Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అన్నమయ్యకు ఆ కుకవులంటే అంత కోపం ఎందుకంటే…!!

June 22, 2025 by M S R

.

Rochish Mon  ..........  అన్నమయ్యకు ఆ కవులంటే అంత కోపం ఎందుకంటే…
————

“వెఱ్ఱులాల మీకు వేడుక గలితేను
అఱ్ఱు వంచి తడు కల్లంగ రాదా?”

వెఱ్ఱి వాళ్లలారా, మీకు కుతూహలం కలిగితే మెడవంచి తడిక అల్లుకోవచ్చు కదా (ఏ చెత్తో రాయకుండా) అంటూ‌ అన్నమయ్య‌ కవులకు చురక వేస్తున్నారు. ‘వెఱ్ఱులారా’ అని కవుల్ని సంబోధించారు అంటే అన్నమయ్య కాలంలోనూ అలాంటి వారు కవులుగా ఉండేవారన్నమాట.

ఇవాళ తెలుగులో కవులు అనబడుతున్న వాళ్లు కవిత్వాన్ని కాటేస్తున్నారు; విమర్శకులు అనబడుతున్న వాళ్లు విషాన్ని పంచిపెడుతున్నారు‌. ఏ కళా రూపమూ దెబ్బతిననంతగా తెలుగుకవిత దెబ్బతిన్నది. కవుల పుఱ్ఱెలకు పట్టిన వెఱ్ఱివల్ల కవిత్వం అంటేనే జనాలకు రోత కలుగుతోంది. ఈ దశలో అన్నమయ్య‌ ఈ సంకీర్తన‌ తెలుగు కవిత్వ దుస్థితికి ఒక ఔషధంగా అవసరం; అత్యవసరం.

Ads

“ముడిచేసిన పువ్వు ముడువ యోగ్యము గాదు
కుడిచి వేసిన పుల్లే‌ కుడువఁగాఁ గాదు
బడి‌ ఒకరు చెప్పినఁ బ్రతి చెప్పఁబోతేను
అడరి శ్రీహరి కది అరుహము గాదు”

ఒకరి తలలో పెట్టుకున్న పువ్వును మఱొకరు పెట్టుకోవడం తగినపని కాదు, ఒకరు తిన్న కంచంలో మఱొకరు తినకూడదు, ఒకరు చెప్పిన క్రమంలో అలాంటిదే చెబితే అది అంతటావ్యాపించి ఉన్న శ్రీహరికి‌ అర్హం అవదు అని అంటూ అన్నమయ్య‌ ఇతరుల‌ రచనలను నకలు చేసే వాళ్లకు అలా చెయ్యడం సరి కాదు అని హితవు చెబుతున్నారు‌; ఆపై అవి వ్యాప్తికి అనర్హమైనవి అనీ చెబుతున్నారు.

“గంపెఁడు‌ముక దినఁగా నొక్క వరిగింజ
తెంపునఁ గలిసితే తెలియనెట్టు వచ్చు
జంపులఁ బలవరించఁగ నొక మంచి మాట
ఇంపైతే హరి యందు కిచ్చునా వరము”

గంపెడు పొట్టు తింటున్నప్పుడు అందులో తెగువగా (తెంపున) ఒక్క వరిగింజ కలిసిపోతే అది తెలుస్తుందా? గుంపులో ఒక మంచి మాట పలవరిస్తే అది ఇంపైనది అయినా కూడా హరి అందుకు వరమిస్తాడా? అని అన్నమయ్య ప్రశిస్తూనే అవి వృథా అనే జవాబును కూడా పరోక్షంగా తెలియజెబుతున్నారు. ఇక్కడ
దైనందిన‌ ప్రజా జీవితంలోంచి పొట్టు, వరిగింజ వంటి వాటిని కవితా రచన కోసం తీసుకున్నారు అన్నమయ్య.

