డ్రాగన్ పార్టీ అనగానే అదేదో పార్టీ అనుకునేరు సుమా… డ్రాగన్ అనగా కమలం… కమలం పార్టీ అనగా బీజేపీ అని అర్థం..! ఆ పార్టీకి ఏపీలో కూడా ఒక శాఖ ఉంది… అందులోనూ లీడర్లున్నారు… దాన్ని ప్రేమించే జాతీయవాద అభిమానులు కూడా ఇప్పుడు నిర్ఘాంతపోతున్నారు… చీదరింపు అనే పదం ఒకటి తెలుగులో ఉందని బీజేపీ పెద్దలకు తెలుసో లేదో తెలియదు… కానీ ‘దేవుడా, మా మంచి దేవుడా, నువ్వెలా చెబితే అలా, నువ్వే దిక్కు, నువ్వు లేక శరణం నాస్తి’ అంటూ పవన్ కల్యాణ్ చల్లని చూపు కోసం ఏపీ బీజేపీ లీడర్లు మాట్లాడే మాటలు వింటుంటే ఫాఫం అనాలనిపిస్తుంది… ఈ దేశాన్ని పాలించే ఓ అధికార పార్టీ ప్రస్తుతం ఏ చట్టసభలోనూ ఏ ప్రాతినిధ్యమూ లేని ఓ పార్టీ అధినేత పాదాల దగ్గర మరీ ఇంత భజన చేయాలా అనిపిస్తుంది… నిజం నిష్ఠురంగానే ఉంటుంది… కానీ సోము వీర్రాజు, రత్నప్రభ, సునీల్ దేవధర్… అందరూ అదే ధోరణి… ఏక్‌సేఏక్… పవన్ కరుణా వీక్షణాలు తమపై ప్రసరిస్తే చాలు అన్నట్టుగా మారిపోయింది… మొన్న ఎక్కడో వకీల్ సాబ్ ట్రెయిలర్ ప్రదర్శనకు ఫ్యాన్స్ విరగబడినప్పుడు థియేటర్ అద్దాలు పగిలిపోయాయి… ఐనాసరే, ఒకరి మీద నుంచి మరొకరు పరుగులు తీస్తున్నారు… ప్రస్తుతం ఏపీ బీజేపీ లీడర్లను చూస్తుంటే ఆ ఫ్యాన్లకూ వీళ్లకూ ఏమీ తేడా లేదని స్పష్టమైపోతోంది…
రాష్ట్ర బీజేపీ వ్యవహారాలు చూడటానికి ఎక్కడి నుంచో దిగుమతైన కేరక్టర్ ఒకటి ఉంది… పేరు సునీల్ దేవధర్… ఎప్పుడూ పెద్దగా తన ప్రసంగాల్ని గమనించలేదు… కానీ రీసెంటుగా ఒక అద్భుత ప్రసంగాన్ని వీక్షించే భాగ్యం కలిగింది… వామ్మో, త్రిపుర సీఎం విప్లవదేవుడికీ, ఉత్తరాఖండ్ సీఎం తీర్థసింగు రావతుడికీ తాతలా ఉన్నాడు… ఎంత రాజకీయ పరిపక్వత.., ఎంత ప్రసంగజ్ఞానం… వెనుక ఓ బ్యానర్… జనసేన పార్టీ బలపరుస్తున్న బీజేపీ అభ్యర్థి అని రాశారు… అంటే జనసేన పేరు చెప్పుకుంటే తప్ప జనం గుర్తించే సీన్ లేదా..? ఇదా బీజేపీ దురవస్థ..? వోకే, వోట్ల కక్కుర్తి కోసం ఎవరెవరితోనో కలుస్తారు, విడిపోతుంటారు… కానీ సొంత ఇజ్జత్ కూడా ముఖ్యమే కదా… పవన్ ఎప్పుడు ఎక్కడ ఏ మీటింగు పెట్టినా ‘‘సీఎం, సీఎం’’ అని ఫ్యాన్స్ డైలాగ్స్ వినిపిస్తుంటయ్, సరే, వాళ్ల అభిమానం… చివరకు ఈ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాటలూ అవే… పైగా పవన్‌ను మల్లెపూవులాగా చూసుకొండి అని ప్రధాని చెప్పాడట… పవన్ కాలు కందిపోకుండా చూసుకోవాలా… దేముడికి వీసమెత్తు చిరాకు, కష్టం, కోపం కూడా రాకుండా జాగ్రత్తపడాలా..? ఓహో, అందుకేనా ఈ భజన..? అటు జనసేన, ఇటు ఈ భజనసేన… భలే దొరికారు తిరుపతి వోటర్లకు…
Ads
ఈ దేవధరుడు ఏమన్నారో విన్నారు కదా… అత్తారింటికి దారేది సినిమాలో హవామే ఉడతా జాయేరే అనే పాట పవన్ స్వయంగా పాడాడట… అంతకు మించి జాతీయవాదం ఏముంటుందీ అని ప్రశ్నిస్తున్నాడు… హిందీలో కూడా ప్రెస్ నోట్ ఇచ్చే ఏకైక పార్టీ అట… ఇంతకుమించి పవన్ జాతీయవాదానికి నిదర్శనం ఏమిటీ అంటున్నాడు… ఎహె, పవన్ ఒక్కడే ఏపీలో జాతీయవాద నాయకుడు… ఏ పార్టీలోనూ ఇంకెవరూ లేరుపో అనేశాడు… ఇలా చాలా చాలా చెప్పాడు… దేవధరుడి జన్మ ధన్యం… రాజకీయ జీవితం సార్థకం అయినట్టే… రాజకీయాల్లో పొత్తులు, దోస్తీలు ఉంటయ్, పోతయ్… కానీ చివరకు మోడీని, అమిత్ షాను కూడా ఎప్పుడూ ఈ రేంజులో పొగిడి ఉండరు ఎవరూ… సరే, ఈ దేవధరుడిని వదిలేస్తే… ఒక రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చేసిన మహిళ కూడా ఓ సగటు జనసేన ఫ్యాన్ అయిపోయిన తీరు విభ్రమ కలిగించింది…
Finally back from meeting all the BJP-JSP enthused youth in Tirupati & Satyavedu . Watched the trailer of VAKEEL SAAB with my kids/PKFANS. What an exciting trailer !Looking forward to see the Chronicles of “VAKEEL SAAB” 👍#VakeelSaab @PawanKalyan @JanaSenaParty @BJP4Andhra
— Ratna Prabha (@Ratnaprabha_IAS) March 30, 2021
ఒక జనసేన సగటు అభిమానిని తప్పుపట్టాల్సిన పనిలేదు… వాళ్లది సినిమా అభిమానం, పవన్ కల్యాణ్‌ను తెర హీరోగా అభిమానిస్తారు, కాస్త అతి చేస్తారు, సరే, హీరోల ఫ్యాన్లంటేనే అలా ఉంటారు… కానీ పవన్ ఒక సినిమా హీరో మాత్రమే కాదు, ఒక పార్టీకి అధినేత… బీజేపీ తనను ఒక హీరోగా చూస్తున్నదా..? ఓ పొలిటికల్ పార్టీ బాస్‌గా చూస్తున్నదా..? భజనలోనూ ఏమిటీ వైపరీత్యం..? ఏళ్ల తరబడీ బీజేపీని ప్రేమించే, ఓన్ చేసుకునే సంఘ్ పరివార్ నిజంగా ఈ ధోరణిని సమర్థిస్తోందా..? స్వాగతిస్తోందా..? ఈ మెచ్యూరిటీ లెవల్స్ పట్ల ఆనందంగా ఉందా..? ఒకే ఒక లోకసభ సీటు, అక్కడ తన బలమేమిటో తనకు తెలుసు, మరెందుకు ఈ విపరీత పోకడలు..?! వంగిపోవడాలు..!!
Share this Article