జగన్‌ను రాధాకృష్ణ తిట్టేస్తాడు… రాధాకృష్ణను జగన్ తిట్టేస్తాడు… అది పాత్రికేయ-రాజకీయ వృత్తి వైరం ఏమీ కాదు… రాజకీయ వైరమే… అయితే అప్పుడప్పుడూ రాధాకృష్ణ అనాలోచితంగా జగన్‌కు తన పత్రిక ద్వారా అక్కరకొచ్చే సలహాలు పరోక్షంగా ఇస్తుంటాడు… ఉద్దేశపూర్వకంగా కాదు, అనుకోకుండానే..! అవి వాడుకుంటాడా లేదానేది జగన్ ఇష్టం… తనవన్నీ పైథాగరస్‌ను మించిన లెక్కలు కదా…
విషయం ఏమిటంటే… తమిళ సినిమా హీరో (తెలుగులోకి కూడా డబ్ అవుతుంటాయి తన మూవీస్…) జి.విశాలకృష్ణారెడ్డి అలియాస్ విశాల్‌ను జగన్ చంద్రబాబుపై కుప్పం నియోజకవర్గంలో పోటీకి దింపాలని ప్రయత్నిస్తున్నాడని ఆంధ్రజ్యోతి రాసిన వార్త సారాంశం… జగన్ ఇప్పటిదాకా నిజంగానే ప్రయత్నిస్తున్నాడో లేదో తెలియదు గానీ ఇప్పుడు సీరియస్‌గా ట్రై చేస్తే బెటరే… మాంచి పందెంకోడిని ఉసిగొల్పినట్టే…
Ads
విశాల్ ఫైటర్… అంత తేలికగా వదిలేసే రకం కాదు… తమిళ ఇండస్ట్రీలో ఉన్న తీవ్రమైన పోటీ నడుమ కూడా నిలదొక్కుకున్నాడు… నిలబడ్డాడు… రాజకీయాలు, పోటీలు, ఎన్నికల మీద విశాల్‌కు యావ ఎక్కువే… నడిగర్ సంఘానికి (మూవీ ఆర్టిస్ట్స్ సంఘం) పోటీపడి, జనరల్ సెక్రెటరీగా గెలిచిన విశాల్‌ను తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఓ దశలో బహిష్కరించింది… ఏవో కామెంట్స్ చేశాడని… తరువాత విశాల్ సొంతంగా విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టరీ పేరిట ఓ సినిమా ప్రొడక్షన్ కంపెనీ పెట్టుకున్నాడు… తనే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పోటీల్లో నిలబడ్డాడు… తనను బహిష్కరించిన సంఘానికి తనే ప్రెసిడెంట్ అయ్యాడు…
అంతేకాదు, విశాల్‌కు రాజకీయం వాసన కూడా ఇష్టమే… జయలలిత మరణం తరువాత ఆర్కేనగర్ ఉపఎన్నిక వచ్చింది కదా… అది ప్రిస్టేజియస్ సీటు… దానికీ స్వతంత్రుడిగా నామినేషన్ వేశాడు… కాకపోతే ఏవో సాంకేతిక కారణాలతో రిజెక్ట్ చేశారు ఆ నామినేషన్‌ను… వరదలు, భారీవర్షాలు, ఇతర విపత్తుల్లో విశాల్ జనంలోకి వస్తాడు, సాయంగా నిలుస్తాడు, ఇతర పెద్ద హీరోలతో పోలిస్తే తన మార్కెట్ తక్కువే అయినా తన స్పెషాలిటీని కాపాడుకుంటాడు…
కుప్పంలో చంద్రబాబును ఓడించడం అసాధ్యమేమీ కాదు… జగన్ ఆలోచన అసాధారణం కూడా కాదు… గత ఎన్నికల్లోనే విపరీతంగా ప్రయత్నించారు గానీ వర్కవుట్ కాలేదు… కానీ స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు బలాన్ని పగులగొడుతూ, బలహీనపరుస్తూ వైసీపీ బలం పెంచుకుంది… పట్టు పెరిగింది… నిజానికి కుప్పం చంద్రబాబు సొంత నియోజకవర్గమేమీ కాదు… చంద్రగిరి నుంచి అక్కడికి వలసవెళ్లి, సురక్షిత స్థావరంగా మార్చుకున్నాడు…
ఏపీ సరిహద్దుల్లో కర్నాటక, తమిళనాడుల్లోకి ఓ కొమ్ములా పొడుచుకువచ్చినట్టుగా ఉంటుంది ఆ నియోజకవర్గం… తమిళం మాట్లాడేవాళ్లు ఎక్కువే… నగరిలో రోజాలాగా… అంటే తమిళం ప్లస్ తెలుగు… కుప్పంలో విశాల్ ఉపయోగపడగలడు… పైగా రెడ్డి… ఇక చూసుకొండి… రెడ్డి వర్సెస్ కమ్మ… విశాల్ తండ్రి, నిర్మాత జీకేరెడ్డికి కుప్పం ఏరియాలో వ్యాపారాలు కూడా ఉన్నాయి… అంటే ఆ ఏరియాతో సంబంధాలు, పరిచయాలు సజీవంగా ఉన్నాయి… విశాల్‌కు హీరోగా పాపులారిటీ ఉంది… అయితే ఎటొచ్చీ ఓ చిక్కు ప్రశ్న… జగన్ పట్ల జనంలో ఆదరణ గత ఎన్నికల స్థాయిలో ఉందా అనేదే..!!
కానీ ఏమాటకామాట… జగన్‌కు మొత్తం 175 సీట్లూ కావాలట… కాస్త ఆంధ్రజ్యోతి పూనుకుని, ఇలాగే కీలక నియోజకవర్గాల్లో ఎవరెవరో బెటరో రాస్తూ ఉంటే జగన్‌కు మేళ్లు చేసినవారవుతారు…!! అబ్బే, విశాలే ఇలాంటి ఫీలర్లు కావాలని వదులుతున్నాడు అని మరో టాక్… ఏమో, తనంతటతాను ఆంధ్రా పాలిటిక్సులోకి ఎంట్రీ ఇస్తాడా..? డౌటే…!!
Share this Article