“ఉమిసిన తమ్మలో నొక కొంత కప్రము
సమకూర్చి చవిగొని చప్పరించనేల
అమరంగ ఛాయాపహారము సేసుక
తమ మాట గూర్చితే దైవము నగఁడా”

ఉమ్మేసిన తాంబూలంలో కొంచెం కర్పూరం కలిపి రుచి చూసి చప్పరించడం ఎందుకు? పరుల‌ ఛాయను‌ లేదా‌ శైలిని దొంగిలించి అందులో తమ మాటలను‌ కూర్చితే దైవం నవ్వడా? అని అంటూ అన్నమయ్య ఒక గొప్ప చింతనను అంతే గొప్పగా వ్యక్తీకరించారు‌.

ఛాయను తీసుకుని తమ మాటలను అందులో కూర్చుకోవడం అన్నదానికి ఉదాహరణలు:

“నేరుపు బ్రహ్మ జేరె, నిజనిర్మల తేజము సూర్యుజేరె, ఆకారము కాముజేరె, అధికంబగు లక్ష్మి అనంతుజేరె, గంభీరత వార్ధిజేరె, కలపెంపు కులాద్రులజేరె, కీర్తి తా నూరటలేక ద్రిమ్మరుచున్నది మైలమ భీమడీల్గినన్”

అని అన్న పూర్వుల ఛాయను తీసుకుని గురజాడ అప్పారావు పూర్ణమ్మలో ఇలా‌ చెప్పారు: “కన్నుల కాంతులు కలువల జేరెను, మేలిమి‌ జేరెను మేనిపసల్, హంసల జేరెను నడకల బెడగులు, దుర్గను‌ జేరెను పూర్ణమ్మ”.

శ్రీశ్రీ “తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు? అని అంటూ కొనసాగింది జర్మన్ కవి Bertolt Brecht ఛాయలో. గమనించండి ఈ మాటల్ని… “Who built the thabes with its seven gates? / In all books it says kings/ Did kings drag up those rocks from the quarry?… / Where did the stone masons go?” ఇలా ఛాయను తీసుకోవడాన్ని అన్నమయ్య నిరసిస్తున్నారు.

“చిబికి వేసిన గింజ చేతఁబట్టగ నేల
గబుక కెంగిలి బూరె గడుగగ మఱి యేల
తొబుక కవిత్వాల దోషాలఁ బొరలితే
దిబుకార నవ్వఁడా దేవుఁడైనాను”

చప్పరించి పారేసిన గింజను తీసుకోవడం ఎందుకు? అన్నం ముద్దలా తీసుకోవడానికి ఎంగిలి బూరెను కడగడం ఎందుకు? గుల్లగా ఉండే (తొబుక) కవిత్వంలో దోషాలు పొర్లితే విరగబడి నవ్వడా‌ దేవుడైనా? అని అంటూ అన్నమయ్య కవులను నిలదీస్తున్నారు. ‘గుల్లగా ఉండే కవిత్వంలో దోషాలు పొర్లితే’.. ఈ అభివ్యక్తి గొప్పగా ఉంది.

ఇవాళ పదాల, వాక్యాల, భావాల, అన్వయాల దోషాలతో భాషను, కవితను అవమానిస్తున్న కాదు, కాదు హత్య చేస్తున్న వాళ్ళు ఈ అన్నమయ్య మాటల్ని చదివి ఒంటబట్టించుకుంటే బావుణ్ణు. “దోషః కావ్యాపకర్షస్య హేతుః” అని పూర్వ లాక్షణికుడు విద్యానాథుడు చెప్పాడు.

అంటే దోషం కావ్యాన్ని అవమానించే లేదా కావ్య స్థాయిని తగ్గించే హేతువు అని అర్థం. “బాస‌‌ దోసమున్న‌ పలుకులు ములుకులు” అని‌ వేమన‌ ఒక‌ పద్యంలో‌ చెప్పాడు. సిగ్గు కూడా (చదువు ఎలాగూ ఉండదు) లేకుండా కొందఱు రాస్తున్న దోషాల్ని చదివి జనాలు నవ్వుతున్నారు. కవులైన వాళ్లు తమ తప్పుల్ని తెలుసుకోవాలి; తెలుగు కవిత్వ గౌరవం నిలిచి ఉండాలి.

