అదుగదుగో ప్రశాంత్ కిషోర్‌తో ఒప్పందం కుదిరింది… ఇంకేముంది, గెలుపు గ్యారంటీ అని ఓ పార్టీవాదుల్లో సంతోషం….. అబ్బే, రాబిన్ శర్మ సరిగ్గా పనిచేయడం లేదబ్బా, బాసు ఆయన్ని తప్పించేసి సునీల్ అని కొత్తాయన్ని పెట్టేస్తున్నాడు, ఇక పార్టీ గాడిలో పడినట్టే అని మరో పార్టీవాదుల్లో ఉపశమనపు ఛాయలు… ప్రశాంత్ కిషోర్ టీంలోనే పనిచేసిన ఒకాయనతో మన పెద్దలు మాట్లాడుతున్నారు, మన పార్టీకి కూడా ఇక జోష్ ఖాయం అని ఇంకో పార్టీవాదుల్లో ఆనందం…
దేశంలో పార్టీలు, వాటి సిద్ధాంతాలు కాదు… ఈ సోకాల్డ్ వ్యూహకర్తల ప్రాబల్యం ఎక్కువైపోయింది, దేశరాజకీయాల్ని వీళ్లే నడిపిస్తున్నారు… ఇప్పుడిది ఏకంగా వేల కోట్ల దందాగా మారిపోయింది… ఈ మొత్తం వ్యాపారానికి మూలకర్త ప్రశాంత్ కిషోరే… ఆయనతోపాటు పనిచేశామంటూ ఇప్పుడు దేశంలో బోలెడు మంది సొంత దుకాణాలు తెరిచి, వందల మందిని నియమించేసుకుని, వ్యాపారాలు స్టార్ట్ చేసేశారు… వాళ్లు ఏది చెబితే అదే ఇప్పుడు…
నిజానికి ఈ టీమ్స్ గెలిపించవు, ఓడించవు… ఒక పార్టీ ఒక ఎన్నికల్లో గెలవాలంటే బోలెడు పరిస్థితులు అనుకూలించాలి, చాలా లెక్కలుంటయ్… కాకపోతే ఈ పోల్ స్ట్రాటజిస్టులు అడ్డగోలు ప్రచారాలకు, ఫేక్ క్యాంపెయిన్లకు పనికొస్తారు… సర్వేలు చేయిస్తారు… జనంలో ఏ అంశం బాగా చర్చకు వస్తుందో పట్టేసుకుని సోషల్ ప్రచారాలతో ఆజ్యం పోస్తారు… ప్రత్యర్థి పార్టీలను బదనాం చేయడానికి టెక్నాలజీని గరిష్ఠంగా ఉపయోగిస్తారు… వీళ్లే గెలిపించే పక్షంలో ఇక మేనిఫెస్టోలు దేనికి, పార్టీల వారీ సిద్ధాంతాల రాద్ధాంతాలు దేనికి..? సొంత వ్యూహాలు, బుర్రలు దేనికి..?
Ads
ఇప్పుడు ఈ చర్చ ఎందుకయ్యా అంటే… తెలుగు రాష్ట్రాల రాజకీయాలు..! చిన్నాచితకా సంస్థలతో పెద్ద ఫాయిదా తీసుకోలేని కేసీయార్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్‌కే గురిపెట్టాడు… దాదాపు ఒప్పందం కుదిరినట్టే… వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ప్రశాంత్ పనిచేస్తాడు… (నిజానికి నేను ఈ దందా నుంచి వైదొలుగుతున్నానని అప్పట్లో ప్రశాంత్ ప్రకటించాడు, కానీ ఇంత డబ్బు వస్తుంటే ఎలా ఊరుకుంటాడు..?) ఉద్దవ్, మమత, స్టాలిన్, జగన్ విజయాల వెనుక ప్రశాంతే ఉన్నాడని కేసీయార్ కూడా నమ్మినట్టున్నాడు…
జగన్‌కు కూడా ప్రశాంత్ కిషోరే మళ్లీ పనిచేస్తాడు… మొదట్లో ఈ వ్యూహకర్తలేంటి..? నన్ను మించిన వ్యూహకర్తలు ఇంకెవరుంటారు అని తేలికగా తీసుకున్న చంద్రబాబు సైతం రాబిన్ శర్మ అని ప్రశాంత్ కిషోర్ మాజీ దోస్తును వ్యూహకర్తగా పెట్టుకున్నాడు అప్పట్లో… ఎందుకో అసంతృప్తిగా ఉన్నాడు, దాంతో సునీల్ అని మరో వ్యూహకర్త వైపు చూస్తున్నాడు… ఆయన్ని వెళ్లగొట్టేశారనీ, కొత్తాయన అప్పుడే పని స్టార్ట్ చేశాడనే ప్రచారం తప్పు… ఈ సునీల్ కూడా ప్రశాంత్ కిషోర్ క్యాంపే ఒకప్పుడు…
తను సొంతంగా దుకాణం స్టార్ట్ చేశాక కొన్ని విజయాలు తన ఖాతాలో పడ్డయ్… గత పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకేకు తనే వర్క్ చేశాడు… గ్రాండ్ సక్సెస్… కానీ ఇదే సునీల్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు వర్క్ చేసి అట్టర్ ఫెయిల్ అనిపించుకున్నాడు… (అర్థమైంది కదా, ఈ వ్యూహకర్తలు గెలిపించలేరు అని…) 2016 నుంచి తను పలు రాష్ట్రాల్లో బీజేపీ కోసం వర్క్ చేశాడు… కొన్ని సక్సెస్… అందుకని చంద్రబాబుకు తనపై గురి కుదిరినట్టు ఉంది…
కానీ చంద్రబాబు అకస్మాత్తుగా కోవిడ్ బారినపడటం, తరువాత ఆయన భార్యకు ఏదో సర్జరీ, వెంటనే లోకేష్‌కు కోవిడ్… ఇలా వాళ్లు పార్టీ మీద పూర్తిగా కాన్సంట్రేట్ చేయలేని పరిస్థితి… 125 నియోజకవర్గాల్లో లోకేష్ ప్రతిపాదిత సుదీర్ఘ పాదయాత్ర కూడా అందుకే వాయిదా పడుతోంది… బేసిక్ వర్క్ కూడా ఇంకా పూర్తికాలేదు… ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో స్టార్ట్ చేసి, ఇక ముందస్తు వచ్చినా సరే, సై అనాలనేది తెలుగుదేశం ప్లాన్… అందుకని వ్యూహకర్త నియామకాన్ని కూడా త్వరలోనే తేల్చేయాలని చంద్రబాబు ఆలోచన… మరి కాంగ్రెస్, బీజేపీ..? ఇప్పటికైతే తెలంగాణ బీజేపీకి ఓ లోకల్ ఆర్గనైజేషన్ పనిచేస్తున్నట్టుంది… కానీ కాంగ్రెస్ పార్టీకి బలమైన వ్యూహకర్తల టీం ఏదీ సెట్ కాలేదు… వచ్చే ఎన్నికల్లో పోరాటం జరిగేది ఎన్నికల వ్యూహకర్తల నడుమే…!!
Share this Article