పాతికేళ్లుగా ఆయన ఎప్పుడూ పోలీస్ డ్రెస్ వేయలేదు… అస్సోం, హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాలు అడిగినా సరే డీజీపీ పోస్టు స్వీకరించలేదు… ప్రస్తుతం అజిత్ దోవల్ వారసుడు, నయా జేమ్స్ బాండ్ అని కీర్తించబడుతున్న 1988 ఐపీఎస్ అధికారి తపన్ కుమార్ డేకా… అలియాస్ టీకే డేకా నేపథ్యం, వ్యక్తిగత వివరాలు ఎవరికీ పెద్దగా తెలియవు… తెలియనివ్వరు… ఎందుకు..? తను అత్యంత కీలకమైన బాధ్యతల్లో పనిచేస్తున్నాడు కాబట్టి… ఒకటీఅరా ఫోటోలు మాత్రమే దొరుకుతాయి మనకు… తన కుటుంబ నేపథ్యం కూడా గోప్యమే… తప్పదు కాబట్టి..!
ఏడుగురు సీనియర్లను పక్కన పెట్టేసి, డేకాను ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా మొన్న తనను మోడీ నియమించాక… నయా జేమ్స్ బాండ్ అనే ప్రచారం ఎక్కువైంది… పైగా తను అజిత్ దోవల్‌కు విశ్వాసపాత్రుడు… తన సిఫారసు మేరకే ఐబీ డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు… నిజానికి తను సమర్థుడే… కీలక ఆపరేషన్లలో తన సామర్థ్యం ప్రూవ్ చేసుకున్నవాడే… కానీ ఇక తనను అప్పుడే మరో అజిత్ దోవల్ అనలేం… చాలామంది సీనియర్లు, చాలా కీలకబాధ్యతల్లో పనిచేస్తున్నారు… ఆ వివరాలు బయటికి రావు… రానివ్వరు… అంతే… ఇండియన్ కరెంట్ టాప్ స్పైలలో తనూ ఒకడనేది నిజం… కానీ తనే టాప్ నంబర్ వన్ కాదు…
Ads
1963లో… అస్సోంలోని తేజ్‌పూర్‌లో పుట్టిన డేకా ఫిజిక్స్‌లో మాస్టర్స్ చేశాడు… అప్పట్లో ఉధృతంగా సాగిన అస్సోం విద్యార్థి ఉద్యమంలో తనూ చురుకుగా పాల్గొన్నాడు… AASU యాక్టివిస్టు… తరువాత 1988లో ఒకే అటెంప్ట్‌లో ఐపీఎస్ కొట్టాడు… హిమాచల్ ప్రదేశ్ కేడర్… కొన్నాళ్లు అక్కడా ఇక్కడా పనిచేశాక, సిమ్లా ఎస్పీగా చేశాక… ఇక 1998లో ఐబీలో చేరాడు… ఇక అంతే… మళ్లీ ఖాకీ డ్రెస్ వేయలేదు… రకరకాల ఆపరేషన్లలో మునిగిపోయాడు… డిప్యూటీ, జాయింట్, అడిషనల్, స్పెషల్ డైరెక్టర్… ఇప్పుడు ఏకంగా ఐబీకి డైరెక్టర్…
నిజానికి ఐబీ డైరెక్టర్ అనగానే సమర్థుడు అని ముద్రవేయనక్కర్లేదు… కానీ డేకా కెరీర్‌లో చాలా ఆపరేషన్లున్నయ్… నేపాల్ నుంచి భత్కల్‌ను పట్టుకొచ్చి, ఇండియన్ ముజాహిదీన్ వెన్నువిరిచిన ఆపరేషన్‌లో తనే కీలకం… ఈశాన్య రాష్ట్రాల ఐబీ ఆపరేషన్ల చీఫ్‌గా చాలా గ్రూపులను నిర్వీర్యం చేయించాడు… అస్సోంలో పౌరసత్వచట్ట వ్యతిరేక ఆందోళనల సమయంలో అమిత్ షా ప్రత్యేకంగా తనను ఆ రాష్ట్రానికి పంపించాడు… కాశ్మీర్‌లో కౌంటర్ టెర్రరిజం చీఫ్‌గా చేశాడు… ఉల్ఫా కేసుల్ని హ్యాండిల్ చేశాడు…
2012-15 నడుమ వాషింగ్టన్‌లో ఏదో ఆపరేషన్‌లో తలమునకలై ఉన్నాడు… అది బయటికి రాలేదు… రాదు… పఠాన్‌కోట్, పుల్వామా ఉగ్రదాడుల దర్యాప్తు, నిజాల సేకరణలో వర్క్ చేయడమే కాదు, సర్జికల్ స్ట్రయిక్స్‌లో కూడా తనది కీలకపాత్రే… ఐతే అజిత్ దోవల్ బూట్లు వేసుకోవాలంటే ఈ మాత్రం విజయాలు సరిపోవు… నో డౌట్… తను హార్డ్ వర్కర్… కానీ దోవల్ రిలేషన్స్, ఆపరేషన్స్, స్ట్రాటజీల స్టయిల్ వేరు… దోవల్‌కు దేశరక్షణ, అంతర్గత భద్రతకు సంబంధించిన దాదాపు అన్ని విభాగాల నడుమ సమన్వయం, వాటిపై కేబినెట్ సెక్రెటరీ స్థాయిలో పెత్తనం అప్పగించాడు మోడీ… ఆ బాధ్యతలన్నీ నిభాయించగల సామర్థ్యం డేకాకు ఉందా ఇంకా పరిశీలించాలి… దోవల్ స్టయిల్ ఒంటబట్టడం అంత ఈజీ కాదు… సో, డేకాపై అప్పుడే ఇండియన్ జేమ్స్ బాండ్ ముద్రలూ సరికాదు..!!
Share this Article