“మించు‌ చద్దికూటి‌ మీద నుమిసినట్టు
మంచి దొకటి చెప్పి మఱి చెప్ప నేరక
కంచుఁ బెంచు నొక్క గతి నదికితే ముటు
పెంచువలెనే చూచు‌ పెరుమాళ్లు వాని”

పెరుగు చద్ది అన్నంపై ఉమ్మేసినట్టుగా ఒక మంచి‌ మాట చెప్పి ఆ తరువాత చాతకాక కంచును పెంకును ఒకటిగా కలిపి అతికిస్తే వాణ్ణి మైలపెంకులా‌ చూస్తాడు దేవుడు అని తేల్చి తెలియజేశారు అన్నమయ్య.
‘వేమన ధోరణికి ఆది ఆన్నమయ్యే’ అని ఈ మాటలవల్లా తెలిసివస్తోంది. కంచును పెంకును అతికిస్తే అనడం ఎంతో బావుంది కదా? అన్నమయ్య చెప్పినట్టు కంచునూ పెంకునూ అతికిస్తూండబట్టే ఇవాళ సమాజంలో కవులకు విలువలేకుండా పోయింది.

“పుచ్చినట్టి పండు బూఁజిలోననే వుండు
బచ్చన కవితలు బాఁతి‌‌ గావు యెందు
ముచ్చుఁగన్న తల్లి మూలకొదిగినట్టు
ముచ్చిమి‌ నుతులేల మొక్కరో హరికి?”

పుచ్చిపోయిన పండు బూజుపట్టి ఉంటుంది. వంచించే కవితలు ఎక్కడా ఇంపుగా ఉండవు. మోసగాణ్ణి కన్న తల్లి మూలకు‌ ఒదిగినట్టు మోసపూరితమైన స్తుతులేందుకు? హరికి మొక్కండి అని అంటున్నారు అన్నమయ్య.

వంచించే కవితలు పుచ్చిపోయిన పళ్లు అనడం గొప్పగా ఉంది. ఆ అనడం ఇవాళ్టి తెలుగుకవిత స్థితికి సరిగ్గా పొసుగుతుంది. రమారమి యాభైయేళ్లకు పూర్వమే తెలుగుకవిత ఈ స్థితికి గురైంది. దీనికి మినహాయింపుగా కొంత మెఱుగైన స్థితి లేకపోలేదు. తెలుగులో వచ్చిన, వస్తున్న మత, కుల, ప్రాంతీయతా వాద కవితలు వంచించే కవితలే. అందుకే వాటిని జనాలు అసహ్యించుకున్నారు.

కమ్యూనిజమ్‌ అన్న బూజుపట్టి తెలుగులో కవిత్వం అని అనిపించుకున్నది పుచ్చిపోయిన పండు అయిపోయింది. కవులు అని అనబడే వాళ్లు మోసగాళ్లను కన్న తల్లుల్లా మూల కూర్చుని మోసపూరితమైన రచనలు చేస్తూండడం కన్నా దేవుణ్ని మొక్కడంవల్ల మేలు జరుగుతుంది అని అంటూ కవులకు నిజాయితీ ముఖ్యం అన్న సూచనను సూటిగా ఇస్తున్నారు అన్నమయ్య. ‘మూల కూర్చుని మోసపూరితమైన రచనలు చేసే అధముల్ని ‘మోసగాళ్లను కన్న తల్లులు’ అనడం ఒక అంతర్జాతీయ అభివ్యక్తి.

“ఉల్లి తిన్న కోమటూరక వున్నట్టు
జల్లెడ నావాలు జారిపోయినట్టు
కల్లలు చెప్పి యా కథకుత్తరములీఁక
మెల్లనే వుండితే మెచ్చునా దైవము?”

