.
ఇద్దరు సూపర్ స్టార్లు కృష్ణ , రజనీకాంతులు నటించిన ఈ అన్నదమ్ముల సవాల్ సినిమా 1978 లో వచ్చింది . కన్నడంలో హిట్టయిన సహోదర సవాల్ సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . రెండు సినిమాలకూ కె యస్ ఆర్ దాసే దర్శకులు . రజనీకాంత్ రెండు భాషల్లోనూ నటించారు . తెలుగులో కూడా వంద రోజులు ఆడింది .
రొటీన్ కధే అయినా స్క్రీన్ ప్లే బాగుంటుంది . దర్శకుడు స్పీడుగానే నడిపిస్తాడు సినిమాని . ముఖ్యంగా సత్యం సంగీత దర్శకత్వంలో పాటలు బాగుంటాయి . కృష్ణ , జయమాలినిల మీద పాట ఓ పిల్ల చలి చలిగా ఉందే చిత్రీకరణ మొదట్లో వెరైటీగా ఉంటుంది . ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పాట మరొకటి ఉంది . అల్లు రామలింగయ్య , చలం , హలంల మీద ఉంటుంది . నేర్పమంటావా నువ్వు నేర్చుకుంటావా పాట . బాలసుబ్రహ్మణ్యం మిమిక్రి గొంతుతో పాడతారు .
Ads
కృష్ణ , జయచిత్రల మీద నా కోసమే నీవున్నది , గువ్వ గూడెక్కె రాజు మేడెక్కె పాటలు శ్రావ్యంగా ఉంటాయి . రజనీకాంత్ , చంద్రకళల మీద నీ రూపమే నా మదిలోన తొలి దీపమై పాట కూడా బాగుంటుంది .
ఇతర పాత్రల్లో కన్నడ ప్రభాకర్ , త్యాగరాజు , మిక్కిలినేని నటించారు . కృష్ణ కుమారుడు రమేష్ బాబు బాల నటుడిగా కనిపిస్తాడు . మా నరసరావుపేటలో కృష్ణ చిత్రాలయలో , గుంటూరులో నాజ్ థియేటర్లో ఆడింది . యూట్యూబులో ఉంది . కృష్ణ , రజనీకాంత్ అభిమానులు చూడవచ్చు . ఈ సినిమా టైంకే రజనీకాంత్ స్పెషల్ మేనరిజాలు ప్రారంభమయ్యాయి . ఈ సినిమాలో కూడా సేంపుల్ ఉంటుంది . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు…… (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)
ఈ సినిమా షూటింగ్ అంతా అవుట్ డోర్ నాగార్జున సాగర్ దగ్గర తీశారు, అప్పట్లో కృష్ణ ఒక్కడికే సూపర్ స్టార్ హీరో స్టేటస్ ఉన్నది, రజనీకాంత్ సహాయ నటుడి హోదాలో ఉన్నాడు, అప్పట్లో గవర్నమెంట్ గెస్ట్ హౌసులు తప్ప ప్రైవేట్ లాడ్జీలు లేవు, సూపర్ స్టార్ కృష్ణకు AC కాటేజ్ ఇచ్చి రజనీకాంత్ కు మాములు రూమ్ ఇస్తే, ఆ గది బాగా లేకపోతే వరండాలో పడుకున్నాడని మాచర్ల సినిమా హల్ ఓనర్ చెప్పాడు, అప్పట్లో లోకల్ హాల్ యాజమాన్యమే ఇటువంటి ఏర్పాట్లు చేసేది, అప్పటి సంగతి, సినిమాలో గుర్రం సకిలింపులు చాలా ఎక్కువ…. (రమణ కుమార్ అనే పాఠకుడి కామెంట్)
Share this Article