వినదగునెవ్వరు చెప్పిన…. అన్నారు పెద్దలు..! ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొన్ని హితవచనాలు పలుకుతున్నాడు… జగన్ మారీచసంతతి అని యెల్లో ద్వేషంతో నిందించవచ్చుగాక… కేసీయార్ శిబిరం సైతం ఆంధ్రజ్యోతిని పలుసార్లు తూలనాడవచ్చుగాక… కానీ కొన్ని పలుకుల్ని పరిగణనలోకి తీసుకోవాలి… ప్రత్యేకించి తమ తెలుగుదేశం శిబిరం అనుభవాలనే ఉదహరిస్తున్నందున… చంద్రబాబు తప్పుడు అంచనాలతో వేసిన అడుగులతో ఎలా నష్టపోయాడో చెబుతున్నందున కేసీయార్ తన చిరకాల సన్నిహితుడు రాధాకృష్ణ పలుకుల్ని విని, చదివి, ఆలోచించవచ్చుగాక…
అందరికీ తెలుసు… కాంగ్రెస్ పుంజుకుంటున్నదనే తప్పుడు అంచనాలతో మోడీషాలకు వ్యతిరేకంగా నానా వేషాలు వేసిన చంద్రబాబు ఏం నష్టపోయాడో చూశాం… చివరకు ఎటూగాకుండా పోయింది ఆ శిబిరం పరిస్థితి… మోడీ దగ్గరకు రానివ్వడు… కాంగ్రెస్ ఎదగదు… మూడో ఆల్టర్నేట్ సాధ్యం కాదు… అతుకులబొంతల మీద జనానికి తీవ్ర వ్యతిరేకత… ఫాఫం, యూపీయే కోసం వందల కోట్లు ఖర్చుపెట్టినా సరే పరాభవమే మిగిలింది… వృద్ధుడైపోయాడు… సరైన నాయకవారసత్వం లేదు…
Ads
అది గుర్తుచేయడమే కాదు… కేంద్రం ఆల్‌రెడీ నీ చుట్టుపక్కల ఆర్థికస్థంభాల్ని కూల్చడానికి దర్యాప్తు సంస్థల్ని ప్రయోగించేట్టుగా ఉంది కేంద్రం… బహుపరాక్ అంటున్నాడు రాధాకృష్ణ… నిజానికి ధాన్యం విషయంలో కేసీయార్ వేసిన తప్పుటడుగులు అందరికీ తెలుసు… తను రాష్ట్ర రైతులకు ఏం చేయాలో తెలియక, దాన్ని ఎవరికి రుద్దాలో అర్థం గాక కిందా మీద పడుతున్న స్థితిని పరోక్షంగా రాధాకృష్ణ గుర్తుచేస్తున్నాడు… లేడీ గవర్నర్ పట్ల అనుచిత వైఖరి, ధాన్యం విషయంలో అశాస్త్రీయ ధోరణి స్థూలంగా రాష్ట్ర ప్రయోజనాలకే వ్యతిరేకంగా మారుతున్న స్థితిని విశ్లేషిస్తున్నాడు… అంతేకాదు, అది కేసీయార్‌కు కూడా పొలిటికల్‌గా నష్టాన్ని కలిగిస్తుంది… వ్యక్తిగతంగా తన సంస్కార స్థితిని కూడా ప్రజల్లో పలుచన చేస్తుంది…
అఫ్‌కోర్స్, కేసీయార్ ఇలాంటి విషయాల్లో ఏమీ తెలియని అమాయకుడు కాదు… గల్లీలో ఒకరకంగా, ఢిల్లీలో మరోరకంగా తన రాజకీయ ధోరణిని ప్రదర్శిస్తున్నాడు… 11న ఢిల్లీలో తలపెట్టిన ధాన్యం దంగల్‌లో తను పాల్గొంటాడనేది డౌటే… కాకపోతే ఓ నిర్ణయం తప్పదు… గతంలో ‘ముచ్చట’ కూడా చెప్పింది… రైతాంగం మోడీని చూడదు, కేసీయార్ ఏం చేస్తాడనేదే చూస్తుంది… అందుకని తనే కొనుగోలు చేయబోతున్నాడని ఓ ప్రాథమిక సమాచారం… ఆల్‌రెడీ ఎమ్మెల్యేలకు ఈ విషయంలో సమాచారం ఇచ్చారట…