ఉల్లిపాయ తిన్న‌ కోమటి ఆ‌ కంపు బయటకు తెలుస్తుందని మాట్లాడకుండా ఉన్నట్టుగా, జల్లెడలో ఆవాలు జారిపోయినట్టుగా ఉండి పరుషపు మాటలు చెబుతూ (కల్లలు చెప్పి) ఆ చెప్పడానికి
(కథకు) జవాబు ఇవ్వకుండానూ, మాంద్యంతోనూ (మెల్లనే) ఉంటే దైవం మెచ్చుకుంటుందా? అని అంటూ కవులను నిలదీస్తున్నారు‌ అన్నమయ్య.

“కవిత్వం.. మహోన్నతమైన మాటలు మహోన్నతమైన క్రమంలో” అని చెప్పాడు ఇంగ్లిష్ కవి, విమర్శకుడు కొలరిజ్ (Coleridge). క్రమం లేదా పద్ధతి తప్పిన మాటలతో ‘కవిత్వం’ రాదు. కవి పరుష వచనాలకు అతీతంగానూ, జవాబుదారీతనంతోనూ ఉండాలని హితవు చెబుతున్నారు అన్నమయ్య. పరుష వచనాలకు, జవాబుదారీతనం లేకపోవడానికి తెలుగు మత వాద, కుల వాద, ప్రాంతీయతా వాద కవులు తార్కాణాలు.

కవులకు జవాబుదారీతనం లేకపోవడంవల్లే గత కొన్ని దశాబ్దులుగా తెలుగుకవిత్వం వికృతమై’పోతోంది’; తెలుగులో ఉచ్చల కవిత్వం కూడా వచ్చేసింది. తెలుగుకవులు పొందుతున్న పురస్కారాలు జవాబుదారీతనం లేకపోవడానికి ఋజువులు.

గజల్, రుబాయీ వంటి విదేశీ ప్రక్రియలను ప్రతిభతో సరిగ్గా సాధించలేని చాతకానితనం మాత్రమే కాదు వాటికి కూడా ప్రాంతీయతను పూసేసిన దుస్థితి తెలుగుకు దాపురించింది. గజల్ అనే విదేశీ ప్రక్రియ ఇవాళ తెలుగుభాషనే చంపేస్తోంది. గజల్ తెలుగు చావుకు వచ్చింది. జవాబుదారీతనం లేకపోవడమే ఇందుకు కారణం.

“నేతి బీరకాయ నేయి అందు లేదు
రాతి వీరునికి బీరము యించుకా లేదు
ఘాత బూరుగుఁబండు కడుపులోన దూది
ఏతుల నుడుగులు యెక్కునా హరికి?”

నేతి బీరకాయ అందులో నెయ్యి లేదు; రాతితో చేసిన వీరుడు కొంచమైనా వీరం లేదు. బూరుగు పండు కడుపులో దూదే ఉంటుంది ఏ సారమూ ఉండదు. పటాటోపం మాటలు హరికి చేరతాయా? అని అంటున్న అన్నమయ్యను మనం అవగాహన చేసుకోవాలి.

బూరుగు పండులో సారం‌ ఉండదు దూది మాత్రమే ఉంటుంది. అలా పటాటోపం మాటల్లో సారం ఉండదు; అవి ఇవ్వాల్సిన ఫలితాన్ని ఇవ్వవు. కవితకు కావాల్సింది పదాల పటాటోపం కాదు. “శబ్దజాలం మహారణ్యం చిత్త భ్రమణ కారణం” అని వివేకచూడామణిలో ఆదిశంకరాచార్య ఉవాచ.

“ఫక్కి తెలిసి పలుక నొక్క వాక్యమె చాలు / పెక్కులేల వట్టి ప్రేల్పులేల?” అని వేమన చెప్పాడు. జపాన్ కవి యోనె నొగూచి “గంపల కొద్దీ కవితలు రాసి అచ్చెయ్యాలి అన్న ఒకే ఒక్క ఉత్సుకతతో ఎప్పుడూ తపించే వాడు కవి అవడు” అని చెప్పాడు. డాంబికపు మాటల్ని నిరసిస్తున్నారు అన్నమయ్య.‌

“ఇరుగు వారెఱఁగరు పొరుగు వారెఱఁగరు
గొరబైన మాటలు గొణుఁగుచు నుందురు
పరులఁగాదందురు బాతిఁగారు తాము
విరసు లట్టివారి విడుచు దేవుఁడు”

ఇరుగు పొరుగు వాళ్లు వీళ్లను ఎఱుగరు; వికారమైన మాటల్ని గొణుగుతూంటారు; ఇతరుల్ని కాదంటారు; వాళ్లు ప్రీతి పాత్రులవరు; అలాంటి విరసుల్ని విడిచిపెట్టేస్తాడు దేవుడు… ఏం చెప్పారు అన్నమయ్య! అన్నమయ్య కవుల గతిని, తీరును ఎంత‌ సరిగ్గా చెప్పారో చూడండి. ఆహా అన్నమయ్య!

పొంతన లేని నాలుగు‌, మూడు పొడి పొడి పదాలతో వాక్యంగా లేనివీ, విషయం లేనివీ నానో అనో, మఱొకటనో ఇంగ్లిష్ పేర్లతో తెలుగులో కవితా ప్రక్రియలుగా వచ్చాయి. ప్రక్రియలు కానివి, కాలేనివి జంతికలు, చక్రకేళీలు, రెక్కలు, కిరణాలు, అణువులు, మొగ్గలు వంటి పేర్లతో ప్రక్రియలుగా తెలుగులో వచ్చేశాయి. వీటిల్లో కుల ప్రక్రియలు కూడా ఉన్నాయి. మొత్తం ప్రపంచంలో కులాల కవితా ప్రక్రియలు వచ్చిన భాష ఒక్క తెలుగు మాత్రమే! అత్యంత బాధాకరమైన పరిణామం ఇది.

మానసిక వికలాంగులు కొందఱు నిస్సిగ్గుగా అలాంటి వాటిని వేల కొద్దీ రాసేస్తూ జాతికి, భాషకు తలవంపులు తెస్తున్నారు. అసలు ప్రక్రియలే కానప్పుడు ‘మేం నూతన ప్రక్రియల సృష్టికర్తలం’ అని కొందఱు ప్రకటించుకోవడం విదూషకత్వం.

ఏది పంక్తి‌ అవుతుందో, ఏది వాక్యం అవుతుందో కూడా తెలియని వాళ్లు చవబాఱుతనంతో తమను తాము పితామహులుగా, విశారదులుగా చెప్పుకుంటున్నారు. మతి పగిలిపోయిన స్థితి, మనస్తత్వం చితికిపోయిన గతి తెలుగుకవితలో నమోదై ఉన్నాయి. తెలుగుభాషకు అవమానకర పరిణామం ఇది.

తెలుగులో అతి జుగుప్సాకరమైన అశ్లీలం కవితగా రాయబడుతోంది. ఆ అశ్లీలాన్ని కొందఱు స్త్రీలే రాస్తున్నారు. ఛీ, ఛీ… కవులం అని అనుకుంటున్న వాళ్లలారా, మీరు విరసులవబట్టి జనాలు కవిత్వాన్ని విడిచి పారిపోతున్నారు. కవులు అనబడే వాళ్ల వెఱ్ఱికీ, వికారానికీ జనాలు బలి కాలేరు కదా? అందుకే జనాలు కవిత్వానికి దూరమవుతున్నారు; జనాలు కవుల నుంచి తమను తాము రక్షించుకుంటున్నారు.

“ఎన్నగ శ్రీ వేంకటేశుఁ‌దాళ్లపాక
అన్నమాచార్యులు అఖిల‌ దిక్కుకులు మెచ్చ నున్నతితోఁ బాడిరొకఁ డెవ్వడో తాను
సన్న నొరసునట సమ్మతమా హరికి”

తాళ్లపాక అన్నమాచార్యలు శ్రీ‌ వేంకటేశ్వరుణ్ణి దిక్కులన్నీ మెచ్చుకునేట్టు ఉన్నతంగా పాడితే ఒకడెవడో సైగ చేస్తూ ఘర్షణకు దిగుతాడట. అది హరికి సమ్మతమా? అని తనకు ఎదురైన‌ స్థితిని చెప్పుకుంటున్నారు అన్నమయ్య. అన్నమయ్య‌ సంకీర్తనలకు అప్పటికే అనుకరణలు, నకళ్లు వచ్చిన సంగతినీ, వాటిని చేసిన కుకవులు అన్నమయ్యతో తలపడ్డారనీ ఇక్కడ తెలియవస్తోంది.

