Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సత్వర న్యాయం Vs చట్టప్రకారం విచారణ… జనానికి ఏది నచ్చుతుంది..?!

December 23, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……. నాలుగు తంతే అప్పుడు చెపుతాడు . ఈ సినిమాలో ఈ సీన్ ఇప్పటికీ చాలామంది సత్వర న్యాయం vs చట్టప్రకారం నిందితుల విచారణ అంశంలో ప్రస్తావిస్తూ ఉంటారు . ఇలాంటి ప్రేక్షకాదరణ పొందిన సీన్లు ఈ అంకుశం సినిమాలో పుష్కలంగా ఉన్నాయి .

  • ఈ సీన్ కన్నా ఇంకా ఎక్కువగా పాపులర్ అయింది రౌడీ రామిరెడ్డిని బట్టలు ఊడదీయించి హైదరాబాద్ వీధుల్లో హీరో రాజశేఖర్ కొట్టుకుంటూ పోవటం .

రాజశేఖర్ కెరీర్లో ఈ సినిమా పెద్ద మలుపు . ఏంగ్రీ యంగ్ పోలీస్ ఆఫీసరుగా గొప్ప పేరొచ్చింది . పోలీస్ అంటే ఇలా ఉండాలని జనం అంటూ ఉంటారు . ఆతనితో పాటు గొప్ప పేరు వచ్చింది రామిరెడ్డికి . అతని డైలాగ్ స్పాట్ పెడతా ఇప్పటికీ వీర పాపులర్ .

Ads

ఇదే అతని మొదటి సినిమా కూడా . మొదటి సినిమాకే నంది అవార్డు వచ్చింది . తర్వాత రాములమ్మ లాంటి ఎన్నో సినిమాలలో పేరు తెచ్చుకున్నాడు . 2009 ఎన్నికల్లో మా కన్నా లక్ష్మీనారాయణ గారికి కేన్వాస్ చేయటానికి గుంటూరు వచ్చినప్పుడు అతన్ని కలిసే అవకాశం కలిగింది . దురదృష్టం . అర్ధాంతరంగా చనిపోయాడు .

వీరిద్దరి తర్వాత అదే లెవెల్లో పేరు వచ్చింది యం యస్ రెడ్డి గారికే . ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి‌ అనిపిస్తుంది . పదవి రాకముందు రోడ్ మీద ఒంటరిగా తిరిగే వాళ్ళు పదవి వచ్చాక వంద మంది పోలీసుల కాపలాతో పటాటోపం చూపిస్తూ ఉంటారు .

ఎవరినీ కలవరు . తాము ఆకాశం నుండి ఊడిపడ్డ దైవాంశ సంభూతులం అనుకుంటూ ఉంటారు . అది సినిమా . రియల్ లైఫ్ వేరు అనే వారు ఉంటారు . నాకు తెలిసి ఒకప్పుడు వావిలాల గారికి ఇప్పుడు మండలి బుధ్ధప్రసాద్ గారికి సెక్యూరిటీని మిగిలిన వారితో పోలిస్తే అర్థం అవుతుంది . యం.యస్.రెడ్డి గారు చాలా సహజంగా , అద్భుతంగా నటనలో జీవించారు .

ఇతర ప్రధాన పాత్రల్లో జీవిత , ఆహుతి ప్రసాద్ , బాబూ మోహన్ , కోకా రంగప్రసాదరావు , చలసాని కృష్ణారావు , సుధారాణి , విజయలక్ష్మి  తదితరులు నటించారు . సినిమా కధను యం యస్ ఆర్ట్ మూవీస్ యూనిట్ తయారు చేసిందని టైటిల్సులో వేసారు . అంటే బహుశా తండ్రీకొడుకులు , కోడి రామకృష్ణ కలిసి నేసి ఉంటారు . ఎవరు నేసినా బాగా నేసారు .

  • కోడి రామకృష్ణ బిర్రయిన స్క్రీన్ ప్లేని , దర్శకత్వాన్ని అందించారు . రాంగోపాల్ వర్మకు శివ ఎలాగో కోడి రామకృష్ణకు ఈ అంకుశం సినిమా అలాంటిది .‌

కధ టూకీగా…: ఓ స్కూల్ మాస్టారు ముఖ్యమంత్రి అవుతాడు . సారా వ్యాపారులతో కుమ్మక్కు అయిన హోం మంత్రి ముఖ్యమంత్రిని చంపిస్తానికి రౌడీ రామిరెడ్డికి సుపారీ ఇస్తాడు . మాస్టారి పూర్వ విద్యార్థి ఇనస్పెక్టరుగా వస్తాడు . ముఖ్యమంత్రిని రక్షించే క్రమంలో భార్యను కోల్పోవటమే కాకుండా క్లైమాక్సులో తానూ చచ్చిపోతాడు . ఈ సినిమా కధ తెలియని వారుండరు . అందుకే చాలా టూకీగా చెప్పా .

సంగీత దర్శకత్వం వహించిన సత్యం శ్రావ్యమైన పాటల్ని అందించారు . ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇది మమతల ప్రేమకు ప్రాకారం సూపర్ హిట్ సాంగ్ . అందుకే కొడుతున్నా డప్పు ఇప్పుడయినా తెలుసుకోండి తప్పు , ఇంద్రధనసు ఇల్లాలే , అమ్మ పిలుపు నోచుకోని వాడు , చట్టాలను ధిక్కరిస్తు , చిన్నారి పసికందు కన్ను తెరిచింది అంటూ సాగుతాయి పాటలు .

పాటలనన్నీ యం యస్ రెడ్డి గారే వ్రాసారు . బాలసుబ్రమణ్యం , జానకమ్మ శ్రావ్యంగా పాడారు . కో డైరెక్టరుగా కె శివ నాగేశ్వరరావు పనిచేసారు .

  • ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేస్తే రాజశేఖర్ పాత్రను చిరంజీవి నటించారు . హిందీ సినిమా పేరు ప్రతిబంధ్ . విలన్ పాత్ర రామిరెడ్డే వేసాడు . జుహీ చావ్లా నటించిన ఆ సినిమాకు కూడా కోడి రామకృష్ణే దర్శకుడు… కన్నడంలోకి కూడా అభిమన్యు టైటిలుతో రీమేక్ అయింది . తమిళంలోకి డబ్ అయింది .

కనక వర్షం కురిపించిన ఈ సెన్సేషనల్ మూవీకి మూడు నంది అవార్డులు వచ్చాయి . ఉత్తమ విలన్ , రెండవ ఉత్తమ కధ , ఉత్తమ గేయ రచన . సినిమా యూట్యూబులో ఉంది . చూడనివారు ఉండరనుకుంటా . ఒకరూ అరా ఉంటే చూసేయండి .

1988 పూర్తయి మనం 1989 లోకి వచ్చాం . సెన్సేషనల్ మూవీ అంకుశంతో ప్రారంభం . నేను పరిచయం చేస్తున్న 1202 వ సినిమా ఇది . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు #తెలుగుసినిమా

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చిన్న ఆవిష్కరణలే… చెప్పరాని అవస్థల్ని తీరుస్తాయి… ఇలా…!!
  • గొర్లు, బర్ల దాకా…! కేసీయార్ కరప్ట్ చేయని రంగం ఏమైనా మిగిలిందా..?!
  • “చచ్చావా… బతికావా?”…. చైనాలో సెన్సేషన్ సృష్టిస్తున్న కొత్త యాప్…!
  • ప్రజారాజ్యం పార్టీ పెట్టింది అక్కినేని..! ఎన్నికల్లో పోటీ కూడా చేశాడు..!!
  • భారత్‌కు చరిత్రాత్మక విజయం … అమెరికాకు వ్యూహాత్మక దెబ్బ…
  • కుంతి కోసం, నెత్తుటి మూలాల కోసం… ఓ డచ్ కర్ణుడి అన్వేషణ…
  • పండుగ స్పెషల్ షో అయినా సరే… అదే జబర్దస్త్ మార్క్ బూతు స్కిట్…
  • రాహుల్ ద్వంద్వ పౌరసత్వం… కోర్టులో ప్రస్తుత స్థితి… ఫ్యాక్ట్ చెక్…
  • ఈసారి నిజంగానే చంద్రుడిపై కాలు పెడతారట అమెరికన్లు..!!
  • అమెరికా చుట్టూ అసాధారణ లక్ష్మణరేఖ… 75 దేశాలకు వీసాల నిలిపివేత…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions