Naresh Siramani…….. రాజమౌళి RRR సినిమాకి ఎంత కలెక్షన్ వచ్చింది అనే దానితోపాటు, ఎంతమంది ప్రేక్షకులు చూసారు అనేది కూడా ముఖ్యమే అని దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. RRR సినిమా, టికెట్ ధరలు పెంచడం వల్ల కలెక్షన్స్ పరంగా పర్వాలేదు కానీ, ప్రేక్షకుల సంఖ్యపరంగా చూస్తే RRR పెద్ద హిట్ ఏమీ కాదని అర్థం అవుతోంది…
ఈ సినిమాలో చరిత్ర వక్రీకరణలు, లాజిక్ లేకపోవడాలు అనే అంశాలని పక్కనబెడితే, ఒక కమర్షియల్ సినిమాగా కూడా దీనిలో అనేక లోపాలు ఉన్నాయి.
1. బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళిన తమ జాతి పిల్లను విడిపించడం అనేది భీమ్ లక్ష్యం. బ్రిటీష్ వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి మెహింది పెట్టించుకోవడం, పాటలు పాడించుకోవడం చేస్తుంటే, ఆడియన్స్ కి ఆ అమ్మాయి మీద సానుభూతి కలగలేదు, దానితో భీమ్ లక్ష్యం కూడా ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ అవలేదు. అదే బ్రిటీష్ వాళ్ళు ఓ 10 మంది పిల్లలను తీసుకెళ్ళి నానా హింసా పెడుతూ, వెట్టిచాకిరీ చేయిస్తుంటే, ఆడియన్స్ కనెక్ట్ అయ్యేవారు.
Ads
2. భీమ్ లక్ష్యం ఏమిటో మొదటి సీన్ లోనే చూపించిన రాజమౌళి, రామ్ లక్ష్యం ఏమిటో మాత్రం సెకండ్ హాఫ్ దాకా దాచిపెట్టారు. రాజమౌళి మీద, రామ్ చరణ్ మీద ఎంత అభిమానం ఉన్నా.. సినిమాలో హీరో, స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న భారతీయులని చితకబాదితే, దాన్ని భారతీయ ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేస్తారని అనుకున్నారో అర్థం కాదు.
3. రామ్, భీమ్ లు మొదటిసారి కలుసుకునే స్టంట్ లో (నీళ్ళలో ఉన్న పిల్లాడిని కాపాడే సీన్) కూడా ఎమోషన్ ఉండదు. టెన్షన్ ఉండదు. కేవలం ఒక స్టంట్ కావాలి కాబట్టి, లేదా రాజమౌళి ఏదో ఇంగ్లీష్ సినిమాలో చూసిన సీన్ ని తను తీయగలనో లేదో టెస్ట్ చేసుకోవడానికి ఈ స్టంట్ పెట్టినట్లు ఉంది తప్ప, సినిమాకి ఉపయోగం లేదు.
4. “విలన్ ని చంపేయాలి అనేంత కోపం ఆడియన్స్ కి వచ్చాక, అప్పుడు హీరో, విలన్ ని నాలుగు తంతే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు..” అనేది రాజమౌళి నమ్మే సూత్రం. RRR లో బ్రిటీష్ వాళ్ళ మీద ఆడియన్స్ కి కోపం వచ్చే ఒక్క సీన్ కూడా లేదు. భారతీయుడి ప్రాణం కన్నా బుల్లెట్ ధర ఎక్కువ అని విలన్ చెప్పే డైలాగ్ కూడా ఇంగ్లిష్ లో ఉండడంతో సగటు ప్రేక్షకులకు అది కనెక్ట్ అవలేదు.
ఇలాంటి తప్పే బాహుబలిలో కూడా రాజమౌళి చేసారు.
కాలకేయులకు కిలికి భాష పెట్టడం వల్ల, డైలాగ్స్ లో పవర్ తగ్గింది. బాహుబలి, భల్లాలదేవా లాంటి వీరుల ముందు, కాలకేయుడు, వాళ్ళ తల్లి శివగామితో, “నీతో సంసారం చేసి, కొడుకుని కని వాడిని ఈ రాజ్యానికి రాజును చేస్తా” అనే డైలాగ్ ఉంటుంది. ఇది కిలికి భాషలో చెప్పడం వల్ల, ఆ డైలాగ్ ఆడియన్స్ కే కాదు ప్రభాస్, రానాలకి కూడా అర్థం కాదు, దుబాసీ దాన్ని తెలుగులో చెప్పాక, ప్రభాస్ రానా ల రియాక్షన్ చూస్తే, రాజమౌళి తీసిన వరెస్ట్ సీన్స్ లో ఒకటి అని చెప్పొచ్చు…
RRRలో కూడా బ్రిటిష్ వాళ్ళ డైలాగ్స్ ఇంగ్లీష్ లోనే ఉంచడం వల్ల, సాధారణ ప్రేక్షకులకు అర్థం కాలేదు. సినిమా రిలీజ్ అయ్యాక, అప్పుడు తెలుగు, హిందీ భాషల్లో డబ్బింగ్ చెప్పించి యాడ్ చేసారు.
5. అల్లూరి, కొమురం భీమ్ ల పాత్రల ఆధారంగా తీసిన కల్పిత కథ అని చెప్పడం వల్ల, ఈ సినిమా అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వారిద్దరి పేర్లు వాడడం వల్ల, సినిమాకి ఏమీ పెద్ద బజ్ క్రియేట్ అవకపోగా, బాగా మైనస్ కూడా అయింది.
ఆఫ్ట్రాల్ ఒక సినిమా మీద, ఎందుకింత చర్చ అంటే.. రాజమౌళి ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్. అందరూ అసహ్యించుకునే ఈగని హీరోగా పెట్టి , ఆ ఈగ కి కష్టం వస్తే థియేటర్ లో ఆడియెన్స్ కన్నీళ్లు పెట్టుకునేట్లుగా, ఈగ గెలిస్తే చప్పట్లు కొట్టేట్లుగా కథ చెప్పగల ప్రతిభావంతుడు. RRR లో రాజమౌళి స్టోరీ టెల్లర్ స్థాయి నుండి స్టంట్ మాస్టర్, VFX కో ఆర్డినేటర్ స్థాయికి తగ్గిపోవడమే బాధాకరం….
Share this Article