అనుకున్నదే… వెంకయ్యనాయుడికి రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ అవకాశం ఇవ్వకపోవడాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈసడించుకుంటాయని అనుకున్నదే… మోడీని, షాను నిందిస్తాయనీ అనుకున్నదే… తనను గనుక అభ్యర్థిగా ఎంపిక చేస్తే వెంటనే తన చరిత్ర కథనాలతో ప్రత్యేక పేజీలు వెలువరించడానికి రెడీ అవుతాయనీ అనుకున్నదే… వెంకయ్యనాయుడిని పక్కన పెట్టేయడం ద్వారా మోడీ ఈనాడు, ఆంధ్రజ్యోతి మనోభావాలను గాయపరిచాడు… (టీవీ5 అనే చానెల్ కూడా బాగానే హర్ట్ అయి ఉంటుంది…)
కానీ ఈనాడు ఎందుకోగానీ నెగెటివ్ వ్యాఖ్యానాల జోలికి పోలేదు… తమాయించుకుంది… ద్రౌపది ముర్ము ఎంపిక, ఇటు విపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఎంపికల మీద సంయమనంతో కథనాలు ఇచ్చింది… సరైన ప్రాధాన్యం కూడా ఇచ్చింది… ఆంధ్రజ్యోతి కవరేజీ కూడా బాగానే ఉంది కానీ తన ఫీలింగ్స్ రాసుకోకుండా ఉండలేకపోయింది… నిజానికి వెంకయ్యనాయుడు బాధపడ్డాడో లేదో తెలియదు గానీ… ఆయన బాధను కూడా ఆంధ్రజ్యోతే భరించింది ఫాఫం…
Ads
నీకు సాయం చేసినవాడికి అన్యాయం చేస్తావా..? నీకు అన్నం పెడితే నువ్వు సున్నం పెడతావా..? అసలు నీకు కృతజ్ఞత అనేది ఉందా మోడీ… మరీ ఇంత అన్యాయమా..? ఇలా మొండిచేయి చూపిస్తావా..? ఏం..? మా వెంకయ్య నీకు ఏం తక్కువ చేశాడో చెప్పు… నీకు ప్రతి సందర్భంలో భరోసాగా నిలబడ్డాడు… నీ ఎదుగుదలకు కారణమయ్యాడు… కానీ నువ్వేమో తనను పక్కన పెట్టేసి ద్రోహం చేస్తావా..?…. అన్నట్టుగా సాగిపోయింది ఓ కథనం…
‘‘గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి మోడీని తీసేయాలని వాజపేయి పట్టుబట్టిన సందర్భంలో అద్వానీతో కలిసి వెంకయ్యే మోడీకి బాసటగా నిలిచాడు… మోడీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు కావడానికి సహకరించాడు… మోడీని ప్రధాని అభ్యర్థిగా నిర్ణయించినప్పుడు అద్వానీకి నచ్చలేదు, కానీ వెంకయ్యే అద్వానీ నచ్చజెప్పి, మోడీ ఎదగడానికి కారణమయ్యాడు…. కేబినెట్ మంత్రిగా మోడీ విధానాలను సమర్థించాడు… ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా మోడీ ప్రభుత్వ మనోభావాలకు అనుగుణంగా నడుచుకున్నాడు… చివరకు మోడీ మీద వెలువడిన ఓ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించాడు… ఇంతా చేస్తే కనీసం తదుపరి రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో కూడా వెంకయ్యకు ముందుగా తెలియనివ్వలేదు… చెప్పలేదు’’ ఇలా ఏమిటేమిటో రాసుకుంటూ కన్నీళ్లు కార్చింది ఆ కథనం…
ఏదో ఏదో రాసుకుని బాధ తగ్గించుకోవడమే తప్ప… వీసమెత్తు పాత్రికేయ స్పృహ లేదు ఇందులో… మోడీ వచ్చాక తన గురువైన అద్వానీతోపాటు చాలామందిని ‘‘పార్టీ వృద్ధాశ్రమం’’లోకి నిర్దయగా తరిమేశాడు… ఇప్పుడు విపక్ష రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కూడా అలా తరిమివేతకు గురైన వ్యక్తే… నిజానికి వెంకయ్యే నయం… ఉపరాష్ట్రపతి పదవినిచ్చి మర్యాదగా పక్కకు నెట్టేశాడు మోడీ… తను కూడా రాజకీయవేత్తే కదా… పార్టీ మీద తన గ్రిప్ కావాలంటే సీనియర్లందరినీ పంపించేయడమే మార్గం అనుకున్నాడు… పైగా పార్టీ ప్రయోజన కోణంలో ఆలోచిస్తే ద్రౌపది ముర్ము ఎంపికే కరెక్టు…
చాలా సింపుల్… పార్టీ యాక్టివ్ పాలిటిక్స్ నుంచి పక్కకు తప్పించడానికే వెంకయ్యను ఉపరాష్ట్రపతిగా పంపించినప్పుడు… ఇక రాష్ట్రపతి పదవికి తన పేరును ఎందుకు ఆలోచిస్తాడు మోడీ..? రాష్ట్రపతిగా చాన్స్ ఇవ్వకపోతో పోయారు గానీ, కనీసం ఎవరిని చేస్తున్నారో కూడా ముందుగా వెంకయ్యకు చెప్పలేదు ఫాఫం అని ఆంధ్రజ్యోతి ఏదో బాగా బాధపడిపోయింది… కానీ బాధపడాల్సింది అది కాదు… అధికార పర్యటనలో ఉన్న తనను హడావుడిగా రప్పించి, ముగ్గురు అగ్రనేతలు ఆయన ఇంటికి వెళ్లి మరీ… నువ్వు మాకిక అక్కర్లేదు సార్ అని చెప్పిన తీరు మాత్రం నభూతో..!!
Share this Article