భావ తీక్ష్ణతతోనూ, భావనా పటిమతోనూ, భాషా సాహసంతోనూ ఈ సంకీర్తనలో నాసిరకం కవుల్ని‌ చీల్చిచెండాడారు అన్నమయ్య. కుకవి నింద అన్నది మనకు ఎప్పటి నుంచో ఉన్నదే. వేమన నీచకవులను నిందించారు. గుంటూరు శేషేంద్రశర్మ ‘కవినామ ధూర్తులు‘ అని అన్నారు. ఈ సంకీర్తనలో అన్నమయ్య ఆ కవుల్ని, కవులు అని అనిపించుకుంటున్న అకవుల్ని తూర్పారపట్టినట్టు ప్రపంచంలో ఏ సుకవీ ఎప్పుడూ చెయ్యలేదేమో?

‘కవిత్వానికి హాని చేస్తున్న భ్రష్ట, దుష్ట కవుల్ని తూర్పారపట్టడం ఒక సుకవి ప్రధాన లక్షణం; ఒక మేలైన కర్తవ్యం’. అన్నమయ్య ఆ లక్షణాన్ని, ఆ కర్తవ్య నిర్వహణను ఇక్కడ చాల గొప్పగా స్థిరపఱిచారు. అందుకు అన్నమయ్యకు మనసా, వాచా ప్రణామం.

కవులం, విమర్శకులం అని‌ మెడల్లో పలకలు వేసుకుని తచ్చాడుతున్న వాళ్లు వాళ్ల జీవితాల్లో ఒక్కసారైనా‌‌ ఈ సంకీర్తనను చదివి అర్థం, అవగతం చేసుకుంటే తెలుగుకవిత్వానికి జరగాల్సిన అత్యవసరమైన మేలు జరుగుతుంది.

సహజమైన విషయాలనే వస్తువులుగా తీసుకుని భ్రష్ట, దుష్ట కవులను తిరస్కరిస్తూ చేసిన ఒక అపూర్వమైన, అనన్యమైన రచనగా ఉన్నది ఇలా‌ అన్నమయ్య అన్నది. …. రోచిష్మాన్       9444012279

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యాక్షన్ లేదు, ఆధార్ బ్లాకూ లేదు… ఈ వివాదం పూర్వపరాలు ఇవీ…
  • మిస్టర్ కీరవాణీ… ఈ వారణాసి లవ్ సాంగ్ వీడియో నువ్వైనా చూశావా..?
  • బాగా మగ్గిన అరటి పండు కేన్సర్‌ కణాల్ని చంపేస్తుందా..? నిజమేంటి..?
  • ఈ తెలంగాణ ద్వేషి అస్సలు మారడు… మళ్లీ అదే విద్వేష ప్రదర్శన..!!
  • బిగ్‌బాస్..! బహుశా ఫైనల్స్‌లో తనూజ, ఇమ్మూ, పడాల, భరణి, రీతూ..!!
  • వ్యక్తిపూజ- ఫ్యానిజం… ఆంధ్రా కింగ్ తాలూకా… కాదు, ఓ హీరో ఫ్యాన్ తాలూకా…
  • హనుమాన్ చాలీసా టాప్ రికార్డు… ఇవీ ఇండియాలో టాప్ 10 వీడియోలు..!
  • బురద… బూడిద..! ఆలు లేదు, చూలు లేదు… అప్పుడే వేల కోట్ల స్కాములట..!!
  • ముగ్గురు కొడుకులు… కాదు, కాదు… ఒక తండ్రి, ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ…
  • 26/11 …. మరిచిపోలేని ఒక నిజ భారత రత్నం… కొన్ని బొగ్గు కేరక్టర్లు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions