ఇదే వార్తను ఆంధ్రజ్యోతి అయితే మాంచి మసాలాలు దట్టంగా వేసి, కుతకుత ఉడికించి, వేడిగా వడ్డించేదేమో… ఈనాడు వార్తలాగా మరీ ఉప్మాకథనంలా మాత్రం ఉండేది కాదు… పేలవమైన ప్రజెంటేషన్… విషయం ఏమిటంటే..? ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి వాలంటీర్‌కు నెలకు 200 ఇవ్వడానికి, ఆ డబ్బుతో దినపత్రికలు కొనడానికి ఉద్దేశించి ఉత్తర్వులు విడుదలయ్యాయి…
అందులో సాక్షి అనే పేరు ఉండదు తప్ప, ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలను బట్టి… సాక్షి పత్రిక కొనండి అని పరోక్షంగా చెప్పినట్టే… నెలకు 5.32 కోట్లు ఖర్చవుతాయట… 2.66 లక్షల మంది వాలంటీర్లు ఈ డబ్బును వినియోగించుకోవచ్చునట… అంటే, నిజంగా ప్రతి వాలెంటీర్ ఈ ఉత్తర్వులు పాటిస్తే… ఒక్క దెబ్బకు సాక్షి సర్క్యులేషన్ రెండున్నర లక్షల కాపీలు అమాంతంగా పెరిగిపోతుందన్నమాట…
పోనీ, ఆల్‌రెడీ సాక్షి పత్రిక కొంటున్న వాలంటీర్లు ఉన్నారనుకుందాం… ఆ చందా డబ్బు ప్రభుత్వమే చెల్లించబోతున్నదన్నమాట… ఏం స్కీమ్..? ఏం ప్లాన్..? వారెవ్వా… చేసేయండి… లైబ్రరీలతో కొనిపించండి… పంచాయతీలు, మున్సిపాలిటీలతో కొనిపించండి… సర్వశిక్షా అభియాన్ డబ్బులు ఉంటాయి, స్కూళ్లతో కొనిపించండి… ఇంకొన్ని అవకాశాల్ని వెతికి మరీ దెబ్బలు కొట్టండి ఇలాగే… దాంతో చకచకా, ఎకాఎకిన ఈనాడులు, మళయాళ మనోరమలు, దైనిక్ జాగరణ్‌లు కూడా దాటేసి… ఫస్ట్ ప్లేసులో ఉన్న దైనిక్ భాస్కర్ సరసన నిలబడాలి… అంతే…
Ads
ఉత్తర్వులు ఏమంటున్నాయి..? ‘‘పథకాల సమాచారం తెలుసుకోవడానికి, దుష్ప్రచారం తిప్పికొట్టడానికి విస్తృతమైన సర్క్యులేషన్ ఉన్న పత్రికలు కొనండి… ఏదైనా మీడియా లేదా ఎవరైనా వ్యక్తులు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఇది ఉపయోగకరం’’ అని చెబుతున్నాయి… అంటే, చాలా సింపుల్… ఏపీలో ఎక్కువ సర్క్యులేషన్ ఉన్నవే మూడు పత్రికలు… ఈనాడు, జ్యోతి, సాక్షి… ఈనాడు, జ్యోతి మారీచపత్రికలు, మన శతృపత్రికలు అని ముఖ్యమంత్రే స్వయంగా చెబుతున్నాడు… ఆ పత్రికలు ప్రభుత్వాన్ని బదనాం చేస్తుంటాయనీ ఆరోపిస్తుంటాడు… ఇక మిగిలింది సాక్షి…
వైసీపీ పత్రిక… అధికారంలో ఉన్న పత్రిక… అందుకని అడ్డగోలు ప్రభుత్వ పథకాల మీద ఏమీ రాయదు… పైగా ఈనాడు, జ్యోతి రాతల్ని ఎండగడుతూ ఉంటుంది… సో, సాక్షిని కొనండి అని కాస్త వాలెంటీర్లందరికీ సులభంగా అర్థమయ్యేట్టుగానే ఉత్తర్వులు ఇచ్చారు… ఉత్తర్వుల్లో ఏదైనా మీడియా అంటే జ్యోతి, ఈనాడు అని… ఎవరైనా వ్యక్తులు అంటే తెలుగుదేశం నాయకులు అని వాలంటీర్లు అర్థం చేసుకోవాలి…
ఎలాగూ ప్రభుత్వ యాడ్స్ ఇబ్బడిముబ్బడిగా ఇస్తూనే ఉన్నారు… కోట్లకుకోట్లు కట్టబెడుతూనే ఉన్నారు… ఇప్పుడిక సర్క్యులేషన్ బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటోంది… అంటే జగనే చూసుకుంటున్నాడు… ఒక పత్రికకు ఇంకేం కావాలి ఇక..? ‘‘250 ఇద్దాం’’ అని వాలెంటీర్ల విభాగం డైరెక్టర్ అత్యంత భారీ ఔదార్యంతో ప్రతిపాదించాడట… చివరకు నెలకు 200 ఖాయం చేశారట… కాపీలు పెంచే స్కీములు, జనాన్ని ఆకట్టుకునే కథనాలు, పట్టుకునే ఫీచర్లు, ప్రొఫెషనల్ సర్కస్ ఫీట్లు గట్రా ఏమీ అక్కర్లేదు ఇక…
మరి జగన్ వేసిన ఈ సర్క్యులేషన్ బాట తెలంగాణలో నమస్తే తెలంగాణ పత్రికకు కూడా ఉపయోగపడే చాన్స్ ఉందా..? ఏమో… తెలంగాణలో వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ లేదు… కానీ ‘‘ప్రభుత్వ సొమ్ముతో అధికార పార్టీ పత్రికల్ని కొనిపించడం’’ అనే స్పూర్తిదాయక పథకం, ఇది గాకపోతే ఇంకేదో మార్గాన్ని చూపకపోదు…!! అవునూ, ఈనాడులో వచ్చే ప్రతి నెగెటివ్ స్టోరీకి తెల్లవారే పెద్ద కౌంటర్ రాసేస్తుంటారు కదా… ఈ వార్తపైనా సుదీర్ఘ సమర్థన వ్యాసాన్ని ఆశించవచ్చా అధ్యక్షా…!!
Share this Article