ఎంత జుత్తు పీక్కున్నా సమజ్ అయితలేదు… బహుశా జగన్ పాలనలోని సంక్లిష్టత ఎవరికీ అర్థం కాదు కాబట్టి, ఇదీ అదేలే అనుకోవచ్చునేమో… ఆప్టరాల్ ఎలుక అనుకోవడానికి వీల్లేదు… ఏపీలో ఎలుకలు హైటెన్షన్ లైన్లను కూడా తెగ్గొట్టగలవు… మరి తెలుగు ఉడతంటే మజాకా..? అందులో పెద్ద డౌటేమీ లేదు… కానీ చచ్చిపోయి దొరికిపోయిన ఆ ఉడత శవానికి జరిపిన ఆ విశేష పోస్ట్ మార్టంలో ఏం తేల్చాలనుకున్నారనేదే ఎంతకూ తేలడం లేదు… ఏదో పెద్ద మిస్టరీ ఉండే ఉంటుంది… ఏదో మార్మిక బ్రహ్మరహస్యం ఏదో ఉండే ఉంటుంది… లేకపోతే జగన్ అనుమతించేవాడు కాదు…
ఆ ఉడత మాడిపోలేదు… ఆటోపై తీగెల్ని తెగిపడేలా చేసి, అయిదుగురు కూలీలను బలిగొన్నదని అంటారు గానీ, ఆ సాధుజీవి ఫాఫం, దాని తప్పేమీ లేదు… ఆ తీగలు హైటెన్షనో, లోటెన్షనో దానికేం తెలుసు..? తన ప్రాణాలే పోతాయనుకుంటే ఆ పెద్ద టవర్లు ఎక్కేదా..? ఆ కండక్టర్ ఎంత నాసిరకమో దానికేం తెలుసు..? ఇన్సులేటర్లు, బ్రేకర్లు సరిగ్గా ఉండవనీ దానికేం తెలుసు..? అసలు ఏపీలో కరెంటు వ్యవస్థే సరిగ్గా పనిచేయడం లేదని దానికేం తెలుసు..? ఆ ఎత్తులో ఏం ఆహారం ఉందని ఆ ఉడుత అక్కడికి వెళ్లిందనే ప్రశ్నకు… ఆ అత్యంత మార్మికమైన ప్రశ్నకు జవాబు కోసం ఇప్పుడు నిపుణులు అనేకులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు… ప్రాథమిక నివేదిక కూడా బయటపడకుండా అత్యంత రహస్యంగా దాచిపెడుతున్నారంటే ఏదో కుట్ర తాలూకు నిజాలేవో దాగి ఉన్నట్టే లెక్క…
చాలా సింపుల్… మన అధికార వ్యవస్థలో, పలు రాష్ట్రాల్లో గండుచీమలు బొరియెలు చేసి చెరువులకు గండ్లు కొడుతుంటయ్… ఎలుకలు మద్యం సీసాలు తాగేస్తుంటయ్… పందికొక్కులు వంతెనల కింద దూరి కూల్చేస్తుంటయ్… గోదాముల్లో టన్నుల కొద్దీ ధాన్యాన్ని తినేస్తుంటయ్… కోతులు టెలిమెట్రీ డబ్బాలను చేరి, డేటాను మార్చేస్తుంటయ్… అలాంటిది ఉడతలు హైటెన్షన్ వైర్లను దెబ్బతీయలేవా..? పైగా తెలుగు ఉడతలకు బలం ఎక్కువ… టెంపర్‌మెంట్ ఎక్కువ… సో, అప్పుడే చెప్పలేం… రేప్పొద్దున ఈగలు బ్రేకర్లను బ్రేక్ చేయలేవని చెప్పలేం… దోమలు కండక్టర్ వైర్ తినేయలేవనీ చెప్పలేం… ఏమో, కరోనా వైరస్ టవర్లను కుళ్లిపోయేలా చేయలేవనీ అనలేం…
Ads
ఇంతకీ పోస్ట్ మార్టం చేసి ఏం తేలుస్తారు..? దాని దేహమేమో మాడిపోలేదు… అంటే హైటెన్షన్ కరెంటు ఆ తీగెల్లో ప్రసరించడం లేదని తేలుస్తారా..? దాని దేహంలోని భాగాలకు విద్యుత్తు ఏ వోల్టేజీలో తగిలిందో నివేదికలిస్తారా..? ఉడతలు, ఎలుకలకూ అందని రీతిలో రాష్ట్రంలో మొత్తం లోటెన్షన్, హైటెన్షన్ వ్యవస్థలను ఆధునికీకరించాలని, తద్వారా ఈ సాధుజీవుల్ని పరిరక్షించాలని నివేదికలిస్తారా..? కనీసం ప్రతి టవర్ మొదట్లో ఈ జీవులేమీ ఎక్కకుండా ఇనుప ముళ్ల కంచెల్ని వేయాలని ఆదేశిస్తారా..? హేమిటో… హంతా హయోమయం…!! అవును సారూ… అంత హైటెన్షన్ కరెంటు ఆ ఉడత శరీరం మీద ఒక్క వెంట్రుకనూ కాల్చేలేదు… ఏపీ కరెంటు మరీ అంత వీకా..?! లేక తెలుగుదేశం వాళ్లు ఏమైనా ఉడత కుట్ర చేశారంటారా..?!
Share this Article