రాష్ట్ర ప్రభుత్వం గనుక కొంటే… ఆ ధాన్యాన్ని ఏం చేయాలనేది ప్రశ్నే… ఇన్నాళ్లూ దాని గురించి పట్టించుకోకుండా ఏవేవో రాజకీయ ఉద్దేశాలతో సమస్యను పక్కదోవ పట్టించే ప్రయత్నం జరిగింది… ఇప్పుడు తను కొనుగోలు చేస్తే (ఎంతోకొంత, రాజకీయంగా నష్టం జరగకుండా…) ఆ ధాన్యాన్ని ఏం చేయాలి..? గతంలో ఓసారి రియల్ ఔట్‌పుట్ మీద టెస్టింగ్ చేశారట, ఇప్పుడు మళ్లీ చేస్తారట… ఈనాడులో ఓ చిత్రమైన వార్త వచ్చింది…
2015లో చేశారట… అప్పట్లో చెరువులు, బోర్ల కింద సాగు కాబట్టి నూకలు ఎక్కువట… ఇప్పుడు మిల్లింగ్ టెస్ట్ చేయిస్తే ఎక్కువ ఔట్‌పుట్ రావచ్చునని ఆశ ఉందట… అత్యంత అపరిణిత విశ్లేషణ… 2015 నుంచి కొత్తగా ఏం సాగునీటి ప్రాజెక్టులు వచ్చాయో ఈనాడే చెప్పాలి… అంతకుముందు ఉన్నవే కదా… ఆ సాకు దేనికి..? ప్రమాణాలు దిగజారిన ఈనాడు మార్క్ విశ్లేషణ ఇది… సరే, ఆ పత్రిక దురవస్థను వదిలేస్తే…
ముందుగా ఆలోచించాల్సింది కేవలం తెలంగాణకే ఎందుకీ పరిస్థితి వస్తోంది..? సరైన కోణంలో విశ్లేషించుకుని, అడుగులు వేస్తే తప్ప రైతాంగానికి రిలీఫ్ రాదు… సో, 11 ఢిల్లీ ధర్నా ఏదో చేసేసి, తరువాత రాష్ట్ర ప్రభుత్వమే ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించబోతున్నదీ అని సాక్షి బ్యానర్ స్టోరీ ఈరోజు… బహుశా రాధాకృష్ణకు ఐడియా లేనట్టుంది… పైగా గవర్నర్ ఇష్యూ మీద రాధాకృష్ణ తన సహజ ధోరణికి భిన్నంగా అటూఇటూ గాని విశ్లేషణకు వెళ్లాడు…
బట్ ఎనీవే… కేసీయార్ ఆలోచన ధోరణి, వెళ్తున్న పంథా తనకే నష్టదాయకం అని పరోక్షంగా తేల్చేసి చెబుతున్నాడు రాధాకృష్ణ… నిజానికి దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా కేసీయార్ నిజంగానే బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తున్నాడు అని నమ్మడం లేదు… తను తెర వెనుక వేరు… తెర మీద వేరు… ఒకవేళ బీజేపీ తనకు అలవాటైన పద్ధతిలో కేసీయార్ చుట్టూ ఉండే ఆర్థికస్థంభాల్ని కూల్చే ప్రయత్నంలో ఉంటే… (గతంలో చంద్రబాబు మీద చేసినట్టు, అన్ని రాష్ట్రాల్లోనూ చేస్తున్నట్టు)… కేసీయార్ ఏం చేయాలి..? సాహసించి తిరగబడాలా..? మౌనాన్ని ఆశ్రయించాలా..?
ప్రస్తుతం జాతీయ స్థాయిలో కేసీయార్‌తో కలిసివచ్చే వాళ్లెవరూ లేరు… సో, ఈ ఫెడరల్, డెమొక్రటిక్, థర్డ్, ఆల్టర్నేట్ ఫ్రంట్ అనేది తన నేతృత్వంలో సాధ్యం అయ్యే స్థితి లేదు… అందుకని రాష్ట్రం అనే కోణంలో ఆలోచించాలని రాధాకృష్ణ హితవచనాలు చెబుతున్నాడు… వినదగిన సూచనలే…!! నో, నో, నేనిలాగే ఉంటాను, సర్జికల్ స్ట్రయిక్స్‌లో ఏం పీకారు, చైనా వాడు దంచికొడుతున్నాడు వంటి వ్యాఖ్యలు ప్రజల్లో వ్యతిరేకతకు దారితీసే చాన్సుంది… కొత్త దోస్తు పీకే కూడా అది చెప్పాడో లేదో…!!
Share this Article