విను తెలంగాణ – ‘ఆలస్య’ రాష్ట్ర సమితి : కాయితీ లంబాడీల ఆగ్రహ ప్రకటన !
ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని వివిధ బృందాలు, సమూహాలు అధికార బిఆర్ఎస్ పార్టీ కి వ్యతిరేకంగా సమాయత్తం అవుతున్నాయా అంటే అవుననే పలు ప్రాంతాలను సందర్శిస్తుంటే తెలిసి వస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధికంగా ఉన్న బోయ కమ్యూనిటీ మాదిరిగానే కామారెడ్డి జిల్లాలోని కాయితీ లంబాడీలు కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు చేయాలని ఏకాభిప్రాయంతో ముందుకు కదలాడుతున్నరు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లబనా (కాయితీ) గిరిజన తండాలను సందర్శిస్తుంటే అందరూ ఒక్క త్రాటి మీద ఉన్నట్టు, వారంతా నిశబ్దంగా తమ వోటును బిఆర్ఎస్ కి వ్యతిరేకంగా వేయడానికి సంకల్పించినట్టు తెలుస్తోంది. వెనుకబడిన తరగతుల్లో ఒకరిగా (బిసి డి గ్రూపు) గుర్తింపబడి ఉన్న వీరంతా ఎంతో కాలంగా ఎస్టీల్లో కలపాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇంతదాకా తమకు హామీ ఇస్తున్న బిఆర్ఎస్ పార్టీని మరొకసారి నమ్మడానికి వారు ఎంతమాత్రం సిధ్ధంగా లేనట్టు క్షేత్రస్థాయి సమాచారం రుజువు చేస్తున్నది. చాలా బృందాలు అనేక విషయాల్లో ప్రభుత్వం చాలా ఆలస్యం చేసిందని, ఇక మూడో సారి తమకొద్దని చెప్పడానికి మాటలు కట్టిపెట్టి ఓటుతో సమాధానం చెప్పాలని భావిస్తున్నట్టు భావిస్తున్నారు.
Ads
నిజానికి ఎనభయ్యవ దశకం దాకా ఎస్టీలుగానే ఉన్నప్పటికీ తర్వాత కాయితీ లంబాడాలను ప్రభుత్వం బిసి డి గ్రూపులో చేర్చిందని, అప్పటి నుంచి తమలోని ఒక తరం యువత విద్యా- ఉద్యోగ- ఉపాధి అవకాశాలకు దూరం అయ్యారని, అంతేకాదు, చట్టపరంగా పోడు భూములు పొందే హక్కుకు కూడా దూరమయినట్లు చద్మల్ తండాకు చెందిన మందు ప్రేమ్ సింగ్ అన్నారు.
నేరెల్ తండాకు చెందిన కైలాస అన్న అమ్మాయి ఇంటర్ పూర్తి చేసింది. అదీ- బిసి డి గ్రూపు రిజర్వేషన్ సౌకర్యం వినియోగించుకుని. అ తర్వాత ఉన్నత చదువులు చదివే పరిస్థితి ఇంటిపట్టున లేకపోవడంతో ఆ యువతీ ప్రస్తుతం వ్యవసాయ పనులు చేసుకుంటోంది. ఆమెను పొలంలో ఫోటో తీస్తూ ఉండగా చెప్పింది, తనలాంటి వందలు, వేలాది యువతీ యువకులు గిరిజనులుగా గుర్తింపబడకపోవడంతో దాదాపు రెండున్నర మూడు దశాబ్దాలుగా ఎస్టీ రిజర్వేషన్ సొకర్యానికి దూరమయ్యారని, ఫలితంగా అటు మరింత మెరుగైన అవకాశాలు ఉపయోగించుకునే స్థితిలేదు, ఇటు జీవితంలో త్వరితంగా స్థిరపడే సౌలభ్యానికి దూరమయ్యామని ఆవేదనతో చెప్పింది. ఇలాంటి ఎందరో బడికి, కాలేజీకి, ఉద్యోగాలకు దూరమై అర్హత ఉండీ బాధపడుతున్న వైనం ప్రతి తండాలోని యువతతో పాటు పెద్దలూ చెప్పి విచార పడటం కనిపించింది.
నిజానికి కాయితీ గిరిజనుల్లో చాలా మంది గతంలో అంటే ఎనభై దశకానికి ముందు దాకా ఎస్టీలుగా ఉద్యోగాలు చేసిన వారున్నారు. కానీ ఈ మూడు దశాబ్దాలుగా తాము రిజర్వేషన్ ఫలాలు అందుకోక పోవడంతో అనేక విధాలా ఎంతగానో నష్ట పోయామని వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. విచారం కాదు, ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
గాంధారి మండలంలోని చద్మల్ తాండా, నాసీరాం తాండా, నేరెల్ తాండా, బీర్మల్ తాండా, నాగ్లూర్ తాండా, గొల్లాడి తండా, తిప్పారం తాండాలు మొదలు అనేక తండాల్లోని స్త్రీ పురుషులు, వయోజనులు పదేళ్లుగా అధికార బిఆర్ఎస్ పార్టీ మాట ఇచ్చి అన్యాయం చేసిందని విమర్శించారు. అందుకే ఈ దఫా తమ నిరసనను ఎన్నికల్లో ప్రదర్శిస్తామని బస్సి దేవ్ సింగ్ అన్న పెద్ద మనిషి అన్నారు.
ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ తో పాటు మెదక్ జిల్లాలో నివాసం ఉండే వీరు ప్రధానంగా వ్యవసాయం పశుపోషణపై ఆధారపడుతున్నారు. కాగా, తమ జనాభా ఏమీ తక్కువ కాదని, అది సుమారు రెండు లక్షల దాకా ఉంటుందని బంతి లాల్ మాంజా అన్న నాయకుడు చెప్పారు. ఆయన తమ తెగ జనాభాకు నిజామాబాద్, కామారెడ్డి – రెండు జిల్లాలకు అధ్యక్షులుగా పని చేస్తున్నారు.
నిజానికి వేలాది మందితో గత నెలలో కామారెడ్డి జిల్లా కేంద్రాన్ని దిగ్బంధించి వీరంతా కలక్టర్ కి వినతిపత్రం ఇచ్చారు. అంతేకాదు, ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ పార్టీ వైఖరి ఏమిటో చెప్పాలని గట్టిగా డిమాండ్ చేశారు. వారి ఆగ్రహానికి దిగివచ్చిన ప్రభుత్వం మంత్రి హరీష్ రావు గారు అలాగే స్థానిక ఎంపి పాటిల్ ద్వారా వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టాక వారిని తప్పకుండా ఎస్టీల్లో కలుపుతామని హామీ కూడా ఇచ్చారు. హామీ ఇవ్వడమే కాకుండా కెసిఆర్ పై పోటీ చేయాలని నామినేషన్ వేయడానికి సన్నద్ధమైన వందలాది మంది కాయితీ లంబాడీలకు వారు సర్ది చెప్పారు కూడా. కానీ ఈ బుజ్జగింపులను తిరస్కరించి వారిలో నామినేషన్ వేసింది పైన పేర్కొన్న ఒక్క బంతి లాల్ మాంజా మాత్రమే,
నామినేషన్ సంగతి సరే. అంతకన్నా ముఖ్యం నేతలు తమ సమస్యను నివేదించే ప్రతినిధులుగా చివరి వరకు ఉన్నా ఉండకపోయినా తామంతా ఈసారి కెసిఆర్ కి వ్యతిరేకంగా ఓటు చేసేందుకు నిర్ణయించుకున్నామని పలు తాండా వాసులు విస్పష్టంగా చెప్పడం విశేషం. ఆ మేరకు ఎల్లారెడ్డి బిఆర్ఎస్ అభ్యర్థి నల్లమడుగు సురేందర్ కి వ్యతిరేకంగా ఓటు చేస్తున్నామని కూడా వారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ కే తమ ఓటు అని కూడా వారు బాహాటంగానే చెబుతున్నారు.
చిత్రమేమిటంటే, బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై తమకు పూర్తి నమ్మకం ఉన్నదని వారం క్రితమే వీరి నాయకత్వం పేర్కొంది. నిజామాబాద్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నామినేషన్లు వేస్తున్నట్టు ప్రకటించిన తమ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకున్నట్టు వారు పత్రికా ముఖంగా ప్రకటించారు. కానీ వారం పది రోజుల్లోనే వారు తిరిగి మొదటికే వచ్చారు. తమ వ్యతిరేకతను ఓటు ద్వారానే తేల్చి చెబుతామని వారంటున్నారు.
ఇట్లా, ఒక్క కాయతీ లంబాడీలు మాత్రమే కాదు, అనేక సమూహాలు కులాలు, తెగలు ఈ సారి ఎక్కడికక్కడ బిఆర్ ఎస్ కి వ్యతిరేకంగా జట్టు కట్టి ఆ పార్టీని ఓటమి పాలు చేయడానికి నిశ్శబ్ద కార్యాచరణలో మునిగిపోయాయి. ముందు చెప్పినట్టు, కాయితీ గిరిజన తెగ దారిలోనే పాలమూరు ఉమ్మడి జిల్లాలో బోయ కమ్యూనిటీ కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నది. ఇవన్నీ చిన్న చిన్న సమూహాలే కావొచ్చు. కానీ, దశాబ్దాపు ఆగ్రహం కట్టలు త్రెంచుకుంటున్న చప్పుడు ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో వినబడుతోంది. ఇప్పటికిప్పుడు అధికార బిఆర్ఎస్ పార్టీ వినిపించుకున్నా ఇక చేసేదేమీ లేకపోవచ్చు…… కందుకూరి రమేష్ బాబు, Samanyashastram Gallery
Share this Article