈ రెండు సినిమాల హీరోల కులాలు పనికొస్తాయని భావిస్తే… అలాగే ఫేక్ పోస్టుల సమరాన్ని క్రియేట్ చేస్తారు… ఎవరు చేయడం లేదు..? టీడీపీ, జనసేన ఈ కుల సమరంలో లేవా..?
Ads
అసలు అన్ని పార్టీల సోషల్ విభాగాలు చేస్తున్న పనీ అదే… జనసేనకు లేరు గానీ టీడీపీకి, వైసీపికి ఎన్నికల వ్యూహకర్తలు కూడా ఉన్నారు… తెల్లారిలేస్తే వాళ్లకు ఇదే పని… ఏం చేసి, ఎదుటి పార్టీల మధ్య చిచ్చు పెట్టాలి..? ఇదే ఆలోచన… ఆ రెండు సినిమాలకే వద్దాం… ఎస్, వీరయ్య కాపు, వీరసింహయ్య కమ్మ… సో వాట్..? రెండు సినిమాల నిర్మాతలూ సేమ్… హీరోయిన్ కూడా సేమ్… ఇద్దరూ దాదాపు అచ్చొచ్చిన ఫార్ములా రూట్‌లోనే వెళ్లారు…
ఒకరిది నరుకుడు భాష… మరొకరిది తుపాకుల భాష… సంక్రాంతి వేళ నాలుగు డబ్బులు రావాలని ఏదో కష్టపడ్డారు ఇద్దరూ… కాకపోతే బాలయ్య సినిమాలో కొన్ని జగన్ పాలనకు వ్యతిరకంగా కొన్ని వ్యాఖ్యలున్నాయి… అంతే… కమర్షియల్ కోణంలో వీరసింహుడికన్నా వీరయ్య కాస్త బెటర్ కలెక్షన్లు సాధిస్తున్నాడట… నిజంగానే వైసీపీ ఈ రెండు కులాల నడమ పెంటపెట్టే ప్రమాదం ఉందని గ్రహించినట్టున్నారు… కమ్మ బాలయ్య కాపు అరవింద్‌కు చెందిన ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షోకు పవన్ కల్యాణ్‌ను పిలిచాడు… ఫీడ్ రెడీ, ప్రసారం చేయాల్సి ఉంది…
ఒకవేళ నిజంగానే కమ్మ, కాపుల నడుమ మంట పెట్టే ప్రయత్నం చేసినా సరే, ఈ ఎపిసోడ్ ఆ ప్రయత్నాలపై నీళ్లు పోస్తుంది… వీరసింహా సినిమా చూడాలని చిరంజీవి, వీరయ్య సినిమా చూడాలని బాలయ్య ప్రేక్షకులకు విజ్జప్తి చేయడం ద్వారా హుందాతనం చాటుకున్నారు… అయితే ఆర్కే వ్యాసంలో చెప్పిన ఒక మాట నిజం… తెలంగాణ కొత్త సీఎస్ శాంతికుమారి నియామకానికి కులం రంగు పులమడం రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా కులాల పోలరైజేషన్‌కు, ఏపీలోని కులం కంపు తెలంగాణకు కూడా పాకే ప్రమాదానికి సూచిక…!!
Share this Article