.
ఐ ఐ టీ ప్రవేశ పరీక్ష ఫలితాలొచ్చిన ప్రతిసారీ పత్రికల్లో ప్రకటనలు చదవడం ఒక బరువైతే… అందులో విశేషణాలు, సాధించిన లెక్కలు అర్థం చేసుకోవడం మరో బరువు.
కాళ్లకు తాడు కట్టుకుని బంగీ జంప్ చేస్తాము. అందులో సాహసం ఉంటుంది. ఆనందం ఉంటుంది. ఆశ్చర్యం ఉంటుంది. భయం ఉంటుంది. అలా ఈ ప్రకటనలను చదవడం, అర్థం చేసుకోవడం కూడా బంగీ జంప్ కంటే పెద్ద సాహసం. భయం.
Ads
ఉదాహరణకు శనివారం 2025 జె ఈ ఈ మెయిన్ ఫలితాలొచ్చాయి. ఆదివారం షరా మామూలుగా పుంఖానుపుంఖాలుగా కార్పొరేట్ కాలేజీల ప్రకటనలొచ్చాయి. ముసుగులో గుద్దులాట ఎందుకు?
తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ కాలేజీలంటే చైతన్య- నారాయణ రెండే. అలా ఎందుకయ్యిందన్నది చెప్పడం ఈ వ్యాసం ఉద్దేశం కాదు. అలా మన ఖర్మ కాలడంలో మన పాత్ర ఏమిటన్నది చెప్పడం కూడా ఈ వ్యాసం ఉద్దేశం కాదు.
తల్లిదండ్రులు గర్వపడే క్షణం! ఒక్క శ్రీ చైతన్య హైదరాబాద్ నుండే ఓపెన్ కేటగిరీలో వందలోపు పది ర్యాంకులతో శ్రీచైతన్యతో పోటీపడే సంస్థే లేదట. నిజమే ఒక్క హైదరాబాద్ నుండే ఇన్ని ర్యాంకులయితే మొత్తం దేశంలో ఉన్న శ్రీచైతన్యలనుండి ఇక ఎన్ని ర్యాంకులో! పేపర్లలో ఎన్ని పేజీలు అదనంగా వేసినా… చాలవు కాబట్టి వేసి ఉండరు!
ఫలితాలను శాసించిన నారాయణ! …శ్రీచైతన్య పేజీలు తిప్పిన వెంటనే సృష్టిధర్మం ప్రకారం రావాల్సిన నారాయణ ప్రకటన ఉండనే ఉంది. టాప్ వందలో 30 శాతం ర్యాంకులను నారాయణ శాసించిందట! ప్రకటన రాసినవారి కవి హృదయం ఏమో కానీ… నిజమే! నారాయణ ర్యాంకులను ఓపెన్ గా, పబ్లిగ్గా శాసిస్తున్నట్లే ఉంది!
తెలుగువారు ఇందుకు గర్వించవచ్చు. మిగతా దేశమంతా ఇందుకు కుళ్ళి కుళ్ళి ఏడవవవచ్చు. ఒక ఫలితంలో ఒక సంస్థ నుండి ఎన్ని లక్షల మందిలో నుండి ఎన్ని వందలమంది వందలోపు ర్యాంకుల్లోకి రాగలిగారు? అన్నది అర్థరహితమైన ప్రశ్న.
ఎన్ని లక్షల మంది ఏటా ఒక్కొక్కరు కనీసం రెండు లక్షల ఫీజు కడితే ఎన్ని వందల/ వేల కోట్ల ఫీజవుతుంది? అన్నది మరింత అర్థం లేని ప్రశ్న. వందలోపు ఎండమావుల వెంటపడి ఏటా ఎన్ని లక్షల మెదళ్ళు మొద్దుబారిపోతున్నాయన్నది అడగకూడని ప్రశ్న.
చదువుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే చైతన్యాలు ఎన్ని? అన్నది సానుభూతికి మనసులో కూడా అనుకోకుడని ప్రశ్న.
తల్లిదండ్రులు గర్వపడే క్షణాల్లో…
ర్యాంకులను శాసిస్తున్న క్షణాల్లో…
ఒకటి అంకె… ప్రకటనల మయాదర్పణంలో ఒకటిగా కాకుండా వందగా, వేలుగా, లక్షలుగా ప్రతిబింబిస్తూ ఉంటుంది. అందులో మన పిల్లలు కనిపిస్తున్నట్లుగా ఉంటుంది. అంకెలన్నీ మాయమై ఒకటి ఒక్కటే ఒంటి స్తంభపు మేడమీద ఒంటరిగా నిలుచుని ఉంటుంది.
ఆ ఒకటి నేను కాకపోతానా అని విద్యార్థికి అనిపిస్తూ ఉంటుంది.
ఆ ఒకటి మా అబ్బాయి కాకపోతాడా? మా అమ్మాయి కాకపోతుందా? అని తల్లిదండ్రులకు అనిపిస్తూ ఉంటుంది.
శతమానం అభవతి…
—————-
వంద తరువాత ఉన్న అంకెలన్నీ అవమానభారంతో తమను తాము రద్దు చేసుకున్నాయి. కొందరు ఆత్మహత్య అన్నారు. కొందరు హత్యే అన్నారు. వంద దాటిన అంకెల ఉనికికోసం ఉవ్వెత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. పునరావాస కేంద్రాలు వెలుస్తున్నాయి. చెట్టంత ఎదగాల్సిన పిల్లలు సింగిల్ నంబర్, డబుల్ డిజిట్ స్వప్నాల్లో శిథిలమవుతున్నారు.
ఒకటి కానప్పుడు నువ్వు నువ్వు కాదు.
వందలోపు లేనప్పుడు నీ నవ్వు నవ్వు కాదు. పేపర్లో నువ్వు ప్రకటన నంబరుగా మారనప్పుడు నీ చదువు చదువు కాదు.
…ఇంతకూ దీన్నేమంటారు?
“నారాయణీయం”;
“ప్రథమ చైతన్యం”!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
ఈ లింక్ కూడా ఓపెన్ చేసి ఓసారి చూసేయండి, పిచ్చ క్లారిటీ వస్తుంది ఈ ర్యాంకుల మాయామర్మాలేమిటో…
https://www.facebook.com/share/v/16MRjbTgSM/
Share this Article